57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) లో ఇండియన్‌ పనోరమా -2026 ప్రారంభం

భారత చలనచిత్ర రంగంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించే చిత్రాల ఎంపికలో విశేష కృషి చేసిన ఫీచర్‌, నాన్‌ ఫీచర్‌ చిత్రాల జ్యూరీ సభ్యులకు సత్కారం

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 3:31PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340158Views: 4

గోవాలోని పనాజీలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ)లో ఇండియన్‌ పనోరమా - 2026ను ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏడాది అధికారిక ప్రదర్శనకు ఎంపికైన చిత్రాల కూర్పు, ఎంపిక ప్రక్రియలో విశేష కృషి చేసిన ఫీచర్‌, నాన్‌ ఫీచర్‌ చిత్రాల జ్యూరీల ప్రముఖ సభ్యులను ఈ సందర్భంగా సత్కరించారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్‌ కుమార్‌, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) చైర్మన్‌ శ్రీ జి. కృష్ణకుమార్‌, చలనచిత్రోత్సవ డైరెక్టర్‌ శ్రీ ఆశుతోష్‌ గోవారికర్‌ జ్యూరీ సభ్యులను సత్కరించారు.

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్‌ కుమార్‌ ఇండియన్‌ పనోరమా - 2026ను ప్రారంభిస్తూ, భారతీయ సినిమా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ప్రదర్శించిన విశేష వైవిధ్యాన్ని ప్రస్తావించారు. దేశంలోని ప్రతి ప్రాంతం తనదైన భాషలు, సంస్కృతులు, కథల ద్వారా భారతీయ సినిమాకు అందిస్తున్న ప్రత్యేకమైన సహకారాన్ని గుర్తించేందుకు చలన చిత్రోత్సవాలు అర్థవంతమైన అవకాశాన్ని కల్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. విజ్ఞతతో చిత్రాలను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు, ఈ వేడుకను నిర్వహించిన గోవా ప్రభుత్వానికి, ఉత్సవ నిర్వాహక బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించాలని ఆకాంక్షించారు.

 

జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ) చైర్మన్‌ శ్రీ జి. కృష్ణకుమార్‌ ప్రసంగిస్తూ, 1978లో ప్రారంభమైన నాటి నుంచి ఇండియన్‌ పనోరమా కొనసాగిస్తున్న వారసత్వాన్ని, వివిధ భాషలు, ప్రాంతాలకు చెందిన భారతీయ సినిమా వైవిధ్యాన్ని వేడుకగా చాటడంలో దాని పాత్రను వివరించారు. ఈ ఏడాది ఐఎఫ్ఎఫ్ఐ ఇతివృత్తమైన ‘ఎల్లలు లేని కథలు’ (స్టోరీస్‌ వితౌట్‌ బోర్డర్స్‌)ను ప్రస్తావిస్తూ, సినిమారంగానికి మంత్రిత్వ శాఖ మద్దతును కొనసాగిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. నిరంతర సహకారం అందిస్తున్న గోవా ప్రభుత్వానికి, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చలనచిత్రోత్సవానికి హాజరైన దర్శకులు, సినీ అభిమానులకు ఆయన సాదర స్వాగతం పలికారు.

 

చలనచిత్రోత్సవ డైరెక్టర్‌ శ్రీ ఆశుతోష్‌ గోవారికర్‌ స్వాగతం చెబుతూ, ఐఎఫ్ఎఫ్ఐతో తనకు ఉన్న తొలి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. దశాబ్దాలుగా ఇండియన్‌ పనోరమా  పరిణామ క్రమాన్ని, భారతదేశ సుసంపన్నమైన సాంస్కృతిక, చలనచిత్ర వైవిధ్యాన్ని చాటిచెప్పే కీలక వేదికగా ఎదిగిన తీరును వివరించారు. ఈ ఏడాది చిత్రాల ఎంపిక ప్రక్రియకు లభించిన స్పందనను ప్రస్తావిస్తూ, మొత్తం 18 భాషల్లో 762 ఫీచర్‌ ఫిల్మ్‌లు, 358 నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌లు కలిపి 1,120 ఎంట్రీలు అందాయని తెలిపారు. తుది ఎంపికలో హిందీ, మరాఠీ, కన్నడ, తుళు, లడఖీ, కశ్మీరీ, ఆంగ్లం సహా 14 భాషలకు చెందిన చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌లు కూడా చోటు దక్కించుకున్నాయని పేర్కొన్నారు.

 

57వ చలనచిత్రోత్సవ ఇతివృత్తమైన ‘ ఎల్లలు లేని కథలు’  గురించి శ్రీ గోవారికర్‌ మాట్లాడుతూ, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణులు, కొత్త తరం కథా రచయితలు తమ కథలను చెప్పడం కొనసాగించాలని కోరారు. ప్రేక్షకులు కూడా విభిన్న చిత్రాలను విస్తృతంగా చూస్తూ, వివేచనతో మంచిచెడులను బేరీజు వేయాలని సూచించారు. 

ఇండియన్‌ పనోరమా - 2026 జ్యూరీ సభ్యులు

నాన్‌ - ఫీచర్‌ చిత్రాల జ్యూరీలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారు-  శ్రీ హిమాంశు శేఖర్‌ ఖటువా (డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు, నాన్‌ -ఫీచర్‌ చిత్రాల జ్యూరీ చైర్మన్‌), శ్రీ శంఖజీత్‌ డే (డాక్యుమెంటరీ చిత్రాల దర్శకుడు), శ్రీమతి రాగిణి సోనా (చిత్ర నిర్మాత), శ్రీ శివ్‌ సన్నీ (చలనచిత్ర పాత్రికేయుడు), శ్రీ ధనేశ్‌ యాదవ్‌ టి.ఆర్‌. (చిత్ర సంపాదకుడు), శ్రీ అభిజీత్‌ దాల్వీ (చిత్ర దర్శకుడు), శ్రీమతి ఆర్తి పటేల్‌ (నిర్మాత, మీడియా రంగ నిపుణురాలు).

కథా (ఫీచర్‌) చిత్రాల జ్యూరీలో 13 మంది సభ్యులు ఉన్నారు. వారు-  శ్రీ మధుర్‌ భండార్కర్‌ (ఫీచర్‌ చిత్రాల జ్యూరీ చైర్మన్‌), శ్రీ యు. రవీందర్‌ (ఛాయాగ్రాహకుడు), శ్రీ సోహమ్‌ పి. షా (చిత్ర దర్శకుడు), శ్రీ రాహుల్‌ భోలే (దర్శకుడు, రచయిత, సంపాదకుడు), శ్రీ ఓయినమ్‌ గౌతమ్‌ సింగ్‌ (చిత్ర దర్శకుడు), శ్రీ నిలాద్రి రాయ్‌ (చిత్ర సంపాదకుడు), శ్రీ ఎం.ఎస్‌. ప్రభు (ఛాయాగ్రాహకుడు), శ్రీ కె.ఎస్‌. శివరామన్‌ (ఛాయాగ్రాహకుడు), శ్రీ జయంత గోస్వామి (దర్శకుడు), శ్రీమతి బిందు చంద్ర‌మౌళి (నటి), శ్రీమతి భారతి ప్రధాన్‌ (చలనచిత్ర విమర్శకురాలు), డాక్టర్‌ అయాష్‌ ఆరిఫ్‌ (ప్రముఖ నటుడు, రచయిత), శ్రీ అరుణ్‌ గోంగడే (యానిమేటర్‌).

 

ఇండియన్‌ పనోరమా - 2026 ప్రారంభ చిత్రాలు

సత్కార కార్యక్రమం అనంతరం, ఇండియన్‌ పనోరమా - 2026లో భాగంగా ప్రదర్శించనున్న ప్రారంభ చిత్రాలను పరిచయం చేసి, తొలి ప్రదర్శనకు ముందు వాటి బృందాలను సత్కరించారు.

నాన్‌ - ఫీచర్‌ విభాగంలో భాగంగా లడఖీ భాషలో రూపొందించిన ‘బికమింగ్‌’ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీమతి లీనా యాదవ్‌ను శ్రీ జి. కృష్ణకుమార్‌, శ్రీమతి డెలిలా లోబో, శ్రీ ఆశుతోష్‌ గోవారికర్‌ సత్కరించారు. కాలం, జ్ఞాపకాలు, జన్మల పరిమితులను అధిగమించే లడఖ్‌కు చెందిన ఒక బాలుడి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. చిత్ర దర్శకురాలు శ్రీమతి లీనా యాదవ్‌ ఈ చిత్రాన్ని పరిచయం చేస్తూ, సరిహద్దులకు అతీతమైన జీవితం అనే ఇతివృత్తం గురించి వివరించారు.

ఫీచర్‌ చిత్రాల విభాగంలో శ్రీ ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ‘ధురంధర్‌’ చిత్రం తరఫున ప్రముఖ నటుడు శ్రీ రాకేశ్‌ బేడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ చంచల్‌ కుమార్‌, శ్రీ ఆశుతోష్‌ గోవారికర్‌ ఆయనకు జ్ఞాపికను అందజేసి సత్కరించారు. దర్శకుడు ఆదిత్య ధర్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని, ఈ చిత్రంలో సంప్రదాయానికి భిన్నమైన గూఢచారి పాత్రను పోషించిన తీరును శ్రీ రాకేశ్‌ బేడీ ప్రేక్షకులతో పంచుకున్నారు.

రెండు ప్రారంభ చిత్రాల ప్రదర్శనలతో  కార్యక్రమం ముగిసింది. దీంతో ఐఎఫ్ఎఫ్ఐ - 2026లో ఇండియన్‌ పనోరమా చిత్ర ప్రదర్శనల శ్రేణి ప్రారంభమైంది.

Read IFFILOID here: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340158
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026