డాక్యుమెంటరీ, లఘు చిత్రాలు, యానిమేషన్ చిత్రాల వేడుకల మధ్య ఘనంగా ముగిసిన 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం
ఉత్తమ అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రంగా నిలిచి అత్యున్నత 'గోల్డెన్ కాంచ్' పురస్కారాన్ని కైవసం చేసుకున్న పోలాండ్ డాక్యుమెంటరీ చిత్రం 'సిల్వర్'
అంతర్జాతీయ పోటీ విభాగంలో 'సిల్వర్ కాంచ్' (వెండి శంఖం) అవార్డులను అందుకున్న 'అండర్ ది స్నో' (లఘు చిత్రం), 'మాయాస్ సాంగ్' (యానిమేషన్) చిత్రాలు
జాతీయ పోటీ విభాగంలో 'సిల్వర్ కాంచ్' పురస్కారాలను పొందిన 'ఆర్మ్‌స్ట్రాంగ్ ఫ్రమ్ అంగాలమ్మన్ టెంపుల్ స్ట్రీట్' (యానిమేషన్), 'స్మాల్ క్లౌడ్స్' (లఘు చిత్రం), 'వాయి' (డాక్యుమెంటరీ) చిత్రాలు
సృజనాత్మక ప్రతిభను చాటే ఒక అంతర్జాతీయ ఉద్యమంగా మారిన ఎంఐఎఫ్ఎఫ్.. 'క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్' అనే నినాదం భారతదేశపు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తోంది: మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, చలనచిత్ర నిర్మాతల మేధో సంపత్తి హక్కులను కాపాడాలని పిలుపునిచ్చిన మహారాష్ట్ర గవర్నర్
సినిమా రంగంపై ఉన్న మక్కువ, కథా కథనం, కళాత్మక అన్వేషణలు, సృజనాత్మకతలతో ఏకమైన చలనచిత్ర నిర్మాతలు, సినీ ప్రేమికులు, సినీ పరిశ్రమ నిపుణులు, యువ సృజనాత్మక మేధస్సుల ఉత్సాహం మధ్య 19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్ 2026) నేడు ఘనంగా ముగిసింది.
ఈ ఉత్సవ ముగింపు వేడుకల్లో డాక్యుమెంటరీ, యానిమేషన్, లఘు చిత్రాల నిర్మాణంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలకు మొత్తం 17 పురస్కారాలను ప్రదానం చేశారు.
ఉత్తమ అంతర్జాతీయ డాక్యుమెంటరీ చిత్రంగా నిలిచిన పోలాండ్‌కు చెందిన డాక్యుమెంటరీ సినిమా 'సిల్వర్' అత్యున్నత 'గోల్డెన్ కాంచ్' (బంగారు శంఖం) పురస్కారంతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతిని (దర్శకుడు, నిర్మాతలకు సగం సగం అందుతుంది) గెలుచుకుంది. చిత్ర దర్శకురాలు శ్రీమతి నటాలియా కోనియార్జ్, నిర్మాత శ్రీ మాసీజ్ కుబికీ తరఫున పోలిష్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్, మినిస్టర్ ప్లెనిపోటెన్షియరీ శ్రీమతి మాల్గోర్జాటా వెజ్సిస్-గోలెంబియాక్ ఈ అవార్డును అందుకున్నారు.
ఉత్తమ అంతర్జాతీయ లఘు చిత్రంగా నిలిచిన ఇరానియన్ సినిమా 'అండర్ ది స్నో'.. 'సిల్వర్ కాంచ్' (వెండి శంఖం) పురస్కారాన్ని, రూ. 5 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. చిత్ర దర్శకురాలు శ్రీమతి నఫీసే జారే, సహ-నిర్మాత శ్రీమతి కొట్టుకతీర ప్రకాష్ తరఫున ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన శ్రీ దీపాంకర్ ప్రకాష్ ఈ అవార్డును స్వీకరించారు.
ఉత్తమ అంతర్జాతీయ యానిమేషన్ చిత్రంగా నిలిచిన జర్మన్ యానిమేషన్ సినిమా 'మాయాస్ సాంగ్'.. 'సిల్వర్ కాంచ్' పురస్కారాన్ని, రూ. 5 లక్షల నగదు బహుమతిని (ఈ మొత్తాన్ని దర్శకుడు, నిర్మాతకు సమానంగా అందుకుంటారు) కైవసం చేసుకుంది. చిత్ర దర్శకులు, నిర్మాతలు అయిన శ్రీమతి ఫ్రాన్సిస్కా షోనెన్బెర్గర్, శ్రీ జయకృష్ణన్ సుబ్రమణియన్ తరఫున లీడ్ యానిమేటర్, స్టూడియో ప్రతినిధి శ్రీమతి సానికా కులకర్ణి ఈ అవార్డును అందుకున్నారు.
జాతీయ పోటీ విభాగంలో ఉత్తమ యానిమేషన్ చిత్రంగా నిలిచిన తమిళ యానిమేషన్ సినిమా 'ఆర్మ్‌స్ట్రాంగ్ ఫ్రమ్ అంగాలమ్మన్ టెంపుల్ స్ట్రీట్'.. 'సిల్వర్ కాంచ్' అవార్డుతో పాటు రూ. 3 లక్షల నగదు బహుమతిని దక్కించుకుంది. ఈ చిత్ర దర్శకుడు, నిర్మాత అయిన శ్రీ భువనేష్ ఎం. కుమార్ స్వయంగా ఈ సిల్వర్ కాంచ్ అవార్డును, నగదు బహుమతిని స్వీకరించారు.
భారతీయ ఉత్తమ లఘు చిత్ర విభాగంలో 'స్మాల్ క్లౌడ్స్' సినిమా 'సిల్వర్ కాంచ్' (వెండి శంఖం) పురస్కారాన్ని, రూ. 3 లక్షల నగదు బహుమతిని సొంతం చేసుకుంది. భారత చలనచిత్ర- టెలివిజన్ సంస్థ (ఎఫ్టీఐఐ) నిర్మించిన ఈ చిత్రం తరఫున ఆ సంస్థ వైస్ ఛాన్సలర్ శ్రీ ధీరజ్ సింగ్, చిత్ర దర్శకుడు శ్రీ శుభమ్ సుమిత్ కలిసి ఈ అవార్డును అందుకున్నారు.
భారతీయ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్ర విభాగంలో 'వాయి' డాక్యుమెంటరీ 'సిల్వర్ కాంచ్' పురస్కారంతో పాటు రూ. 5 లక్షల నగదు బహుమతిని (ఈ మొత్తాన్ని దర్శకుడు, నిర్మాతకు సమానంగా అందుకుంటారు) కైవసం చేసుకుంది. చిత్ర దర్శకుడు శ్రీ సాయినాథ్ ఎస్. ఉస్కైకర్, చిత్ర నిర్మాత శ్రీ భరత్‌బాలా గణపతి తరఫున శ్రీ జవహర్ శర్మ కలిసి ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
అంతర్జాతీయ పోటీ విభాగంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ పురస్కారం... 'టర్టిల్ వాకర్' అనే భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అద్భుతమైన విజువల్స్ అందించిన శ్రీ క్రిష్ మఖిజాను వరించింది.
అంతర్జాతీయ పోటీ విభాగంలో ఉత్తమ ఎడిటింగ్ పురస్కారం.. రష్యాకు చెందిన 'అబౌట్ ది కౌ' అనే లఘు చిత్రానికి గాను ఎడిటర్ ద్వయం శ్రీమతి ఎవ్‌గెనీ స్మిర్నోవ్, శ్రీ మక్సిమ్ స్మిర్నోవ్‌లను వరించింది. ఆ చిత్ర దర్శకుడు శ్రీ ఆంటోన్ సిముఖిన్ వారి తరఫున అవార్డును అందుకున్నారు.
అంతర్జాతీయ పోటీ విభాగంలో ఉత్తమ సౌండ్ డిజైనర్ పురస్కారాన్ని... 'దేవా ఆజ్ పన్ వాయ్' చిత్రానికి అద్భుతమైన సౌండ్ అందించిన శ్రీ అభయ్ రుమ్డే (పర్పుల్ హేజ్ స్టూడియో) కైవసం చేసుకున్నారు.
‘వికసిత్ భారత్, వందేమాతరానికి 150 ఏళ్లు, భారత్@2026’ అనే ప్రత్యేక ఇతివృత్తంపై రూపొందించిన చిత్రాల విభాగంలో 'ది లాస్ట్ షెల్టర్' ఉత్తమ లఘు చిత్రం అవార్డును గెలుచుకుంది. ఈ పురస్కారాన్ని శ్రీ భరత్ అరోరా, శ్రీ రాజేష్ భాటియా అందుకున్నారు.
అత్యంత వినూత్న లేదా ప్రయోగాత్మక చిత్రానికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'ప్రమోద్ పతి స్పెషల్ జ్యూరీ అవార్డు'.. తైవాన్ దేశానికి చెందిన 'ది హోర్డర్స్' చిత్రానికి దక్కింది. ఆ చిత్ర దర్శకురాలు శ్రీమతి చువాన్-యింగ్ లియావో స్వయంగా ఈ అవార్డును స్వీకరించారు.
జాతీయ పోటీ విభాగంలో ఉత్తమ సౌండ్ డిజైన్ పురస్కారం.. 'కోవర్టీ' చిత్రానికి గాను శ్రీ బిగ్యన దహాల్‌ను వరించింది.
జాతీయ పోటీ విభాగంలో ఉత్తమ ఎడిటింగ్ పురస్కారాన్ని 'మేడే' సినిమాకు గాను శ్రీ అఖిల్ కృష్ణన్ సొంతం చేసుకున్నారు. ఎడిటర్ శ్రీ అఖిల్ కృష్ణన్ తరఫున ఆ చిత్ర దర్శకుడు శ్రీ శరత్ అంబట్ ఈ అవార్డును స్వీకరించారు.
జాతీయ పోటీ విభాగంలో ఉత్తమ సినిమాటోగ్రాఫర్ పురస్కారాన్ని 'స్మాల్ క్లౌడ్స్' చిత్రానికి అద్భుతమైన దృశ్యరూపం అందించిన శ్రీ రణధీర్ బిస్వాస్ కైవసం చేసుకున్నారు.
అంతర్జాతీయ చలనచిత్ర విమర్శకుల సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్) నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక 'ఎఫ్ఐపీఆర్ఈఎస్‌సీఐ ఇంటర్నేషనల్ క్రిటిక్స్ ప్రైజ్'.. 'ది హగ్ ఆఫ్ ఎంప్టీనెస్' చిత్రానికి గాను శ్రీ ప్రదీప్ కెంచనూరుకు దక్కింది.
ఉత్తమ విద్యార్థి చిత్రానికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక 'ఐడీపీఏ అవార్డు'.. 'ది ఓల్డ్ బుల్ నోస్, ఆర్ వన్స్ న్యూ' (సినిమాకు గాను శ్రీ మిలన్ కుమార్‌ను వరించింది.
ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలిగా ఇచ్చే 'దాదాసాహెబ్ ఫాల్కే చిత్రనగరి అవార్డు'... 'రాజా' చిత్రానికి గాను శ్రీమతి పూజ తోలాని దక్కించుకున్నారు.
ఈ 19వ ఎంఐఎఫ్ఎఫ్ ముగింపు వేడుకలకు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ధీరేంద్ర ఓజా, సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు శ్రీ అశుతోష్ గోవారికర్, ఫెస్టివల్ డైరెక్టర్- ఎన్‌ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దుమ్, మహారాష్ట్ర ప్రభుత్వ మరాఠీ భాషా- సాంస్కృతిక వ్యవహారాల కార్యదర్శి శ్రీ కిరణ్ కులకర్ణి, మహారాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రటరీ శ్రీ ఎస్. రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎంఐఎఫ్ఎఫ్ 2026 ముగింపు వేడుకలను ఉద్దేశించి మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. డాక్యుమెంటరీ, లఘు చిత్రాలు, యానిమేషన్ సినిమాలకు అంకితమైన అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వేదికలలో ఒకటిగా ఈ చలనచిత్రోత్సవం సాధించిన అద్భుతమైన ప్రయాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మూడు దశాబ్దాలుగా ఎంఐఎఫ్ఎఫ్ సృజనాత్మక మేధస్సులకు, కథకులకు, దార్శనికులకు ఒక శక్తిమంతమైన వేదికగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇది ఒక జాతీయ స్థాయి కార్యక్రమం నుంచి కళాత్మక విశిష్టతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని, అర్థవంతమైన కథా కథనాన్ని చాటిచెప్పే ఒక అంతర్జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందిందని ఆయన కొనియాడారు. ముఖ్యంగా గత ఐదు ఎడిషన్లలో కనిపించిన అసాధారణ వృద్ధి.. అంతర్జాతీయంగా ఎంఐఎఫ్ఎఫ్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను, ఉన్నత స్థానాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు.
2025 మే 1న ముంబయిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన మొట్టమొదటి 'ప్రపంచ దృశ్య శ్రవణ వినోద సదస్సు' (వేవ్స్) గురించి కూడా గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మీడియా, వినోదం, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల కోసం ఒక అంతర్జాతీయ వేదికగా రూపుదిద్దుకున్న ఈ సదస్సు.. ‘కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్’ అనే ఇతివృత్తంతో 90కి పైగా దేశాల నుంచి కంటెంట్ క్రియేటర్లు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమల అధినేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. 'క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్' అనే దార్శనికతను ముందుకు తీసుకెళ్తూనే సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ కథా కథనంలో భారత్‌ను ఒక ప్రపంచ కేంద్రంగా మార్చాలనే దేశ సంకల్పానికి 'వేవ్స్' మరింత బలాన్ని చేకూర్చిందని ఆయన చెప్పారు.
సృజనాత్మక లేదా 'ఆరెంజ్ ఎకానమీ' ప్రాముఖ్యతను ప్రధానంగా చెప్పిన గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ.. చలనచిత్ర పరిశ్రమ దీనికి అత్యంత బలమైన ఆధారాల్లో ఒకటిగా నిలుస్తోందని అభివర్ణించారు. చలనచిత్రాలు కేవలం ఉపాధిని కల్పించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే కాకుండా... దేశాలు తమ విలువలు, సంప్రదాయాలు, ఆకాంక్షలను ప్రపంచ ప్రేక్షకులకు చాటిచెప్పేందుకు ఒక శక్తిమంతమైన 'సాఫ్ట్ పవర్' గా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వాస్తవాలను కళ్లకు కట్టడం, చరిత్రను భద్రపరచడం, అపోహలను తొలగించడం, సామాజిక మార్పునకు స్ఫూర్తినిచ్చే సామర్థ్యం ఉన్నందుకు గాను ఆయన డాక్యుమెంటరీ చిత్రాలను ప్రత్యేకంగా అభినందించారు.
లఘు చిత్రాలు, యానిమేషన్‌కు ఉన్న ప్రాముఖ్యతను కూడా మహారాష్ట్ర గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొత్త ప్రయోగాలకు, వర్ధమాన ప్రతిభావంతులకు లఘు చిత్రాలు ఒక వేదికను కల్పిస్తుండగా... యానిమేషన్ - విద్య, సమాచారం, సంస్కృతి పరిరక్షణ, సృజనాత్మక వ్యక్తీకరణకు ఒక శక్తిమంతమైన మాధ్యమంగా రూపాంతరం చెందిందని ఆయన అన్నారు. సాంకేతికత, ఊహాశక్తి కలయిక ద్వారా క్లిష్టమైన ఆలోచనలను సైతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా, సులభంగా అర్థమయ్యే రీతిలో విశ్వవ్యాప్తంగా చేరవేయడానికి యానిమేషన్ ఎంతో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమానికి ముంబయి నగరమే ఎప్పటికీ ఆతిథ్యమివ్వడం గర్వకారణమైన అంశమని గవర్నర్ అన్నారు. సినిమా, కళలు, సృజనాత్మకతకు మహారాష్ట్ర ఒక అగ్రగామి కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని ఆయన పునరుద్ఘాటించారు. సమాజంలోని యువత ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల వారు, మహిళా చలనచిత్ర నిర్మాతలు తమదైన ప్రత్యేకమైన కథలను ప్రపంచంతో పంచుకునేలా వారికి మరింత ప్రోత్సాహం అందించాలని ఆయన పిలుపునిచ్చారు. సాంకేతికత ప్రగతికి ఒక గొప్ప సాధనమన్న ఆయన.. కృత్రిమ మేధను అత్యంత బాధ్యతాయుతంగా ఉపయోగించాలని కోరారు. చలనచిత్ర నిర్మాతల 'మేధో సంపత్తి హక్కులను' కాపాడాల్సిన ఆవశ్యకతను ఆయన ప్రముఖంగా చెప్పారు. అవార్డు విజేతలతో పాటు ఉత్సవంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేసిన ఆయన.. అర్థవంతమైన కథా కథనం అనేది ఎల్లప్పుడూ పరస్పర చర్చలకు, సానుభూతికి, సమాజంలో సానుకూల మార్పుకు ఒక శక్తిమంతమైన సాధనంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ప్రభాత్ తన స్వాగతోపన్యాసంలో.. ఈ వారంలో వివిధ ప్రదర్శనా వేదికల వద్ద ప్రేక్షకుల నుంచి లభించిన అద్భుతమైన స్పందన.. డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు, యానిమేషన్ వంటి తక్కువ నిడివి గల చిత్రాలకు ఉన్న శాశ్వతమైన ఆదరణను మరోసారి రుజువు చేసిందని అన్నారు. ఈ చలనచిత్రోత్సవం సాధించిన అసలైన విజయానికి ప్రేక్షకులే నిజమైన కొలమానమని ఆయన పేర్కొన్నారు.
నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ మగ్దుమ్ ‘ఎంఐఎఫ్ఎఫ్ నివేదిక’ను అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… "అత్యంత శక్తిమంతమైన నిజాలు పెద్ద వెండితెరలపై కంటే చిన్న, అత్యంత ప్రామాణికమైన ఫ్రేమ్‌లలోనే ఆవిష్కృతమవుతాయి. డాక్యుమెంటరీలు, లఘు చిత్రాలు, యానిమేషన్ వంటి ప్రక్రియలు ప్రపంచ వాస్తవాల నుంచి ముఖం చాటేయవు. పైగా ఆ నిజాల ప్రభావాన్ని ప్రేక్షకులకు అద్దం పట్టి చూపిస్తాయి" అని పేర్కొన్నారు. ఎంఐఎఫ్ఎఫ్ 2026 ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా 1,459 చిత్రాలు నమోదు చేసుకోవటంతో అద్భుతమైన స్పందన లభించిందని ఆయన వెల్లడించారు. ‘పోటీ విభాగం’లో 13 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 52 అంతర్జాతీయ, 92 జాతీయ చిత్రాలతో కలిపి మొత్తం 144 చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. ఇక ‘పోటీయేతర విభాగం’లో 46 దేశాల భాగస్వామ్యంతో 106 అంతర్జాతీయ, 96 జాతీయ చిత్రాలతో కలిపి మొత్తం 202 సినిమాలను ప్రదర్శించారు. ఇవన్నీ కలిసి మొత్తంగా 83 గంటలకు పైగా స్క్రీనింగ్ సమయాన్ని నమోదు చేశాయి. ఈ ఉత్సవంలో ప్రదర్శనలను మోసాయిక్, బెస్ట్ ఆఫ్ ఫెస్ట్, బుసాన్ నెక్స్ట్ వేవ్, ఆస్కార్ విజేతలు, రేమండ్ క్రుమ్ రిట్రోస్పెక్టివ్, ఎన్‌ఎఫ్‌డీసీ షోకేస్, ఎకోస్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్, మరాఠీ సినిమారాలు, ఐఎఫ్ఎఫ్ఐ, సీఎంఓటీ వంటి 24 ప్రత్యేక విభాగాల కింద వర్గీకరించారు. ఇవి ప్రఖ్యాత సినిమాలను, వర్ధమాన సినీ ప్రతిభను, ప్రాంతీయ మూలాలున్న కథా కథనాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చాయి. ప్రముఖ చలనచిత్ర సృష్టికర్త డేవిడ్ అటెన్‌బరో శతాబ్ది వేడుకలకు నివాళిగా ఆయన రూపొందించిన రెండు చిత్రాలను ఇక్కడ ప్రదర్శించారు. ‘విశిష్ట గుర్తింపు’ (హోమేజ్) విభాగంలో చలనచిత్ర దిగ్గజాలు శ్యామ్ బెనెగల్, ఫోటోగ్రాఫర్ రఘు రాయ్, డాక్యుమెంటరీ మాస్టర్ ఫ్రెడ్రిక్ వైస్‌మన్ల చిత్రాలను ప్రదర్శించారు. పూర్తి నిడివి కాని సినిమా ఎందుకు ఎల్లప్పుడూ ఆదరణ పొందుతుందో వీరి రచనలు ప్రేక్షకులకు మరోసారి గుర్తుచేశాయని ఎన్‌ఎఫ్‌డీసీ ఎండీ అన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలోని విభిన్న ప్రాంతీయ గళాలను గౌరవించాలనే ఎంఐఎఫ్ఎఫ్ నిబద్ధతను చాటుతూ ఈ ఎడిషన్‌లో రెండు సరికొత్త విభాగాలను కొత్తగా ప్రవేశపెట్టారు. అందులో ఈశాన్య భారత్ నుంచి 7 చిత్రాలను ప్రదర్శించిన ‘ఎకోస్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్’ ఒకటి కాగా.. ఫిల్మ్ సిటీ మహారాష్ట్ర సహకారంతో 19 చిత్రాలను ప్రదర్శించిన ‘మరాఠీ సినిమాలు’ విభాగం మరొకటిగా నిలిచింది.
19వ ముంబయి అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) ఇంతటితో ముగిసినప్పటికీ.. కథా కథనం, సృజనాత్మకత, చలనచిత్ర విశిష్టతల స్ఫూర్తి చలనచిత్ర నిర్మాతలను, ప్రేక్షకులనూ నిరంతరం ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. సినిమాలు మనసుకు సాంత్వన చేకూర్చే ఔషధాలైతే... ఆలోచింపజేసే కథలు, విభిన్న దృక్పథాలు, విప్లవాత్మక భావాలతో 'ఎంఐఎఫ్ఎఫ్' మరోసారి ప్రేక్షకుల మనసులను రంజింపజేసింది. ఈ అధ్యాయం ముగిసినప్పటికీ అర్థవంతమైన సినిమాలను ఆదరించే, ఆస్వాదించే ఈ నిరంతర ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. సినీ ప్రేమికులు ఇప్పుడు గోవాలో జరగబోయే '57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (ఐఎఫ్ఎఫ్ఐ), 2028లో జరగబోయే ఎంఐఎఫ్ఎఫ్ తదుపరి ఎడిషన్‌పై దృష్టి సారిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథకులను మళ్లీ ప్రేమతో ఆహ్వానించడానికి, మనుషులను అనుసంధానించడానికి, స్ఫూర్తినింపడానికి, సమాజంలో శాశ్వతమైన ప్రభావాన్ని సృష్టించడానికి ఆనాడు తెరలు మళ్లీ జీవం పోసుకుంటాయి.
***
रिलीज़ आईडी:
2276404
| Visitor Counter:
3