నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2026 2:43PM by PIB Hyderabad
పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ సాధించిన అద్భుత ప్రగతి, పర్యావరణ కట్టుబాటు దేశ ఆర్థిక వృద్ధికి ఆటంకాలు కాదని, పురోగమనానికి ఉత్ప్రేరకమని నిరూపితమైనట్లు ఉప-రాష్ట్రపతి శ్రీ సి.పి.రాధాకృష్ణన్ అన్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారత పునరుత్పాదక ఇంధన సదస్సు.. ఎక్స్పో-2026 ముగింపు కార్యక్రమంలో ఆయన ఇవాళ ప్రసంగించారు. పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం సాధించిన అద్భుత విజయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే, సుస్థిర ప్రగతిపై దేశం నిబద్ధత, దేశవ్యాప్తంగా పేదలు, రైతులు, సమాజాలకు సాధికారత కల్పనలో కాలుష్య రహిత ఇంధనం పోషిస్తున్న పరిణామాత్మక పాత్రను కూడా వివరించారు.
భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశం శిలాజ ఇంధనాల పరాధీనత తగ్గించడమే కాకుండా సత్వర ఆర్థిక వృద్ధిని కొనసాగించడంపై అనేక సందేహాలకు దీటైన జవాబిచ్చిందని ఉప-రాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ దిశగా ఏకకాలంలో తాను సాధించిన విజయాల ద్వారా అన్ని అనుమానాలనూ సమర్థంగా నివృత్తి చేసిందని చెప్పారు.
భారత శిలాజేతర ఇంధన ఆధారిత స్థాపిత సామర్థ్యం 300 గిగావాట్లను అధిగమించిందని, తద్వారా ఐదేళ్ల గడువుకన్నా ముందుగానే… అంటే- 2025కల్లా శిలాజేతర ఇంధన వనరుల ద్వారా తన స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో 50 శాతాన్ని సాధించిందని స్పష్టం చేశారు. సౌర విద్యుత్ సామర్థ్యం ఒక దశాబ్దం వ్యవధిలోనే 3 గిగావాట్లకు దిగువ స్థాయి నుంచి 170 గిగావాట్ల స్థాయిని మించి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఒకప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్తుకన్నా సౌర విద్యుత్తు అనేక రెట్లు ఖరీదైనదిగా ఉండేదని, ఇప్పుడు దేశంలోనే అత్యంత చౌకైన వనరులలో ఒకటిగా మారిందని వివరించారు. పటిష్ట విధానాలు, ప్రైవేట్ రంగం, రాష్ట్రాలు, పౌరుల సమష్టి కృషిని ఈ రూపాంతరీకరణ ప్రతిబింబిస్తున్నదని ఆయన అన్నారు.
దేశంలో హైడ్రోజన్ ఇంధన రంగం పురోగమనం కూడా ప్రోత్సాహకరంగా ఉందని ఉప-రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో శాస్త్ర-సాంకేతికతలలో ప్రగతి ఈ రంగం సామర్థ్యాన్ని మరింత సరసమైనదిగా మార్చగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారత పునరుత్పాదక ఇంధన రూపాంతరీకరణ దేశానికి ఒక ఆదర్శప్రాయ విజయం మాత్రమేగాక పేద దేశాలకు ఒక నమూనాగా మారిందన్నారు.
గడచిన దశాబ్దంలో సాధించిన పురోగతి, పర్యావరణ నిబద్ధతలు వృద్ధికి ఉత్ప్రేరకాలు కాగలవని చెప్పారు. తద్వారా అధిక ఇంధన లభ్యత, స్వల్ప పారిశ్రామిక వ్యయం, ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు దిగుమతులపై పరాధీనత తగ్గుతుందనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత రుజువవుతున్నదని ఉప-రాష్ట్రపతి అన్నారు. పారిశ్రామిక-విద్యా రంగాల మధ్య బలమైన సహకారం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశోధన, ఆవిష్కరణలు, వ్యవస్థాపనల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తూ- “2040 నాటి సాంకేతికతలు నేటి ప్రయోగశాలలు, అంకుర సంస్థల నుంచే రూపొందుతాయి” అన్నారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద 65 లక్షలకు పైగా కుటుంబాలు సౌర ఉద్యమంలో భాగస్వాములై సరసమైన కాలుష్య రహిత ఇంధనాన్ని పొందుతున్నాయని ఉప-రాష్ట్రపతి తెలిపారు. పీఎం-కుసుమ్ పథకం కింద దాదాపు 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సౌర పంపులతో రైతులకు డీజిల్ ఖర్చు ఆదా కావడమే కాకుండా అదనపు ఆదాయార్జనకూ దోహదం చేస్తాయన్నారు. తద్వారా వారు ఆహార ప్రదాతలుగానే విద్యుత్ సరఫరాదారులుగానూ మారుతున్నారని ఆయన పేర్కొన్నారు.
సంప్రదాయ గ్రిడ్ సంధానం సాధ్యం కాని మారుమూల గిరిజన ప్రాంతాలకు పీఎం-జన్మాన్, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద చేపట్టిన కార్యక్రమాలు విద్యుత్ సదుపాయాన్ని విస్తరిస్తున్నాయని ఉప-రాష్ట్రపతి ప్రముఖంగా ప్రస్తావించారు. విద్యుత్ లభ్యతతో విద్య, ఆరోగ్య సంరక్షణ, సమాచార ప్రసారం, జీవనోపాధి రంగాలలో అవకాశాల విస్తరణ ద్వారా జీవితాలు రూపాంతరం చెందుతాయని అభిప్రాయపడ్డారు. నగరాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాల విభిన్న అవసరాలను ఇంధన పరిష్కారాలతో తీర్చాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి ఆకాంక్షించిన మేరకు పునరుత్పాదక ఇంధన రూపాంతరీకరణ ఒక ప్రజా ఉద్యమంగా మారిందని చెబుతూ- ఇది కేవలం ప్రభుత్వ చొరవతో మాత్రమే ముందుకు సాగదని ఉప-రాష్ట్రపతి అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, పౌరులు తదితరులంతా ఇందులో చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. ఈ ఉద్యమంలో ప్రజల భాగస్వామ్యం పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని వేగిర పరుస్తుందన్నారు. అంతేగాక కొత్త ఆర్థిక అవకాశాలను సృష్టిస్తుందని, జీవనోపాధి కల్పిస్తుందని, కుటుంబ సౌభాగ్యానికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
‘మిషన్ లైఫ్’ను ప్రస్తావిస్తూ- ఇంధన సామర్థ్య పద్ధతులు, ఆలోచనాత్మక వినియోగం, బాధ్యతాయుత వ్యర్థాల నిర్మూలనకు ఉప-రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఓ కొత్త విద్యుత్ ప్లాంటుతో సమానంగా ఒక బిలియన్ చిన్న వ్యక్తిగత చర్యలు కూడా సుస్థిరతకు గణనీయంగా దోహదం చేయగలవని ఆయన అభిప్రాయపడ్డారు.
రాబోయే దశాబ్దం కోసం ప్రపంచ వాతావరణ లక్ష్యాల సాధన కీలకమని ఉప-రాష్ట్రపతి అన్నారు. ఈ సందర్భంగా 2047 నాటికి ‘వికసిత భారత్’, 2070 నాటికి ‘నికరశూన్య ఉద్గారాల’ సాధనపై భారత్ దృక్కోణాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో 2070 నాటికి దేశ విద్యుత్ డిమాండ్ దాదాపు 7 రెట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు కాలుష్య రహిత, విశ్వసనీయ, చౌక విద్యుత్ ద్వారా పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చాల్సి ఉందని స్పష్టం చేశారు.
ఈ దిశగా ప్రస్తుత సదస్సు చర్చలను ఆచరణలోకి తేవాలని సూచిస్తూ- “చర్చలను ప్రాజెక్టులుగా… ప్రాజెక్టులను ఇంధనంగా మార్చండి” అని ఉప-రాష్ట్రపతి పిలుపునిచ్చారు. “ప్రపంచం సూర్యరశ్మితో ప్రకాశించాలంటే, సమష్టి కృషితోనే అది సాధ్యం” అని ప్రపంచ సహకారానికి మేల్కొలుపు పలికారు.
ఈ సదస్సు ముగింపు కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, ప్రభుత్వ విభాగాలు, విక్రేతలు, బ్రాండ్ యజమానులు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు “ఎక్సలెన్స్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ”, “పీఎం సూర్య ఘర్” అవార్డులను ఉప-రాష్ట్రపతి ప్రదానం చేశారు.
కేంద్ర నవ్య-పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, సహాయమంత్రి శ్రీ శ్రీపాద యశోనాయక్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రవిజ్ఞాన సలహాదారు డాక్టర్ అజయ్ కుమార్ సూద్, మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంతోష్ కుమార్ సారంగి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక అగ్రగాములు, విజ్ఞాన భాగస్వాములు, ప్రదర్శన సంస్థలు, ఇతర ప్రతినిధులు కూడా హాజరయ్యారు.
***