తరతరాల ఆలోచనలను ఆకట్టుకునే సినిమా సమాజానికి అద్దం పడుతూ, జ్ఞాపకాలను భద్రపరుస్తూ, సాంస్కృతిక గుర్తింపులను నిర్మిస్తుంది. తెరపై కనిపించే దృశ్యాలే కాకుండా, సినీ రంగాన్ని తీర్చిదిద్దిన భావాలు, సృజనాత్మక ప్రయాణాలను గ్రంథస్థం చేయడంలో పుస్తకాల పాత్ర కూడా ఎంతో కీలకం. దీని ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వ ప్రచురణల విభాగం (పబ్లికేషన్స్ డివిజన్) భారతీయ సినిమా వారసత్వంలోని భిన్న పార్శ్వాలను ఆవిష్కరిస్తూ 57వ ఇఫీ - 2026లో రెండు పుస్తకాలను విడుదల చేసింది.
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, చిత్ర నిర్మాణం వెనుక ఉన్న సృజనాత్మక ప్రయాణాలను అక్షరబద్ధం చేయడం, భారతదేశ సుసంపన్నమైన సినీ వారసత్వాన్ని భావితరాల కోసం పదిలపరచడం ఎంతో అవసరమని అన్నారు. సినిమా కేవలం వినోద మాధ్యమం మాత్రమే కాదని, అది సమాజానికి, వివిధ తరాల స్ఫూర్తికి, మారుతున్న ఆలోచనలకు ప్రతిబింబమని ఆయన అభిప్రాయపడ్డారు. "సినిమాలు మనకు ఒక కథను చెబుతాయి. ఆ కథలు వెండితెరపై ఎలా ప్రాణం పోసుకున్నాయో అర్థం చేసుకోవడానికి సినిమా పుస్తకాలు సహాయపడతాయి" అని ఆయన పేర్కొన్నారు. చిత్రనిర్మాతల అనుభవాలు, సినీ సాంకేతిక పరిణామం, భారతీయ సినిమాను తీర్చిదిద్దిన ఆలోచనలపై ఇటువంటి ప్రచురణలు విలువైన అంతర్దృష్టిని అందిస్తాయని ఆయన వివరించారు.
విడుదల చేసిన రెండు పుస్తకాల్లో మొదటిది శ్రీ రాజేంద్ర భట్ సంకలనం చేసిన ‘సినిమా: వివిధ్ ఆయామ్’. రెండోది శ్రీ వినోద్ కౌల్ రచించిన ‘అవతార్ కౌల్: ది (ఇన్)కంప్లీట్ స్టోరీ’. సినిమాకు సంబంధించిన ముఖ్యమైన రచనలు, విభిన్న దృక్పథాలను ఒకచోట చేర్చి, హిందీ పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడం మొదటి పుస్తకం ప్రత్యేకత. ప్రముఖ సినీ దర్శకుడు అవతార్ కౌల్ జీవితం, అసంపూర్తిగా మిగిలిపోయిన ఆయన సృజనాత్మక వారసత్వాన్ని రెండో పుస్తకం నమోదు చేస్తుంది.
‘సినిమా: వివిధ్ ఆయామ్’ పుస్తకం గురించి ప్రస్తావిస్తూ, ప్రముఖ చిత్రాలు, చిత్ర నిర్మాణ ప్రక్రియ, ప్రపంచ సినిమా వంటి అంశాలపై సినీ దర్శకులు, పరిశోధకులు రాసిన వ్యాసాలను ఒకచోట చేర్చడాన్ని శ్రీ చంచల్ కుమార్ అభినందించారు. ఈ రచనలను హిందీ పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడానికి చేసిన కృషిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘అవతార్ కౌల్: ది (ఇన్)కంప్లీట్ స్టోరీ’ పుస్తకం గురించి మాట్లాడుతూ, ప్రముఖ సినీ దర్శకుడు అవతార్ కౌల్ వారసత్వాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అవతార్ కౌల్ దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ‘27 డౌన్’ (1974), భారతీయ న్యూ వేవ్ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ పుస్తకాలను ప్రచురించిన ప్రచురణల విభాగానికి, ప్రచురణలో భాగస్వాములైన శ్రీ రాజేంద్ర భట్, శ్రీ వినోద్ కౌల్ తదితరులకు కార్యదర్శి అభినందనలు తెలిపారు. ఈ పుస్తకాలు విద్యార్థులు, సినీ దర్శకులు, చలనచిత్రాభిమానులకు భారతీయ సినిమా వారసత్వాన్ని మరింత లోతుగా అన్వేషించేందుకు స్ఫూర్తినిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రచురణల విభాగం డైరెక్టర్ జనరల్ శ్రీమతి కాంచన్ ప్రసాద్ మాట్లాడుతూ, భారతీయ సినిమాతో ప్రచురణల విభాగానికి ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, దేశ సాంస్కృతిక, సృజనాత్మక వారసత్వాన్ని పత్రాల రూపంలో భద్రపరచడంలో అది పోషిస్తున్న పాత్రను వివరించారు. సినిమా కాలగమనంలో కొన్ని క్షణాలను తెరపై ఆవిష్కరిస్తే, పుస్తకాలు వాటిని శాశ్వతంగా పదిలపరుస్తాయని ఆమె పేర్కొన్నారు. సృజనాత్మక ప్రయాణాలను నమోదు చేయడం, కథలను భద్రపరచడం, భారతీయ సాంస్కృతిక గుర్తింపును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన వారి కృషిని గౌరవించడం వంటి లక్ష్యాలతో ప్రచురణల విభాగం చేస్తున్న ప్రయత్నాలను ఆమె వివరించారు.
‘సినిమా: వివిధ్ ఆయామ్’ పుస్తకం రూపకల్పన వెనుక సంపాదక ప్రక్రియ గురించి శ్రీ రాజేంద్ర భట్ వివరించారు. సినిమాపై వెలువడిన ముఖ్యమైన రచనలను హిందీ పాఠకులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనను ప్రచురణల విభాగం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లిందో ఆయన వివరించారు.
ఈ కార్యక్రమానికి పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) డైరెక్టర్ జనరల్ శ్రీమతి స్మితా వత్స శర్మ సమన్వయకర్తగా వ్యవహరించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్, సంయుక్త కార్యదర్శి డాక్టర్ కె.కె. నిరాలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పుస్తకాల గురించి
అవతార్ కౌల్: ది (ఇన్)కంప్లీట్ స్టోరీ
శ్రీ వినోద్ కౌల్ ఆంగ్లంలో రచించిన ఈ పుస్తకం చిత్ర దర్శకుడు అవతార్ కౌల్ జీవితాన్ని, అసంపూర్తిగా మిగిలిపోయిన ఆయన సృజనాత్మక వారసత్వాన్ని అక్షరబద్ధం చేసింది. ఆయన రాసిన లేఖలు, ఛాయాచిత్రాలు, జ్ఞాపకాలు, సంభాషణల ఆధారంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఆయన దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం ‘27 డౌన్’ (1974) భారతీయ న్యూ వేవ్ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం కూడా లభించింది. అయితే, ఆ పురస్కారాన్ని ప్రకటించిన రోజే ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో ముంబైలో సముద్రంలో మునిగి, 34 ఏళ్ల వయసులో అవతార్ కౌల్ ప్రాణాలు కోల్పోయారు.
సినిమా: వివిధ్ ఆయామ్
శ్రీ రాజేంద్ర భట్ హిందీలో సంకలనం చేసిన ఈ పుస్తకంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) ప్రచురించే ‘లెన్సైట్’ పత్రికలో వెలువడిన వ్యాసాలు, ముఖాముఖీల అనువాదాలు చోటుచేసుకున్నాయి. చలనచిత్ర చరిత్ర, ఛాయాగ్రహణం, ప్రపంచ సినిమా, చిత్ర నిర్మాణం వెనుక ఉన్న సృజనాత్మక ప్రక్రియలు వంటి అంశాలపై ఈ పుస్తకం విలువైన అవగాహన కల్పిస్తుంది. సినిమాపై విభిన్న దృక్పథాలను విస్తృత స్థాయిలో హిందీ పాఠకులకు చేరువ చేస్తుంది.
Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1®=48
***