57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

కథలో మానవీయ కోణం, గాంధేయవాద ఆదర్శాలతో పొందిక.. మదింపులో ముఖ్య ప్రమాణాలు ఇవేనన్న ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పతక న్యాయనిర్ణేతల బృంద సభ్యుడు శ్రీ మనోజ్ కదమ్

నాడు పోస్టు చేయడమైనది: 26 NOV 2026 7:50PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2342562Views: 3

యాభై ఏడో భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ.. ‘ఇఫి’)లో ప్రతిష్ఠాత్మక ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పతకాన్ని చేజిక్కించుకోవడానికి పది కథా చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఈ చిత్రాలను శాంతి, సహన శీలత, కరుణ, సామాజిక న్యాయం, అంతర సాంస్కృతిక చర్చ అనే విషయాలతో రూపొందించారు. చలనచిత్రోత్సవంలో భాగంగా పత్రికా సమాచార కార్యాలయం (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో.. ‘పీఐబీ’) ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన పత్రికావిలేకరుల సమావేశంలో, ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పతకం న్యాయనిర్ణేతల బృందం సభ్యుడు శ్రీ మనోజ్ కదమ్, ‘ఇఫి’ కళాత్మక దర్శకుడు శ్రీ పంకజ్ సక్సేనాలు ఈ పోటీపై ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో  చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
శ్రీ మనోజ్ కదమ్ మాట్లాడుతూ ఎంపిక చేసిన చిత్రాలు అర్థవంతమైన అభిప్రాయాలను అందజేయడంతో పాటు, ప్రపంచంలో శాంతి వర్ధిల్లేటట్లు చూడటానికి కూడా సినిమా మాధ్యమాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకొనే విషయంలో ఉమ్మడి ఆసక్తిని కనబరిచాయన్నారు.
చిత్రాలను మదింపు చేసేందుకు న్యాయనిర్ణేతల బృందం ఎలాంటి దృక్పథాన్ని అనుసరించిందో శ్రీ కదమ్ వివరించారు. కథలో మానవీయ స్వభావం అన్నిటి కన్నా ముఖ్య విషయమని, చిత్రాన్ని గాంధేయవాద ఆదర్శాలకు అనుగుణంగా రూపొందించారా లేదా, ప్రత్యేకించి అహింసను ప్రబోధించారా లేదా, శాంతిని ప్రోత్సహిస్తున్నారా అనేవి పరిశీలనలోకి తీసుకున్నామన్నారు. చిత్రంలోని రసజ్ఞత‌, సాంకేతిక శోభలతో పాటు చిత్ర రూపకర్తలు ఇవ్వదలుచుకున్న సందేశం ఏమిటి, ఆ సందేశాన్ని ప్రసారం చేయడంలో నిజాయతీ, దృఢ సంకల్పం ఎంత అనేవి కూడా కీలకంగా భావించామని శ్రీ కదమ్ వెల్లడించారు.
‘ఎల్లలు లేని కథలు’ (స్టోరీస్ వితవుట్ బార్డర్స్)ను ఈ సంవత్సరం ‘ఇఫి’కి ప్రధాన ఇతివృత్తంగా తీసుకోవడాన్ని గురించి ఆయన చెబుతూ, ఎంపిక చేసిన సినిమాలు ప్రపంచంలో వివిధ ప్రాంతాల అపరిచిత సంస్కృతులను, దృష్టికోణాలను ప్రేక్షకుల కళ్లెదుట ఉంచాయన్నారు. ‘‘ప్రతి చలనచిత్రానికి తనదైన సౌందర్యం, కళాత్మక విలువలంటూ ఉంటాయి. ఆ యా చిత్రాలు తమ దేశాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పార్శ్వాల్ని ఆవిష్కరిస్తాయి. ప్రపంచం నలు మూలలకు చేరుకొంటున్న చిత్రాలు.. న్యాయనిర్ణేతల బృందం సభ్యులకు తమతో పాటు ప్రయాణించి తమ దేశ సంస్కృతి పట్ల అవగాహనను ఏర్పరుచుకొనేందుకు ఓ అవకాశాన్ని ఇస్తున్నాయి. ఇదే సినిమాకు ఉన్న శక్తి.. ఇది ప్రపంచాన్ని గురించిన ఎరుకను మీకు అందిస్తుంది’’ అని ఆయన అన్నారు.
పోటీకి నిలిచిన కొన్ని చిత్రాలను గురించి శ్రీ మనోజ్ కదమ్ ప్రస్తావిస్తూ, ‘స్ట్రాబెరీస్’ సినిమా మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించే పోరాటాన్ని చిత్రించిన, నారీశక్తిని బలపరిచిన చిత్రమన్నారు. ‘ద ఫాల్ ఆఫ్ ద క్వీన్’ను గురించి కూడా ఆయన ఉదాహరించారు. ఈ చిత్రం మందులు, పేటెంట్, ఆరోగ్యసంరక్షణ సేవల లభ్యతతో ముడిపడిన అంశాలపై ఆందోళనను వ్యక్తపరిచిందని, ‘స్క్రాల్’ యువతరానికి ఒక ముఖ్య సందేశాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. అనేక చిత్రాలు సామాజిక అంశాలను చిత్రించే దశను మించి ముందుకు సాగిపోయి ఆచరణసాధ్య పరిష్కారాలను గురించి ప్రేక్షకవర్గం ఆలోచించేటట్లుగా వారిలో స్ఫూర్తిని నింపుతున్నాయని శ్రీ కదమ్ అన్నారు. ప్రేక్షకవర్గం స్పందనను బట్టి మాత్రమే ఒక చిత్రం ఎంత గుణభరితమైందో నిర్ధారించలేం అని కూడా ఆయన అన్నారు.
సమావేశంలో ‘ఇఫి’ కళాత్మక దర్శకుడు శ్రీ పంకజ్ సక్సేనా ప్రసంగిస్తూ సహన శక్తి, శాంతి, అవగాహన, అంతర సాంస్కృతిక మార్పిడిలను ప్రోత్సహించే చలనచిత్రాలను ఎంపిక చేయడానికి ఒక స్పష్టమైన ఫ్రేంవర్కును ఐసీఎఫ్‌టీ-యునెస్కో మార్గదర్శకాలు అందించాయన్నారు. సమాజానికి ఆకారాన్ని ఇవ్వడంలో సినిమా పోషించే పాత్రను ఆయన ప్రస్తావించారు. ఈ మాధ్యమాన్ని ఎలా ఉపయోగిస్తారన్న అంశం ఆధారంగా చలనచిత్రాలు అయితే ప్రయోజనకరంగా నిలవొచ్చని, లేకపోతే హానికరంగా పరిణమిస్తాయంటూ ఆయన ఓ హెచ్చరిక చేశారు.
అభివృద్ధి చెందాలని తపిస్తున్న దేశాల (గ్లోబల్ సౌత్) సమాజాలు, మరీ ముఖ్యంగా తీవ్ర సామాజిక, సాంస్కృతిక మార్పుల గుండా పయనిస్తున్న దేశాలు సినిమా మాధ్యమంలో సృజనాత్మకతకు అనేక కోణాల్ని అందించ గలుగుతాయని శ్రీ సక్సేనా అన్నారు. కెన్యా, హైతీ, టర్కీ వంటి దేశాలకు చెందిన చలనచిత్రాలు వికసిస్తున్న సామాజిక వాస్తవికతలు, సాంస్కృతిక చైతన్యాలతో ముడిపడిన ఎంతో విలువైన సమాచారాన్ని ప్రేక్షకవర్గాలకు అందిస్తున్నాయని ఆయన తెలిపారు.
సామాజిక సమస్యలకు చలనచిత్ర రూపకర్తలు ఎల్లవేళలా నిర్దిష్ట పరిష్కారాల్ని సూచించాల్సిన పని లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే, సందర్భశుద్ధి ఉన్న ప్రశ్నలను వేయడం, ఆలోచించక తప్పని స్థితిని జన మానసానికి కల్పించడం కళకు సమాన ప్రాధాన్యం కలిగిన బాధ్యతలు అని ఆయన అన్నారు. ‘‘పరిష్కారాల్ని అందించడం ఒక కళాకారుడు లేదా కళాకారిణి విధి కావచ్చు.. అయితే, అదే విధి ప్రజాక్షేత్రంలో సమాధానం తెలియని ప్రశ్నను లేవనెత్తడం కూడా కావచ్చును. ఇది ఎంతైనా సమంజసంగా నిలుస్తుంది.. మరి ఈ రెండు వర్గాల కళాకారులనూ మనం సత్కరించుకుంటాం’’ అని ఆయన అన్నారు.
ఏ అంశాలు కథలను భౌగోళిక, సాంస్కృతిక పరిమితుల ఆవలకు తీసుకుపోగలుగుతాయన్న ప్రశ్నకు శ్రీ సక్సేనా జవాబిస్తూ రసజ్ఞానం, సందర్భ శుద్ధి, లేదా రూపం, సారం.. ఇవి అతి కీలకమన్నారు.
పత్రికా విలేకరుల సమావేశాన్ని శ్రీ మహేశ్ కుమార్ సమన్వయపరిచారు.
ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పతకాన్ని గురించి
ఐసీఎఫ్‌టీ-యునెస్కో గాంధీ పతకాన్ని ప్యారిస్‌లో నిర్వహించిన భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 46వ సంచికలో యునెస్కో ఆధ్వర్యంలోని అంతర్జాతీయ చలనచిత్ర, టెలివిజన్, ఆడియో విజువల్ కమ్యూనికేషన్ కౌన్సిల్ (ఐసీఎఫ్‌టీ) సహకారంతో ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ బోధించిన అహింస, సహనశీలం, అంతర సాంస్కృతిక అవగాహన, శాంతి ప్రచారం అనే ఆదర్శాలకు అద్దం పట్టే చలనచిత్రాలను గుర్తించి, ఈ పతకంతో సత్కరిస్తున్నారు. ఈ సంవత్సరం పోటీకి ఎంపిక చేసిన పది చిత్రాలు (వీటిలో ఏడు అంతర్జాతీయ చిత్రాలు కాగా మూడు భారతీయ చిత్రాలున్నాయి) వేరువేరు సాంస్కృతిక నేపథ్యాలకు చెందిన కథలను చెబుతాయి. వాటిలో మానవ సంబంధాలను, సామాజిక సవాళ్లను, ఉమ్మడి విలువలను చర్చించారు.
ఇఫిలాయిడ్‌ (IFFILOID)ను ఈ కింద ఇచ్చిన వెబ్ చిరునామాలోకి పోయి, చదువగలరు:
https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2342562
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026