సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
చట్టవిరుద్ధ.. అశ్లీల కంటెంట్ నుంచి భారత ఇంటర్నెట్ విముక్తి.. సురక్షిత-విశ్వసనీయ డిజిటల్ వాతావరణ సృష్టి ప్రభుత్వ లక్ష్యం
మహిళలు-బాలలపై సైబర్ నేరాల అజ్ఞాత ఫిర్యాదుల కోసం జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ)
డీప్‌ఫేక్ సహా అనుమానాస్పద డిజిటల్ వ్యవస్థలపై పౌరులు సమాచారమిచ్చేలా ‘రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్’ మాడ్యూల్ తోడ్పడుతుంది
प्रविष्टि तिथि:
05 AUG 2026 5:08PM by PIB Hyderabad
దేశంలోని మహిళలు-బాలలు సహా వినియోగదారులకు ఒక సార్వత్రిక, సురక్షిత, విశ్వసనీయ, జవాబుదారీతనం సహిత ఇంటర్నెట్ సౌలభ్య కల్పనే ప్రభుత్వ విధానాల లక్ష్యం. ఆ మేరకు ఏ రూపంలోనైనా చట్టవిరుద్ధ కంటెంట్ లేదా సమాచారం నుంచి... ముఖ్యంగా అసభ్య-అశ్లీల కంటెంట్ నుంచి విముక్తి కల్పించడంపై ప్రభుత్వం నిబద్ధతతో ఉంది.
డిజిటల్ ప్రపంచంలో చట్టవిరుద్ధ, హానికర కంటెంట్ నిరోధం దిశగా సమాచార సాంకేతిక చట్టం-2000 (ఐటీ చట్టం), సమాచార సాంకేతిక (మధ్యంతర మార్గదర్శకాలు-డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు-2021 (ఐటీ నిబంధనలు) సంయుక్తంగా ఒక సమగ్ర చట్రాన్ని రూపొందించాయి. అంతేకాకుండా జవాబుదారీతనానికి భరోసా ఇస్తూ మధ్యంతర వ్యవస్థకు స్పష్టమైన బాధ్యతలను నిర్దేశిస్తాయి.
ఐటీ నిబంధనలు-2021, సామాజిక మీడియా మధ్యంతర వ్యవస్థలు తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తాయి. ఈ మేరకు అశ్లీల, పోర్నోగ్రాఫిక్, పెడోఫిలిక్, పిల్లలకు హానికరమైన, గోప్యతను ఉల్లంఘించే, లింగం ఆధారంగా అవమానించే లేదా వేధించే లేదా అమలులోగల ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించే సమాచార ప్రసారం-ప్రదర్శన, అప్‌లోడ్, సవరణ, ప్రచురణ, నిల్వ-అప్‌డేట్ లేదా పంచుకోవడం తదితరాల కోసం ఆ వ్యవస్థల కంప్యూటర్ వనరులను వినియోగదారులు వాడటం లేదని భరోసా ఇచ్చేవిధంగా సహేతుక కృషి చేయాలి. ఐటీ నిబంధనలు-2021లో నిర్దేశించిన చట్టపరమైన బాధ్యతలను మధ్యంతర వ్యవస్థలు పాటించని పక్షంలో ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద తృతీయ పక్ష సమాచారం నుంచి లభించే మినహాయింపును అవి కోల్పోతాయి. అమలులోగల ఏదైనా చట్టం ప్రకారం తదుపరి చర్యలకు లేదా ప్రాసిక్యూషన్‌కు వారు బాధ్యులవుతారు.
డీప్‌ఫేక్, ఏఐ ఆధారిత కంటెంట్ సహా కృత్రిమ సమాచారం (ఎస్‌జీఐ) వల్ల కలిగే కష్టనష్టాల పరిష్కారానికి 2026 ఫిబ్రవరి 10న ప్రభుత్వం ఐటీ నిబంధనలను సవరించి నియంత్రణ చట్రాన్ని బలోపేతం చేసింది.
ఈ సవరణల ప్రకారం అశ్లీల, తప్పుదోవ పట్టించే, వ్యక్తులను అనుకరించే లేదా బాలలకు హానికర కంటెంట్ సహా చట్టవిరుద్ధ, ఏఐ ఆధారిత కంటెంట్ సృష్టి-వ్యాప్తి నిరోధం కోసం మధ్యంతర వ్యవస్థలు, పెద్ద సామాజిక మాధ్యమ వేదికలు సహేతుక సాంకేతిక చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023 లేదా లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం-2012 వంటి చట్టాల ప్రకారం, సంబంధిత నేరాలపై సముచిత అధికార యంత్రాంగానికి నివేదించాల్సిన బాధ్యత కూడా ఆ వేదికలపై ఉంటుంది.
అన్ని రకాల సైబర్ నేర సంఘటనలపై ప్రజల నివేదనకు వీలుగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ)లో భాగంగా ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (ఎన్‌సీఆర్‌పీ (https://cybercrime.gov.in) ప్రారంభమైంది. మహిళలు-బాలలపై కొన్ని రకాల సైబర్ నేరాలపై అజ్ఞాత ఫిర్యాదుకు ఈ పోర్టల్ నిబంధనలు వీలు కల్పిస్తాయి. ఈ మేరకు “మహిళలు/బాలల సంబంధిత నేరాలను నివేదించండి” మాడ్యూల్ కింద ఫిర్యాదుదారులు “అజ్ఞాతకంగా నివేదించండి” అనేదాన్ని ఎంచుకోవచ్చు. తద్వారా వ్యక్తిగత గుర్తింపు వివరాల వెల్లడితో నిమిత్తం లేకుండా ఫిర్యాదు సమర్పణకు అనుమతిస్తుంది.
అనుమానాస్పద వెబ్‌సైట్ ‘యూఆర్‌ఎల్’లు, వాట్సాప్ నంబర్లు, టెలిగ్రామ్ హ్యాండిళ్లు, ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, ఎస్ఎంఎస్ హెడర్లు-నంబర్లు, డీప్ ఫేక్‌లు, సోషల్ మీడియా ‘యూఆర్‌ఎల్’ల గురించి పౌరుల నివేదనకు వీలుగా ‘ఎన్‌సీఆర్‌పీ’లోని ‘రిపోర్ట్ అండ్ చెక్ సస్పెక్ట్’ మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు.
‘మహిళలు-బాలలపై సైబర్ నేరాల నివారణ (సీసీపీడబ్ల్యూసీ)’ పథకం కింద సైబర్ ఫోరెన్సిక్-కమ్-శిక్షణ ప్రయోగశాలల ఏర్పాటు, జూనియర్ సైబర్ కన్సల్టెంట్ల నియామకం, దర్యాప్తు సంస్థల సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారులకు శిక్షణ వంటి సామర్థ్య వికాస కార్యకలాపాల కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రభుత్వం రూ.132.93 కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది. తదనుగుణంగా 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్ ఫోరెన్సిక్-కమ్-శిక్షణ ప్రయోగశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో 24,600 మందికి పైగా దర్యాప్తు సంస్థల సిబ్బంది, న్యాయాధికారులు, ప్రాసిక్యూటర్లకు సైబర్ నేరాలపై అవగాహన, దర్యాప్తు, ఫోరెన్సిక్స్ తదితర అంశాల్లో శిక్షణనిచ్చారు.
దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌వైకేఎస్ విద్యార్థులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సైబర్ హైజీన్ శిక్షణనిచ్చింది.
అలాగే, సైబర్ నేరాల నివారణపై విద్యార్థులకు అవగాహన లక్ష్యంగా ‘హ్యాండ్‌బుక్ ఫర్ అడోలెసెంట్స్-స్టూడెంట్స్’ను, మహిళల్లో చైతన్యం పెంచే దిశగా ‘సైబర్ సెక్యూరిటీ హ్యాండ్‌బుక్ ఫర్ మహిళా సురక్ష’ను ‘ఐ4సీ’ ఆవిష్కరించింది.
సమాచార భద్రత రంగంలో మానవ వనరుల సృష్టి, ప్రజలలో సైబర్ హైజీన్ అండ్ సైబర్ సెక్యూరిటీ సంబంధిత వివిధ అంశాలపై సార్వత్రిక అవగాహన దిశగా ప్రభుత్వం ‘ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్’ (ఐఎస్‌ఈఏ) ప్రాజెక్టును కూడా అమలు చేస్తోంది.
కేంద్ర సమాచార-ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఇవాళ లోక్‌సభలో శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఈ సమాచారం వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2295192)
आगंतुक पटल : 6