హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఐఎస్ఐ సహకారం ఉన్న ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేసిన మోదీ ప్రభుత్వం: 200 మందికి పైగా ముఠా సభ్యుల అరెస్టుతో విధ్వంసకర దాడుల కుట్రలు భగ్నం

సీమాంతర ఉగ్రవాదం పట్ల సున్నా ఉపేక్ష విధానంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, హోం మంత్రి శ్రీ అమిత్ మార్గదర్శకత్వంలో 14 రాష్ట్రాల్లో 253 మంది అదుపులోకి తీసుకున్నారు

షాజాద్ భట్టి నెట్‌వర్క్‌పై 80కి పైగా ఎఫ్ఐఆర్‌లు, 200కు పైగా అరెస్టులు

प्रविष्टि तिथि: 17 AUG 2026 3:00PM by PIB Hyderabad

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు పలు రాష్ట్రాల్లో పటిష్టమైన చర్యలు చేపట్టి ఐఎస్ఐ మద్దతున్న షాజాద్ భట్టి నెట్‌వర్క్ (ఎస్‌బీఎన్) ఉగ్రవాద ముఠాలను భధ్రతా సంస్థలు ఛేదించాయి. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో 14 రాష్ట్రాల్లో 253 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌బీఎన్‌పై 80కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగా, 200కు పైగా అరెస్టులు చేశారు. సీమాంతర ఉగ్రవాదంపై అనుసరిస్తున్న సున్నా ఉపేక్ష విధానంలో భాగంగా దీనిని చేపట్టారు.

‘‘స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఐఎస్ఐ సహకారం ఉన్న ఉగ్ర ముఠా షాజాద్ భట్టి నెట్‌వర్క్‌ను మోదీ ప్రభుత్వం నాశనం చేసింది. 200 మందికి పైగా అరెస్టు చేయడం ద్వారా విధ్వంసక దాడుల కుట్రలను భగ్నం చేసింది. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో సమన్వయంతో కూడిన ఆపరేషన్లను  చేపట్టిన భారతీయ భద్రతా బలగాలు ఈ నెట్‌వర్క్‌ను విచ్ఛిన్నం చేశాయి. ఇది ఉగ్రవాదం పట్ల భారతదేశం అనుసరిస్తున్న సున్నా ఉపేక్ష విధానానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఐఎస్ఐ నుంచి నిధులు సమకూర్చుకున్న ఈ ముఠా నుంచి ఐఈడీలు, పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చిహ్నాలున్న గ్రెనేడ్లు, పిస్టళ్లు, లైవ్ క్యాట్రిడ్జ్‌లు, గూడచర్యం కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాలతో సహా భారీ మొత్తంలో వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్‌కు అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉంది’’ అని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు.

పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తూ, ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక ఉగ్రవాద సంస్థ షాజాద్ భట్టి నెట్‌వర్క్ (ఎస్‌బీఎన్). ఇది భారతదేశ వ్యాప్తంగా గ్రెనేడ్, ఐఈడీ, పెట్రోల్ బాంబు దాడులు, లక్షిత హత్యలకు పాల్పడుతోంది. అంతేకాకుండా, పోలీసు, రక్షణ, మతపరమైన ప్రదేశాలపై నిఘా వేయడానికి, గూఢచర్యం కోసం సీసీటీవీ కెమెరాలను అమర్చడానికి స్థానిక ఏజెంట్లకు ఎస్‌బీఎన్ డబ్బు చెల్లిస్తోంది.

స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఎస్‌బీఎన్‌ ప్రమేయమున్న దాడులను నిలువరించేందుకు రాష్ట్రాల పోలీసు బలగాలతో ఎప్పటికప్పుడు నిఘా సమాచారాన్ని పంచుకుంటూ ఆగస్టు 12న బహుళ రాష్ట్ర సమన్వయ ఆపరేషన్ నిర్వహించారు. దీని కారణంగా 14 రాష్ట్రాల్లో 253 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ (62), హర్యానా (52), ఢిల్లీ (51), పంజాబ్ (44), రాజస్థాన్ (15), మహారాష్ట్ర (8), ఉత్తరాఖండ్ (5), కర్ణాటక, గుజరాత్, బీహార్ (ముగ్గురు చొప్పున), తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, కేరళ (ఇద్దరు చొప్పున) రాష్ట్రాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, కర్ణాటకల్లో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.

యూఏపీఏ, బీఎన్ఎస్, ఆయుధాల చట్టం, ఎన్‌డీపీఎస్ యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం ప్రకారం ఎస్‌బీఎన్‌పై 80కి పైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. 200 మందికి పైగా అరెస్టు చేశారు. ఐఈడీలు, గ్రెనేడ్లు, పాకిస్థాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ చిహ్నాలున్న పిస్టళ్లు, లైవ్ క్యాట్రిడ్జ్‌లు, గూఢచర్యం కోసం వినియోగించిన సీసీటీవీలు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఈ నెట్‌వర్కుకు సీమాంతర ఉగ్రవాదంతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని నిర్ధారిస్తున్నాయి.

సరిహద్దు ఉగ్రవాదాన్ని ఏ మాత్రం ఉపేక్షించని భారత ప్రభుత్వ విధానాన్ని భద్రతా దళాలు పునరుద్ఘాటించాయి. అలాగే దేశవ్యాప్తంగా ఎస్‌బీఎన్ నెట్‌వర్కులను నిర్మూలించడానికి సమన్వయ చర్యలను కొనసాగిస్తామని తెలియజేశాయి.

 

***


(रिलीज़ आईडी: 2300520) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam