ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పై తాజా వివరాలు
Posted On:
05 APR 2020 6:48PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్-19 నివారణ, నియంత్రణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి అనేక చర్యలు చేపట్టింది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ -19 ప్రభావంపై ప్రణాళిక, సంసిద్ధత, అమలును నిర్ధారించడం కోసం నిన్న జరిగిన సాధికారతా బృందాల సంయుక్త సమావేశానికి ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు. ఆసుపత్రులు, ఐసోలేషన్ మరియు క్వారంటైన్ సదుపాయాలూ, పరీక్షలు, క్లిష్టమైన సంరక్షణ శిక్షణ మొదలైన విషయాలపై కొనసాగిస్తున్న చర్యల గురించి బృందాల సభ్యులు వివరించారు.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఝజ్జర్ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏ.ఐ.ఐ.ఎం.ఎస్.) సందర్శించి కోవిడ్-19 ను అధిగమించడానికి తీసుకుంటున్న చర్యల పురోగతిని సమీక్షించారు. ఝజ్జర్ లోని ఏ.ఐ.ఐ.ఎం.ఎస్. ఆసుపత్రి, కోవిడ్-19 కు అంకితమైన ఆసుపత్రిగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉన్నత వైద్య సహాయం అవసరమైన రోగులకు సత్వర వైద్య సంరక్షణ అందించడానికి వీలుగా ఈ ఆసుపత్రిలో మూడు వందల ఐసోలేషన్ పడకలు అందుబాటులో ఉన్నాయి. ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి నిరోధానికి మందు కనుక్కోడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఇది కనుగొనబడలేదు. ఈ నేపథ్యంలో, కోవిడ్-19 ను ఎదుర్కోడానికి లాక్ డౌన్ తో పాటు సామాజిక దూరం పాటించడమే సమర్ధవంతమైన విధానమన్న విషయాన్ని మనం తప్పక గుర్తించాలి.
అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ కార్యదర్శులతోనూ, అన్ని జిల్లాల డి.ఎం., ఎస్.ఎస్.పి., సి.ఎం.ఓ., ఐ.డి.ఎస్.పి. సిబ్బంది తోనూ, కేంద్ర మంత్రి మండలి కార్యదర్శి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. మందులు, మందుల పరికరాలను తయారుచేసే ఫార్మా యూనిట్లు సజావుగా పనిచేసేటట్లు చూడాలని ఆయన డి.ఎం. లందరినీ ఆదేశించారు. మొత్తం సిబ్బందికీ, రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సంబంధిత ప్రతినిధులకు నియంత్రణ వ్యూహంపై ఈ వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు. కోవిడ్-19 సంక్షోభం నివారణకు ఒక యాజమాన్య ప్రణాళికను రూపొందించవలసిందిగా అన్ని జిల్లాలకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆరు జిల్లాలకు చెందిన (భిల్వారా, ఆగ్రా, గౌతమ్ బుద్ధ్ నగర్, పథనంతిట్ట (కేరళ), తూర్పు ఢిల్లీ తోపాటు ముంబాయి మున్సిపల్) జిల్లా కమీషనర్లు, మున్సిపల్ కమీషనర్లు తమ వ్యూహాలను, అభిప్రాయాలను, అనుభవాలను తెలియజేసారు.
ఈ రోజు వరకు దేశంలో మొత్తం 274 జిల్లాలు కోవిడ్-19 వైరస్ ప్రభావానికి లోనయ్యాయి.
సమూహాలు (అదుపు చేసే జోన్లతో సహా), పెద్ద పెద్ద వలస సమావేశాలు / తరలింపు కేంద్రాలలో కోవిడ్-19 కోసం వేగవంతమైన యాంటీబాడీ రక్త పరీక్షల గురించి ఐ.సి.ఎం.ఆర్. ఒక అడ్వైజరీ ని విడుదల చేసింది. ఈ అడ్వైజరీ ప్రకారం, ఈ పరీక్షా ఫలితాలను నేరుగా ఐ.సి.ఎం.ఆర్. పోర్టల్ లో నమోదు చేసే విధంగా సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల సంబంధిత రోగులను వెతికి, కలుసుకుని, వారికి సకాలంలో వైద్యం అందించే ప్రక్రియ వేగవంతమౌతుంది.
ఐ.సి.ఎం.ఆర్. ఇటీవల విడుదల చేసిన ఒక అడ్వైజరీ ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం వల్ల కోవిడ్ -19 వ్యాప్తి పెరుగుతుంది. కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు పొగరాని పొగాకు ఉత్పత్తులు వినియోగించడం మానుకోవాలనీ, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇంతవరకు, 3,374 కేసులను ధృవీకరించారు. 79 మరణాలు నమోదయ్యాయి. 267 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి విడుదల అయ్యారు.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలు, మార్గదర్శకాలు, సలహాలు, సూచనలపై ప్రామాణికమైన, తాజా సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : : https://www.mohfw.gov.in/.
కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు :
technicalquery.covid19[at]gov[dot]in
ఇతర సందేహాలు, అనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న ఈ మెయిల్ ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు :
ncov2019[at]gov[dot]in .
కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలు, సమస్యలు, సమాచారానికైనా, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన
ఉచిత హెల్ప్ లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 ను సంప్రదించవచ్చు.
వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ని చూడండి :
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1611483)
Visitor Counter : 179
Read this release in:
Assamese
,
Kannada
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam