ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సైబర్ భద్రత.. కీలక సాంకేతికతలు.. సరఫరా వ్యవస్థలపై ఆస్ట్రేలియా-భారత్ భాగస్వామ్యం

प्रविष्टि तिथि: 09 JUL 2026 11:04AM by PIB Hyderabad

   భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సైబర్ రంగంతోపాటు కీలక సాంకేతిక పరిజ్ఞానాలలో ఒక శాశ్వత భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, సైబర్-తదాధారిత కీలక సాంకేతిక సహకారం చట్రంపై 2020 నాటి ఒప్పందం సహా రెండు దశాబ్దాల సంయుక్త పరిశోధన, కార్యాచరణ సమన్వయం, విధానపరమైన భాగస్వామ్యాల ప్రాతిపదికన తాజా ఒప్పందం ఖరారైంది.

దేశ ఆర్థిక వృద్ధికి చోదక శక్తులైన సరఫరా వ్యవస్థలు, కీలక సాంకేతికతలు, సైబర్ భద్రత రంగాలు జాతీయ భద్రతలోనూ కీలకమని రెండు దేశాలూ గుర్తించాయి. దీంతోపాటు విలువలు, ప్రపంచ ప్రమాణాల రూపకల్పనకు అవి తోడ్పడతాయని గ్రహించాయి. ఈ నేపథ్యంలో స్నేహ సంబంధాల పునాది ఆధారంగా ‘‘సైబర్, కీలక సాంకేతికతలు-సరఫరా వ్యవస్థల భాగస్వామ్యం” (పీఏసీటీఎస్‌-ప్యాక్ట్స్‌) కింద 2020 నాటి చట్రం స్థానంలో ద్వైపాక్షిక ప్రయోజనాలను తాజా ఒప్పందం ద్వారా మరింత ఉన్నతీకరించాలని సంకల్పించాయి.

జాతీయ-ప్రాంతీయ భద్రతలో ఉమ్మడి ప్రయోజనాలకు మద్దతు, భాగస్వాములకు మరిన్ని డిజిటల్ సదుపాయాల సౌలభ్యం, కీలక సరఫరా వ్యవస్థలకు పునరుత్థాన సామర్థ్యం కల్పన, ప్రపంచ సైబర్ భద్రత పునరుత్థాన సామర్థ్యం పెంపు తదితరాలకు ‘ప్యాక్ట్స్‌’ మద్దతిస్తుంది. ఈ భాగస్వామ్యం కింద ఉభయ దేశాల కృషిలోని ప్రతి దశలోనూ భద్రత, రక్షణ, పునరుత్థాన సామర్థ్యం, సార్వజనీనత, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలకు సముచిత స్థానం ఉంటుంది. తద్వారా బాధ్యతాయుత సాంకేతిక అగ్రగాములుగా కొనసాగడంపై రెండు దేశాల నిబద్ధతకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఒక సమగ్ర ఏకీకృత వ్యూహాత్మక దృష్టి కింద ఈ కృషి క్రమబద్ధీకరణ ద్వారా 5 సహకార మూలస్తంభాల ద్వారా లక్షిత కార్యకలాపాల నిర్వహణకు వీలు కలుగుతుంది.

సహకార మూలస్తంభాలు

పరస్పరం ముడిపడిన ప్రతి మూలస్తంభం కింద ప్రైవేట్ రంగం, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థల మధ్య సహకారానికి మద్దతుపై అందుబాటులోగల అవకాశాలను, నిర్దిష్ట ప్రాజెక్టులను భారత్‌-ఆస్ట్రేలియా గుర్తిస్తాయి. దీంతో ప్రభుత్వాల మధ్య సహకార విస్తృతి సహా నవ్య సాంకేతికతలలో రెండువైపులా పెట్టుబడులు పెరుగుతాయి.  మరోవైపు మేధా సంపత్తిని ఆర్థిక వృద్ధికి దోహదం చేసే ఉత్పత్తులుగా మార్చడంలో  మద్దతిస్తుంది.

మూలస్తంభం 1: సరఫరా వ్యవస్థల పటిష్టీకరణ.. వైవిధ్యీకరణ

రెండు దేశాల్లో విస్తరిస్తున్న సాంకేతిక పరిశ్రమలకు చేయూతనిస్తూ సురక్షిత, పటిష్ట, విశ్వసనీయ సరఫరా వ్యవస్థల కోసం ఆస్ట్రేలియా-భారత్‌ సంయుక్తంగా కృషి చేస్తాయి. భద్రత, రక్షణ ప్రక్రియల రూపకల్పనకు ప్రోత్సాహం, రక్షణాత్మక నియంత్రణ చట్రాల ఏర్పాటు, నియమాధారిత ద్వైపాక్షిక సాంకేతిక వాణిజ్యం-సరఫరా శ్రేణుల మరింత బలోపేతం వంటివి కూడా ఇందులో భాగంగా ఉంటాయి.

  • విశ్వసనీయ విక్రయ చట్రాలపై సహకారం దిశగా ద్వైపాక్షిక యంత్రాంగం ఏర్పాటు
  • ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సురక్షిత, విశ్వసనీయ, పటిష్ట సముద్రగర్భ కేబుల్ సంధానానికి మద్దతుగా కేబుల్ అనుసంధానం-పటిష్టత కోసం ఏర్పాటు చేసిన క్వాడ్ భాగస్వామ్యం సహా, భారత్‌-ఆస్ట్రేలియా సహకారాన్ని ప్రోత్సహించడం. ఉత్తమ పద్ధతుల ఆదానప్రదానం, సమాచార మార్పిడి, సమన్వయం మెరుగుదల, ముప్పులు, విధ్వంసం సహా సముద్రగర్భ కేబుల్ మౌలిక సదుపాయాలకు ఎదురయ్యే ప్రమాదాల పరిష్కారం దిశగా సహకార బలోపేతం.
  • సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలకు రక్షణపై రెండు దేశాల్లోని పరిశోధన సంస్థల మధ్య సహకారాభివృద్ధి సహా వారి కృషికి బలం చేకూర్చేందుకు సహ-అభివృద్ధి, పరిశోధనలకు సదుపాయాల కల్పన.
  • సమన్వయంతో పెట్టుబడులు-నియంత్రణల అనుసంధానం, రీసైక్లింగ్, పునరుద్ధరణ సహా సురక్షిత కీలక ఖనిజాల సరఫరా వ్యవస్థలపై అభివృద్ధిపై సహకారం.
  • ఆస్ట్రేలియా-భారత్‌ వ్యాపారాల మధ్య వాణిజ్య సహకారం, వ్యాపార వైవిధ్యీకరణకు ప్రోత్సాహం, అలాగే ప్రస్తుత కార్యక్రమాలను అనుసంధానించడం సహా సంబంధిత ఉన్నత సంస్థల మధ్య సంబంధాల బలోపేతం.

మూలస్తంభం 2: కీలక సాంకేతిక పరిజ్ఞానాలు

ప్రాధాన్యంగల కీలక సాంకేతికతల భద్రత, పునరుత్థాన సామర్థ్యం, సమగ్రతల బలోపేతం సహా కృత్రిమ మేధ (ఏఐ), అంతరిక్ష సాంకేతికతలు, టెలికమ్యూనికేషన్లు, బయోటెక్నాలజీ, అత్యాధునిక మూలకాలు వంటి కీలక రంగాల్లో నవ్య సాంకేతిక ఆవిష్కరణ దిశగా రెండు దేశాలూ సంయుక్తంగ కృషి చేస్తాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, ప్రాంతీయ స్థిరత్వానికి తోడ్పాటుగా అవసరమైన డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల పరిరక్షణ, ఆవిష్కరణలు-పరిశోధనల వేగం పెంపు, పరస్పర సంధానంతో ఏకాభిప్రాయ సహిత అంతర్జాతీయ ప్రమాణాల రూపకల్పనకు కృషి చేస్తాయి.

  • విశ్వసనీయ, సురక్షిత కృత్రిమ మేధ దిశగా అంతర్జాతీయ ప్రమాణాల మెరుగుదల కోసం అంతర్జాతీయ కృషిని సద్వినియోగం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇందుకోసం ప్రజాస్వామ్య విలువల ప్రాతిపదికన ఏకాభిప్రాయంతో వివిధ రంగాల భాగస్వామ్య చట్రాలను రూపొందించుకోవాలని సంకల్పించాయి. ఈ ప్రక్రియలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా విద్యాసంస్థలు, ప్రైవేట్ రంగాల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించాలని తీర్మానించాయి. ఈ కార్యక్రమాల ద్వారా ఉభయ దేశాల పౌరులకు వాస్తవిక ప్రయోజనాలను... అంటే- ఏఐ పరిశోధకులు, నిపుణులు, విధాన రూపకర్తలు, ఉద్యోగులకు అవసరమైన విజ్ఞానాన్ని, నైపుణ్యాలను సమకూరుతాయి. ఏఐ సాంకేతికతల సురక్షిత రూపకల్పన, వినియోగాల కోసం ఉమ్మడి సూత్రాలు ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడంలో ఈ విజ్ఞానం దోహదం చేస్తుంది. మరోవైపు కంప్యూటింగ్ సామర్థ్యం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎం), ఏఐ-తత్సంబంధిత మౌలిక సదుపాయాల సురక్షిత వినియోగ విధానాల ఆదానప్రదానానికి ఈ కృషి తోడ్పడుతుంది.
  • ఆధునిక పదార్థాలు, టెలికమ్యూనికేషన్స్, బయోటెక్నాలజీ వంటి ప్రాధాన్య రంగాలపై భారత్-ఆస్ట్రేలియా నిశితంగా దృష్టి సారిస్తాయి. ఈ మేరకు పరిశోధన, ఆవిష్కరణలు, పెట్టుబడి భాగస్వామ్యాలను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించాయి. ఈ లక్ష్య సాధన దిశగా ప్రస్తుతం అమలయ్యే కార్యక్రమాల్లో తగిన మార్పులు చేసుకుంటాయి. తద్వారా పరస్పరం వాస్తవిక ప్రయోజనాలు లభించే పరిశోధన ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తాయి. ఈ కృషితో ద్వైపాక్షకంగానే కాకుండా విస్తృత ఇండో-పసిఫిక్ ప్రాంతానికీ లబ్ధి చేకూరుతుంది.
  • అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం పరిణతి చెందుతుండటాన్ని భారత్, ఆస్ట్రేలియాలలో వేగంగా పురోగమిస్తున్న అంతరిక్ష రంగ కార్యకలాపాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ దేశాల్లో ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ప్రాజెక్టులు సహా సంయుక్త వాణిజ్య కార్యక్రమాలకు ప్రోత్సాహం దిశగా పరస్పర సహకార విస్తృతికి నిర్ణయించాయి.

మూలస్తంభం 3: సైబర్‌ భద్రత

సైబర్, డిజిటల్ రంగాల రక్షణ-భద్రతల బలోపేతానికి భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా కృషి చేస్తాయి. సైబర్ నేరాల నియంత్రణ, హానికర సైబర్ కార్యకలాపాల నిరోధం ఇందులో భాగంగా ఉంటాయి. ఈ క్రమంలో సైబర్, సాంకేతిక భద్రత ప్రమాణాల సంబంధిత విజ్ఞానాన్ని, అనుభవాలను పంచుకోవడం సహా కీలక జాతీయ మౌలిక సదుపాయాల రక్షణకు ప్రాధాన్యమిస్తాయి.

  • సామర్థ్య వికాస చర్యలు, ప్రాంతీయ-బహుపాక్షిక సహకార అవకాశాల క్రమబద్ధీకరణ కోసం సైబర్, ఐసీటీ రంగాలలో సమగ్ర ద్వైపాక్షిక యంత్రాంగం ఏర్పాటవుతుంది. వివిధ కార్యాచరణ మార్గాల మధ్య విధానపరమైన స్పష్టతకు భరోసా ఇస్తూ ఒకే రకమైన కార్యకలాపాలు పునరావృతం కాకుండా ఈ యంత్రాంగం పర్యవేక్షిస్తుంది.
  • ఐక్యరాజ్యసమితి నిర్దేశిత సైబర్ ప్రక్రియలలో సహకార బలోపేతానికి రెండు దేశాలూ చర్యలు చేపట్టనున్నాయి. అలాగే, సమాచార నిర్వహణ సదుపాయాలు సహా టెలి కమ్యూనికేషన్స్ రంగంలో సైబర్ భద్రతపై అంతర్జాతీయ సహకారంపై చర్చలను మరింత మెరుగుపరచాలని నిర్ణయించాయి.
  • సైబర్ భద్రత, సాంకేతిక రంగాలలో భారత్-ఆస్ట్రేలియా వాణిజ్య సంస్థల మధ్య పెట్టుబడుల పెంపు, వ్యాపార విస్తరణకు మరిన్ని అవకాశాలను సృష్టిస్తాయి.
  • సైబర్ భద్రత రంగంలో రెండు దేశాల ప్రభుత్వ సంస్థలు, ఇతర భాగస్వాములను ఒకే వేదికపైకి తేవడం కోసం సంయుక్త చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
  • కీలక నైపుణ్యాల వృద్ధి, ఆదానప్రదానం కోసం ఒక సైబర్ సాంకేతిక నైపుణ్య ఇంక్యుబేటర్ కూడలిని ఏర్పాటు చేస్తాయి.

మూలస్తంభం 4: డిజిటల్‌ పునరుత్థానం

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో డిజిటల్‌ రూపం సంతరించుకుంటున్న ఆర్థిక వ్యవస్థలకు మద్దతుగా విశ్వసనీయ, విస్తరణీయ సాంకేతిక పరిష్కారాలు చూపడంలో భారత్-ఆస్ట్రేలియా సంయుక్తంగా కృషి చేస్తాయి. అలాగే, ప్రాంతీయ సామర్థ్యాలను బలోపేతం చేయగల నిర్దిష్ట ప్రాజెక్టులను గుర్తించి, ప్రగతి సంబంధిత సమస్యల పరిష్కారానికి కలసి ముందడుగు వేస్తాయి.

  • ఇండో-పసిఫిక్ దేశాలతో కొత్త భాగస్వామ్య ఆదానప్రదానానికి భారత సార్వజనీన డిజిటల్‌ మౌలిక సదుపాయాల (డీపీఐ) సూత్రాధారితంగా రెండు దేశాలూ మద్దతిస్తాయి.
  • కాలుష్య రహిత పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాలు, అనుసంధానం, డిజిటల్ రూపాంతరీకరణ, ఆరోగ్యం, సామాజిక రక్షణ, నైపుణ్యాభివృద్ధి, విద్య, పరిశోధన తదితర రంగాల్లో చౌక ‘డీపీఐ’ పరిష్కారాలను ఇండో-పసిఫిక్ ప్రాంతానికి విస్తరింపజేస్తాయి.
  • ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ‘డీపీఐ’ ముమ్మర వినియోగం ద్వారా డిజిటల్ స్థిరత్వంలో ద్వైపాక్షిక నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తాయి. స్థానిక అనుకూల డిజిటల్ పర్యావరణ వ్యవస్థల రూపకల్పన కోసం సంయుక్త ప్రాజెక్టులు సహా వివిధ సామర్థ్య వికాస చర్యల ద్వారా ప్రాథమిక డిజిటల్ పరిష్కారాలపై దృష్టి సారించే ఇండో-పసిఫిక్ ప్రయోగాత్మక ప్రాజెక్టులకూ వీలు కల్పిస్తాయి.

మూలస్తంభం 5: రక్షణరంగ పరిశోధనలో సహకారం

రక్షణ రంగంలో వివిధ సవాళ్లు-సామర్థ్యాలపై ఉమ్మడి అవగాహన పెంపు దిశగా రక్షణ పరిశోధన భాగస్వామ్యాలను రెండు దేశాలూ సద్వినియోగం చేసుకుంటాయి. మునుపటి ఉమ్మడి పరిశోధనల ఆధారంగా పరస్పర ప్రయోజనానుగుణ భవిష్యత్తు ప్రాజెక్టులను రూపొందిస్తాయి. రక్షణ సహకారంపై అవగాహన ఒప్పందం (MoU)లోని ‘డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ సహకార నిబంధనల మేరకు రక్షణ శాస్త్రవిజ్ఞాన సంస్థల మధ్య ఆదానప్రదానాన్ని ముమ్మరం చేస్తాయి.

  • రక్షణ మంత్రుల స్థాయి చర్చలు, రక్షణరంగ విధాన చర్చలు, పరిశ్రమలు-పరిశోధన, పదార్థాలపై ఏర్పాటైన సంయుక్త కార్యాచరణ బృందం తదితరాల ద్వారా రక్షణ శాస్త్ర-సాంకేతిక ప్రాథమ్యాలపై చర్చల వేగాన్ని పెంచుతాయి.
  • ఆస్ట్రేలియాలోని ‘డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్’, భారత ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్’ (డీఆర్‌డీఓ)ల మధ్య సంస్థాగత సంబంధాలను రెండు దేశాలూ పటిష్టం చేస్తాయి. పరిశోధన సహకారాన్ని వేగిరపరచే దిశగా కార్యాచరణ బృందం స్థాయిలో ఆదానప్రదానాన్ని క్రమబద్ధీకరిస్తాయి.
  • రెండు దేశాల్లోని రక్షణ ఆవిష్కరణలు, అంకుర వ్యవస్థల మధ్య, వాణిజ్య సంస్థల మధ్య సన్నిహిత సంబంధాలకు సౌలభ్యం కల్పిస్తాయి.

·        రక్షణ అనువర్తనాల కోసం (సముద్ర నిఘా, ఆధునిక పదార్థాలు సహా) వినూత్న సముద్ర శాస్త్ర విజ్ఞాన-సాంకేతిక సామర్థ్యాలపై సహకారాత్మక కృషిని కేంద్రీకరిస్తాయి.

స్వరూపం... పరిపాలన: ద్వైపాక్షిక పర్యవేక్షణ

ఈ భాగస్వామ్యానికి ఉన్నత స్థాయిలో- ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కేబినెట్ డిప్యూటీ సెక్రటరీ (ఇంటర్నేషనల్ అండ్ సెక్యూరిటీ గ్రూప్), భారత డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏ) అధ్యక్షత వహిస్తారు. సైబర్, కీలక సాంకేతిక రంగాల్లో పరస్పర ప్రయోజన సహకారానికిగల ప్రాథమ్యాలను వారు గుర్తిస్తారు.

ఉన్నతాధికారుల (వార్షిక) సమావేశం: ప్రతి మూలస్తంభం పరిధిలోని ఉన్నతాధికారులు తమతమ బాధ్యతలకు సంబంధించి సమన్వయం చేసుకుంటారు. తద్వారా అధ్యక్ష పీఠానికి నివేదికలు సమర్పిస్తూ ప్రాథమ్యాలను సమీక్షిస్తారు. ఎప్పటికప్పుడు ప్రగతిని అంచనా వేస్తూ సైబర్, కీలక సాంకేతిక రంగాలలో కొత్త సమస్యలు-ముప్పులను విశ్లేషించి, ప్రతి మూలస్తంభం కింద నిర్దిష్ట ప్రాజెక్టులను గుర్తిస్తారు.
 

 

మూలస్తంభం

భారత్‌ ప్రతినిధి

ఆస్ట్రేలియా ప్రతినిధి

1

సరఫరా వ్యవస్థ పునరుత్థానం

జాతీయ భద్రతా మండలి సచివాలయం (ఎన్‌ఎస్‌సీఎస్‌)

సైబర్ వ్యవహారాలు, కీలక సాంకేతికత విభాగ దౌత్య కార్యాలయ సమన్వయం

2

కీలక సాంకేతికతలు

జాతీయ భద్రతా మండలి సచివాలయం (ఎన్‌ఎస్‌సీఎస్‌)

సైబర్ వ్యవహారాలు, కీలక సాంకేతికత విభాగ దౌత్య కార్యాలయం

3

సైబర్‌ భద్రత

సైబర్ దౌత్య విభాగం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ

సైబర్ వ్యవహారాలు, కీలక సాంకేతికత విభాగ దౌత్య కార్యాలయం

4

డిజిటల్‌ పునరుత్థానం

ఓషియానియా విభాగం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ

సైబర్ వ్యవహారాలు, కీలక సాంకేతికత విభాగ దౌత్య కార్యాలయం

5

రక్షణ పరిశోధన-సహకారం

రక్షణ మంత్రిత్వశాఖ

రక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ

 

***


(रिलीज़ आईडी: 2282815) आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam