నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

"లక్ష్యసాధన నాయకత్వం"పై నీతి ఆయోగ్ జాతీయ కార్యశాలలో కర్మయోగి సంకల్పను ప్రారంభించిన కేబినెట్ కార్యదర్శి


నాయకత్వ పద్దతుల్లో నిర్దిష్టమైన మార్పులు చేసుకుంటామని ఐగాట్ కర్మయోగి వేదికపై దేశ వ్యాప్తంగా ప్రతిజ్ఞ చేయనున్న సివిల్ సర్వెంట్లు

నాడు పోస్టు చేయడమైనది: 17 NOV 2026 9:25PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని భారత మండపంలో "లక్ష్యసాధన నాయకత్వం"పై నీతి ఆయోగ్ నిర్వహించిన జాతీయ కార్యశాల ముగింపు సమావేశంలో ఐగాట్ కర్మయోగి వేదికపై కర్మయోగి సంకల్ప్‌ను కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టి. వి. సోమనాథన్ ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇరవై అయిదేళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా నీతి ఆయోగ్ నిర్వహిస్తున్న అయిదు జాతీయ కార్యశాలల శ్రేణిలో ఇది మొదటిది.

కర్మయోగి సంకల్పం ద్వారా ప్రతి సివిల్ సర్వెంట్ సొంత నాయకత్వ పద్ధతుల్లో నిర్దిష్ట మార్పు కోసం ప్రతిజ్ఞ చేస్తారు. ఈ ప్రతిజ్ఞ ద్వారా ఆఫీసర్ ఎక్కడ పని చేస్తారు, ఏ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు, పౌరులకు ఎలాంటి మార్పు కనిపిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారనే వివరాలను స్పష్టం చేస్తారు. భారత మండపం, ఐగాట్ కర్మయోగి వేదిక ద్వారా పాల్గొన్న అధికారులు ఈ ప్రారంభ సమయంలో సంకల్పాలను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ అధికారుల ప్రతిజ్ఞలను కర్మయోగి భారత్ పర్యవేక్షిస్తుంది. డిసెంబర్ 25, 2026న సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా ఈ వేదికలో 25,000 సంకల్పాలను నమోదు చేయాలనే లక్ష్యంతో మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, శిక్షణ సంస్థల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తారు.

ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.కె. మిశ్రా కీలక ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 2001 భూకంపం తర్వాత కచ్ పునర్నిర్మాణం, కొవిడ్-19 మహమ్మారికి ప్రతిస్పందన, లఖ్‌పతి దీదీ, అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలపై స్వీయ అనుభవాలను పంచుకున్నారు. కేస్ క్లినిక్‌లో, ప్రతి బృందం తమకు కేటాయించిన ఎపిసోడ్ నుంచి ఒక నిర్ణయాన్ని పరిశీలించింది. ఆ నిర్ణయంలో ప్రజానీకానికి ఏది అవసరం, దానికి వ్యతిరేకంగా ఏం ఉంది? నిర్ణయం అమల్లో ఉద్దేశానికి అనుగుణంగా ఎలా కట్టుబడి ఉందనే అంశాలను విశ్లేషించారు.

"వికసిత్ భారత్ కోసం నాయకత్వం"  అంశంపై నీతి ఆయోగ్ మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం మధ్యవర్తిగా ఒక ప్యానెల్ చర్చ జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పట్టణాభివృద్ధి, ఇంధన శాఖ కేబినెట్ మంత్రి శ్రీ అరవింద్ కుమార్ శర్మ, ఐఐఎం అహ్మదాబాద్‌ ప్రొఫెసర్ విశాల్ గుప్తా, నాస్కామ్ మాజీ అధ్యక్షురాలు, నీతి ఆయోగ్ విశిష్ట ఫెలో శ్రీ దేబ్జాని ఘోష్, ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జాయింట్ మేజిస్ట్రేట్ శ్రీ నారాయణి భాటియా ఈ ప్యానెల్ చర్చలో వక్తలుగా పాల్గొన్నారు.

గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వ సూత్రాలు, 2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించటంలో వాటి ప్రాముఖ్యత గురించి ప్యానెల్ సభ్యులు అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రధానమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పును శ్రీ అరవింద్ కుమార్ శర్మ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నూతన విధానాలను రూపొందించటంలో, సంస్థలను, మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించటంలో, స్థానిక కమ్యూనిటీలను అభివృద్ధికి కేంద్రంగా మలచటంలో ప్రధానమంత్రికి గల ప్రత్యేక సామర్థ్యాన్ని ఆయన స్పష్టం చేశారు.

ప్రొఫెసర్ విశాల్ గుప్తా మాట్లాడుతూ... ప్రతిష్టాత్మక లక్ష్యాలపై విశ్వాసాన్ని కలిగించే ప్రధానమంత్రి సామర్థ్యాన్ని వివరించారు. రాజకీయ సంకల్పానికి తగినట్లుగా పరిపాలనా సంస్కరణలు కూడా జరగాలని చెప్పారు. సేవా భావం నాయకత్వానికి ప్రధాన సూత్రమని కొనియాడారు.

సాంకేతికతను ఎల్లప్పుడూ ప్రజలపై, సమాజంపై చూపే ప్రభావం ద్వారానే అంచనా వేయాలని దేబ్జాని ఘోష్‌ అభిప్రాయపడ్డారు. ఏఐ, సాంకేతిక పురోగతి మానవ కేంద్రీకృత దృక్పథంతో ఉండాలని, నూతన ఆవిష్కరణలు సార్థకమైన సామాజిక మార్పునకు దోహదపడేలా చూడాలని ఆమె పిలుపునిచ్చారు.

ప్రధానమంత్రిలో ఉన్న పార్శ్వ ఆలోచనా విధానాన్ని, ఒకదానికొకటి ముడిపడున్న అవకాశాలను గుర్తించే నేర్పును నారాయణి భాటియా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన ఆచరించే శ్రవణ, సానుభూతి గుణాలను ఆమె అభినందించారు. యువ అధికారులతో సహా అందరికీ అభిప్రాయాలను పంచుకునేందుకు తగిన అవకాశాన్ని, స్వేచ్ఛను ఇవ్వటం ఆయన నాయకత్వంలోని అత్యంత విలువైన లక్షణాల్లో ఒకటని ఆమె పేర్కొన్నారు.

అప్లికేషన్ క్లినిక్‌లో కేస్ క్లినిక్ ద్వారా నేర్చుకున్న అంశాలను ప్రభుత్వాధికారులు ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టింగ్స్‌లో ఎదురవుతున్న వాస్తవ నాయకత్వ సవాళ్లకు అన్వయించారు.

ముగింపు సదస్సులో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్. బాలసుబ్రమణ్యం ఆ రోజు జరిగిన కార్యకలాపాల సంక్షిప్త నివేదికను అందజేశారు. అదనంగా వివిధ బృందాలు పలు సవాళ్లకు సంబంధించిన అప్లికేషన్లను సమర్పించాయి. మారుమూల గిరిజన ప్రాంతాల్లో మాతృ సంరక్షణను పర్యవేక్షించేందుకు, నిలకడగా కొనసాగించేందుకు ఉద్దేశించిన ఏఎస్ఆర్ సాథీ - సేఫ్ ఆంటెనాటల్ అసిస్టెన్స్, అసంక్రమిత వ్యాధులకు సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను అందించేందుకు క్లోజ్డ్-లూప్ రిఫెరల్ మార్గాలను అమలు చేయటం, ఎస్‌హెచ్‌జీ సంస్థలు లఖ్‌పతి దీదీ ఆదాయాన్ని నిలకడగా కొనసాగించేలా ప్రతి సరస్ మేళా ద్వారా ఏడాది పొడవునా కొనుగోలుదారుల హామీలు లభించేలా చేయటం, ఎస్‌బీఎం-జీ ద్వారా మురికి నీటి నిర్వహణ ఆస్తుల ప్రారంభ, దీర్ఘకాలిక పనితీరును నిర్ధారించటం వంటి అంశాలపై ఈ అప్లికేషన్లను సమర్పించారు.

సమావేశం ముగింపు సందర్భంగా కేబినెట్ కార్యదర్శి డాక్టర్ టి.వి. సోమనాథన్ మాట్లాడారు. "నాయకత్వ పాఠాలను విద్యా కోర్సులు, పరిశోధనల ద్వారా అధ్యయనం చేయవచ్చు. అత్యంత విలువైన పాఠాలు సమర్థులైన నాయకులను గమనించటం, వారితో కలిసి పనిచేయటం ద్వారానే వస్తాయి" అని పేర్కొన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి నాయకులతో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఉదాహరణగా చూపుతూ... సివిల్ సర్వెంట్లు అలవర్చుకోవాల్సిన కీలక పరిపాలనా నాయకత్వ పద్ధతులను ఆయన ప్రస్తావించారు. ఈ కార్యశాల ద్వారా నేర్చుకున్న పాఠాలను కర్మయోగి సంకల్ప క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తుందని ఆయన తెలిపారు. సమర్థులైన నాయకుల అనుభవం ద్వారా మాత్రమే ప్రభావవంతమైన నాయకత్వాన్ని అర్థం చేసుకోవచ్చని డాక్టర్ సోమనాథన్ స్పష్టం చేశారు. వారి పరిపాలనా నైపుణ్యాల నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యతను ఆయన వివరించారు.

సమర్థవంతమైన పరిపాలనా నాయకత్వం అంటే.. సముచితమైన ప్రశ్నలు వేయటం, శ్రద్ధగా ఆలకించటం, దృఢమైన నిర్ణయాలు తీసుకోవటం, జవాబుదారీతనం పాటించటం, నిబంధనలకు కట్టుబడి ఉండటం ద్వారా ఒక నిర్దిష్ట దృష్టిని కొలవదగిన ఫలితాలుగా మార్చటమేనని ఆయన తెలిపారు.

ఈ బృందాల విశ్లేషణను కేస్ స్టడీలుగా కేస్ రైటర్లు రూపొందిస్తారు. సివిల్ సర్వెంట్లు, శిక్షణ సంస్థలు వినియోగించుకునేలా ఐగాట్ కర్మయోగి వేదికపై ప్రచురిస్తారు. ప్రతి బృందం రూపొందించిన ప్రణాళికలు, కర్మయోగి సంకల్ప్ ద్వారా తీసుకున్న ప్రతిజ్ఞలు ఈ కార్యశాల అభ్యాసాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్తాయి. "పరిపాలనా ప్రయోజనాలను ప్రజలకు చేర్చటం" అనే అంశంపై తదుపరి జాతీయ కార్యశాల 2027 జనవరిలో జరుగుతుంది. నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ అనురాగ్ జైన్ కృతజ్ఞతలు తెలియజేసి కార్యశాలను ముగించారు.

 

 

***


(రిలీజ్ ఐడి: 2337857) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Odia , English , Khasi , Urdu , हिन्दी , Nepali , Assamese , Bengali-TR , Gujarati , Tamil , Kannada