రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పాకిస్థాన్‌ దుస్సాహసానికి పాల్పడితే దీటుగా తిప్పికొట్టగల భారత్‌ సామర్థ్యం ‘ఆపరేషన్ సిందూర్‌’తో నిరూపితం

ద్రాస్‌లో 27వ కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌

పాకిస్థాన్‌తో చర్చ ఎలాంటిదైనా భారత్‌లో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశం మాత్రమే కేంద్రకంగా ఉంటుందని స్పష్టీకరణ

పురోగమనం.. ఆవిష్కరణలే భారత్‌ ఆకాంక్ష... ఉగ్రవాదాన్ని-చొరబాట్లను ప్రోత్సహించడమే పాకిస్థాన్‌ నైజం

రక్షణ రంగంలో స్వయంసమృద్ధి కోసం భారత్‌ కృషికి ‘యే దిల్ మాంగే మోర్’ నినాదమే స్ఫూర్తి

వికసిత భారత్-2047 ఆర్థిక శ్రేయస్సును మించినది... ఇది వ్యూహాత్మక బలం.. సాంస్కృతిక ప్రతిష్ట.. సామాజిక సామరస్యంపై నిబద్ధతకు ప్రతీక

प्रविष्टि तिथि: 26 JUL 2026 12:25PM by PIB Hyderabad

   పాకిస్థాన్‌ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా అనూహ్య తీవ్రతతో దీటుగా తిప్పికొట్టగల భారత్ సామర్థ్యం ‘ఆపరేషన్ సిందూర్’తో నిరూపితమైందని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. కార్గిల్‌ విజయ దినోత్సవం సందర్భంగా ద్రాస్‌ సెక్టార్‌లో ఇవాళ  నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలూ ఉండబోవని, ఏదైనా ఉంటే- అది కేవలం పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)పైనే కేంద్రీకృతం అవుతాయని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. ఆ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని, పాక్‌ అక్రమంగా దాన్ని ఆక్రమించుకున్నదని చెప్పారు. భారత సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే ప్రతి దుష్ట చర్యకూ ‘ఆపరేషన్ సిందూర్‌’ తరహాలో భారత రక్షణ దళాలు దీటుగా బదులిస్తాయని హెచ్చరించారు. మన రక్షణ దళాల చావుదెబ్బను ఉగ్రవాదులు, వారి పోషకులు ఇప్పటికే రుచి చూశారని, భవిష్యత్తులో కూడా ఎలాంటి దుశ్చర్యకు దిగినా ఫలితం ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు.

పాకిస్థాన్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య విభజన రేఖ చెరిగిపోయిందని, ఆ దేశం ఉగ్రవాదాన్ని తన ప్రభుత్వ విధానంలో అంతర్భాగం చేసుకున్నదని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. “ఉగ్రవాద సంస్థలకు సైన్యం ఆశ్రయమివ్వడమే కాకుండా, వాటితో చేయి కలిపి దుశ్చర్యలకు పాల్పడుతోంది. అందుకే, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉగ్రవాదులు, వారికి అండగా నిలిచే ప్రభుత్వాల మధ్య భారత్‌ వ్యత్యాసం చూపలేదు. ఇకపైనా మన వైఖరి ఇలాగే ఉంటుందని స్పష్టం చేశాం” అని ఆయన వ్యాఖ్యానించారు.

కార్గిల్ యుద్ధానికి 27 ఏళ్లు ముగిసిన నేపథ్యంలో భారత్, పాక్‌ మార్గాలు పూర్తిగా వేరయ్యాయని రక్షణ మంత్రి అన్నారు. ఆ మేరకు “భారత్‌ నవ్యావిష్కరణల బాట పడితే, పాక్‌ ఇంకా పాత పద్ధతిలోనే చొరబాట్లకు దారులు వెదుకుతోంది. భారత్‌ చిప్ డిజైన్‌లో నిమగ్నమైతే, పాక్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే పనిగా పెట్టుకుంది. భారత్‌ అంకురావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంటే పాక్‌ ఉగ్రవాద వ్యవస్థను రూపొందిస్తోంది. భారత్‌ సెమీకండక్టర్లను తయారు చేస్తుంటే, పాక్‌ ఆత్మాహుతికి ఉగ్రవాదులను సిద్ధం చేస్తున్నది. భారత్‌ మానవసహిత అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుడుతుండగా, పాకిస్థాన్‌ ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నది. భారత్‌ అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపుతుంటే, పాక్‌ ఉగ్రవాదులను సరిహద్దులు దాటించడంపై దృష్టి సారిస్తోంది. భారత్‌ ప్రపంచానికి సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంటే, పాకిస్తాన్ స్లీపర్ సెల్స్‌ (ఉగ్రవాదుల)ను ఎగుమతి చేస్తోంది. భారత్‌ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుంటే- పాకిస్థాన్ ఉగ్రవాద దుర్బోధలతో యువతను భ్రష్టు పట్టిస్తున్నది. భారత్‌ యూపీఐతో ప్రపంచాన్ని అనుసంధానిస్తుంటే, పాకిస్థాన్‌ హవాలా నెట్‌వర్క్‌లతో ఉగ్రవాదాన్ని ముడిపెడుతోంది. సంక్షిప్తంగా- రెండు దేశాల మార్గాలు పూర్తిగా భిన్నం. పాకిస్థాన్‌ తన దుష్ట పన్నాగాలతో మన సౌభాగ్య పథానికి అడ్డుపడేందుకు సాహహిస్తే, మన రక్షణ దళాలు తగువిధంగా స్పందించడానికి సదా సిద్ధంగా ఉన్నాయి” అని ఆయన స్పష్టం చేశారు.

ఎలాంటి ముప్పు విషయంలోనైనా రక్షణ దళాలు నిర్ణయాత్మకంగా ప్రతిస్పందించ పూర్తి స్వేచ్ఛనిచ్చే రాజకీయ సంకల్పం కేంద్ర ప్రభుత్వానికి ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. మన సైనికులు దేశ సరిహద్దులను కాపలా కాస్తుండగా, శత్రువు భారత్‌ వైపు తేరిపార చూడటం కూడా దుర్లభమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మాతృభూమి రక్షణ కోసం 1999 కార్గిల్ యుద్ధంలో ప్రాణతర్పణం చేసిన భారత వీర సైనికులకు ఆయన ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా పరమవీర చక్ర పురస్కార గ్రహీతలు కెప్టెన్ విక్రమ్ బాత్రా, కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే సహా, దేశానికి... ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిస్తున్న ఎందరో వీర సైనికులను ఆయన స్మరించుకున్నారు. వ్యక్తిగత విజయం, జాతీయ కర్తవ్యం మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని భావించే ప్రతి యువకుడికీ కార్గిల్ విజయ దినోత్సవం ఒక స్ఫూర్తిదాయక దినమని ఆయన అభివర్ణించారు. “త్యాగం, సేవల స్ఫూర్తి ఏ దేశానికైనా వెన్నెముక వంటిదని ఈ విజయ దినోత్సవం మనకు బోధిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం భారత సంపూర్ణతను ప్రతిబింబిస్తుందని, అమరవీరులు దేశంలోని ప్రతి ప్రాంతానికీ ప్రాతినిధ్యం వహిస్తారని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. “వైవిధ్యం, వైరుధ్యంతో నిమిత్తం లేకుండా మనకు హాని తలపెట్టే వారిని ఈ ఐక్యతా కుడ్యం గంభీరంగా నిరోధిస్తుంది” అని ఆయన అన్నారు.

పశ్చిమాసియాలో, రష్యా-ఉక్రెయిన్ మధ్య సంఘర్షణలు రక్షణ దళాల సామర్థ్యంతోపాటు దేశాల పునరుత్థాన సామర్థ్యం, సహనం, సంకల్పాన్ని కూడా పరీక్షించాయని రక్షణశాఖ  మంత్రి చెప్పారు. భారత సైన్యం, బలమైనదేగాక సమర్థమైనదని, అయినప్పటికీ జాతీయ భద్రత పరిరక్షణ కర్తవ్యం ప్రతి పౌరుడిపైనా ఉంటుందని చెప్పారు. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తి, క్రమశిక్షణ, కర్తవ్య భావనల ప్రాధాన్యాన్ని వివరిస్తూ- ప్రతి భారతీయుడూ సైనికుల తరహాల చైతన్యంతో మెలగాలని సూచించారు. “ప్రతి పౌరుడు ఒక సైనికుడిగా మారాలన్నది నా ఉద్దేశం కాదు. దేశం ఎప్పుడైనా తన ప్రజల ప్రత్యక్ష-పరోక్ష మద్దతును అభిలషిస్తే మాతృభూమి రక్షణ కోసం ముందుకు రావడానికి ప్రతి భారతీయుడు మానసికంగా, నైతికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండాలి. ప్రతి సైనికుడు అన్నింటికంటే ముందుగా ఒక భారతీయుడైన తరహాలోనే, ఒక సైనికుడి ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి ప్రతి భారతీయుడిలో సదా సజీవంగా ఉండాలి” అన్నారు.

వికసిత భారత్-2047 ఆర్థిక శ్రేయస్సును మించినదని వ్యూహాత్మక బలం, సాంస్కృతిక ప్రతిష్ట, సామాజిక సామరస్యంపై నిబద్ధతకు అదొక ప్రతీకని శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. దేశ పురోగమనంలో అడుగడుగునా కార్గిల్ యుద్ధ వీరులు ప్రదర్శించిన అంకితభావం, కర్తవ్య స్ఫూర్తిని అలవర్చుకోవడం ద్వారానే ఈ స్వప్నం సాకారం కాగలదని చెప్పారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం జాతీయ భద్రతకు, సైనికుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిస్తోందని ప్రముఖంగా ప్రస్తావించారు. “ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితులలోనైనా మన సరిహద్దుల వద్ద సదా అప్రమత్తంగా ఉండాలని కార్గిల్ యుద్ధం మనకు పాఠం నేర్పింది” అన్నారు. కాలానుగుణంగా సైనిక సామర్థ్యాల ఆధునికీకరణ, కార్యాచరణ సామర్థ్యం పెంపుపై సమానంగా దృష్టి సారిస్తూ, సరిహద్దు మౌలిక సదుపాయాలను నిరంతరం బలోపేతం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

‘యే దిల్ మాంగే మోర్’ అంటూ కెప్టెన్ విక్రమ్ బాత్రా ఇచ్చిన ప్రసిద్ధ నినాదం స్ఫూర్తితో రక్షణ రంగ ఉత్పాదనలో స్వయం సమృద్ధివైపు శరవేగంగా పయనిస్తున్నామని శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. “మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, భారత్‌ తన రక్షణావసరాల్లో 65-70 శాతం దిగుమతి చేసుకునేది. అయితే, నేడు మన రక్షణ పరికరాలలో 65 శాతాన్ని భారత గడ్డపైనే తయారు చేస్తున్నాం. ఈ రోజు మన సైనికులు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఆకాశ-తీర్’ గగనతల రక్షణ నియంత్రణ వ్యవస్థను నిర్వహిస్తున్నా. తదుపరి తరం ఆకాశ్ క్షిపణిని కూడా మనం రూపొందించుకున్నాం. భారత తొలి స్వదేశీ విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’, తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’, తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ‘ప్రచండ్‌’, అధునాతన తేలికపాటి హెలికాప్టర్ ‘ధ్రువ్’, ప్రధాన యుద్ధ ట్యాంక్ ‘అర్జున్’, ‘పినాక’ మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్, ‘అస్త్ర’ గగనతల క్షిపణి, ఆధునిక డ్రోన్లు-కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు కూడా రక్షణ దళాల యుద్ధ సంసిద్ధతను బలోపేతం చేస్తున్నాయి. కానీ, ‘ఈ మనసు ఇంకా ఏదో కోరుకుంటోంది’.. మరిన్ని ఆధునిక ఆయుధాలు, భావితరం యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, క్షిపణులను దేశంలోనే తయారు చేయడానికి మేం కృషి చేస్తూనే ఉంటాం” అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 1999 నాటి ‘ఆపరేషన్ విజయ్’ సమయంలో అమరులైన వీరయోధుల స్మరణార్థం రక్షణ మంత్రి సెనోటాఫ్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మౌనం పాటించారు. లదాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, నార్తర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ, 14 కార్ప్స్ జీఓసీ లెఫ్టినెంట్ జనరల్ మదన్‌రాజ్ పాండే, 8 మౌంటెన్ డివిజన్ జీఓసీ మేజర్ జనరల్ ఏపీ సింగ్ తదితరులు కూడా శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి కార్గిల్ యుద్ధ వీరులకు నివాళి అర్పించారు. ఈ ‘శ్రద్ధాంజలి సమారోహ్’లో సీనియర్ సైనిక-పౌర ప్రముఖులు, కార్గిల్ యుద్ధ వీరులు, శౌర్య పురస్కార గ్రహీతలు, వీరనారులు, మృతుల కుటుంబ సభ్యులు, స్థానిక పౌరులు కూడా పాల్గొన్నారు.

సందర్శకుల పుస్తకంలో సంతకం చేసిన అనంతరం- ఆపరేషన్ విజయ్ సమయంలో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పం, అకుంఠిత స్ఫూర్తిని శ్రీ రాజ్‌నాథ్‌ వివరించారు. ఈ సందర్భంగా ఇద్దరు నాన్ కమిషన్డ్ అధికారులు సమర్పించిన ‘గౌరవ గాథ’ను వీక్షించారు. కార్గిల్ యుద్ధ చరిత్ర-వారసత్వాన్ని ప్రజలకు మరింత విస్తృతంగా చేరవేసేలా రూపొందించిన ‘వర్చువల్ వాక్‌త్రూ పోర్టల్‌’ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన స్మారక కుటీరాన్ని సందర్శించి, వీరభూమి వద్ద నివాళి అర్పించారు.

అనంతరం ప్రముఖులు, సైనికులు, వారి కుటుంబాలతో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ముచ్చటిస్తూ, తేనీరు సేవించారు. అనంతరం, కార్గిల్ విజయ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ‘శౌర్య విజయ యాత్ర’ పేరిట మోటార్ సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఆయన 2026 జూలై 14న న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి కూడా ఒక ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

ద్రాస్‌లో రక్షణశాఖ మంత్రి రక్షణ దళాలకు నాయకత్వం వహిస్తూ కార్గిల్ విజయ దినోత్సవంలో పాల్గొనగా, ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళి అర్పించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, రక్షణ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్ తదితరులు కూడా వీరయోధులకు నివాళి అర్పించారు.

 

***


(रिलीज़ आईडी: 2289621) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam