వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నిర్దేశిత గడువు కంటే ఐదు నెలల ముందే 11 కోట్ల రైతు గుర్తింపు కార్డుల (ఐడీ) సృష్టి.. డిజిటల్ వ్యవసాయంలో చారిత్రక మైలురాయి చేరిన భారత్: కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ రుణాలు, పంట భీమా మరియు విపత్తు సహాయాన్ని సులభంగా, పారదర్శకంగా మరియు వేగవంతంగా పొందేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కార్డులు తోడ్పడతాయి: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన సమృద్ధివంతమైన వ్యవసాయ రంగాన్ని మరియు 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.

ధృవీకరించిన రైతుల వివరాల నిధి (డేటాబేస్) సేవల పంపిణీలో పారదర్శకతను పెంచుతుంది, నకిలీలను పూర్తిగా అరికడుతుంది మరియు అర్హులైన రైతులకు నేరుగా లబ్ధి అందేలా చూస్తుంది.

నాడు పోస్టు చేయడమైనది: 24 OCT 2026 1:56PM by PIB Vijayawada

డిజిటల్ వ్యవసాయ రంగంలో భారత్ కీలక మైలురాయిని సాధించింది. భారత ప్రభుత్వం 2027 మార్చి 31 నాటికి నిర్దేశించుకున్న 11 కోట్ల 'రైతు ఐడీ'ల (ఫార్మర్ ఐడీ) సృష్టి లక్ష్యాన్ని, గడువు కంటే ఐదు నెలల ముందే విజయవంతంగా పూర్తి చేసింది. కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విజయాన్ని ప్రశంసిస్తూ—సమృద్ధివంతమైన రైతులతో కూడిన 'వికసిత్ భారత్' ను సాకారం చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృక్పథం దిశగా ఇది ఒక అత్యంత కీలకమైన అడుగు అని పేర్కొన్నారు. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న 'డిజిటల్ అగ్రికల్చర్ మిషన్' కింద ఈ ఘనత సాధ్యమైంది. రైతులకు ఒక ప్రత్యేక డిజిటల్ గుర్తింపును అందించేందుకు ఈ రైతు ఐడీ చొరవను రూపొందించారు. ఇది కాగితాల పనిని (పేపర్ వర్క్) మరియు పదేపదే చేసే పత్రాల ధృవీకరణలను తగ్గిస్తూ, ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ రుణాలు, పంట భీమా మరియు విపత్తు పరిహారాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా మరియు నిర్దేశిత సమయంలో రైతులకు అందించడానికి దోహదపడుతుంది.

నిర్దేశిత గడువు కంటే ఐదు నెలల ముందే లక్ష్య సాధన

అక్టోబర్ 23 రాత్రి నాటికే 11 కోట్ల రైతు ఐడీల సృష్టి విజయవంతంగా పూర్తయిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2027 మార్చి 31ని గడువుగా నిర్ణయించగా, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు క్షేత్రస్థాయి అధికారులు పరస్పర సమన్వయంతో రాత్రింబవళ్ళు శ్రమించి, ఐదు నెలల ముందే ఈ ఘనతను సాధించారు. రైతు ఐడీ అనేది ప్రతి రైతు యొక్క స్వంత డిజిటల్ గుర్తింపు అని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశ వ్యవసాయాన్ని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మరియు లాభదాయకంగా మార్చేందుకు ఇది ఒక ముందడుగు అని పేర్కొంటూ దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

కాగితాల శ్రమ తగ్గుదల, పారదర్శక ప్రయోజనాల పంపిణీ

రైతు ఐడీ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో, రైతులు వివిధ ప్రభుత్వ పథకాల కోసం పదేపదే ప్రభుత్వ కార్యాలయాలు లేదా బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, అలాగే ఒకే రకమైన పత్రాలను మళ్లీ మళ్లీ సమర్పించాల్సిన శ్రమ కూడా తప్పుతుందని శ్రీ చౌహాన్ వివరించారు. గతంలో రైతులు ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు పలుమార్లు పత్రాలను అందించాల్సి రావడం వల్ల సమయం, డబ్బు రెండూ తీవ్రంగా వృథా అయ్యేవి. ఇప్పుడు రైతు ఐడీల ద్వారా అనేక కీలక సేవలు ఎంతో సులభంగా, స్పష్టంగా, పారదర్శకంగా అందుతాయి.

  • బ్యాంక్ రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి): రుణ మంజూరు ప్రక్రియ ఎంతో సులభతరం అవుతుంది, పదేపదే కాగితాలను ధృవీకరించే అవసరం ఉండదు.
  • ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన (పిఎంఎఫ్బివై): ప్రకృతి వైపరీత్యాలు లేదా అకాల వర్షాల వల్ల పంట నష్టం వాటిల్లినప్పుడు, పరిహార అంచనా, నష్టపరిహార పంపిణీ ఎంతో పారదర్శకంగా జరుగుతాయి. పరిహార సొమ్ము నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే జమ అవుతుంది.
  • విపత్తు సహాయం: అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం అందించే పరిహారం లేదా సహాయం అసలైన, అర్హులైన రైతులకు మరింత వేగంగా చేరుతుంది.
  • కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పి) వద్ద పంట కొనుగోలు: ఈ డిజిటల్ విధానం పంట సేకరణ ప్రక్రియలో దళారుల పాత్రను పూర్తిగా తొలగిస్తుంది, దాంతో రైతులు తమ కష్టానికి తగిన మద్దతు ధరను నేరుగా పొందుతారు.

వ్యవసాయ రంగానికి సంబంధించిన సేవల పంపిణీలో పారదర్శకతను, బాధ్యతాయుతమైన విధానాన్ని పెంచడం, విధానపరమైన నిబంధనల అడ్డంకులను తగ్గించి అర్హులైన ప్రతి రైతుకూ ప్రభుత్వ మద్దతు సకాలంలో అందేలా చూడడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం.

ఇప్పటికే 6 కోట్లకు పైగా రైతులకు అందిన ప్రత్యక్ష ప్రయోజనాలు

2024 సెప్టెంబర్ 2న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తరువాత డిజిటల్ అగ్రికల్చర్ మిషన్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ మిషన్ కింద రూపుదిద్దుకుంటున్న డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ) ఇప్పటికే క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. రైతు ఐడీ ఆధారిత సేవా వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 6 కోట్లకు పైగా రైతులు వివిధ సంక్షేమ పథకాల కింద నేరుగా ప్రయోజనాలు పొందారు. ధృవీకరించబడిన రైతుల వివరాల నిధిని వ్యవసాయ సేవలతో అనుసంధానించడం వల్ల అక్రమాలను, పదేపదే తనిఖీలు చేసే విధానాన్ని అరికట్టవచ్చు. ఇది వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడంతో పాటు విధానాల రూపకల్పన, పథకాల అమలు తీరును నిరంతరం పర్యవేక్షించే ప్రక్రియను ఎంతో సులభతరం చేసింది.

సహకార సమాఖ్యవాదానికి బలమైన నిదర్శనం

ఈ అపూర్వ విజయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషికి నిదర్శనమని అభివర్ణించిన శ్రీ చౌహాన్, ఇది భారత సహకార సమాఖ్యవాదానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని కొనియాడారు. నిర్దేశిత గడువు కంటే ముందే ఈ లక్ష్యాన్ని సాకారం చేయడంలో భాగస్వాములైన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు, జిల్లా స్థాయి బృందాలు మరియు గ్రామీణ స్థాయిలో శ్రమించిన క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. నిబంధనలకు అనుగుణంగా కౌలుదారులు మరియు రైతులకు కూడా ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయోజనాలు అందించేందుకు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి ఏ ఒక్క అర్హతగల రైతు కూడా దూరమవ్వకూడదన్నదే ప్రభుత్వ సంకల్పం.

సాంకేతికతతో భారత వ్యవసాయ రంగ రూపాంతరం

'కనీస ప్రభుత్వం - గరిష్ట పాలన' అనే పాలనా సూత్రానికి కట్టుబడి, రైతు రిజిస్ట్రీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ శ్రమిస్తోంది. రైతు ఐడీ అనేది కేవలం ఒక డిజిటల్ గుర్తింపు కార్డు మాత్రమే కాదు; ఇది పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన, రైతు సంక్షేమమే పరమావధిగా సాగే పాలనా వ్యవస్థకు బలమైన పునాది. రైతుల కోసం ధృవీకరించబడిన డిజిటల్ గుర్తింపును రూపొందించడం ద్వారా వ్యవసాయ సేవలందించే విధానాన్ని మరింత ఆధునికీకరించడం, అలాగే ప్రభుత్వ మద్దతు నిజమైన లబ్ధిదారులకు ఎటువంటి ఆలస్యం లేకుండా సమర్థవంతంగా అందేలా చూడటమే ఈ చొరవ అంతిమ లక్ష్యం.

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు అభినందనలు తెలుపుతూ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఎలాంటి అనవసర శ్రమ లేదా ఇబ్బందులు లేకుండా తమకు రావలసిన పథకాలు, ప్రయోజనాలను పొందాలని శ్రీ చౌహాన్ పిలుపునిచ్చారు. అలాగే భారతీయ వ్యవసాయాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సాంకేతికత రైతు సంక్షేమానికి సాధనంగా మారుతూ, 'వికసిత్ భారత్' సాధనలో కీలక పాత్ర పోషించే ఒక నూతన వ్యవసాయ రంగాన్ని నిర్మించడంలో ఈ విజయం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

***

 


(రిలీజ్ ఐడి: 2328019) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Tamil , Urdu , Marathi , Gujarati , Kannada , Malayalam