పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశం... అధ్యక్షత వహించిన కేంద్ర పర్యావరణ మంత్రి
సాంకేతికత, సాముదాయిక భాగస్వామ్యం, సమన్వయపూర్వక జాతీయ కార్యాచరణ ద్వారా
మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణల నివారణను బలోపేతం చేయడం గురించి చర్చించిన కమిటీ
प्रविष्टि तिथि:
05 AUG 2026 12:27PM by PIB Hyderabad
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అధ్యక్షతన పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వశాఖకు చెందిన పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించారు. మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణ (హెచ్‌డబ్ల్యూసీ) అంశంపై ఈ సమావేశంలో చర్చోపచర్చలు జరిపి, ప్రజలకు వన్యజీవులకు మధ్య సంఘర్షణలను నివారించడం, తగ్గించడం, దీర్ఘకాలిక సహ-జీవనాన్ని పెంపొందింప చేయడం కోసం ఏయే చర్యలను చేపట్టవచ్చో పరిశీలించదలచారు. సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్‌తో పాటు కమిటీలో సభ్యులుగా ఉన్న ఎంపీలు, మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు, పీసీసీఎఫ్‌లు, చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్లు పాల్గొన్నారు.

గత సంవత్సరం డిసెంబరు 18న నిర్వహించిన కమిటీ సమావేశంలో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్న చర్యల్ని ప్రస్తుత సమావేశంలో ప్రస్తావించారు. సంఘర్షణ వల్ల ప్రభావితమైన ప్రాంతాలు గల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎంపీలతో జరిపిన సంప్రదింపుల వివరాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న సంఘర్షణల తీరుతెన్నులు విభిన్నంగా ఉన్నాయని, వాటిలో అనేక రాష్ట్రాల్లో మనుషులకు, ఏనుగులకు మధ్య తరచు సంఘర్షణ జరిగాయని, పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, ఖడ్గమృగాలు, అడవి పందులు, అడవి దున్నలు, కోతులు ఇతర ప్రజాతులతో ముడిపడిన సంఘర్షణల విషయంలో నిర్దిష్ట ప్రాంతం వారీ నిర్వహణ విధానాల్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ
స్పష్టం చేసింది.
వన్యప్రాణుల జాతీయ మండలి ఏడో సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటించిన మేరకు కోయంబత్తూరులో ని ఎస్ఏసీఓఎన్ డబ్ల్యూఐఐ సౌత్ సెంటర్‌లో ‘మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణ సంబంధిత ఎక్స్‌లెన్స్ సెంటర్’ (సీఓఈ-హెచ్‌డబ్ల్యూసీ)ని ఏర్పాటు చేసిన విషయాన్ని కమిటీకి తెలియజేశారు. మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణను ప్రభావవంతంగా అదుపు చేయడానికి శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక నవకల్పన, విధానపరమైన మద్దతు, సామర్థ్యాల పెంపు, సముదాయ ఆధారిత దృష్టికోణాలను అనుసరించడానికి ఒక జాతీయ సంస్థగా ఈ కేంద్రాన్ని స్థాపించారు. సంఘర్షణతో ముడిపడిన ఘటనల నమోదు, డేటా నిర్వహణ, జ్ఞానాన్ని పంచుకోవడం, నిర్ణయాల సమర్థన కోసం ఒక ఏకీకృత డిజిటల్ వేదికగా ‘మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణ సంబంధిత జాతీయ పోర్టల్’ను గత నెల 10న ప్రారంభించిన సంగతిని కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంది. దక్షిణ భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఏనుగుల సంరక్షణకు సంబంధించిన ప్రాంతీయ కార్యాచరణ ప్రణాళిక (ఆర్ఏపీ)కి ఆమోదం తెలిపిన విషయాన్ని కూడా కమిటీకి తెలియజేశారు.
అస్సాం, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో సంఘర్షణ స్థితిగతులు, వాటిని తగ్గించే దిశగా చేపడుతున్న చర్యలు, సాముదాయిక భాగస్వామ్య ప్రధాన కార్యక్రమాల నిర్వహణ, సాంకేతికతను ఉపయోగించడం, సంస్థాగత యంత్రాంగాలతో పాటు జాతీయ స్థాయిలో ప్రయత్నాలును బలోపేతం చేయడానికి తమ సిఫార్సులను సమర్పించాయి. ఫలానా ప్రాంతాల్లో అమలు చేయదగిన ప్రణాళికలు, త్వరితగతిన ప్రతిస్పందించడం, సహజ స్థలాలను మెరుగుపరచడం, వన్యప్రాణి కారిడార్ల సంరక్షణ, శాస్త్రీయ పద్ధతుల్లో పర్యవేక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవ్థలు, సాముదాయిక భాగస్వామ్యంతో పాటు రాష్ట్రాల మధ్య పరస్పర సమన్వయం.. వీటికి ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ అనుభవాలు స్పష్టం చేశాయి.

మనుషులు-వన్యజీవుల సంఘర్షణను ప్రభావవంతంగా అదుపు చేయడానికి పర్యావరణ సంరక్షణతో మానవ జీవన పరిరక్షణ, జీవనోపాధి మార్గాల పరిరక్షణలను అనుసంధానించడం అవసరమని చర్చల్లో స్పష్టం చేశారు. జీఐఎస్, కృత్రిమ మేధ, డ్రోన్లు, రేడియో టెలీమెట్రీ, భవిష్యత్తు సూచక విశ్లేషణ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించుకోవడంపై సభ్యులు చర్చించారు. ముందు వరుసలో నిలిచే వారి సామర్థ్యాన్ని పెంచడం, పరిహారం అందజేత పద్ధతుల్ని మెరుగుపరచడం, ప్రజలలో చైతన్యాన్ని పెంపొందింప చేయడం, సంరక్షణలో సాముదాయిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని సూచించారు.
ఆరు రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి:
అస్సాం: ఏనుగులు, పులులు, చిరుతలు, ఖడ్గమృగాలు, అడవి దున్నలు, అడవి పందుల ప్రమేయం గల మానవులు-వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించే విషయంలో అస్సాం ప్రభుత్వం తాను అనుసరిస్తున్న వ్యూహాన్ని వెల్లడించింది. ఆయా ప్రాంతాలలో అమలు చేసేందుకు ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడానికి ‘ప్రాంతీయ మానవ-వన్యప్రాణి సంఘర్షణ తాలూకు రిస్కును తగ్గించే సంఘాల’ (జోనల్ హ్యూమన్-వైల్డ్‌లైఫ్ కాన్‌ఫ్లిక్ట్ రిస్క్ రిడక్షన్ కమిటీస్) ఏర్పాటు చేస్తామని ఈ రాష్ట్రం ప్రస్తావించింది. ఈ ప్రణాళికలను రూపొందించడంలో సహజ నివాస స్థలాల (హాబిటాట్స్) పునరుద్ధరణ, కారిడార్ సంరక్షణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, శీఘ్ర స్పందన, సాముదాయిక భాగస్వామ్యం, వివిధ రీతుల జీవనోపాధులపై దృష్టిని కేంద్రీకరిస్తానంది. జోన్‌వారీ ప్రణాళిక పద్ధతిని కమిటీ ప్రశంసించింది. సంఘర్షణ ప్రభావం ప్రసరిస్తున్న ఇతర భూభాగాల్లోనూ ఈ పద్ధతిని అనుసరించడానికి వీలుగా, ఈ పద్ధతిలో రాబట్టిన ఫలితాల్ని నమోదు చేయాలని (డాక్యుమెంటేషన్) సూచించింది.
కర్ణాటక: మానవులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణలను నియంత్రించడానికి కర్ణాటక తాను అమలు చేస్తున్న ఆరు విధాల నమూనాను గురించి వివరించింది. ఇంజినీరింగ్ సాయాన్ని తీసుకోవడం, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పర్యవేక్షణ, కమాండ్ సెంటర్లు, శీఘ్ర స్పందన బృందాలు, కమ్యూనిటీ వాలంటీర్ నెట్‌వర్కులతో పాటు ఈ-పరిహార పేరిట డిజిటల్ నష్టపరిహార వ్యవస్థలను ఏర్పాటు చేయడం ఈ నమూనా ప్రత్యేకతలు. ‘నేషనల్ హ్యూమన్-వైల్డ్‌లైఫ్ కాన్‌ఫ్లిక్ట్ మిషన్’, సామాన్య ప్రామాణిక కార్యకలాపాల ప్రక్రియ (కామన్ ఎస్ఓపీ)లు, కారిడార్ల పునరుద్ధరణ, సరిహద్దులకు అవతలి వైపు ఏనుగుల సంతతి నిర్వహణకు రాష్ట్రాల మధ్య బలమైన సమన్వయం.. ఇవి కూడా అవసరమని కర్ణాటక సూచించింది. సాంకేతికత ఆధారిత దృష్టికోణాన్ని కర్ణాటక అనుసరిస్తుండటాన్ని కమిటీ మెచ్చుకుంది. అత్యుత్తమ పద్ధతులను రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది.
కేరళ: ఈ రాష్ట్రం తన ఏకీకృత సంస్థాగత ప్రాథమిక ప్రణాళికను వివరించింది. ఈ ప్రణాళికలో.. మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణను ‘రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రత్యేక విపత్తు’ (స్టేట్-స్పెసిఫిక్ డిజాస్టర్)గా ప్రకటించడం, శీఘ్ర స్పందన బృందాలతో పాటు ప్రాథమిక స్పందన బృందాలను రంగంలోకి దింపడం, సంఘర్షణతో ప్రభావితమైన 273 పంచాయతీలను గుర్తించడం, జన జాగృతి సమితులతో పాటు ఎస్ఏఆర్‌పీఏ వాలంటీర్ కార్యక్రమం వంటి సాముదాయిక కార్యక్రమాలను అమలు చేయడం కలిసి ఉన్నాయి. వన్యప్రాణి కారిడార్ల పునరుద్ధరణ, సహజ నివాస స్థలాల నిర్వహణ, జవాబుదారుతనంతో కూడిన పర్యటన రంగం, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణలు ఎంతైనా ముఖ్యమని ఈ రాష్ట్రం కూడా స్పష్టం చేసింది. శక్తిమంతమైన సంస్థాగత, సాముదాయిక దృష్టికోణాన్ని అనుసరిస్తూ కేరళ ముందుకు సాగుతుండటాన్ని కమిటీ పరిగణనలోకి తీసుకుంది. విజయవంతమైన కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేస్తూ ఉండాయాల్సిందిగా కేరళను ప్రోత్సహించింది.
మధ్యప్రదేశ్: మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణలను తగ్గించడానికి ‘నివారణే ముఖ్యం’ అన్న తన నమూనాను గురించి మధ్యప్రదేశ్ ఈ సమావేశంలో తెలియజేసింది. నిఘాకు ఏఐని ఉపయోగించడం, జీపీఎస్ ట్రాకింగ్, డ్రోన్లు, ‘గజరక్షక్’, శీఘ్ర స్పందన బృందాలు, ప్రజాతుల వారీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు, ఒక నిర్దిష్ట సమయం లోపల పరిహారం చెల్లింపు, ‘బాఘ్ మిత్ర’, ‘హాథీ మిత్ర’, పర్యావరణ అభివృద్ధి కమిటీల ద్వారా విస్తృత స్థాయిలో ప్రజా భాగస్వామ్యం.. ఇవి ఈ నమూనాలో భాగంగా ఉన్నాయి. హాబిటాట్ మేనేజ్‌మెంట్, వన్యప్రాణులకు స్వస్థతపరమైన సహాయం, సైన్స్ ఆధారిత ప్రజాతి నిర్వహణ పద్ధతుల్ని గురించి ఈ రాష్ట్రం కూడా ప్రస్తావించింది. సంఘర్షణతో సంబంధం ఉన్న పశువులను వేరే చోటుకు మార్చాలని సూచించింది. సాంకేతికతను ఉపయోగించుకోవడం, సాముదాయిక భాగస్వామ్యం, సకాలంలో సహాయక చర్యలను చేపట్టడం వంటి పద్ధతుల్ని పార్లమెంటరీ కమిటీ ప్రశంసించింది. ముందుగా అంచనా వేసి సంఘర్షణ నివారణ చర్యలను చేపట్టే విషయంలో మరింత అప్రమత్తతతో నడుచుకోవాల్సిందిగా కోరింది.
ఉత్తరాఖండ్: ప్రాధాన్య ప్రాంతాల్లో సంఘర్షణల తగ్గింపు దిశగా వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను అనుసరిస్తున్నట్లు ఉత్తరాఖండ్ తెలియజేసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్, ప్రతి నిమిషం అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్ (1926 నంబరు), ఈ-నిఘా, జీపీఎస్ ట్రాకింగ్, సహజ నివాస స్థలాల పునరుద్ధరణ, బయో-ఫెన్సింగ్, సకాలంలో పరిహారం అందజేసే వ్యవస్థ, గ్రామాల్లో వాలంటీర్ నెట్‌వర్కులను ఏర్పాటు చేసినట్లు వివరించింది. వన్యజీవులతో సమస్యలు ఎదురుకాగల ప్రాంతాల విషయంలో ప్రత్యేక ప్రణాళిక, జిల్లా స్థాయి పర్యవేక్షణ సంఘాలు, ‘చిరుతలతో, పులులతో కలిసి ఉండటం’ కార్యక్రమంలో భాగంగా సహజీవన ఏర్పాట్లను బలోపేతం చేయడంపైన కేంద్రీకరించినట్లు ఈ రాష్ట్రం తన దీర్ఘకాలిక వ్యూహాన్ని పార్లమెంటరీ కమిటీ కి వెల్లడించింది. ఉత్తరాఖండ్ అనుసరిస్తున్న ఏకీకృత భూభాగ ప్రధాన దృష్టికోణాన్ని కమిటీ కొనియాడింది. సాంకేతికత ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, సాముదాయిక సన్నాహకాలకు పెద్ద పీట వేయాలని కమిటీ స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్: తమ రాష్ట్రంలో మానవ-వన్యప్రాణి సంఘర్షణ కేసుల్లో ఎక్కువ భాగం చిరుతపులులకు సంబంధించినవే ఉంటున్నాయని ఉత్తరప్రదేశ్ వివరించింది. ఇవి తరాయి ప్రాంతంలో తరచు చోటుచేసుకుంటున్నాయంది. శీఘ్ర స్పందన బృందాలను, సహాయక కేంద్రాలను (ఇలాంటివి నాలుగింటి నిర్మాణం పూర్తి చేశారు), సౌర శక్తితో పనిచేసే కంచెలను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, సాముదాయిక వాలంటీర్ కార్యక్రమాలను, శాస్త్రీయ పర్యవేక్షణ, రక్షితప్రాంతాలకు ఆవల కూడా శక్తిమంతమైన సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఈ రాష్ట్రం తన వ్యూహాన్ని గురించి తెలియజేసింది. శాస్త్రీయ నిర్వహణపై దృష్టి సారించి రాష్ట్రం తీసుకుంటున్న శ్రద్ధను కమిటీ ప్రశంసించింది. తరచుగా సంఘర్షణలు తలెత్తుతున్న ప్రాంతాల్లో వాటిని తగ్గించే దిశగా సముదాయ ఆధారిత చర్యలను, పర్యవేక్షక వ్యవస్థలను నిరంతరాయ ప్రాతిపదికన పటిష్ఠపరచాలని సలహా ఇచ్చింది.
రాష్ట్రాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ప్రశంసించారు. మనుషులు-వన్యప్రాణుల సంఘర్షణ సంబంధిత సవాలును శాస్త్రీయ పద్ధతిలో, సంస్థల మధ్య సమన్వయంతో, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణతో, స్థానికుల భాగస్వామ్యంతో, సమతౌల్య దృక్పథంతో అధిగమించాలని ఆయన సూచించారు. డేటా ఆధారిత వ్యూహాలను రచించడంలోనూ, జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకొనే ప్రక్రియను సులభతరంగా మార్చడంలోనూ, రాష్ట్రాలు అత్యుత్తమ పద్ధతులను అనుసరించడంలోనూ తోడ్పడటానికి ఒక ప్రధాన సంస్థాగత ప్రాథమిక ప్రణాళికను మానవ-వన్యప్రాణి సంఘర్షణ సంబంధిత జాతీయ పోర్టల్, ఎక్స్‌లెన్స్ సెంటర్ అందిస్తాయని ఆయన తెలిపారు. అంతకు ముందు, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ సింగ్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. సహజ నివాస స్థానాల ఆధారిత శాస్త్రీయ అధ్యయనాన్ని చేపట్టి వాటి సామర్థ్యాన్ని అంచనా వేయాలని, దీని వల్ల వన్యజీవుల సంతతి మనుగడకు తగినన్ని వనరులు విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఇకోసిస్టమ్)లో ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. ఇది వనరులను పెంపొందించడానికి, మానవులు-వన్యప్రాణుల సంఘర్షణను అదుపు చేయడానికి మెరుగైన వ్యూహాన్ని రూపొందదించడంలోనూ తోడ్పడుతుందని ఆయన అన్నారు.

మనుషులకు, వన్యప్రాణులకు మధ్య సంఘర్షణను తగ్గించే ధ్యేయంతో జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో చేపట్టాల్సిన చర్యలను పటిష్ఠపరచడంతో పాటు భారత్‌లోని విశిష్ట వన్యప్రాణి వారసత్వాన్ని సంరక్షించడానికి దీర్ఘకాలిక ప్రాతిపదికన ఏయే చర్యలు తీసుకోవాలో విస్తృతంగా చర్చించి, సమావేశాన్ని ముగించారు.
***
(रिलीज़ आईडी: 2294946)
आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam