జైలు జీవితాన్ని గడిపి, ఏళ్ల తర్వాత తిరిగి సమాజంలోకి అడుగుపెట్టేవారు తమ జీవితాలను పునర్నిర్మించుకోవడంలో, గత అనుభవాల భారాన్ని అధిగమించడంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని, అయితే ఈ సమస్యకు తగినంత గుర్తింపు లభించడం లేదని రష్యన్ చిత్ర దర్శకుడు, ‘న్యూ హోమ్’ చిత్ర దర్శకుడు శ్రీ నికితా గ్రుషిన్ పేర్కొన్నారు. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తన చిత్రానికి ప్రేరణ కలిగించిన అంశాలను వివరిస్తూ, సుదీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించిన అనంతరం పునరావాసం పొందుతున్న కొందరితో జరిపిన సంభాషణలు వారు తిరిగి సమాజంలో కలిసిపోయి సాధారణ జీవితాన్ని గడపడానికి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తనకు అవగాహన కల్పించాయని శ్రీ గ్రుషిన్ తెలిపారు. ఈ అనుభవాలకు తగినంత ప్రాధాన్యం లభించడం లేదనే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయిలో తొలిసారిగా ప్రదర్శిస్తున్న తన తొలి చలనచిత్రం ద్వారా వారి కథలను విస్తృత ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ జీవితాలను తిరిగి నిర్మించుకోవడానికి, జీవితానికి కొత్త అర్థాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్న పురుషులు, మహిళలు ఎదుర్కొంటున్న సంఘర్షణలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.
శ్రీ గ్రుషిన్ రచించి, దర్శకత్వం వహించిన ‘న్యూ హోమ్’ (నోవీ డోమ్) చిత్రం అన్నా అనే మహిళ కథను ఆవిష్కరిస్తుంది. ఏడేళ్ల జైలు జీవితం అనంతరం విడుదలైన ఆమెకు చేతిలో డబ్బు లేదు. కుటుంబ సభ్యుల అండదండలు లేవు. జీవితంలో ఎలా ముందుకు సాగాలో కూడా స్పష్టత లేదు. సామాజిక సేవా సంస్థల సహాయంతో ఆమెకు ఒక ఉద్యోగం, నివాసం లభిస్తాయి. పరస్పర సహకారం అందించుకునే ఒక బృందంలో కూడా చేరుతుంది. అక్కడే రోమన్ పరిచయమవుతాడు. అతని సహకారంతో అన్నా క్రమంగా తన జీవితాన్ని తిరిగి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే తన భవిష్యత్తును నిర్ణయించగల ఒక క్లిష్టమైన నిర్ణయం తీసుకునే ముందు ఆమె తన గతాన్ని, అంతరంగంలో కొనసాగుతున్న సంఘర్షణలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పశ్చాత్తాపం, క్షమాపణ, పునరావాసం, జీవితంలో మరో అవకాశం లభించే సాధ్యాసాధ్యాలు వంటి అంశాలను ఈ చిత్రం స్పృశిస్తుంది.
కథలోని ప్రధాన పాత్ర రూపకల్పన గురించి వివరిస్తూ, అన్నా పాత్రను ఏ ఒక్క వ్యక్తినీ దృష్టిలో ఉంచుకుని రూపొందించలేదని శ్రీ గ్రుషిన్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని, తమ జీవితాలను తిరిగి నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్న పలువురితో జరిపిన సంభాషణల నుంచి ప్రేరణ పొందినట్టు చెప్పారు. నిజ జీవితంలో తాను గమనించిన ఈ అనుభవాలే కథకు పునాదిగా నిలిచాయని, వాటికి తన రచనా నైపుణ్యాన్ని, సృజనాత్మక దృక్పథాన్ని జోడించి చిత్ర కథనాన్ని రూపొందించానని ఆయన తెలిపారు.
చిత్రంలోని ప్రధాన సందేశం గురించి వివరిస్తూ, జైలు నుంచి విడుదలైన వారు ఎదుర్కొనే సవాళ్లు ఏ ఒక్క దేశానికో, సమాజానికో పరిమితమైనవి కావని దర్శకుడు అభిప్రాయపడ్డారు. శిక్షాకాలం పూర్తయి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది తీవ్ర అపరాధ భావనతో సతమతమవుతుంటారని, ఆ భావన వారి నిర్ణయాలను ప్రభావితం చేయడమే కాకుండా, జీవితంలో ముందుకు సాగకుండా అడ్డుకుంటుందని పేర్కొన్నారు. అన్నా జీవిత ప్రయాణం ద్వారా వ్యక్తులు ఈ మానసిక భారాన్ని ఎలా ఎదుర్కొంటారు? తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అవసరమైన ధైర్యాన్ని ఎలా కూడగట్టుకుంటారు? అనే అంశాలను ఆవిష్కరించేందుకు ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు.
విలేకరుల సమావేశంలో దర్శకుడితో పాటు పాల్గొన్న ఛాయాగ్రాహకురాలు శ్రీమతి ఎకటెరీనా స్మోలినా తమ సృజనాత్మక భాగస్వామ్యం గురించి వివరించారు. ఫిల్మ్ స్కూల్ రోజుల నుంచే తమకు పరిచయం ఉందని, గతంలో కలిసి మూడు లఘు చిత్రాలకు పనిచేశామని గుర్తుచేసుకున్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న తమ స్నేహం, ఒకరి పని విధానం గురించి మరొకరికి ఉన్న అవగాహన కారణంగా చిత్రీకరణ సమయంలో సహజమైన సమన్వయం ఏర్పడిందని ఆమె తెలిపారు. దీంతో సృజనాత్మక ప్రక్రియ సౌకర్యవంతంగా సాగడమే కాకుండా, మంచి అనుభూతిని కూడా అందించిందని పేర్కొన్నారు.
ఛాయాగ్రహణ రంగంలోకి ప్రవేశించే మహిళలు ఎదుర్కొనే సవాళ్ల గురించిన ప్రశ్నకు శ్రీమతి స్మోలినా సమాధానమిస్తూ, తనకు కూడా తొలినాళ్లలో భయం, అనిశ్చితి ఎదురయ్యాయని గుర్తుచేసుకున్నారు. అయితే, క్రమంగా ఆ భయాలను అధిగమించానని తెలిపారు. ఛాయాగ్రహణాన్ని వృత్తిగా ఎంచుకోవాలనుకునే ఔత్సాహిక మహిళలు ప్రారంభంలో ఎదురయ్యే భయాందోళనలకు వెనుకడుగు వేయకుండా, ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పంతో ఈ రంగంలో ముందుకు సాగాలని ఆమె సూచించారు.
భారత, రష్యా చలనచిత్ర రంగాల మధ్య మరింత విస్తృత సహకారానికి ఉన్న అవకాశాల గురించి మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సినీ అనుబంధాన్ని శ్రీ గ్రుషిన్ గుర్తుచేసుకున్నారు. సోవియట్ యూనియన్ కాలంలో భారతీయ సినిమాలకు విశేష ఆదరణ లభించిందని, నేటికీ రష్యా ప్రేక్షకుల హృదయాల్లో భారతీయ చిత్రాలకు ప్రత్యేక స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తులో భారత్ - రష్యా దేశాల మధ్య చలనచిత్ర రంగంలో భాగస్వామ్యాలకు అపారమైన అవకాశాలున్నాయని శ్రీ గ్రుషిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సహకారం కేవలం ఆర్థిక పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడికే పరిమితం కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న అనుబంధాలను ప్రతిబింబించే కథలు, సాంస్కృతిక పరస్పర అవగాహనకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మరింత బలమైన సృజనాత్మక భాగస్వామ్యాలకు పునాది వేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
అన్నా జీవిత ప్రయాణం ద్వారా ‘న్యూ హోమ్’ చిత్రం జాతీయ, సాంస్కృతిక సరిహద్దులకు అతీతమైన ఒక మానవీయ అనుభవాన్ని తెరపై ఆవిష్కరిస్తుంది. గౌరవప్రదమైన జీవితం, సమాజం నుంచి అంగీకారం, తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం కోసం మనిషి చేసే అన్వేషణను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఐఎఫ్ఎఫ్ఐ - 2026 ఇతివృత్తమైన ‘ విశ్వజనీన కథలు’కు అనుగుణంగా విభిన్న జీవన వాస్తవాలను దగ్గర చేయడం, పరస్పర సానుభూతిని పెంపొందించడం, అందరికీ వర్తించే మానవీయ అనుభవాల ద్వారా ప్రేక్షకులను అనుసంధానించడం వంటి అంశాల్లో సినిమాకు ఉన్న శక్తిని ఈ చిత్రం చాటిచెబుతుంది. రష్యా భాగస్వామ్య దేశంగా నిర్వహిస్తున్న ప్రత్యేక చిత్ర ప్రదర్శనలో ఈ చిత్రానికి చోటు కల్పించడం ద్వారా సాంస్కృతిక అవగాహనను పెంపొందించడంలోనూ, భారత్‌తో పాటు ప్రపంచ దేశాల మధ్య సృజనాత్మక ఆలోచనలు, అనుభవాల మార్పిడిని ప్రోత్సహించడంలోనూ చలనచిత్రోత్సవం పోషిస్తున్న పాత్ర మరోసారి ఆవిష్కృతమైంది.
ఈ విలేకరుల సమావేశానికి శ్రీ కిరణ్ మురళి సమన్వయకర్తగా వ్యవహరించారు.
***