సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము నాలుగేళ్ల పాలన... రాష్ట్రపతి భవన్‌లో అయిదు స్మారక పుస్తకాల ఆవిష్కరణ
సమ్మిళిత ప్రజాస్వామ్యంపై దేశ ప్రజలకున్న విశ్వాసానికి స్మారక పుస్తకాలు ప్రతీకలు... భారతీయ వారసత్వంపై పౌరులు గర్వపడాలి: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము
హుందాతనం, వినయం, వివేకం, నిబద్ధతతో అత్యున్నత రాజ్యాంగ పదవికి రాష్ట్రపతి ముర్ము మరింత శోభ తెచ్చారు: ఉపరాష్ట్రపతి
प्रविष्टि तिथि:
28 JUL 2026 8:47PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము నాలుగేళ్ల పాలనను పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ నేడు రాష్ట్రపతి భవన్‌లో అయిదు స్మారక పుస్తకాలను ఆవిష్కరించారు. వీటిలోని మొదటి ప్రతిని రాష్ట్రపతికి అందజేశారు.
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము పదవీకాలం నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రచురణల విభాగం ప్రచురించిన ‘రాష్ట్రపతి భవన్: రాష్ట్ర కా భవన్’, ‘సేవాఔర్ సంవేదన’, ‘సమావేశీ సహభాగిత’, ‘భారతీయతా కా ఉత్సవ్’ అనే నాలుగు పుస్తకాలు నేడు రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కృతమయ్యాయి. వీటితో పాటు రాష్ట్రపతిపై రాసిన కథనాల సమాహారమైన ‘ఆమ రాష్ట్రపతి ఆమ గౌరవ్’ అనే ఒడియా పుస్తకాన్ని కూడా విడుదల చేశారు.
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సమాచార-ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ... ఈ పుస్తకాల పేర్లు సమ్మిళిత ప్రజాస్వామ్యంపై మనకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. చిత్రాలతో కూడిన ఈ ప్రచురణలు పాఠకులకు రాష్ట్రపతి భవన్ సంప్రదాయాలు, పనితీరు, వివిధ కోణాలను పరిచయం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మన వారసత్వంపై గర్విస్తూ, ప్రగతి పథంలో ముందుకు సాగేలా పౌరులలో స్ఫూర్తిని నింపడమే ఈ పుస్తకాల అసలైన ప్రాముఖ్యత అని స్పష్టం చేశారు.
2022 జూలై 25న భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయం నుంచి గౌరవం కంటే బాధ్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె తెలిపారు. గడిచిన నాలుగేళ్లలో అదే కర్తవ్య భావనతో తన విధులను నిర్వహించినట్లు వెల్లడించారు. రాష్ట్రపతి భవన్‌లో లేదా వివిధ రాష్ట్రాల పర్యటనల్లో ప్రజలను, ముఖ్యంగా యువతను కలిసినప్పుడు నైతిక విలువలకు కట్టుబడి ఉండాలని... దేశం, సమాజ పురోగతి కోసం కృషి చేయాలని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించి, ఆత్మవిశ్వాసంతో ప్రగతి పథంలో ముందుకు సాగాలని తాను కోరుతున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. గిరిజన వర్గాల ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి ప్రధాన స్రవంతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా అక్కడ నివసించే భారతీయ సమాజాన్ని కలుస్తూ, దేశ అభివృద్ధి ప్రయాణంలో తమ వంతు సహకారం అందించాలని వారిని ప్రోత్సహిస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ... జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన కాలాన్ని గుర్తుచేసుకుంటూ, ఈ వేడుక తనకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఆ రాష్ట్రవ్యాప్త పర్యటనల్లో ప్రతి వర్గం ప్రజలు శ్రీమతి ద్రౌపదీ ముర్ము గవర్నర్ పదవీకాలం గురించి ఎంతో అభిమానంతో, అప్యాయతతో మాట్లాడేవారని తెలిపారు. రాజ్యాంగ బాధ్యతలను ఆమె నిర్వహించిన తీరు, ప్రజలతో గాఢమైన వ్యక్తిగత అనుబంధం, గిరిజన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, యువత పట్ల ఆమె చూపిన సానుభూతిని, శ్రద్ధను ప్రజలు నేటికీ గుర్తుంచుకున్నారని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి అభిమానం కేవలం పదవితో రాదు..వ్యక్తిత్వం, కరుణ, ప్రజా సేవ పట్ల నిబద్ధత ద్వారా మాత్రమే లభిస్తుంది’’ అని స్పష్టం చేశారు.
రాష్ట్రపతి ముర్ము హయాంలో చేపట్టిన పలు కీలక కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి కొనియాడారు. చారిత్రాత్మక ముఘల్ గార్డెన్స్‌కు అమృత్ ఉద్యాన్‌గా నామకరణం చేయడం, డెహ్రాడూన్‌లోని రాష్ట్రపతి నికేతన్, రాష్ట్రపతి తపోవన్లను ప్రజల సందర్శనకు తెరవడం, రాష్ట్రపతి భవన్‌ను దివ్యాంగులకు మరింత అనుకూలంగా మార్చడం వంటి చర్యలను ప్రస్తావించారు. సర్ ఎడ్విన్ లుటియన్స్ విగ్రహం స్థానంలో భారతదేశ చివరి గవర్నర్ జనరల్, భారతరత్న చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని ప్రత్యేకంగా గుర్తుచేశారు. జాతీయ సంస్థలను బానిసత్వ వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి చేస్తూ... రాష్ట్రపతి వ్యవస్థను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఈ చర్యలు నిదర్శనమని ఉపరాష్ట్రపతి తెలిపారు.
ఈ ప్రచురణల గురించి ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ... సేవా ఔర్ సంవేదన పుస్తకం రాష్ట్రపతి ముర్ము ప్రజా జీవితంలో ప్రతిబింబించే సేవా భావన, సానుభూతి విలువలని చాటిచెబుతోందని పేర్కొన్నారు. సమావేశీ సహభాగిత పుస్తకం భారతదేశ అభివృద్ధి అందరినీ కలుపుకునిపోయేలా, లబ్ధిదారుల భాగస్వామ్యంతో సాగాలనే ఆమె బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తుందని తెలిపారు. భారతీయతా కా ఉత్సవ్ పుస్తకం భారతీయ నాగరికత శాశ్వత విలువలను, అద్భుతమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని కొనియాడుతుందని చెప్పారు. భారత్‌ను సమైక్యంగా ఉంచుతున్న సాంస్కృతిక వైభవం, స్థానిక సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వాన్ని రాష్ట్రపతి ముర్ము నిరంతరం గుర్తుచేస్తుంటారని కొనియాడారు.
ఓల్ చికి లిపిలో సంథాలీ భాషలోకి అనువదించిన భారత రాజ్యాంగాన్ని రాష్ట్రపతి గతంలో విడుదల చేసిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అది గిరిజన సమాజంలో గొప్ప ఆత్మగౌరవాన్ని నింపిందని వర్ణించారు. భారతదేశ భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడంలో దేశానికి ఉన్న నిబద్ధతను ఆ క్షణం పునర్నిర్వచించిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ పుస్తకాలు దేశంలోని వివిధ సంస్కృతులను, వైవిధ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించాయని తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఇవి ప్రామాణిక పుస్తకాలుగా ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము పరిపాలనా ప్రయాణాన్ని భద్రపరచడంలో నేడు విడుదలైన పుస్తకాలు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తాయని వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2290856)
आगंतुक पटल : 5