57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

ఉపశీర్షికలు రాయటం కేవలం అనువాదం మాత్రమే కాదు… భాషల మధ్య భావోద్వేగాలను మోసుకెళ్లే కళ: ఇఫి-2026లో రేఖ్స్

నాడు పోస్టు చేయడమైనది: 25 NOV 2026 8:54PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2341762Views: 6

గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ)లో 'వర్డ్స్ అక్రాస్ బోర్డర్స్: సబ్‌టైట్లింగ్ అక్రాస్ కల్చర్స్' అంశంపై నిర్వహించిన మాస్టర్‌క్లాస్‌లో ప్రముఖ సబ్‌టైటిలర్ రేఖ్స్ అభిప్రాయాలను పంచుకున్నారు. అయిదు భాషల్లో 800కు పైగా చిత్రాలకు సబ్‌టైటిల్స్ అందించిన ఆమె... ఉపశీర్షికల కళాత్మకతను, భారతీయ సినిమాను ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయటంలో దాని పాత్రను వివరించారు.

ఉపశీర్షికలు రాయటం కేవలం పదాలను అనువదించటం మాత్రమే కాదని రేఖ్స్ స్పష్టం చేశారు. దీనికి ఎంతో ఓపిక, సృజనాత్మకత, సాంస్కృతిక అవగాహనతో పాటు సినిమాలోని భావోద్వేగాలను అర్థం చేసుకునే తత్వం అవసరమన్నారు. ఖచ్చితత్వం ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూ... "సబ్‌టైట్లింగ్‌లో ఓపిక చాలా ముఖ్యం. ప్రతి పదాన్ని మళ్లీ మళ్లీ సరి చూసుకోవాల్సి ఉంటుంది" అని ఆమె అన్నారు.

 

ఓటీటీ వేదికలు రావటాని కన్నా ముందు, ప్రధానంగా అవార్డు కార్యక్రమాలకు పంపే చిత్రాలకు మాత్రమే ఉపశీర్షికలను రూపొందించేవారని రేఖ్స్ గుర్తు చేసుకున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ రాకతో వీటి పరిధి విస్తరించి, ప్రాంతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను చేరుకునే అవకాశం కలిగిందన్నారు. ఓటీటీ వేదికలు సబ్‌టైటిల్స్‌ను మారుస్తుండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అసలు అనువాదంలోని సమగ్రతను కాపాడాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.

ఉపశీర్షికల విషయంలో సృజనాత్మక విధానాన్ని పంచుకుంటూ... దీనికి కచ్చితమైన నియమావళి అంటూ లేదని... తరచుగా వ్యక్తిగత పద్ధతులను అనుసరించాల్సి ఉంటుందని వివరించారు. సాధారణ సంభాషణల నుంచి పాటల సాహిత్యాన్ని ప్రేక్షకులు సులభంగా వేరు చేసి గుర్తించేందుకు వీలుగా పాటల సబ్‌టైటిల్స్ ప్రాసతో ఉండటానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. చిన్న వాక్యాలను పైన, పొడవైన వాక్యాలను కింద ఉంచే పిరమిడ్ శైలిని ఉపయోగిస్తానని, మెరుగైన స్పష్టత కోసం పసుపు రంగు సబ్‌టైటిల్స్‌ను ఇష్టపడతానని తెలిపారు.

అనువాదంలోని సూక్ష్మభేదాలను వివరిస్తూ... వాడుక భాషలోని వ్యక్తీకరణలు, దంగమారి వంటి పాటలను అనువదించటంలో ఎదురయ్యే సవాళ్ల గురించి రేఖ్స్ ప్రస్తావించారు. ఉచ్చారణలోని చిన్న తేడా వల్ల అర్థం 'వేషం' నుంచి 'విషం'గా ఎలా మారిపోతుందో వివరిస్తూ తమిళ పదాలైన 'వేషం', 'విషం'లను ఉదాహరణగా పేర్కొన్నారు. 'కబాలి' చిత్రానికి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, రజనీకాంత్ నవ్వులోని విభిన్న ఛాయలను వ్యక్తపరిచేందుకు "ఆత్మీయతతో కూడిన నవ్వు", "వ్యంగ్యంతో కూడిన నవ్వు" వంటి పదబంధాలను ఉపయోగించినట్లు వెల్లడించారు.

సబ్‌టైట్లింగ్‌ను సమ్మిళితత్వానికి సాధనంగా అభివర్ణిస్తూ... వినికిడి లోపం ఉన్న వ్యక్తులకు దీని ప్రాముఖ్యతను ఆమె ప్రత్యేకంగా వివరించారు. సాంస్కృతిక నేపథ్యం ఉన్న వ్యక్తీకరణలు, బంధుత్వాలను యథాతథంగా కాకుండా సందర్భోచితంగా జాగ్రత్తగా అన్వయించి అనువదించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.

 

కృత్రిమ మేధ వినియోగం పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, ఏఐ ద్వారా రూపొందించే సబ్‌టైటిల్స్ అర్థాలను వక్రీకరించే ప్రమాదం ఉందని, లింగ సూచికలను మార్చివేయవచ్చని మరియు ఒక సన్నివేశంలోని భావోద్వేగ సందర్భాన్ని కోల్పోయే అవకాశం ఉందని రేఖ్స్ హెచ్చరించారు. "ఏఐకి నిఘంటువు తెలుసు కానీ, నాటకీయత గానీ, ఆత్మలోని భావోద్వేగం గానీ తెలియదు" అని ఆమె వ్యాఖ్యానిస్తూ, మానవ సృజనాత్మకతకున్న నిరంతర ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.

"సబ్‌టైటిల్స్ అనేవి పోస్ట్-ప్రొడక్షన్ దశలో మిగిలిపోయే అదనపు పనులు కావు" అని ఆమె పేర్కొన్నారు. మంచి సబ్‌టైట్లింగ్ అనేది కేవలం సంభాషణలను యథాతథంగా అనువదించడం కాకుండా, సినిమాలోని అసలు భావాన్ని, భావోద్వేగాన్ని ప్రేక్షకులకు చేరవేయాలని ఆమె స్పష్టం చేశారు. ఇది కథలు భాషా, సాంస్కృతిక సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో మమేకమయ్యేలా చేస్తుందని ఆమె వివరించారు.

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

 

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2341762
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026