నాడు పోస్టు చేయడమైనది:
19 NOV 2026 4:24PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని పురానా ఖిలాలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) తొలి సాంస్కృతిక చర్చల వేదికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 20న సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం ఆయన సభికులనుద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ ప్రాంత సుసంపన్న నాగరికతా వారసత్వంపై ఈ నెల 22 వరకు.. మూడు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజల మధ్య సంబంధాల బలోపేతం, విభిన్న సంస్కృతుల మధ్య చర్చలు, సహకారాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం.
చైనాలోని తియాంజిన్‌లో 2025 నాటి ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ కూటమి చట్రం కింద సాంస్కృతిక చర్చల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటును ప్రధానమంత్రి ప్రతిపాదించారు. దీని ఆధారంగానే ఈ కార్యక్రమం రూపొందగా, ఎస్సీఓ బిష్కెక్ తీర్మానంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
తదనుగుణంగా 20న వేదిక ప్రారంభోత్సవం సందర్భంగా “సివిలైజేషన్స్ ఇన్ కాన్వర్జేషన్- కల్చరల్ షో” పేరిట ఒక ప్రదర్శన నిర్వహిస్తారు. ఇందులో సంగీత-నృత్య, దృశ్య కథనం- వ్యాఖ్యానం అంతర్భాగంగా ఉంటాయి. “వసుధైవ కుటుంబకం’ ఇతివృత్తంగా భారత్, యురేషియా అంతటా విస్తరించిన సాంస్కృతిక సంబంధాలను ఈ ప్రదర్శన విశదీకరిస్తుంది.
అలాగే, “అస్తిత్వం- మన మనుగడ సారాంశం” పేరిట భారత పురావస్తు, కళాత్మక, సాహితీ వారసత్వాన్ని కళ్లకు కట్టే ప్రదర్శనలు కూడా ఉంటాయి. సామాన్య శక పూర్వం 1200 నుంచి సామాన్య శకం 1200 వరకూ గల పురావస్తు ఆధారాలతో ఢిల్లీ చరిత్రను ఇది సమగ్రంగా విశదీకరిస్తుంది. వివిధ తవ్వకాలలో లభించిన అవశేషాలు, కళాఖండాలు, వాస్తు శకలాలు, ఇతర కీలక ఆవిష్కరణలు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. “మహాభారత్ స్క్రోల్ పెవిలియన్ – అనంత్: 18వ శతాబ్దపు అరుదైన మహాభారత ప్రదర్శన” పేరిట భారతేతిహాస, కళా సంప్రదాయాలను ప్రతిబింబించే సచిత్ర ప్రదర్శన కూడా ఉంటుంది.
ఇక నవంబరు 21, 22 తేదీలలో పండితులు, విద్యావేత్తలు, విషయ పరిజ్ఞాన నిపుణులు, సాంస్కృతిక ప్రతినిధులందరితో నాలుగు ప్రత్యేకాంశాలపై చర్చాగోష్ఠులు నిర్వహిస్తారు. సంగీతం, ప్రదర్శన కళలు, వస్త్రాలు, వంటకాలు, సంప్రదాయ క్రీడలు, తదితరాలపై సాంస్కృతిక వైశిష్టం చాటే ప్రదర్శనలు కూడా ఉంటాయి. వీటితో పాటు కళ, వాస్తుశిల్పంలో సమష్టి సంప్రదాయాలు, లిపులు-రాతప్రతులు సహా భాషా, సాహిత్య సంప్రదాయాలు, బౌద్ధారామాల విశేషాలు, తాత్త్విక సంప్రదాయాలపైనా ఈ గోష్ఠులలో చర్చిస్తారు.
***