ప్రధాన మంత్రి కార్యాలయం
ఆయుష్ వైద్యులతో ప్రధానమంత్రి సమావేశం
దేశాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో ఆయుష్ కు ఘనమైన సంప్రదాయం ఉంది; కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో ముఖ్యమైన పాత్ర ఉంది : ప్రధానమంత్రి
ఈ వ్యాధికి ఆయుష్ ద్వారా నివారణ ఉందన్నవాదనలోని వాస్తవాన్ని తనిఖీ చేయవలసిన అవసరం ఉంది : ప్రధానమంత్రి
ప్రజల్లో స్థిరమైన అవగాహన కల్పించడం కోసం, టెలి మెడిసిన్ విధానాన్ని వినియోగించుకోవాలి : ప్రధానమంత్రి
ఇంటిలో యోగా (#యోగా ఎట్ హోమ్) ను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వశాఖ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి ప్రశంసించారు.
Posted On:
28 MAR 2020 1:16PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ఆయుష్ రంగ వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఆయుష్ రంగానికి, దేశాన్ని ఆరోగ్యవంతంగా ఉంచే ఘనమైన సంప్రదాయం ఉందనీ, అదేవిధంగా, కోవిడ్-19 పరిష్కరించడానికి ప్రస్తుతం కొనసాగుతున్న కృషిలో ఆయుష్ ప్రాముఖ్యత అనేక రేట్లు పెరిగిందనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆయుష్ నెట్ వర్క్ విస్తృతంగా పెరిగిందనీ, అందువల్ల, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెట్ వర్క్ ను ఉపయోగించుకోవడం వారికి ఎంతైనా అవసరమనీ, ప్రధానమంత్రి చెప్పారు. ఆయుష్ కు చెందిన మంచి విధానాల గురించి అందరికీ తెలియజేసి, వైరస్ వ్యాప్తిని అరికట్టే కృషిలో వాటిని అమలుచేయాలి. ఇటువంటి కష్ట కాలంలో మనసుపై ఒత్తిడిని తగ్గించి, శరీరాన్ని బలోపేతం చేయడానికి ఇళ్లల్లో యోగా ను ప్రోత్సహించడంలో ఆయుష్ కొనసాగిస్తున్న కృషిని కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు.
ఈ వ్యాధికి ఆయుష్ ద్వారా నివారణ ఉందన్నవాదనలోని వాస్తవాన్ని తనిఖీ చేయవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఆయుష్ శాస్త్రవేత్తలు, ఐ.సి.ఎం.ఆర్., సి.ఎస్.ఐ.ఆర్. తో పాటు ఇతర పరిశోధనా సంస్థలు ప్రమాణ పూర్వక పరిశోధన కోసం కలిసి కృషి చేయాలని ప్రధానమంత్రి కోరారు. ఈ సవాలు ను ఎదుర్కోడానికి దేశం లోని మొత్తం ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. అవసరమైతే, ఆయుష్ తో సంబంధం ఉన్న ప్రైవేట్ వైద్యుల సహాయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవచ్చు.
ప్రస్తుత సమయంలో ఎక్కువగా డిమాండ్ ఉన్న శానిటైజర్ వంటి అత్యవసర వస్తువులను తయారుచేయడానికి, ఆయుష్ ఔషధాల ఉత్పత్తిదారులు తమ వనరులను వినియోగించాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ మహమ్మారిపై పోరాటానికి వీలుగా ప్రజల్లో స్థిరమైన అవగాహన కల్పించడం కోసం, టెలి మెడిసిన్ విధానాన్ని వినియోగించుకోవాలని ప్రధానమంత్రి ఆయుష్ వైద్యులను ప్రోత్సహించారు. వైరస్ వ్యాప్తినిరోధానికి సామాజిక దూరం పాటించడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
కోవిడ్-19 కు వ్యతిరేకంగా దేశం జరుపుతున్న పోరుకు నాయకత్వం వహిస్తున్నందుకు ఆయుష్ వైద్యులు ప్రధానమంత్రిని అభినందించారు. రోగ నిరోధక శక్తి ని పెంపొందించడంలో ఈ సాంప్రదాయ వైద్య విధానాల ప్రభావం గురించి వారు వివరించారు. రోగ లక్షణాలకు అనుగుణంగా చికిత్సా విధానంపై పరిశోధన కోసం చేస్తున్న కృషిని కూడా వారు ప్రధానమంత్రికి తెలియజేశారు. ఇటువంటి సంక్షోభ సమయంలో దేశానికి సేవచేయాలన్న కోరికను వారు వ్యక్తం చేశారు.
భారత దేశ సంప్రదాయ మందులు, వైద్య విధానాల గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించడం ముఖ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం కష్టపడుతున్న ఆయుష్ వైద్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం జరుపుతున్న పోరులో వారు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరారు.
ఈ సమావేశంలో ఆయుష్ శాఖ కేంద్ర మంత్రి తో పాటు ఆశాఖ కాబినెట్ కార్యదర్శి, కార్యదర్శి కూడా పాల్గొన్నారు.
******
(Release ID: 1608866)
Visitor Counter : 217
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam