పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ఆహార భద్రతను, రైతు సంక్షేమాన్ని సమతౌల్యం చేస్తూ పెట్రోలులో ఇథనాల్ మిశ్రమ ప్రక్రియ
ఇథనాల్ కలపకపోతే.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిన సమయంలో పెట్రోలు ధర రూ. 125 వరకు చేరేది
प्रविष्टि तिथि:
31 JUL 2026 12:17PM by PIB Hyderabad
దేశీయ ఇంధన భద్రతను పటిష్టం చేయడంతోపాటు విదేశీ ముడిచమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, రైతులకు అండగా నిలవడం, ఆహార భద్రతకు భంగం కలగకుండా చూడడం లక్ష్యంగా.. కీలకమైన జాతీయ ప్రాజెక్టుగా ‘ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈబీపీ)’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే, ఇటీవల ఈ కార్యక్రమంపై కొందరి వాదనలు అసంపూర్ణంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. కింది వివరణలు ఆ వాదనలకు తెరదించుతూ వాస్తవ పరిస్థితిని తెలియజేస్తాయి.
ఆరోపణ: కిలోకు రూ. 37 విలువైన ఎఫ్‌సీఐ బియ్యాన్ని డిస్టిలరీలకు కిలోకు రూ. 23 చొప్పున ప్రభుత్వం విక్రయించడం వల్ల రూ. 10,000 కోట్ల నష్టం వాటిల్లింది. పెట్రోలు కన్నా ఇథనాల్ ఖరీదైందని ప్రభుత్వం కూడా అంగీకరించింది. ప్రజలు చెల్లించే పన్నుల వల్లే ఈ20 ప్రాజెక్టు కొనసాగుతోంది.
ఆహార భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు – పేదల ప్రయోజనాలకు భంగం కలిగించకుండానే ఇథనాల్ ఉత్పత్తి.
- ఈ ఆరోపణ కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించేది మాత్రమే కాదు.. ఇది సత్యాన్ని తలకిందులు చేసేలా ఉంది.
- ప్రతీ ధాన్యపు గింజనూ ముందుగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్ఎస్ఏ), ఇతర సంక్షేమ పథకాలు, తప్పనిసరి బఫర్ నిల్వల అవసరాల కోసమే ప్రభుత్వం కేటాయిస్తుంది. దేశ ఆహార భద్రతకు పూర్తి భరోసా లభించిన తర్వాత గానీ.. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యంలో ఒక్క గింజను కూడా ఇథనాల్ తయారీకి మళ్లించేది లేదు.
- దేశ ఆహార భద్రతా అవసరాలన్నీ తీరిన తర్వాతే.. మిగులు ధాన్యం నిల్వలపై ఆహార, ప్రజా పంపిణీ శాఖ ధ్రువీకరణ ఆధారంగా మాత్రమే ఇథనాల్ ఉత్పత్తికి అనుమతిస్తారు.
- నిజానికి దెబ్బతిన్న ధాన్యం, నూకలు, ఆహారంగా తీసుకోవడానికి పనికిరాని నిల్వలనే ఇథనాల్ తయారీకి ఉపయోగించేది. లేదంటే అవి గోదాముల్లోనే మగ్గిపోయి పాడైపోయేవి.
- ఇది పేదల నోటి వద్ద కూడును లాక్కోవడం ఎంతమాత్రమూ కాదు.. ఇది వ్యర్థాలను సంపదగా మార్చడం. దిగుమతులను తగ్గించడం, భారతీయ రైతులు మరింత ఆదాయాన్ని ఆర్జించేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
- ఈ కార్యక్రమం మరింత ముందుకు సాగుతోంది. ప్రధానమంత్రి జీ-వన యోజన ద్వారా.. వ్యవసాయ వ్యర్థాల నుంచి 2జీ ఇథనాల్ వెలికితీతను భారత్ వేగంగా విస్తరిస్తోంది. ఆహార ధాన్యాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది.
- వాస్తవాలు సుస్పష్టం: ముందుగా ఆహార భద్రత కోసం అవసరమైన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కాపాడుతుంది. ఆ తర్వాతే మిగులును, వ్యర్థాలను శుద్ధ ఇంధనంగా మారుస్తుంది. కాబట్టి పైన పేర్కొన్న ఆరోపణ అవాస్తవం మాత్రమే కాదు.. భారత ఇథనాల్ కార్యక్రమాన్ని ప్రపంచంలోని అత్యంత బాధ్యతాయుతమైన కార్యక్రమాల్లో ఒకటిగా నిలిపిన రక్షణ చర్యలనూ విస్మరిస్తూ చేసిన తప్పుడు ఆరోపణ ఇది.
బియ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వలేదు
- ఎఫ్‌సీఐ వద్ద ఉన్న బియ్యాన్ని అత్యంత తక్కువ ధరకే ఇథనాల్ తయారీదారులకు విక్రయించారన్ని అభిప్రాయాన్ని ఈ ఆరోపణ కలిగిస్తోంది. అది ఏమాత్రం నిజం కాదు.
- ఇథనాల్ తయారీకి ఉపయోగించేందుకు ఆమోదించిన అనేక ముడి పదార్థాలలో ఎఫ్‌సీఐ బియ్యం ఒకటి. ఇతర ముడి పదార్థాల మాదిరిగానే.. దీని ధరను కూడా అదే ప్రభుత్వ ధరల విధానం మేరకు నిర్ణయిస్తారు.
|
ముడి పదార్థం (ఇథనాల్ సరఫరా సంవత్సరం 2025-26)
|
చెల్లించిన ఇథనాల్ ధర
|
|
మొక్కజొన్న
|
రూ. 71.86/లీటరు
|
|
చెరకు రసం/పాకం
|
రూ. 65.61/లీటరు
|
|
విరిగిన ధాన్యపు గింజలు
|
రూ. 64.00/లీటరు
|
|
బి-హెవీ మొలాసిస్
|
రూ. 60.73/ లీటరు
|
|
ఎఫ్‌సీఐ బియ్యం
|
రూ. 60.32/ లీటరు
|
|
సి-హెవీ మొలాసిస్
|
రూ. 57.97/ లీటరు
|
ఈ కార్యక్రమం బియ్యంపైనే ఆధారపడి ఉండదు. ఆమోదించిన ముడి పదార్థాల్లో అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగిస్తుంది.
- 2023-24 ఇథనాల్ సరఫరా సంవత్సరం (ఈఎస్‌వై)లో ఇథనాల్ ఉత్పత్తిలో ఎఫ్‌సీఐ బియ్యం వాటా దాదాపు శూన్యం. అది కేవలం 0.02 శాతం మాత్రమే.
- ఆహార భద్రతకు సంబంధిత అవసరాలన్నీ తీరిన తర్వాతే.. 2025-26 ఇథనాల్ సరపరా సంవత్సరం నాటికి దీని వాటా 24.64 శాతానికి పెరిగింది. మిగులు ఎఫ్‌సీఐ నిల్వలు అందుబాటులోకి రావడమే దీనికి కారణం.
- అదే సమయంలో మొక్కజొన్న వాటా 42.6 శాతం నుంచి 35.96 శాతానికి తగ్గింది. లభ్యతను బట్టి ఉత్పత్తిదారులు ఎంచుకునే వివిధ ముడి పదార్థాలు సులభంగా మారుతుంటాయని ఇది సూచిస్తోంది.
- ఇథనాల్ ఉత్పత్తి కేవలం చౌక బియ్యం మీదే ఆధారపడి నడిచేది కాదు. ప్రభుత్వం ఆమోదించిన రకరకాల ముడి పదార్థాల ఆధారంగా ఇది సాగుతుంది. ఆహార భద్రతా అవసరాలన్నీ తీరిన అనంతరం.. మిగులు బియ్యం ఉందని ధ్రువీకరించిన తర్వాతే ఇథనాల్ కోసం ఎఫ్‌సీఐ బియ్యాన్ని వాడుతారు.
ఇథనాల్ చవకైనదా కాదా అని కాదు.. భారత్‌కు మెరుగైన ఇంధన భద్రత లభిస్తుందా లేదా అన్నదే అసలు ప్రశ్న
- ఇదీ అసలు ప్రశ్న: ఇథనాల్ మిశ్రమం లేకపోయి ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిన సమయంలో భారతీయులు ఎంత చెల్లించాల్సి వచ్చేది?
- భారత ముడి చమురు ధర బ్యారెల్‌కు దాదాపు 135 డాలర్లకు పెరిగిన సమయంలో.. ఢిల్లీలో ఇథనాల్ కలపని పెట్రోలు ధర లీటరుకు దాదాపు రూ.125కు చేరుతుందని అంచనా వేశారు.
- కానీ వినియోగదారులు లీటరుకు రూ. 94.77 మాత్రమే చెల్లించారు. లీటరు పెట్రోలులో 20 శాతం మేర దేశీయంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్‌ను కలపడమే దీనికి కారణం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోయినప్పటికీ.. ముందుగానే కుదుర్చుకున్న స్థిర ధరలకే ఇథనాల్‌ను సేకరించడం వల్ల పెట్రోల్ ధరల భారం తగ్గింది.
- ఫలితం? - సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో.. పెట్రోల్ బంకులో లీటరుకు దాదాపు రూ. 30 చొప్పున ఆదా అయ్యాయి.
- ఇథనాల్ మిశ్రమానికి సంబంధించి అసలు ప్రయోజనం ఇక్కడే ఉంది. రోజూ అతి తక్కువ ధరకే ఇంధనాన్ని అందించడం కాదు.. అంతర్జాతీయ చమురు మార్కెట్లలోని తీవ్రమైన హెచ్చుతగ్గుల నుంచి దేశ వినియోగదారులను కాపాడడం, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, దేశ ఇంధన వ్యయంలో ఎక్కువ భాగం విదేశాలకు తరలిపోకుండా భారత ఆర్థిక వ్యవస్థలోనే ఉండేలా చూడడం దీని ముఖ్య లక్ష్యం.
- ఈ కార్యక్రమ ఫలితాలే దాని విజయానికి నిదర్శనం. ఈబీపీ ద్వారా ఇప్పటికే సాధించిన వివరాలిలా ఉన్నాయి:
- రూ. 1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదా అయ్యింది.
- 316 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురు దిగుమతుల స్థానంలో దానికి ప్రత్యామ్నాయంగా నిలిచింది.
- 950 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించింది.
- రైతులు, డిస్టిల్లర్లకు రూ. 1.66 లక్షల కోట్లకు పైగా చెల్లింపులు చేసి.. వ్యవసాయోత్పత్తులకు స్థిరమైన దేశీయ మార్కెటును సృష్టించింది.
- దిగుమతి చేసుకునే ముడి చమురుపై భారత్ ఆధారపడడాన్ని తగ్గించడం ఇథనాల్ మిశ్రమ ముఖ్య లక్ష్యం. మన చమురు అవసరాల్లో దాదాపు 88 శాతం వరకూ ముడిచమురు దిగుమతులపైనే నేటికీ మనం ఆధారపడుతున్నాం. ఇది అంతర్జాతీయ చమురు సంక్షోభాల నుంచి రక్షణ కల్పించే భద్రతా కవచం లాంటిది తప్ప.. రోజువారీ ధరల పోటీ కోసం ఉద్దేశించినది కాదు.
ఇథనాల్ మిశ్రమం.. పన్ను చెల్లింపుదారుల సొమ్ముతోనే నడుస్తున్న కార్యక్రమం కాదు. ఇది దేశానికి ఒక ఇంధన భద్రతా కవచం. సంక్షోభ సమయంలో దీని ఆవశ్యకత ఇప్పటికే స్పష్టంగా నిరూపితమైంది.
***
(रिलीज़ आईडी: 2292624)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Khasi
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam