57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

57వ ఇఫీ వేదికగా ప్రారంభమైన 'క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో' (సీఎంఓటీ) ఆరో విడత

‘మూలాలు, రెక్కలు: మన మూలాలను గౌరవిస్తూ మన భవిష్యత్తును ఆహ్వానిద్దాం’ అనే ఇతివృత్తంతో 48-గంటల ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్‌లో పాల్గొననున్న దేశవ్యాప్తంగా ఎంపికైన 100 మంది యువ సృజనాత్మక ప్రతిభావంతులు

యువ చిత్రనిర్మాతలు తమ మూలాలు, సంస్కృతి నుంచి స్ఫూర్తి పొందాలని కోరిన సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్

నాడు పోస్టు చేయడమైనది: 21 NOV 2026 2:39PMby PIB Hyderabadరిలీజ్ ఐడి: 2340157Views: 3

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీసీ) నిర్వహిస్తోన్న 'క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో' (సీఎంఓటీ) ఆరో విడత కార్యక్రమం...57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (ఇఫీ) భాగంగా నేడు గోవాలోని కళా అకాడమీలో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న 100 మంది యువ సృజనాత్మక ప్రతిభావంతులను ఒకదగ్గరికి తీసుకువస్తూ వారు పరస్పరం సహకరించుకోవడానికి, తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి, చిత్ర పరిశ్రమ అనుభవాన్ని పొందడానికి ఒక వేదికను కల్పిస్తోంది.

ఈ ప్రారంభోత్సవ వేడుకకు సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్, ఎఫ్‌టీఐఐ రిజిస్ట్రార్ శ్రీ లౌకిక్ పరాఖ్, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ కె. కె. నిరాలా, ఎన్ఎఫ్‌డీసీ ఛైర్మన్ శ్రీ జీ. కృష్ణకుమార్, ఎన్ఎఫ్‌డీసీ జనరల్ మేనేజర్ శ్రీ గౌతమ్ భానోట్ హాజరయ్యారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ చంచల్ కుమార్ మాట్లాడుతూ.. పాల్గొనే ప్రతి ఒక్కరూ ఇప్పటికే తమదైన ముద్ర వేశారు కాబట్టే ఇక్కడ ఉన్నారన్నారు. ఆ ప్రతిభను ఒక చలనచిత్రంగా మలచుకోవడానికి రాబోయే 48 గంటలు వారికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు.

మూలాలు అనేవి సంస్కృతి, భాష, అనుభవాల నుంచి ఏర్పడతాయని.. అదే సమయంలో కలలు అనేవి ఊహాశక్తి, జిజ్ఞాస, కొత్తదనాన్ని ప్రయత్నించే ధైర్యం నుంచి ఉద్భవిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఫ్రెంచ్ తత్వవేత్త జోసెఫ్ జౌబర్ట్ మాటలను ప్రస్తావిస్తూ ఊహాశక్తి కలలు కనడానికి తోడ్పడుతుందని, కళా నైపుణ్యాన్ని సంపాదించుకోవటం అనేది ఆ కలలకు దిశానిర్దేశం చేస్తుందని, మూలాలు కథలకు తమదైన గళాన్ని అందిస్తాయని ఆయన వివరించారు.

పాల్గొనేవారు తమ కథల పరిధిని పరిమితం చేసుకోకుండా, తమ మూలాల నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి పుట్టిన కథ అయినప్పటికీ నిజాయితీతో చెప్పినట్లయితే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయాలను తాకగలదని ఆయన అన్నారు.

సినిమా ఒక సమష్టి కళా రూపమని ఆయన అన్నారు. పాల్గొనేవారు ఒకరి మాట ఒకరు వినాలని, తమ సహచర బృంద సభ్యులను నమ్మాలని, ప్రయోగాలు చేయాలని, సృజనాత్మక సాహసాలు చేయాలని, ఈ నిర్మాణ ప్రక్రియను ఆస్వాదించాలని పిలుపునిచ్చారు. తమ మూలాలను వెంట తీసుకువెళ్తూ తమ ఊహాశక్తికి రెక్కలు తొడగాలని, తమ కథలను ప్రపంచానికి పరిచయం చేయాలని కోరుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ ప్రారంభోత్సవ వేడుకలో '48-గంటల ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్'ను అధికారికంగా ప్రారంభించడం ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేకంగా రూపొందించిన ఫిల్మ్ స్లేట్‌ను కొట్టిన కార్యదర్శి.. ఈ ఛాలెంజ్ ఆరో ఎడిషన్‌కు శ్రీకారం చుట్టారు.

2026 బృందంలో 13 చలనచిత్ర నిర్మాణ విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 100 మంది ప్రతిభావంతులు ఉన్నారు. వీటిలో దర్శకత్వం, నటన, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్- సబ్‌టైటిలింగ్, స్క్రిప్ట్ రైటింగ్, నేపథ్య గానం, సంగీత దర్శకత్వం, సౌండ్ రికార్డింగ్, కాస్ట్యూమ్ డిజైన్, హెయిర్- మేకప్, కళా దర్శకత్వం, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్(వీఎఫ్‌ఎక్స్), ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, వాయిస్ ఓవర్- డబ్బింగ్ విభాగాలు ఉన్నాయి.

ఎన్ఎఫ్‌డీసీ సహకారంతో పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నిర్వహిస్తున్న ఈ 48-గంటల ఫిల్మ్ మేకింగ్ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు 5 బృందాలుగా ఏర్పడి 48 గంటల నిర్మాణ వ్యవధిలో లఘు చిత్రాలను తీస్తారు. పూర్తైన చిత్రాలను ఇఫీలో ప్రత్యేకంగా ప్రదర్శించి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిపుణులతో కూడిన జ్యూరీ ద్వారా మదింపు చేస్తారు.

సీఎంఓటీ టాలెంట్ క్యాంప్.. పాల్గొనేవారిని మీడియా, వినోద పరిశ్రమతో మరింత అనుసంధానిస్తుంది.  తద్వారా నిర్మాణ సంస్థలు, స్టూడియోలు, మ్యూజిక్ లేబుల్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, ప్రసార సంస్థలు, ఇతర పరిశ్రమ భాగస్వాములతో సంభాషించే అవకాశాలను కల్పిస్తుంది.

2021లో ప్రారంభమైనప్పటి నుంచి సీఎంఓటీ వర్ధమాన సృజనాత్మక నిపుణులను మీడియా, వినోద పరిశ్రమతో అనుసంధానించే వేదికగా అభివృద్ధి చెందింది. దీని పూర్వ విద్యార్థులు అంతర్జాతీయ చిత్ర నిర్మాణాలలో పనిచేయడంతో పాటు కేన్స్, బెర్లినాలే, టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం.. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులు వంటి ప్రముఖ వేదికలు, చలనచిత్రోత్సవాలలో గుర్తింపు పొందారు. మునుపటి విడతలో పాల్గొన్న 18 మంది ప్రతిభావంతులు ముఖేష్ ఛాబ్రా కాస్టింగ్ కంపెనీ (ఎంసీసీసీ) ద్వారా ఎంపికవ్వటం విశేషం. సీఎంఓటీ ద్వారా మార్గదర్శకత్వం పొందిన నైపుణ్యాలను వృత్తిపరమైన అవకాశాలుగా మలచటంలో ఇది ఒక ప్రోత్సాహకరమైన ముందడుగు.

ఇఫీలోయిడ్ ఇక్కడ చదవండి: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

***


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2340157
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026