పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై అంతర మంత్రిత్వ శాఖల సమావేశం


ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధితో విమానయాన సంస్థలకు చేయూత… దేశవ్యాప్తంగా అంతరాయం లేకుండా విమాన రవాణాకు దోహదపడేలా ప్రభుత్వ నిర్ణయం

తగిన ముడి చమురు నిల్వలతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న రిఫైనరీలు… దేశవ్యాప్తంగా సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు

గత 3 రోజుల్లో దాదాపు 1.50 కోట్ల సిలిండర్ల బుకింగ్‌లకు గాను… దాదాపు 1.43 కోట్ల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ

2026 జూన్ 3 నాటికి MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్‌లను వదులుకున్న 80,400 పైగా పీఎన్‌జీ వినియోగదారులు

ఆ ప్రాంతంలోని భారతీయ నావికులంతా క్షేమం… గత 24 గంటల్లో భారత జెండా ఉన్న వాణిజ్య నౌకలకు సంబంధించిగానీ, విదేశీ జెండా ఉన్న వాణిజ్య నౌకలలోని భారతీయ నావికులకు సంబంధించిగానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడిలో భారతీయుడి మృతి… 13 మంది భారతీయులకు గాయాలు.. అన్ని విధాలా సాయమందిస్తున్న రాయబార కార్యాలయం

प्रविष्टि तिथि: 04 JUN 2026 6:19PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడం ద్వారా… ప్రజలను జాగరూకులను చేసే చర్యలను భారత ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ మీడియా సెంటర్‌లో ఈ రోజు ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పెట్రోలియం - సహజ వాయు మంత్రిత్వ శాఖ, ఓడరేవులు - షిప్పింగ్ - జలమార్గాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంధన లభ్యత, నౌకావాణిజ్య కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయ పౌరులకు అందిస్తున్న సాయం, కీలక రంగాల్లో స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలపై తాజా వివరాలను వారు వెల్లడించారు. అలాగే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ నిధి గురించి మీడియాకు వివరించింది.

ఏటీఎఫ్ ధరల స్థిరీకరణ చర్యలు

షెడ్యూల్డు భారతీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరల స్థిరీకరణపరంగా సాయమందించేందుకు రూ. 10 వేల కోట్ల వరకు ఏకమొత్తంగా బడ్జెట్ సాయాన్ని అందించే విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమాన రవాణాను కొనసాగించడం, విమానయాన సేవల్లో స్థిరత్వాన్ని కాపాడడంతోపాటు, పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో ఏర్పడిన అసాధారణ పెరుగుదల భారం ప్రయాణికులపై పడకుండా చూడడం కోసం.. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. –

        తాత్కాలిక, స్వీయ సవరణ ఏర్పాటు కలిగి ఉండేలా కొత్తగా ఆమోదించిన ఈ విధానాన్ని రూపొందించారు. ఈ పథకం కింద చమురు మార్కెటింగ్ సంస్థలకు వడ్డీ లేని ముందస్తు నిధులను ప్రభుత్వం అందిస్తుంది. దీంతో ఆ సంస్థలు దేశీయ, అంతర్జాతీయ కార్యకలాపాలను నిర్వహించే భారతీయ విమానయాన సంస్థలకు ముందుగా నిర్ణయించిన, స్థిరమైన ధరలకే ఏటీఎఫ్ సరఫరా చేయగలుగుతాయి. అంతర్జాతీయంగా ఏటీఎఫ్ ధరలు గరిష్ఠ పరిమితి కన్నా పెరిగిన సమయాల్లో.. ఆ ధరల వ్యత్యాసాన్ని ఈ నిధి ద్వారా చమురు మార్కెటింగ్ సంస్థలకు భర్తీ చేస్తారు.

        ముఖ్యంగా ఇంధన ధరలు తగ్గితే, ఆ వ్యత్యాసపు మొత్తాన్ని చమురు మార్కెటింగ్ సంస్థల నుంచి తిరిగి సేకరించి… పారదర్శకమైన ట్రూ-అప్ విధానం ద్వారా ఈ నిధులను భారత సంచిత నిధిలో జమ చేస్తారు. కాబట్టి ఈ ఏర్పాటు సబ్సిడీ కాదు… ఇంధన ధరల్లో అసాధారణ పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఒక తాత్కాలిక స్థిరీకరణ చర్య. అదే సమయంలో ఈ నిధుల వినియోగానికి సంబంధించి పూర్తి జవాబుదారీతనం, పర్యవేక్షణ, రికవరీ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

        విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో ఏటీఎఫ్ అత్యంత కీలకమైన అంశం. అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఒక్కసారిగా పెరగడం, దీనికి తోడు పలు అంతర్జాతీయ మార్గాల్లో భారతీయ విమానయాన సంస్థలు సుదీర్ఘ దూరాలు ప్రయాణించాల్సి రావడం వంటి కారణాలు.. విమానయాన సంస్థల కార్యకలాపాల్లో తీవ్రమైన ఒత్తిడిని పెంచాయి. ఇప్పుడు ఆమోదించిన ఈ కొత్త విధానం… ఒక నిర్ణీత ధరల ఏర్పాటు ద్వారా ఇంధన ఖర్చులపై స్పష్టమైన అంచనాను అందిస్తుంది. దీంతో విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలపై మరింత సమర్థంగా ప్రణాళికలు రూపొందించుకునేందుకు, దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా సేవలను కొనసాగించడానికి వీలవుతుంది.

        ప్రయాణికుల పరంగా చూస్తే... ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగినప్పుడు విమాన ఛార్జీలు కూడా అంతే వేగంగా పెరిగిపోకుండా అదుపు చేయడంలో ఈ విధానం ఎంతగానో సహాయపడుతుంది. ఇంధన ధరలలో వచ్చే తీవ్రమైన హెచ్చుతగ్గుల ప్రభావం విమానయాన సంస్థలపై పడకుండా తగ్గించడం ద్వారా.. ఆ అదనపు భారాన్ని ప్రయాణికులపై పడకుండా చూడడం, తద్వారా విమానయాన ధరల్లో స్థిరత్వాన్ని తేవడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా కుటుంబాలు, విద్యార్థులు, వ్యాపార రీత్యా ప్రయాణించేవారు, పర్యాటకులు, రవాణా అవసరాల కోసం, ఆర్థిక అవకాశాల కోసం విమాన ప్రయాణాలపై ఆధారపడే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది.

        మారుమూల, ప్రాంతీయ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు సహా దేశవ్యాప్తంగా అంతరాయం లేకుండా విమాన ఈ విధానం దోహదపడుతుంది. సమతౌల్యంతో కూడిన ప్రాంతీయాభివృద్ధిని, సమ్మిళిత వృద్ధిని ఈ విధానం ప్రోత్సహిస్తుంది.  ప్రాంతీయాభివృద్ధి, పర్యాటకం, వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ సదుపాయం, విద్య, పెట్టుబడుల కోసం నిరంతర అనుసంధానం అత్యావశ్యకం. ఇది సమ్మిళిత వృద్ధి, సమతౌల్యంతో కూడిన ప్రాంతీయాభివృద్ధి అన్న ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తూ... దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకూ విమాన రవాణా సేవలు అంతరాయం లేకుండా అందుబాటులో ఉండేలా చూస్తుంది.

        విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, క్షేత్రస్థాయి నిర్వహణ సేవలు, నిర్వహణ - మరమ్మత్తు సంస్థలు, పర్యాటకం, ఆతిథ్య రంగం, సరుకు రవాణా రంగాల్లో ఉపాధికి చేయూతనివ్వడం ద్వారా… దేశ విస్తృత ఆర్థిక వ్యవస్థపై ఈ నిర్ణయం సానుకూల ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. అలాగే భారత దేశీయ, అంతర్జాతీయ అనుసంధానాన్ని కాపాడడానికి, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇది తోడ్పడుతుంది. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసిన విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను.. ముఖ్యంగా ఉడాన్ పథకం కింద అందుబాటులోకి వచ్చిన విమానాశ్రయాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.

        ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొన్న ఈ కాలంలో… ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడటానికీ, అలాగే అందుబాటు ధరల్లో, నమ్మకమైన విమాన సేవలను అందించడానికి, దేశపు పౌర విమానయాన రంగం దీర్ఘకాలిక వృద్ధిని సాధించేలా మద్దతుగా నిలవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

ఇంధన సరఫరా, ఇంధన లభ్యత

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా లభించేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ… పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించింది.

ప్రజలకు సలహా, ప్రజల్లో అవగాహన

        పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యత దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. పౌరులు భయాందోళనలతో పెట్రోలు, డీజిలును అవసరం లేకున్నా కొనుగోలు చేయొద్దని, అవసరం లేకపోయినా ఎల్పీజీని బుక్ చేసుకోవద్దని సూచించింది.

        వదంతుల పట్ల జాగ్రత్త వహించండి. సరైన సమాచారం కోసం అధికారిక సమాచార వనరులపైనే ఆధారపడండి.

        పీఎన్జీ, ఇండక్షన్/ ఎలక్ట్రిక్ కుక్‌టాప్‌లు మొదలైన ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలని ప్రజలను కోరడమైనది.

        టోకు, పారిశ్రామిక వినియోగదారులు తమకు కావాల్సిన డీజిల్‌ను అధీకృత కొనుగోలు మార్గాల ద్వారా మాత్రమే సేకరించాల్సిందిగా కోరడమైనది.

        ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలంతా తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపుగా వాడుకునేందుకు ప్రయత్నించాలని కోరడమైనది.

ప్రభుత్వ సన్నద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు

        ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ… గృహ అవసరాల ఎల్పీజీ, గృహ అవసరాల పీఎన్‌జీ, రవాణా రంగానికి ఉపయోగించే సీఎన్‌జీల విషయంలో వంద శాతం సరఫరా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

        వాణిజ్య ఎల్పీజీ విషయంలో ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు ప్రాధాన్యమిస్తోంది. ఫార్మా, ఉక్కు, ఆటోమొబైల్, విత్తనాలు, వ్యవసాయం మొదలైన రంగాలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. 2026 మార్చి 2, 3 తేదీల సగటు రోజువారీ సరఫరా ఆధారంగా వలస కార్మికులకు 5 కేజీల ఎఫ్‌టిఎల్ సరఫరాను కూడా రెట్టింపు చేశారు.

        సరఫరా, డిమాండ్ రెండు వైపులా ప్రభుత్వం ఇప్పటికే పలు క్రమబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో భాగంగా రిఫైనరీల్లో ఉత్పత్తిని పెంచడం, ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ కాలపరిమితిని పట్టణ ప్రాంతాల్లో 21 రోజుల నుంచి 25 రోజులకు… గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం, అత్యవసర రంగాలకు సరఫరాలో ప్రాధాన్యమివ్వడం వంటి కీలక చర్యలు తీసుకుంది.

రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయంతో కూడిన చర్యలు

        నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్పీజీ నియంత్రణ ఉత్తర్వు-2000 ప్రకారం… ఇంధన సరఫరాను పర్యవేక్షించడానికి, అలాగే అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారముంది.

        పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ వంటి నిత్యావసర వస్తువుల సరఫరా పరిస్థితిని పర్యవేక్షించడంలో, నియంత్రించడంలో రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేసింది.

        తగినంత ఇంధనం అందుబాటులో ఉందన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేస్తూ, వారిలో నమ్మకాన్ని నింపడానికి... వారికి ఎప్పటికప్పుడు విస్తృతంగా సమాచారాన్ని చేరవేయాలని భారత ప్రభుత్వం పలు లేఖలు, వీడియో కాన్ఫరెన్సుల ద్వారా వివరించింది.

        2026 మే 26 నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులకు భారత ప్రభుత్వం ఒక కీలకమైన అభ్యర్థన చేసింది. హెచ్‌ఎస్‌డీ, ఎమ్ఎస్ వినియోగ విధానాన్ని పర్యవేక్షించాలని రాష్ట్ర/జిల్లా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అందులో కోరింది. ముఖ్యంగా పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులు రిటైల్ పెట్రోల్ బంకుల ద్వారా అనధికారికంగా డీజిల్‌ను కొనుగోలు చేయకుండా నిరోధించడానికి.. సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన రవాణా, పారిశ్రామిక కారిడార్లలో తనిఖీలను తీవ్రతరం చేయాలని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

అమలు, పర్యవేక్షణ చర్యలు

        పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అక్రమ నిల్వలను, నల్లబజారు విక్రయాలను అదుపు చేయడానికి… దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.

        ఎల్పీజీ సిలిండర్ల అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి చేపట్టిన చర్యల్లో భాగంగా... గత మూడు రోజుల్లోనే 4 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

        పెట్రోల్, డీజిల్‌కు సంబంధించిన చేపట్టిన చర్యలలో భాగంగా... గత మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా 1,880కి పైగా ఆకస్మిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 2,900 లీటర్లకు పైగా పెట్రోలు, 6,350 లీటర్లకు పైగా డీజిలును అధికారులు సీజ్ చేశారు. అలాగే ఈ వ్యవహారంలో దేశవ్యాప్తంగా 18 ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా, 13 మంది అరెస్టయ్యారు.

        ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల అధికారుల ఆకస్మిక తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి:

        ఎల్పీజీ పంపిణీ కేంద్రాలు – గత మూడు రోజుల్లో దాదాపు 680 ఎల్పీజీ పంపిణీ కేంద్రాల్లో తనిఖీలు చేశారు. 6 ఎల్పీజీ పంపిణీ కేంద్రాలపై జరిమానాలు విధించగా, 2 ఎల్పీజీ పంపిణీ కేంద్రాలపై సస్పెన్షన్ విధించారు.

        పెట్రోల్ బంకులు – గత మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 2,500 పెట్రోల్ బంకుల్లో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 19 పెట్రోల్ బంకులకు జరిమానాలు విధించగా, మరో 457 రిటైల్ పెట్రోల్ బంకులపై సస్పెన్షన్ విధించారు. 

 

ఎల్‌పీజీ సరఫరా

గృహావసరాల కోసం ఎల్‌పీజీ సరఫరా స్థితి...

       ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.

       గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరా కోసం అత్యంత ప్రాధాన్యం కొనసాగుతోంది.

       ఎల్‌పీజీ పంపిణీదారుల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.

       నిన్న పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు సుమారు 99 శాతానికి పెరిగాయి.

       పంపిణీదారుల స్థాయిలో సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 96 శాతానికి పెంచారు. నమోదు చేసుకున్న ఫోన్‌ నంబర్‌కు డీఏసీ వస్తోంది.

       గత 3 రోజుల్లో సుమారు 1.50 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌లకు గానూ, దాదాపు 1.43 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ చేశారు.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు:

       మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో  సంస్కరణలతో ముడిపడి ఉన్న 10 శాతం కేటాయింపులు ఉన్నాయి.

       గత 3 రోజుల్లో 1.57 లక్షలకు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

       గత 3 రోజుల్లో సుమారు 520 శిబిరాల ద్వారా 9,200కు పైగా 5 కేజీల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

       గత 3 రోజుల్లో మొత్తం 19,372 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

       గత 3 రోజుల్లో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల ద్వారా సుమారు 649 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్‌పీజీ విక్రయాలు జరిగాయి.

సహజవాయువు సరఫరా – పీఎన్‌జీ విస్తరణ చర్యలు

       డీ-పీఎన్‌జీ, సీఎన్‌జీ రవాణాకు 100 శాతం సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యం.

       ప్రస్తుతం పనిచేస్తున్న యూరియా ప్లాంట్లకు గత 6 నెలల సగటు వినియోగంలో దాదాపు 98 శాతం సరఫరా అవుతోంది.

       సీజీడీ నెట్‌వర్క్‌ ద్వారా సరఫరా సహా ఇతర పారిశ్రామిక-వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరా 80 శాతం దాకా పెరిగింది.

       వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతపై సమస్యల పరిష్కారం దిశగా సీజీడీ సంస్థలు తమ అన్ని జీఏలన్నిటి పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వడంపై ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం సూచించింది.

       సీజీడీ నెట్‌వర్క్‌ విస్తరణకు అవసరమైన ఆమోద ప్రక్రియను వేగిరపరచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సహా కేంద్ర మంత్రిత్వ శాఖలను కోరింది.

       ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక మార్పిడి దిశగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దోహదం చేస్తే, వాటికి 10 శాతం అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా ప్రతిపాదించింది.

       పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.

       దేశవ్యాప్తంగా సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్‌లు, ఇతర సౌకర్యాల కల్పన, నిర్మాణం-నిర్వహణ-విస్తరణ ద్వారా) కోసం పైప్‌లైన్లు వేయడంతోపాటు, విస్తరణ దిశగా క్రమబద్ధ, కాలపరిమితితో కూడిన విధానాన్ని సూచిస్తూ నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద కేంద్ర ప్రభుత్వం 24.03.2026న గెజిట్ ఉత్తర్వు ద్వారా ప్రకటన చేసింది. ఈ పనులకు అనుమతులు, భూ సేకరణలో జాప్యాలను పరిష్కరించి, నివాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల సత్వర అభివృద్ధికి ఇది వీలు కల్పిస్తుంది. అలాగే పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధి వేగవంతమై, చివరి అంచెదాకా అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కాలుష్య రహిత ఇంధనం వైపు మార్పిడికి మద్దతిస్తూ ఇంధన భద్రతను బలోపేతం చేసి, భారత గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నారు.

       డీ-పీఎన్‌జీ కనెక్షన్లను వేగవంతం చేయాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది. అలాగే పీఎన్‌జీ విస్తరణలో వేగం కొనసాగేలా జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను 30.06.2026 వరకు పొడిగించింది.

       స్వచ్ఛమైన, సురక్షితమైన, స్వయం సమృద్ధ ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర  ప్రభుత్వం ఒక ముసాయిదా ‘సీబీజీ’ విధానాన్ని రూపొందించింది. దీని కింద రాష్ట్రాలు తమ సొంత, పెట్టుబడిదారు హిత, అమలు అనుగుణమైన వ్యవస్థను సృష్టించుకోవచ్చు. ఆ మేరకు ఒక సమగ్రమైన, సరళమైన మార్గదర్శకంగా  ఇది ఉపయోగపడుతుంది. ఇందుకు సుముఖంగా గల రాష్ట్రాలకు వాణిజ్య ఎల్‌పీజీ అదనపు కేటాయింపుల తదుపరి విడతలో ప్రాధాన్యం లభిస్తుంది.

       ఈ ఏడాది మార్చి నుంచి సుమారు 8.82 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు గ్యాసిఫై చేశారు. దీనికి అదనంగా 2.98 లక్షల కనెక్షన్ల కోసం మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో మొత్తం కనెక్షన్ల సంఖ్య 11.80 లక్షలకు చేరింది. మరో 8.98 లక్షల మంది వినియోగదారులు కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్నారు.

       ఈ ఏడాది జూన్‌ 3 నాటికి 80,400 మందికిపైగా పీఎన్‌జీ వినియోగదారులు ‘MYPNGD.in’ వెబ్‌సైట్ ద్వారా ఎల్‌పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.

ముడిచమురు నిల్వలు... శుద్ధి కర్మాగారాల కార్యకలాపాలు

       దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతోపాటు శుద్ధి కర్మాగారాలన్నీ అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతోపాటు పెట్రోలు, డీజిలు నిల్వల నిర్వహణ సంతృప్తికరంగా ఉంది.

       దేశీయ వినియోగానికి కొరత రాకుండా శుద్ధి కర్మాగారాల్లో ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.

       దేశీయ మార్కెట్‌కు పెట్రోరసాయన ముడిసరకు సరఫరా లభ్యతకు భరోసా దిశగా అంతర్‌ మంత్రిత్వ సంయుక్త కార్యవర్గం ఏర్పాటైంది. అనంతరం 01.04.2026 నాటి ఒక ఉత్తర్వు ద్వారా పెట్రోరసాయన పరిశ్రమలు సహా చమురుశుద్ధి కర్మాగారాలను, సెంటర్ ఫర్ హై టెక్నాలజీ నిర్దేశిత కీలక రంగాలకు నిర్దిష్ట కనీస పరిమాణంలో సి3, సి4 స్ట్రీమ్‌లను అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.

       ఔషధ విభాగం, రసాయనాలు, పెట్రో రసాయనాల విభాగం పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగాల నుంచి అందిన అభ్యర్థనల ఆధారంగా ఫార్మా, రసాయన, పెయింట్ రంగ సంస్థల కోసం ఎల్‌పీజీ నిల్వల నుంచి రోజుకు 1,120 మెట్రిక్‌ టన్నుల మేర సి3-సి4 మాలిక్యూల్స్‌ కేటాయింపు వెసులుబాటు కల్పించారు.

       ఈ ఏడాది జూన్‌ 1 నుంచి  ముంబయి, కొచ్చి, విశాఖపట్నం, చెన్నై, మధుర, గుజరాత్ చమురుశుద్ధి కర్మాగారాలు రసాయన, ఔషధ, పెయింట్ పరిశ్రమలకు సుమారు 1,030 మెట్రిక్‌ టన్నుల (ప్రొపిలీన్, బ్యూటిలీన్‌ సహిత) సి3-సి4 మాలిక్యూల్స్‌ను, సుమారు 320 మెట్రిక్‌ టన్నుల బ్యూటైల్ అక్రిలేట్‌ను విక్రయించాయి.

రిటైల్‌ ఇంధన లభ్యత... ధరల నిర్ధారణ చర్యలు

       దేశవ్యాప్తంగా అన్ని రిటైల్‌ విక్రయ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి.

       మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ముడిచమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. దీంతో వినియోగదారులను ఆదుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిలు‌పై లీటరుకు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించడం ద్వారా భారాన్ని పాక్షికంగా భరించాలని నిర్ణయించింది.

       కేంద్ర ప్రభుత్వం 31.05.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా పెట్రోలు‌పై ఎగుమతి సుంకాన్ని లీటరుకు రూ.3 నుంచి రూ.1.50కు, డీజిలు‌పై లీటరుకు రూ.16.50 నుంచి రూ.13.50కి,  ఏటీఎఫ్‌పై లీటరుకు రూ.16 నుంచి రూ.9.50కి తగ్గించింది.

       కొన్ని ప్రాంతాల్లోని రిటైల్‌ విక్రయ కేంద్రాల వద్ద అసాధారణంగా అధిక అమ్మకాలు, భారీ రద్దీ కనిపించాయి.

సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు

 

పర్షియన్ జలసంధిలో సముద్ర పరిస్థితిపై ఓడరేవులు-నౌకా రవాణా-జలమార్గాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ఇచ్చింది. ఈ ప్రాంతంలో భారత నౌకలు, సిబ్బంది భద్రత, రక్షణ దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించింది. ఆ సమాచారం మేరకు..

       నావికుల సంక్షేమం, నిరంతరాయ సముద్ర కార్యకలాపాలను నిర్ధారించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో, ఓడరేవులు, నౌకా రవాణా మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.

       ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గడచిన 72 గంటల్లో భారతీయ జెండా కలిగిన నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని మంత్రిత్వశాఖ తెలిపింది.

       డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తూనే ఉండగా, ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 11,630 కాల్స్, 25,864కి పైగా ఈమెయిళ్లను స్వీకరించి పరిష్కరించింది. గత 72 గంటల్లో సముద్రయాన సిబ్బంది, వారి కుటుంబాలు, భాగస్వాముల నుంచి 444 కాల్స్, 1,034  ఈమెయిళ్లు అందాయి.

       డీజీ షిప్పింగ్ ద్వారా గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుంచి గత 72 గంటల్లో 28 మంది సహా ఇప్పటి దాకా 3,474 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహాయపడింది.

       దేశవ్యాప్తంగా ఓడరేవుల కార్యకలాపాలు సర్వసాధారణ స్థితిలో కొనసాగుతుండగా, ఎటువంటి రద్దీ నమోదు కాలేదు.

యుద్ధ ‍ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత

గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. ఈ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమాన్ని నిర్ధారించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కింది విషయాలను తెలియజేసింది.

       సమాచారాన్ని తెలియజేయడానికి,   ప్రయత్నాలను సమన్వయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

       ఈ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ… భారతీయ పౌరులకు ఎప్పటికప్పుడూ సహాయం అందిస్తున్నాయి. భారత పౌరులకు సకాలంలో సహాయం అందించడానికి 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్‌లను నిర్వహిస్తూ, స్థానిక ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉంటున్నాయి.

       స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన, ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలు, పౌరుల కోసం చేపడుతున్న వివిధ సంక్షేమ చర్యలకు సంబంధించిన సమాచారంతో కూడిన సలహాలు జారీ చేస్తున్నాయి.

       ఆప్రాంతంలోని భారతీయ పౌరులతో రాయబార కార్యాలయాలు చురుగ్గా మమేకమవుతున్నాయి. వారి సమస్యలను పరిష్కరించడానికి అవి భారతీయ సమాజ సంఘాలు, సంస్థలు, వృత్తిపరమైన బృందాలు, భారతీయ సంస్థలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నాయి.

       అక్కడి భారతీయ నావికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. భారత రాయబార కార్యాలయాలు స్థానిక అధికారులు, ఏజెన్సీలతో సమన్వయం చేయడం, కాన్సులర్ సహాయం అందించడం, భారత్‌కు తిరిగి రావాలనే అభ్యర్థనలకు సహాయం చేయడం సహా వారికి అన్ని విధాలా సహాయం అందిస్తున్నాయి.

విమానాల పరిస్థితి

       ఈ ప్రాంతం నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు అదనపు విమానాలు నడుస్తుండటంతో మొత్తం విమాన పరిస్థితి మెరుగుపడుతూనే ఉంది.

       యూఏఈ: యూఏఈ గగనతలం తెరిచి ఉంది. భారత్‌, యూఏఈ విమానయాన సంస్థలు యూఏఈ నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.

       సౌదీ అరేబియా ఒమన్: సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలు నడుస్తున్నాయి.

       ఖతార్: ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఖతార్ ఎయిర్‌వేస్ సంస్థలు ఖతార్ నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.

       కువైట్: కువైట్ గగనతలం తెరిచి ఉంది. కువైట్ ఎయిర్‌వేస్, జజీరా ఎయిర్‌వేస్ సంస్థలు కువైట్ నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగిస్తున్నాయి.

       బహ్రెయిన్: బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, గల్ఫ్ ఎయిర్ సంస్థలు బహ్రెయిన్ నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నాయి.

       ఇరాక్: ఇరాక్ గగనతలం ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలతో తెరిచి ఉంది. దీనిని భారత్‌కు తదుపరి ప్రయాణం కోసం ఉపయోగించుకోవచ్చు.

       ఇరాన్: ఇరాన్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. భారత పౌరులు ఇరాన్‌కు ప్రయాణించకుండా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఇప్పటికే అక్కడ ఉన్నవారిని రాయబార కార్యాలయం మద్దతుతో తిరిగి రావాలని కోరింది. ఇప్పటివరకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం భూ సరిహద్దు మార్గాల ద్వారా 2,557 మంది భారత పౌరులు ఇరాన్ నుంచి బయటకు రావడానికి సౌకర్యం కల్పించింది.

       ఇజ్రాయెల్: ఇజ్రాయెల్ గగనతలం తెరిచి ఉంది. ఈ ప్రాంతంలోని గమ్యస్థానాలకు పరిమిత విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీనిని భారత్‌కు తదుపరి ప్రయాణం కోసం ఉపయోగించుకోవచ్చు.

కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడిపై తాజా సమాచారం

       నిన్న కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారత పౌరుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తన ప్రగాఢ సంతాపం తెలియజేసింది. వారి కుటుంబంతో కువైట్‌లోని భారత రాయబారకార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. స్థానిక అధికారులతో సన్నిహితంగా సమన్వయం చేస్తోంది. పార్థివ దేహం రేపు భారత్‌కు చేరుకుంటుందని భావిస్తున్నారు.

        ఈ దాడిలో పదమూడు మంది భారత జాతీయులు గాయపడి, ప్రస్తుతం కువైట్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారికి రాయబార కార్యాలయం అన్ని విధాలా సహాయం అందిస్తోంది. స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.

 

***


(रिलीज़ आईडी: 2269159) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam