57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

వేవ్స్‌ బజార్‌ ద్వారా సరికొత్త కథాంశాల అన్వేషణకు ఎన్ఎఫ్‌డీసీ, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా భాగస్వామ్యం

సృజనాత్మక కథాంశాల కోసం ‘వేవ్స్ బజార్ - ఎస్‌పీఎన్ఐ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమం ద్వారా ఐదు భాషల్లో వినూత్న కల్పిత, వాస్తవిక కథాంశాలకు ఆహ్వానం

నాడు పోస్టు చేయడమైనది: 22 NOV 2026 1:50PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340174Views: 7

 నగోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) సందర్భంగా జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ  (ఎన్ఎఫ్‌డీసీ), సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా (ఎస్‌పీఎన్ఐ) ఈ రోజు ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా వేవ్స్‌ బజార్‌ - ఎస్‌పీఎన్ఐ సృజనాత్మక కథాంశాల ఆహ్వాన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి.

 

ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రచయితలు, సృజనకర్తలు, నిర్మాణ సంస్థలు తమ వినూత్న కల్పిత, వాస్తవిక కథాంశాలను హిందీ, ఆంగ్లం, తమిళం, తెలుగు, బెంగాలీ భాషల్లో ఎస్‌పీఎన్ఐకి సమర్పించి, వాటిని నిర్మాణ ప్రతిపాదనలుగా వివరించే అవకాశం లభిస్తుంది.

కల్పిత కథా ధారావాహికలు, ప్రీమియం టీవీ+ కంటెంట్‌, రియాలిటీ షోలు, గేమ్‌, పోటీ కార్యక్రమాల రూపకల్పనలు, ప్రతిభ ఆధారిత కార్యక్రమాలు, ముందుగా స్క్రిప్టు సిద్ధం చేయని ఇతర వినూత్న కార్యక్రమాల ఆలోచనలు సహా వివిధ ఫార్మాట్లలో ప్రతిపాదనలను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన దరఖాస్తుదారులకు తమ కథాంశాలు, కార్యక్రమాల ఆలోచనలను ఎస్‌పీఎన్ఐ ప్రతినిధులకు వివరించే అవకాశం కల్పిస్తారు. వాటిని పరిశీలించిన అనంతరం, తగిన ప్రతిపాదనలను మరింత అభివృద్ధి చేసి వాటిని నిర్మించే అవకాశాన్ని పరిశీలిస్తారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్ఎఫ్‌డీసీకి చెందిన పరిశ్రమల అనుసంధాన వేదిక - వేవ్స్‌ బజార్‌ -  భారత మీడియా, వినోద రంగంలోని వివిధ భాగస్వాములతో సృజనాత్మక ప్రతిభావంతులను అనుసంధానిస్తోంది. ఈ భాగస్వామ్యం ద్వారా వినూత్న కథలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, ముఖ్యంగా ప్రాంతీయ మార్కెట్ల నుంచి వచ్చే కథాంశాలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. విభిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తుల గొంతుకలు, భిన్న దృక్పథాలు మరింత విస్తృతమైన ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది.

ఎంఓయూపై సంతకాలు చేసిన సందర్భంగా ఎన్ఎఫ్‌డీసీ చైర్మన్‌ జి. కృష్ణకుమార్‌ మాట్లాడుతూ, ‘‘ఐఎఫ్ఎఫ్ఐ సినిమా, దాని రూపకల్పనలో భాగస్వాములయ్యే కళాకారులు, సాంకేతిక నిపుణులందరి వేడుకగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథలు, సంస్కృతులు, సృజనాత్మక గొంతుకలను ఈ వేదిక ఒకచోటికి చేరుస్తుంది. చిత్రాలు, వాటిని ఆవిష్కరించే గొంతుకల్లోని వైవిధ్యమే ఈ ఏడాది చలనచిత్రోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ. ‘ విశ్వజనీన కథలు’ అనే ఇతివృత్తం సినిమా స్ఫూర్తిని అద్భుతంగా ప్రతిబింబిస్తోంది’’ అని పేర్కొన్నారు.

ఎన్ఎఫ్‌డీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ధీరజ్‌ సింగ్‌ మాట్లాడుతూ, ‘‘సృజనాత్మక ప్రతిభావంతులకు, చలనచిత్ర పరిశ్రమకు మధ్య అర్థవంతమైన అనుసంధానాలను ఏర్పరచడంలో వేవ్స్‌ బజార్‌ నిరంతరం కృషి చేస్తోంది. సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియాతో ఈ భాగస్వామ్యం ద్వారా రచయితలు, సృజనకర్తలు, నిర్మాణ సంస్థలకు వివిధ భాషలు, ఫార్మాట్లలో తమ వినూత్న కథాంశాలను పరిచయం చేసేందుకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’’ అని పేర్కొన్నారు.

సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ గౌరవ్‌ బెనర్జీ మాట్లాడుతూ, ‘‘దేశవ్యాప్తంగా అపారమైన సృజనాత్మక ప్రతిభ ఉంది. అయితే, వారి ఆలోచనలకు, కథాంశాలకు ఎల్లప్పుడూ ప్రముఖ వేదికలపై చోటు లభించడం లేదు. వేవ్స్‌ బజార్‌ ద్వారా ఎన్ఎఫ్‌డీసీతో కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం వివిధ భాషలు, ఫార్మాట్లలో రచయితలు, సృజనకర్తలు తమ వినూత్న ఆలోచనలను మాకు పరిచయం చేసేందుకు మరిన్ని అవకాశాలను కల్పించే దిశగా వేసిన ముందడుగు. ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన దృక్పథాలను, ఆసక్తికరమైన కథాంశాలను అందించే ప్రతిభావంతులను, వినూత్న ఆలోచనలను గుర్తించేందుకు మేం ఎదురుచూస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

వేవ్స్‌ బజార్‌ పోర్టల్‌ (https://wavesbazaar.com) ద్వారా ప్రతిపాదనల స్వీకరణ ప్రక్రియను ఎన్ఎఫ్‌డీసీ నిర్వహిస్తుంది. వచ్చిన ప్రతిపాదనలను  ఇరు సంస్థలు పరస్పరం అంగీకరించిన ప్రమాణాల ఆధారంగా ప్రాథమికంగా పరిశీలించి, తగిన వాటిని తుది ఎంపిక కోసం షార్ట్‌లిస్ట్‌ చేస్తుంది. ఎంపికైన దరఖాస్తుదారులకు తమ కథాంశాలు, సృజనాత్మక ఆలోచనలను ఎస్‌పీఎన్ఐ ప్రతినిధులకు వివరించే అవకాశం కల్పిస్తారు.

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

* * *


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340174
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026