నాడు పోస్టు చేయడమైనది:
24 OCT 2026 1:56PM by PIB Hyderabad
డిజిటల్ వ్యవసాయ రంగంలో కీలక మైలురాయిని సాధిస్తూ, 2027 మార్చి 31 నాటికి 11 కోట్ల రైతు ఐడీలను సృష్టించాలన్న లక్ష్యాన్ని భారత ప్రభుత్వం ఐదు నెలల ముందుగానే చేరుకుంది. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విజయాన్ని ప్రస్తావిస్తూ, సుసంపన్నమైన రైతులతో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేసే దిశగా ఇదొక కీలక ముందడుగు అని పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద ఈ మైలురాయిని సాధించారు. రైతులకు ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపును అందించడమే రైతు ఐడీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలు, పంటల బీమా, విపత్తుల సమయంలో అందించే సహాయాన్ని రైతులు పారదర్శకంగా, సమర్థంగా, సకాలంలో పొందగలుగుతారు. అంతేకాకుండా, పత్రాల సమర్పణ భారాన్ని, పదేపదే ధ్రువీకరణ చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ విధానం తగ్గిస్తుంది.
నిర్ణీత గడువుకు ఐదు నెలల ముందుగానే లక్ష్య సాధన
11 కోట్ల రైతు ఐడీల సృష్టి అక్టోబర్ 23వ తేదీ రాత్రికే విజయవంతంగా పూర్తయిందని వ్యవసాయ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2027 మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించారు. అయితే, కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో కృషి చేసి, నిర్ణీత గడువుకు ఐదు నెలల ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ ఘనత సాధించినందుకు దేశంలోని రైతులందరికీ శ్రీ చౌహాన్ అభినందనలు తెలిపారు. రైతు ఐడీ అనేది రైతులకు సొంతమైన డిజిటల్ గుర్తింపు అని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ వ్యవసాయాన్ని మరింత సమర్థంగా, పారదర్శకంగా, సుసంపన్నంగా తీర్చిదిద్దే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు.
పత్రాల సమర్పణ భారం తగ్గింపు, ప్రయోజనాల పంపిణీలో మరింత పారదర్శకత
రైతు ఐడీ విధానం వల్ల ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ పదేపదే తిరగాల్సిన అవసరం, వివిధ పథకాల కోసం ఒకే పత్రాలను మళ్లీ మళ్లీ సమర్పించాల్సిన భారం గణనీయంగా తగ్గుతుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. గతంలో వివిధ ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు రైతులు పదేపదే పత్రాలు సమర్పించాల్సి వచ్చేది. దీనివల్ల వారి సమయం, డబ్బు రెండూ వృథా అయ్యేవి. రైతు ఐడీలతో పలు కీలక సేవలను మరింత సులభంగా, పారదర్శకంగా పొందే అవకాశం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
బ్యాంకు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డు: రుణాలు పొందే ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. పత్రాలను పదేపదే ధ్రువీకరించాల్సిన అవసరం తగ్గుతుంది.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు లేదా పంటలు నష్టపోయినప్పుడు పరిహారం అంచనా, పంపిణీ మరింత పారదర్శకంగా జరుగుతాయి. పరిహారం మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
విపత్తుల సమయంలో సహాయం: అత్యవసర పరిస్థితుల్లో అర్హులైన, అసలైన రైతులకు సహాయక చర్యల ప్రయోజనాలు మరింత వేగంగా అందుతాయి.
కనీస మద్దతు ధరపై పంటల కొనుగోలు: డిజిటల్ విధానం ద్వారా కొనుగోలు ప్రక్రియలో మధ్యవర్తుల పాత్రను తొలగించేందుకు వీలవుతుంది. తద్వారా రైతులు తమ పంటలకు దక్కాల్సిన పూర్తి విలువను పొందేలా చూడవచ్చు.
వ్యవసాయ సేవల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. తద్వారా అర్హులైన రైతులు తక్కువ విధానపరమైన అడ్డంకులతో ప్రభుత్వ సహాయాన్ని పొందేందుకు వీలవుతుంది.
ఇప్పటికే 6 కోట్ల మందికి పైగా రైతులకు ప్రయోజనాలు
2024 సెప్టెంబర్ 2న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ను ప్రారంభించారు. ఈ మిషన్ కింద అభివృద్ధి చేస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఫలితాలను చూపుతోంది. రైతు ఐడీ ఆధారిత సేవల పంపిణీ విధానం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 6 కోట్లమందికి పైగా రైతులు వివిధ పథకాల కింద నేరుగా ప్రయోజనాలు పొందారు. ధ్రువీకరించిన రైతుల డేటాబేస్ను వ్యవసాయ సేవలతో అనుసంధానించడం వల్ల మోసాలకు, పదేపదే ధ్రువీకరణ చేసుకోవాల్సిన అవసరానికి అడ్డుకట్ట పడుతోంది. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం మెరుగుపడటంతో పాటు, విధానాల రూపకల్పన, పథకాల పర్యవేక్షణ మరింత పటిష్ఠమయ్యాయి. దీనివల్ల పథకాల అమలు, ప్రయోజనాల పంపిణీని సులభంగా పర్యవేక్షించేందుకు వీలవుతోంది.
సహకార సమాఖ్య స్ఫూర్తికి సరైన నిదర్శనం
ఈ విజయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషే కారణమని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి అద్భుతమైన నిదర్శనమని అభివర్ణించారు. నిర్ణీత గడువుకు ముందుగానే లక్ష్యాన్ని సాధించడంలో భాగస్వాములైన కేంద్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు, జిల్లా స్థాయి బృందాలు, గ్రామాల్లో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి ఆయన అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. కౌలు రైతులు, వాస్తవంగా సాగు చేస్తున్న రైతులను డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చేందుకు వర్తించే నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ, సహాయ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన ఏ రైతూ దూరం కాకూడదన్నదే ఈ చర్యల ప్రధాన లక్ష్యం.
భారత వ్యవసాయ రంగాన్ని మార్చే సాంకేతికత
‘కనీస ప్రభుత్వం - గరిష్ఠ పాలన’ సూత్రానికి అనుగుణంగా రైతుల రిజిస్ట్రీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది. రైతు ఐడీ అనేది కేవలం డిజిటల్ గుర్తింపు పత్రం మాత్రమే కాదు. పారదర్శకత, జవాబుదారీతనం, రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చే పాలనా వ్యవస్థకు ఇది బలమైన పునాది. రైతులకు ధ్రువీకరించిన డిజిటల్ గుర్తింపును కల్పించడం ద్వారా వ్యవసాయ సేవల పంపిణీని మెరుగుపరచడం, ప్రభుత్వ సహా యాన్ని నిర్దేశిత లబ్ధిదారులకు సమర్థంగా చేరేలా చూడటం ఈ కార్యక్రమం లక్ష్యం. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు అభినందనలు తెలిపిన శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, తమకు అర్హత ఉన్న పథకాలు, ప్రయోజనాలను అనవసర ఇబ్బందులు లేకుండా పొందాలని, భారత వ్యవసాయ రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం రైతుల ప్రయోజనాలకు తోడ్పడుతూ, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యానికి సహకరించే ఆధునిక వ్యవసాయ వ్యవస్థను రూపొందించే దిశగా ఈ విజయం ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.
***