ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెమికాన్ 2.0 గురించి మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్

సెమికాన్ 2.0 సంబంధిత 6 కీలక విభాగాలకు నోటిఫికేషన్‌లు జారీ

‘85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను అభివృద్ధి చేయాలనే’10 ఏళ్ల లక్ష్యాన్ని నాలుగేళ్లలోనే సాధించిన భారత్

రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ మార్కెట్‌లో 10 శాతం వాటా సాధించనున్న భారత్

250కి పైగా సెమీకండక్టర్ చిప్‌లను రూపొందించిన టయర్-II, టయర్-III నగరాల విద్యార్థులు: శ్రీ అశ్వినీ వైష్ణవ్

నాడు పోస్టు చేయడమైనది: 31 AUG 2026 4:12PM by PIB Hyderabad

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు, సమాచార, ప్రసార శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. భారత సెమీకండక్టర్ వ్యవస్థను తదుపరి స్థాయికి తీసుకెళ్లడం పట్ల ప్రభుత్వ దార్శనికతను వివరించారు. భారత్‌లో సెమీకండక్టర్ రూపకల్పన, తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు వేస్తూ... సెమికాన్ 2.0 పథకంలోని ఆరు కీలక విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను జారీ చేశారు.

 

మొదటి సెమికాన్ ఇండియా పథకం ద్వారా పొందిన ఊపును కొనసాగిస్తూ... చిప్ రూపకల్పన, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ నుంచి పరికరాలు, మెటీరియల్స్, పరిశోధనాభివృద్ధి, ప్రతిభ అభివృద్ధి వరకు మొత్తం సెమీకండక్టర్ వాణిజ్య కార్యకలాపాల వ్యాప్తంగా ఆర్థిక, మౌలిక సదుపాయాల మద్దతును ఈ పథకం అందిస్తుంది.

సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థ సామర్థ్యాలను మెరుగుపరచడం, కీలక రంగాల్లో సాంకేతిక నాయకత్వాన్ని నెలకొల్పడం ద్వారా భారత ఆర్థిక వృద్ధిని, జాతీయ భద్రతనూ బలోపేతం చేయడం ఈ పథకం లక్ష్యం. ఇది 10 కేటగిరీలను కవర్ చేసే ఆరు విభాగాల ఆధారంగా పనిచేస్తుంది.

సెమికాన్ 2.0 కింద ఉన్న ఆరు కీలక విభాగాలు:

1వ విభాగం - రూపకల్పన

2వ విభాగం – యంత్రాలు, ముడిపదార్థాలు

3వ విభాగం - మరిన్ని ఫ్యాబ్‌ల ఏర్పాటు

4వ విభాగం - ఏటీఎంపీ/ఓఎస్ఏటీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడం

5వ విభాగం - పరిశోధన - అభివృద్ధి

6వ విభాగం - ప్రతిభ అభివృద్ధి

 

విభాగం 1 - రూపకల్పన

కేటగిరీలు: జాతీయ ప్రాముఖ్యత, వ్యూహాత్మక ప్రాధాన్యాల కోసం సెమీకండక్టర్ ఐపీలు, చిప్‌లు, సిస్టమ్-ఆన్-చిప్‌లు (ఎస్‌వోసీలు), మాడ్యూళ్లను రూపొందించడం. వాణిజ్య రంగం కోసం సెమీకండక్టర్ ఐపీలు, చిప్‌లు, ఎస్‌వోసీలు రూపొందించడం. విస్తరణ కోసం సెమీకండక్టర్ ఐపీలు/చిప్‌లు/ ఎస్‌వోసీల కొరకు విస్తరణ-అనుసంధాన ప్రోత్సాహకం (డీఎల్ఐ).

విభాగం 2 – యంత్రాలు, మెటీరియల్స్

కేటగిరీ: సెమీకండక్టర్ తయారీ వ్యవస్థ.

విభాగం 3 - మరిన్ని ఫ్యాబ్‌లను ఏర్పాటు చేయడం

కేటగిరీలు: సిలికాన్ సెమీకండక్టర్ వేఫర్ ఫ్యాబ్‌లు. కాంపౌండ్ సెమీకండక్టర్లు/ఫోటోనిక్స్/సెన్సార్లు (ఎంఈఎంఎస్ సహా) ఫ్యాబ్/డిస్క్రీట్ సెమీకండక్టర్ల ఫ్యాబ్. డిస్‌ప్లే ఫ్యాబ్‌లు.

విభాగం 4 - ఏటీఎంపీ/ఓఎస్ఏటీ పరిశ్రమను మరింత బలోపేతం చేయడం

కేటగిరీ: సెమీకండక్టర్ అసెంబుల్ చేయడం, పరీక్షించడం, మార్కింగ్ చేయడం, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) / పొరుగుసేవల ద్వారా సెమీకండక్టర్ అసెంబుల్ చేయడం, పరీక్షించే (ఓఎస్ఏటీ) సదుపాయం.

విభాగం 5 – పరిశోధన-అభివృద్ధి

కేటగిరీ: అధునాతన సెమీకండక్టర్ సాంకేతికతల కోసం పరిశోధన-అభివృద్ధి.

విభాగం 6 - ప్రతిభ అభివృద్ధి

కేటగిరీ: ప్రతిభను అభివృద్ధి చేయడం.

 

 

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, “పదేళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను అభివృద్ధి చేయాలన్న తన లక్ష్యాన్ని భారత్ కేవలం నాలుగేళ్లలోనే సాధించింది. ఇప్పుడు మరో లక్ష మంది ఇంజనీర్లను అభివృద్ధి చేయాలనే కొత్త లక్ష్యాన్నీ నిర్దేశించుకుంది. రాబోయే సంవత్సరాల్లో, ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ మార్కెట్‌లో దాదాపు 10 శాతం వాటాను భారత్ సాధిస్తుందని అంచనా. టయర్-II, టయర్-III నగరాల విద్యార్థులు ఇప్పటికే 250కి పైగా చిప్‌లను రూపొందించారు. ఒక సందర్భంలో... శంకుస్థాపన జరిగిన కేవలం 13 నెలల్లోనే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. పలు సందర్భాల్లో 200 రోజులు, 150 రోజులు, 90 రోజుల్లోనే అనుమతులు మంజూరయ్యాయి. దేశంలో అభివృద్ధి చెందుతున్న సెమీకండక్టర్ వ్యవస్థ ద్వారా 50,000–60,000 ప్రత్యక్ష ఉద్యోగాలూ అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నాం” అని పేర్కొన్నారు.

సెమికాన్ 2.0 కింద మద్దతు పొందిన ప్రాజెక్టులు సాధారణంగా ఆరు సంవత్సరాల వరకు కాలపరిమితిని కలిగి ఉంటాయి. ఈ పథకం ప్రారంభంలో మూడు సంవత్సరాల పాటు దరఖాస్తుల కోసం అందుబాటులో ఉంటుంది.

సెమికాన్ 2.0కు ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎమ్) నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇది దరఖాస్తులను ఆహ్వానించడం... సాంకేతిక, ఆర్థిక మూల్యాంకనం చేపట్టడం... దరఖాస్తుదారులను సిఫార్సు చేయడం... అమలును పర్యవేక్షించడం వంటి పనులు నిర్వహిస్తుంది. ఐఎస్ఎం, సీ-డీఏసీ సహాయంతో రూపకల్పన, విస్తరణ విభాగాలను అమలు చేయవచ్చు. ప్రత్యేక ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 2026 నుంచి సెమీకండక్టర్ డీప్-టెక్ పురస్కారాలనూ ఈ మిషన్ ప్రకటించవచ్చు.

ఆర్థిక సహాయం కోసం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయింపులు చేస్తుంది. ఆమోదించిన షరతులకు అనుగుణంగా నోడల్ ఏజెన్సీ ద్వారా చెల్లింపులు చేస్తారు. పథకం ప్రభావాన్ని మూల్యాంకనం చేయడానికి, మార్పులు లేదా కొనసాగింపును పరిగణించడానికి, అమలు చేసిన మూడు సంవత్సరాల తర్వాత లేదా అవసరమైనప్పుడు మధ్యంతర అంచనానూ నిర్వహిస్తారు.

నోటిఫికేషన్ కోసం, మీరు  Semicon 2.0 ను చూడవచ్చు.

మీడియా సమావేశాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు

 

***


(రిలీజ్ ఐడి: 2305129) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Gujarati , Tamil , Kannada