నాడు పోస్టు చేయడమైనది:
23 NOV 2026 1:00PM by PIB Hyderabad
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేరా యువ భారత్ (మై భారత్) ద్వారా 2026 నవంబర్ 24 నుంచి 26 వరకు దేశవ్యాప్తంగా 'వికసిత్ భారత్ యువ సంవాద్' కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది. 30కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 600కు పైగా జిల్లాల్లో ఉన్న 500కు పైగా కళాశాలల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే క్రమంలో యువతను క్రియాశీల భాగస్వాములుగా ప్రోత్సహిస్తూ... దేశ అభివృద్ధి ప్రస్థానం, సాధించిన విజయాలు, భవిష్యత్ ఆకాంక్షలతో 15-29 ఏళ్ల వయసు గల యువతను ఏకతాటిపైకి తీసుకురావటమే ఈ జాతీయ స్థాయి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
రాజ్యాంగ దినోత్సవ స్ఫూర్తికి అనుగుణంగా వివిధ విద్యా సంస్థల్లోని విద్యార్థులు, యువత సామూహికంగా భారత రాజ్యాంగ పీఠికను పఠిస్తూ, రాజ్యాంగ విలువలు, ఆదర్శాల పట్ల నిబద్ధతను తెలియజేస్తారు. భారతదేశ పురోగతి, నూతనంగా వస్తున్న అవకాశాలు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో తమ పాత్రపై యువత ఆలోచించేలా ప్రోత్సహించేందుకు ఇంటరాక్టివ్ సంభాషణలు, అవగాహన సదస్సుల ద్వారా ఈ కార్యక్రమం జాతీయ వేదికగా నిలుస్తుంది.
ఈ దార్శనికతను క్షేత్రస్థాయిలో అర్థవంతమైన భాగస్వామ్యంగా మార్చేందుకు, ఇందులో భాగస్వాములవుతున్న విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రముఖ యువ ఐకాన్లు ప్రత్యేక సదస్సులకు నాయకత్వం వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి యువ ఐకాన్ 'వికసిత్ భారత్ @2047’ ఇతివృత్తంపై ప్రత్యేకంగా రూపొందించిన ప్రజెంటేషన్‌ను అందిస్తారు. దీనిద్వారా భారతదేశ అభివృద్ధి ప్రయాణం, ఇటీవలి సంవత్సరాల్లో సాధించిన విజయాలు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే ఆకాంక్షల గురించి విద్యార్థులకు వివరిస్తారు. సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాలను, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చేస్తున్న కృషితో పాటు పేదరిక నిర్మూలన, సామాజిక-ఆర్థిక పరివర్తనలో దేశం సాధించిన ప్రగతిని ఈ ప్రజెంటేషన్ ప్రధానంగా వివరిస్తుంది. నక్సలిజాన్ని నియంత్రించటం, శాంతిని పునరుద్ధరించటం, గతంలో ప్రభావితమైన ప్రాంతాల్లో అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించటం, భారతదేశం సాధించిన గణనీయమైన పురోగతిని కూడా ఇది ప్రముఖంగా చాటిచెబుతుంది. ఆరోగ్యకరమైన, సాధికారత గల, వ్యసన రహిత సమాజాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను ఇది స్పష్టం చేస్తుంది. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత సామర్థ్యాన్ని, కుటుంబ సంక్షేమాన్ని, సామాజిక పురోగతిని, జాతీయ ఉత్పాదకతను ఏ విధంగా దెబ్బతీస్తుందో ఇది వివరిస్తుంది. వికసిత్ భారత్ @2047 కలను సాకారం చేసుకునేందుకు నషా ముక్త్ భారత్ అత్యంత కీలకమని, ఈ పరివర్తనను ముందుకు నడిపించటంలో యువత నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఈ ప్రజెంటేషన్ స్పష్టం చేస్తుంది.
ఈ చర్చలకు మరింత ప్రాముఖ్యతను జోడిస్తూ పద్మ పురస్కార గ్రహీతలు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి జీవిత ప్రయాణాలు, వ్యక్తిగత అనుభవాలు, ఆలోచనలను పంచుకుంటారు. ఈ సందర్భంగా వారు అధిగమించిన సవాళ్లు, సాధించిన కీలక విజయాలు, తమ ప్రయాణానికి మార్గనిర్దేశం చేసిన విలువలను ప్రత్యేకంగా వివరిస్తారు. వారి అనుభవాల నుంచి స్ఫూర్తి పొందేందుకు, దేశ నిర్మాణంలో అంకితభావం, పట్టుదల, నిబద్ధతల ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు ఈ ముఖాముఖి కార్యక్రమాలు యువతకు అవకాశాన్ని కల్పిస్తాయి.
వికసిత్ భారత్ @2047 లక్ష్యాన్ని సాకారం చేయటంలో యువశక్తి కీలక పాత్ర పోషించాలని 2023 ఆగస్టు 15న ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన దార్శనికత నుంచి స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అమృత తరాన్ని దేశ నిర్మాణంలో కీలక శక్తిగా గుర్తిస్తూ... ఈ జాతీయ దార్శనికతను సాధించే దిశగా యువ శక్తిని, నాయకత్వ లక్షణాలను మళ్లించటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
వికసిత్ భారత్ @2047 దార్శనికతను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు, రిజిస్ట్రేషన్లు, కార్యక్రమ సంబంధిత కార్యకలాపాల కోసం మై భారత్ పోర్టల్ ఒక డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. ఇది యువతకు విస్తృత భాగస్వామ్యాన్ని కల్పించటంతో పాటు మై భారత్ వ్యవస్థలో యువతను భాగస్వాములను చేసేందుకు దోహదపడుతుంది. సంస్థాగత అనుసంధానం, డిజిటల్ భాగస్వామ్యాన్ని సమ్మిళితం చేయటం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న యువతకు భాగస్వామ్య అవకాశాలను విస్తరించటం, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపట్టేలా వారిని ప్రోత్సహించటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
ఈ కార్యక్రమం ద్వారా భాగస్వామ్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో నిరంతర సంస్థాగత అనుబంధం కూడా ఏర్పడుతుంది. యువత నిరంతర భాగస్వామ్యాన్ని సులభతరం చేసేందుకు, స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు, భవిష్యత్తులో చేపట్టే మై భారత్ కార్యక్రమాల అమలుకు మద్దతిచ్చేందుకు ఈ విద్యాసంస్థల్లో తదుపరి మై భారత్ విభాగాలను ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ కార్యక్రమానికి అతీతంగా భాగస్వామ్యం, నాయకత్వం, సేవా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లగల సామాజిక బాధ్యత, స్ఫూర్తి కలిగిన యువ పౌరుల వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
'వికసిత్ భారత్ యువ సంవాద్' ద్వారా వికసిత్ భారత్ @2047 జాతీయ దార్శనికత దిశగా అమృత తరం శక్తిని, ఆలోచనలను, సామర్థ్యాన్ని మళ్లించేందుకు మై భారత్ కృషి చేస్తోంది. సమ్మిళిత వృద్ధి, సామాజిక పరివర్తన, శాంతి భద్రతలు, పౌరుల సాధికారత పునాదులుగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ప్రయాణం కొనసాగుతోంది. మాదకద్రవ్య రహిత భారత్.. కేవలం ఒక సామాజిక ఆకాంక్ష మాత్రమే కాదు, ప్రతి యువ పౌరుడి క్రియాశీల భాగస్వామ్యాన్ని కోరే జాతీయ ఆవశ్యకత. 'వికసిత్ భారత్ కోసం నషా ముక్త్ యువ' సందేశంతో అవగాహనను కార్యాచరణగా, సంవాదాన్ని దృఢ సంకల్పంగా, యువత భాగస్వామ్యాన్ని దేశవ్యాప్త పరివర్తన ఉద్యమంగా మార్చాలని ఈ కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత యువత ఏకమై రాజ్యాంగ పీఠికను సామూహికంగా పఠించాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆదర్శాల పట్ల నిబద్ధతను స్పష్టం చేయాలని, మరింత ఆరోగ్యకరమైన, బలమైన, మాదకద్రవ్య రహిత భారత్ కోసం గళమెత్తాలని మై భారత్ పిలుపునిస్తోంది. వికసిత్ భారత్ @2047 దిశగా సాగే ప్రయాణం యువత ఆకాంక్షలతో పాటు వారు ఎంచుకునే మార్గాలు, తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది.
రిజిస్ట్రేషన్లు, కార్యక్రమాల తాజా సమాచారం, మై భారత్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యే అవకాశాల కోసం www.mybharat.gov.in. వెబ్‌సైట్‌ను సందర్శించండి.
***