ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డెంగ్యూ నివారణకు జాతీయ స్థాయిలో చేస్తున్న ప్రయత్నాలను బలోపేతం చేస్తూ భారత్‌లో తొలి డెంగ్యూ టీకాకు ఆమోదం తెలిపిన సీడీఎస్‌సీవో

4 నుంచి 60 ఏళ్ల వయసున్న వ్యక్తుల్లో డెంగ్యూ నివారణకు రీకాంబినెంట్ లైవ్ అటెన్యూయేటెడ్ డెంగ్యూ టీకాకు ఆమోదం తెలిపిన సీడీఎస్‌సీవో

డబ్ల్యూహెచ్‌వో ప్రీక్వాలిఫికేషన్, బలమైన ప్రపంచ భద్రతా రికార్డుతో 42 దేశాల్లో డెంగ్యూ వ్యాక్సిన్‌కు ఆమోదం

प्रविष्टि तिथि: 21 JUL 2026 8:35AM by PIB Hyderabad

డెంగ్యూ నివారణ, నియంత్రణ కోసం భారత్ చేపడుతున్న ప్రయత్నాలను బలోపేతం చేసే దిశగా కీలకమైన విజయం నమోదయింది. డెంగ్యూ టెట్రావాలెంట్ వ్యాక్సిన్‌ (సజీవ, బలహీనపరిచిన) – క్యుడెంగాకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) మార్కెటింగ్ అనుమతులను మంజూరు చేసింది. జర్మనీకి  చెందిన టకేడా జీఎంబీహెచ్ సంస్థ తయారు చేసిన ఈ టీకాను టకేడా బయోఫార్మాసూటికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దిగుమతి చేసుకుంటుంది. డెంగ్యూ వ్యాధిని నివారించడానికి దేశంలో ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ ఇదే.

ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం – 1940, ఔషధ నియమాలు – 1945 లోని నిబంధనల ప్రకారం టీకా నాణ్యతను, భద్రతను, సామర్థ్యాన్ని సమగ్ర శాస్త్రీయ అధ్యయనం చేసిన అనంతరం ఆమోదాన్ని మంజూరు చేశారు.

రీకాంబినెంట్ డీఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసిన సజీవ, బలహీనపరిచిన టెట్రావాలెంట్ డెంగ్యూ టీకాయే క్యుడెంగా. ఈ వ్యాక్సిన్‌ను వెరో కణాల్లో ఉత్పత్తి చేస్తారు. డెంగ్యూ వైరస్ టైప్-2లో నిర్దిష్ట సీరోటైప్ ఉపరితల ప్రొటీన్ జన్యువులను ప్రవేశపెట్టి దీనిని అభివృద్ధి చేశారు. దీనిలో జన్యుపరమైన మార్పులు చేసిన సూక్ష్మజీవులు (జీఎంఓ) ఉంటాయి. ఫ్రీజ్-డ్రైడ్ పౌడర్ రూపంలో సరఫరా చేసే ఈ వ్యాక్సిన్‌ను సబ్‌క్యుటేనియస్ ఇంజెక్షన్‌గా ఇస్తారు.

4 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిలో డెంగ్యూ వ్యాధి నివారణకు ఈ టీకాను సూచించారు. నిర్దేశించిన ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం మూడు నెలల వ్యవధిలో (0, 3 నెలలు) ఒక్కొక్కటి 0.5 ఎంఎల్ చొప్పున రెండు డోసులను ఇవ్వాలి.

డెంగ్యూ ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు, తక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ నిర్వహించిన విస్తృత అంతర్జాతీయ వైద్య అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఈ వ్యాక్సిన్ భద్రత, వ్యాధి నిరోధకతత్వాన్ని, సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా వెల్లడైన ఫలితాల ఆధారంగానే ఈ ఆమోదం లభించింది. బ్రెజిల్, థాయిలాండ్, శ్రీలంక సహా ఎనిమిదికి పైగా దేశాలకు చెందిన వారిపై వైద్య అధ్యయనాలు నిర్వహించారు. వీటిలో భాగంగానే 4 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న భారతీయుల్లో  నిర్వహించిన కీలకమైన మూడో దశ‌ భద్రత, రోగ నిరోధకతత్వ అధ్యయనాన్ని కూడా చేపట్టారు.

ఈ వ్యాక్సిన్‌కు యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్, స్విట్జర్లాండ్, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ సహా 42 దేశాల్లో నియంత్రణ సంస్థల ఆమోదం లభించింది. అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి ప్రీక్వాలిఫికేషన్ పొందింది. ప్రపంచవ్యాప్తంగా 24 మిలియన్ డోసులకు పైగా వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. వ్యాక్సిన్ ఉపయోగిస్తున్న దేశాల నుంచి వచ్చిన మార్కెటింగ్ అనంతర పర్యవేక్షణ సమాచారం ప్రకారం... ఎలాంటి ఆరోగ్యపరమైన ఆందోళనలు తలెత్తలేదు. అలాగే సానుకూలమైన ప్రభావాలను ప్రదర్శించింది. 

ప్రజారోగ్య ప్రతిస్పందనలో భారత్ సాధించిన ముఖ్యమైన విజయాన్ని తొలి డెంగ్యూ టీకాకు లభించిన ఈ ఆమోదం సూచిస్తుంది. అలాగే జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న వ్యాధి వాహకాల నియంత్రణ, పర్యవేక్షణ, ముందస్తు రోగనిర్ధారణ, కేసుల నిర్వహణ చర్యలకు తోడ్పాటునిస్తుందని భావిస్తున్నారు.

పటిష్టమైన, శాస్త్రీయాధారిత నియంత్రణ విధానం ద్వారా సురక్షితమైన, ప్రభావవంతమైన, నాణ్యమైన టీకాలు, ఔషధాలను సకాలంలో అందించడానికి  కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉంది.

 

***


(रिलीज़ आईडी: 2287135) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Tamil , Malayalam