సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముగిసిన 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం 'భోపాల్ డిక్లరేషన్'కు ఆమోదం

प्रविष्टि तिथि: 08 AUG 2026 1:54PM by PIB Hyderabad

బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భోపాల్ వేదికగా భారత్ నిర్వహించిన 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం విజయవంతంగా ముగిసింది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఆచరణాత్మక, దూరదృష్టితో కూడిన విధాన ప్రణాళికను అందించే భోపాల్ డిక్లరేషన్‌ను సమావేశం ఆమోదించింది.

బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ నిర్వహించిన ఈ సాంస్కృతిక సమావేశం మూడు సాంస్కృతిక కార్యవర్గ సమావేశాల ద్వారా ముందుకు సాగింది. మొదటి సమావేశం 2026 ఏప్రిల్ 29-30 తేదీల్లో వీడియో అనుసంధానం ద్వారా జరిగింది. రెండో సమావేశం 2026 జూన్ 4-5 తేదీల్లో వారణాసిలో, మూడో సమావేశం 2026 ఆగస్టు 5-6 తేదీల్లో భోపాల్‌ వేదికగా జరిగాయి. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో భారత్ సహా 14 దేశాలు పాల్గొన్నాయి. వీటిలో 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలు ఉన్నాయి. పాల్గొన్న బ్రిక్స్ సభ్య దేశాలు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, భారత్, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాగా... ఈజిప్ట్ ఆన్‌లైన్‌ ద్వారా మంత్రివర్గ సమావేశంలో పాల్గొంది. భాగస్వామ్య దేశాలుగా బెలారస్, క్యూబా, కజకిస్తాన్, థాయిలాండ్ ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సాంస్కృతిక మంత్రులూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది సాంస్కృతిక విభాగంలో ఉన్నత స్థాయి భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సమావేశాల్లో మొత్తం 55 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

చర్చలను ఆచరణాత్మక కార్యక్రమాలుగా మార్చడం, సాంస్కృతిక రంగంలో సంస్థాగత సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తూ... భారత ప్రధాన బ్రిక్స్ ఇతివృత్తమైన “అన్ని పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం” ఆధారంగా ఈ చర్చలు జరిగాయి.

అత్యుత్తమ పద్ధతులు, అనుభవాలు, ఆచరణలను పరస్పరం పంచుకోవడం, సృష్టికర్తలకు మద్దతు, నెట్‌వర్కింగ్, డిజిటల్ సాధనాల ద్వారా మార్కెట్ ప్రవేశానికి విస్తరించిన అవకాశాలు సహా... సాంస్కృతిక, సృజనాత్మక రంగాలు, సృజనాధారిత ఆర్థిక వ్యవస్థలో సహకారాన్ని ఈ రోజు ఆమోదం పొందిన భోపాల్ డిక్లరేషన్ మరింత ముందుకు తీసుకువెళ్లనుంది. ఇది యునెస్కో బహుళజాతి నామినేషన్లు, మూల పరిశోధన, సాంస్కృతిక ఆస్తుల అప్పగింత, పునరుద్ధరణపై మెరుగైన సహకారానికీ వీలు కల్పిస్తుంది. ఇందులో ఏఐ ఆధారిత ట్రేసింగ్ సాధనాల అన్వేషణ భాగంగా ఉంటుంది. సాంప్రదాయిక విజ్ఞాన వ్యవస్థలు, సాంప్రదాయిక, సాంస్కృతిక వ్యక్తీకరణలను పరిరక్షించడం... డాక్యుమెంటరీ వారసత్వం... డిజిటలైజేషన్... మ్యూజియంలు, లైబ్రరీలు, ప్రాచీన కాలపు పత్రాల పరిరక్షణ విషయంగా సహకారం... కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థల్లో కాపీరైట్ చేసిన రచనల వినియోగానికి సంబంధించి సృష్టికర్తల హక్కుల పరిరక్షణ... పారదర్శకమైన, న్యాయమైన, సమానమైన పారితోషికం అందించడం వంటివి ఇందులో ఉన్నాయి.

కల్చర్ ట్రాక్ కింద ఒక నిర్దిష్ట కార్యక్రమంగా... స్వచ్ఛంద కళాకారుల రిజిస్ట్రీని అభివృద్ధి చేయడానికి భారత్ ఒక పైలట్ కార్యక్రమాన్ని ప్రకటించింది. బ్రిక్స్ దేశాల వ్యాప్తంగా సాంస్కృతిక సహకారాన్ని సులభతరం చేయడం... వృత్తిపరమైన నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడం... కళాకారులు, సృజనాత్మక నిపుణులకు మరిన్ని అవకాశాలను కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం.

బ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారత్ ఆధ్వర్యంలో ఈ నెల 6-7 తేదీల్లో భోపాల్‌లో జరిగిన ఈ రెండు రోజుల బ్రిక్స్ సాంస్కృతిక ఉత్సవం ఒక ప్రధాన సాంస్కృతిక అంశం. ఈ ఉత్సవంలో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలు పాల్గొన్నాయి. బెలారస్, బ్రెజిల్, ఇండోనేషియా, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తమ కళా సంప్రదాయాల గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని చాటుతూ సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చాయి. "సర్వే భవంతు సుఖినా" — "అందరికీ సామరస్యం, శాంతి" — అనే శాశ్వతమైన భారతీయ స్ఫూర్తిని కేంద్రంగా చేసుకుని... ఈ ఉత్సవం సాంస్కృతిక చర్చలు, కళా సంబంధిత సహకారం, ప్రజల మధ్య అనుసంధానానికి అత్యుత్తమ వేదికను అందించింది. రెండో రోజున, సమావేశంలో పాల్గొన్న బ్రిక్స్ దేశాల భాషల్లో ఈ ఇతివృతంపై ఇచ్చిన సామూహిక బృంద ప్రదర్శన... సాంస్కృతిక భిన్నత్వం ద్వారా ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.

కల్చర్ ట్రాక్ ద్వైపాక్షిక సంప్రదింపులకూ ఇది అవకాశాన్ని కల్పించింది. పాల్గొన్న దేశాలతో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్థాయిలో ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. ద్వైపాక్షిక సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడంపై అభిప్రాయాలను పంచుకోవడానికి, పరస్పర ప్రయోజనకరమైన రంగాలను అన్వేషించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పించింది.

భారత పర్యటనకు వచ్చిన ప్రతినిధి బృందాలకు భారత గొప్ప సాంస్కృతిక, నాగరిక వారసత్వాన్ని అనుభవించే అవకాశాన్ని ఈ కార్యక్రమం కల్పించింది. ఈ ప్రతినిధులంతా ఈ నెల 5న భోపాల్‌లోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయాన్ని (ఐజీఆర్ఎమ్ఎస్) సందర్శించారు. మంత్రుల స్థాయి సమావేశం అనంతరం, విశిష్టమైన బౌద్ధ వారసత్వ గొప్పతనాన్ని అనుభూతి చెందడం కోసం ప్రతినిధి బృందాలు ఈ రోజు సాంచికి వెళ్తున్నారు. భీమ్‌బెట్కా సందర్శనను ఈ నెల 9న ఉదయం ఏర్పాటు చేశారు. ఈ పర్యటన ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటున్న ప్రతినిధి బృందాలకు భారత చరిత్రలోని ప్రాచీన రాతి గుహలు, సాంస్కృతిక వారసత్వాన్ని అనుభవించే అవకాశం లభిస్తోంది.

భారత్ అధ్యక్షత కాలంలో వారి నిర్మాణాత్మక భాగస్వామ్యం, క్రియాశీల భాగస్వామ్యం కోసం పాల్గొన్న అన్ని బ్రిక్స్ సభ్య దేశాలకు, భాగస్వామ్య దేశాలకు భారత్ తన ప్రశంసలు తెలియజేసింది. బ్రిక్స్ దేశాల మధ్య మరింత అనుసంధానిత, సమ్మిళిత, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సాంస్కృతిక భాగస్వామ్యం దిశగా నిరంతర సహకారం పట్ల తన నిబద్ధతను భారత్ పునరుద్ఘాటించింది.

 

***


(रिलीज़ आईडी: 2296529) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , Gujarati , Urdu , हिन्दी , Bengali , Tamil , Kannada , Malayalam