ప్రధాన మంత్రి కార్యాలయం
కరోనా వైరస్ బెడదపై వారణాసి ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
సంయమనం, సంకల్పం, అవగాహన దిశగా ప్రజలకు ప్రధాని పిలుపు
కరోనా వైరస్‌పై సహాయ కేంద్రం నంబరు ప్రకటించిన ప్రధాని
Posted On:
25 MAR 2020 6:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తన నియోజకవర్గమైన వారణాసి ప్రజలతో దృశ్య-శ్రవణ మాధ్యమం ద్వారా సంభాషించారు. వారణాసి పార్లమెంటు సభ్యుడుగా ఈ క్లిష్ట సమయంలో తాను వారితో ఉండాల్సినప్పటికీ ఢిల్లీలో వ్యవహారాల దృష్ట్యా సాధ్యం కావడం లేదని ఆయన చెప్పారు. ఆ మేరకు తాను తీరికలేకుండా ఉంటున్నప్పటికీ వారణాసి గురించి తన సహచరులద్వారా ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకుంటూనే ఉన్నానని తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాటంలో దేశానికి మరింత బలం చేకూర్చాలని కోరుతూ వారణాసి ప్రజలు శైలపుత్రి దేవతకు పూజలు చేసినందుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. “కొన్ని సందర్భాల్లో జనం ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ చూపరు. ఇప్పుడు జరుగుతున్నదీ అదే” అని ఆయన వ్యాఖ్యానించారు. వదంతులను నమ్మవద్దని, వాస్తవాలను పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ధనికులు-పేదల మధ్య కరోనా వైరస్ ఎలాంటి తేడా చూపదని, ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోదని స్పష్టం చేశారు. కాగా, కాబూల్‌లోని గురుద్వారాలో ఉగ్రవాదుల దాడి సంఘటనలో మరణించినవారి కుటుంబాలకు ఆయన సంతాపం ప్రకటించారు.
కరోనా వైరస్‌పై ప్రజలకు కచ్చితమైన సమాచారం ఇచ్చేందుకుగాను వాట్సాప్‌తో సంయుక్తంగా ప్రభుత్వం ఒక సహాయకేంద్రం ఏర్పాటు చేసిందని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ మేరకు 90131 51515 నంబరుకు వాట్సాప్ ద్వారా ‘నమస్తే’ అని ఆంగ్లం లేదా హిందీలో సందేశం పంపాలని సూచించారు. ఆనాడు 18 రోజులపాటు సాగిన మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధించారని, నేడు మనం నవ్య కరోనా వైరస్‌ను పారదోలేందుకు 21 రోజులపాటు యుద్ధం చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. వైద్యులు, నర్సులువంటి వృత్తి నిపుణులను ఎవరైనా అవమానిస్తున్న సంఘటన ఏదైనా ఎదురైతే అలా చేస్తున్నవారికి వారి తప్పు అర్థమయ్యేలా చొరవ చూపాలని పౌరులందరికీ ప్రధాని సూచించారు. ఈ సంక్లిష్ట సమయంలో ప్రజలందరికీ సేవలందించే వైద్యులు, నర్సులు, ఇతర నిపుణులకు సహాయపడని లేదా సహకరించనివారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా దేశీయాంగ మంత్రిత్వ శాఖను, రాష్ట్రాల డీజీపీలను తాను కోరినట్లు తెలిపారు. సరైన సమయంలో సముచిత చర్య తీసుకోవాలన్న వాస్తవాన్ని దేశంలోని ప్రతి సామాన్యుడూ విశ్వసిస్తాడని గుర్తుచేశారు. ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూకు పౌరులు మద్దతిచ్చిన తీరు ఈ విషయాన్ని స్పష్టంగా రుజువు చేసిందన్నారు. అలాగే అంకిత భావంతో సేవలందిస్తున్న అత్యవసర సేవల సిబ్బందికి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు సామూహికంగా కృతజ్ఞతలు అర్పించారని పేర్కొన్నారు. ఆస్పత్రులలో తెల్లని యూనిఫారాలతో సేవలందిస్తున్న ఆరోగ్య సంరక్షణ నిపుణులు నేటి మన దేవతలని కొనియాడారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి వారంతా మనను వ్యాధులనుంచి రక్షిస్తున్నారని ప్రశంసించారు.
***
(Release ID: 1608218)
Visitor Counter : 219
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam