ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19పై తాజా సమాచారం
Posted On:
02 APR 2020 5:39PM by PIB Hyderabad
కోవిడ్-19 నిరోధం, నియంత్రణ, నిర్వహణపై దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు సంయుక్తంగా అనేకరకాల చర్యలు తీసుకోవడంతోపాటు ఉన్నతస్థాయిలో అనుక్షణం పర్యవేక్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. జిల్లాల స్థాయిలో సంక్షోభ నివారణ దిశగా నిర్ధారణ పరీక్ష, ఏకాంత చికిత్స, దిగ్బంధ పర్యవేక్షణలపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్రాలకు సూచించారు. ప్రభుత్వ-ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో వివిధ చర్యలద్వారా ఆరోగ్య సంరక్షణ రంగ మావన వనరుల స్థాయిని పెంచాలని రాష్ట్రాలను కోరారు. కరోనా వైరస్ నిరోధం, నియంత్రణ కోసం తీసుకుంటున్న పలురకాల చర్యల గురించి గౌరవనీయులైన ప్రధానమంత్రికి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివరించారు. దీంతోపాటు మానసిక-సామాజిక సంక్షేమ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మరోవైపు గౌరవనీయ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు- కరోనా వైరస్‌పై ప్రజానీకంలో భయాందోళనలు సృష్టించే బూటకపు వార్తలు, కథనాల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. దీంతోపాటు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కోవిడ్-19 రోగులకు రక్తశుద్ధి (డయాలిసిస్) సంబంధిత మార్గదర్శకాలను జారీచేసింది. ఇందుకోసం www.mohfw.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు. అలాగే ‘నిమ్‌హాన్స్’ సహకారంతో పిల్లలు, వృద్ధులలో ఆదుర్దా-మానసిక ఒత్తిడి నివారణ కోసం తీసుకోవాల్సిన సాధారణ చర్యలను సిఫారసు చేసింది. అంతేకాకుండా 080-46110007 నంబరుతో మానసిక-సామాజిక అంశాల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు కోవిడ్-19 నిర్ధారిత కేసుల సంఖ్య 1,965 కాగా- 50 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 328 కేసులు నమోదవగా, 12 తాజా మరణాలు సంభవించాయని, 151 మంది వైరస్ బారినుంచి కోలుకుని, ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారని సమాచారం అందింది. కోవిడ్-19పై అధికారిక, తాజా వివరాల కోసం https://www.mohfw.gov.in/వెబ్‌సైట్‌ను ఎప్పుడైనా చూడవచ్చు. సాంకేతిక సందేహాలపై technicalquery.covid19[at]gov[dot]in ఈ-మెయిల్, మార్గదర్శకాలకు https://www.mohfw.gov.in/ వెబ్‌సైట్, ఇతర అంశాల కోసం ncov2019[at]gov[dot]inని చూడవచ్చు. కోవిడ్-19 సంబంధిత సందేహాలపై +91-11-23978046 లేదా 1075 ఉచిత నంబర్లకు ఫోన్ చేయవచ్చు. అలాగే రాష్ట్రాలు/కేంద్రపాలిత సహాయ కేంద్రాల నంబర్లు https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdfలో లభ్యమవుతాయి.
******
(Release ID: 1610449)
Visitor Counter : 286
Read this release in:
Malayalam
,
Marathi
,
English
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada