ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల పరిధిలో 4 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ అనుమతి... దాదాపు 410 కిలోమీటర్ల మేర విస్తరించనున్న భారతీయ రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌


ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ. 9,450 కోట్లు... 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం

प्रविष्टि तिथि: 19 AUG 2026 3:18PM by PIB Hyderabad

రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన నాలుగు ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీటి మొత్తం అంచనా వ్యయం దాదాపు ₹9,450 కోట్లు. ఆ ప్రాజెక్టులివీ:

  1. ఖరగ్‌పూర్ - భద్రక్ (రనిటాల్) నాలుగో వరుస - 173 కి.మీ (పశ్చిమ బెంగాల్, ఒడిశా)
  2. భద్రక్ – హరిదాస్‌పూర్ నాలుగో వరుస – 75 కి.మీ (ఒడిశా)
  3. గుమ్మిడిపుండి - గూడూరు మూడో, నాలుగో వరుస - 90 కి.మీ (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు)
  4. కటక్ – పారాదీప్ (బడబంధమూడో, నాలుగో వరుస - 72 కి.మీ (ఒడిశా)

ఈ లైన్లలో సామర్థ్యం పెరగడం వల్ల రైళ్ల రాకపోకలు మెరుగుపడతాయి. ఇది భారతీయ రైల్వే రవాణా సామర్థ్యాన్ని, సేవల విశ్వసనీయతను బలోపేతం చేస్తుంది. ఈ మల్టీట్రాకింగ్ ప్రతిపాదనలు రైల్వే కార్యకలాపాలను క్రమబద్ధీకరించి, ట్రాఫిక్ రద్దీని తగ్గించనున్నాయి. ఈ ప్రాంతంలో సమగ్రాభివృద్ధిని సాధించడం ద్వారా... ప్రజలకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించి వారిని ఆత్మనిర్భరులుగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవభారత దార్శనికతకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను చేపట్టారు.

సమగ్ర ప్రణాళిక, భాగస్వామ్య పక్షాల మధ్య సంప్రదింపుల ద్వారా.. బహువిధ రవాణా అనుసంధానాన్ని, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో.. ‘పీఎం గతిశక్తి జాతీయ బృహత్ప్రణాళిక’ ఆధారంగా ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఎలాంటి ఆటంకం లేకుండా.. ప్రజలు, సరుకులు, సేవల రవాణాకు ఈ ప్రాజెక్టులు సదుపాయాన్ని కల్పిస్తాయి.

పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల పరిధిలో ఉన్న ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌ దాదాపు మరో 410 కిలోమీటర్ల మేర విస్తరించనుంది. దాదాపు 60 లక్షల జనాభా ఉన్న దాదాపు 6,448 గ్రామాలకు.. మెరుగైన రైలు అనుసంధానాన్ని ఈ ప్రతిపాదిత మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు అందిస్తాయి.

ఈ రైల్వే మార్గాల సామర్థ్యం పెంపు ద్వారా దేశంలో పలు ప్రసిద్ధ పర్యాటక, పుణ్యక్షేత్రాలకు రైలు అనుసంధానం గణనీయంగా మెరుగుపడనుంది. కుల్దిహా వన్యప్రాణుల అభయారణ్యం, భితరకనిక జాతీయ పార్కు, భద్రకాళీ దేవాలయం, ధమరాయ్ మాత దేవాలయం, పంచలింగేశ్వర ఆలయం, తాల్సరి - ఉదయ్‌పూర్, చాందీపూర్ బీచ్‌లతోపాటు.. పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల అభయారణ్యం, వీరరాఘవ పెరుమాళ్ ప్రభు ఆలయం, గడ కుజంగ జగన్నాథాలయం, సరళా ఆలయం, ధబలేశ్వరాలయం, లలిత్‌గిరి వంటి ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు వీటిలో ఉన్నాయి.

బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంటు, ఇనుము - ఉక్కు, కంటైనర్లు, వాహనాలు, ఆహార ధాన్యాల వంటి సరుకులను చేరవేసేందుకు ఈ ప్రతిపాదిత రైల్వే మార్గాలు అత్యంత ప్రయోజనకరంగా మారనున్నాయి. ఏటా అదనంగా 76 మిలియన్ టన్నుల సరుకు రవాణాకు ఈ మార్గాల విస్తరణతో అవకాశం కలుగుతుంది. పర్యావరణ అనుకూల, ఇంధన పొదుపునిచ్చే రైల్వే వ్యవస్థ ద్వారా.. దేశ వాతావరణ లక్ష్యాలను సాధించడంతోపాటు సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల దాదాపు 13 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గి.. దాదాపు 65 కోట్ల కిలోల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి. దాదాపు 2.60 కోట్ల మొక్కలను నాటడం వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనానికి ఇది సమానం.  

 

***


(रिलीज़ आईडी: 2301216) आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Bengali-TR , Gujarati , Odia , Tamil , Telugu_Vw , Kannada , Malayalam