నాడు పోస్టు చేయడమైనది:
18 NOV 2026 4:31PM by PIB Hyderabad
ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సహించరాదనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విధానానికి అనుగుణంగా గురువారం (2026 నవంబర్ 19) న్యూఢిల్లీలో మొదలయ్యే రెండు రోజుల ‘ఉగ్రవాద వ్యతిరేక సదస్సు’ను హోం మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభిస్తారు. ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కొనేందుకు దేశ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే నిరంతర ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఈ సదస్సును నిర్వహిస్తోంది. ఈ ఏడాది సదస్సులో సీమాంతర ఉగ్రవాదంపై విస్తృతంగా చర్చించనున్నారు.
ఏటా నిర్వహించే ఈ సదస్సు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే క్షేత్రస్థాయి బలగాలు, వివిధ దర్యాప్తు సంస్థలు, సాంకేతిక, న్యాయ, ఫోరెన్సిక్ రంగాల నిపుణులు ఒకచోట చేరే కీలక వేదికగా ఎదిగింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు, ఉగ్రవాదం వల్ల ఎదురయ్యే ముప్పులపై వివిధ సంస్థలు, భద్రతా బలగాలు సమష్టిగా సమీక్షించి చర్చించేందుకు ఈ సదస్సు అవకాశం కల్పిస్తోంది.
సమగ్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా భాగస్వాములందరి మధ్య సమన్వయం, సహకారాన్ని పెంపొందించడంపై ఈ సదస్సు ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సమన్వయంతో, సమష్టిగా చర్యలు చేపట్టేలా అధికారిక, అనధికారిక సమాచార మార్పిడి మార్గాలను ఏర్పాటు చేయడం ఈ సదస్సు లక్ష్యం. భవిష్యత్తులో విధానాల రూపకల్పనకు అవసరమైన విలువైన సూచనలు, సలహాలను అందించడం కూడా ఈ సదస్సు ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి.
ఈ సదస్సులో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. విదేశీ న్యాయ పరిధుల నుంచి సాక్ష్యాధారాల సేకరణ, ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తుల్లో డిజిటల్ ఫోరెన్సిక్స్, డేటా విశ్లేషణ వినియోగం, విచారణ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఉగ్రవాద భావజాల వ్యాప్తిని అరికట్టడం, జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్న కొత్త తరహా హైబ్రిడ్ ముప్పులను ఎదుర్కోవడం వంటి అంశాలపై కూడా ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చే నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు ఉపయోగించే సాధనాలు, వ్యూహాలు, గత కేసుల దర్యాప్తు అనుభవాలను కూడా చర్చించనున్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఉగ్రవాద ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యూహాల రూపకల్పన, జాతీయ భద్రతకు సంబంధించిన కొత్త సవాళ్లను అధిగమించేలా సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడం వంటి అంశాలపై కూడా దృష్టి సారిస్తారు.
ఈ ఏడాది సదస్సులో భాగంగా రాష్ట్ర పోలీసు సిబ్బంది, వృత్తిపరమైన న్యాయ నిపుణుల కోసం సామర్థ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. పలు కీలక అంశాల్లో వారికి నైపుణ్యాలు, అవగాహన కల్పించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఉగ్రవాద కేసుల దర్యాప్తులో నూతన నేర న్యాయ చట్టాల అమలు, ప్రాసిక్యూషన్‌లో డిజిటల్ సాక్ష్యాధారాల వినియోగం, విచారణ వ్యూహాలు, కేసుల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఉగ్రవాద కేసుల దర్యాప్తుకు సంబంధించిన ప్రత్యేక చట్ట నిబంధనలు, నిందితుల తరఫు న్యాయవాదులు లేవనెత్తే సాధారణ సవాళ్లు, సాక్షుల రక్షణ, ప్రాసిక్యూషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వంటి అంశాలను కూడా చర్చించనున్నారు.
ఈ రెండు రోజుల సదస్సులో చర్చల ద్వారా చట్ట అమలు సంస్థలు తమ అనుభవాలను పరస్పరం పంచుకోవడానికి, ఉగ్రవాద వ్యతిరేక కేసుల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను వివరించడానికి, గత ఉగ్రవాద దర్యాప్తుల నుంచి నేర్చుకున్న పాఠాలను విశ్లేషించడానికి అవకాశం కలుగుతుంది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ పోలీసు అధికారులు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను పర్యవేక్షించే కేంద్ర దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వ విభాగాల అధికారులు, న్యాయ, ఫోరెన్సిక్, సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
***