పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ముడిచమురు దిగుమతి తగ్గింపు నుంచి రైతు సౌభాగ్యం దాకా: ఢిల్లీలో తొలి మిశ్రమ ఇంధన ప్రయాణిక వాహనం ఆవిష్కరణ
ప్రపంచమంతటా సంక్షోభం నెలకొన్నప్పటికీ ఇంధన ధర అత్యల్పంగా పెరిగిన దేశాల్లో భారత్ ఒకటి: శ్రీ హర్దీప్ సింగ్ పూరి
దేశంలో విక్రయించే కొత్త ద్విచక్ర, చతుశ్చక్ర వాహనాల్లో 50 శాతం మిశ్రమ ఇంధనంతో నడిస్తే మన రైతులకు ₹12,403 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూరుతుంది
प्रविष्टि तिथि:
04 JUN 2026 4:02PM by PIB Hyderabad
స్వయంసమృద్ధ భారత్ దార్శనికతకు మరింత ఉత్తేజమిస్తూ కేంద్ర పెట్రోలియం-సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఇవాళ న్యూఢిల్లీలో మారుతి సుజుకి సంస్థ రూపొందించిన భారత తొలి మిశ్రమ ఇంధన (ఫ్లెక్స్-ఫ్యూయల్) ప్రయాణిక వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రోడ్డు రవాణా-రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ కూడా పాల్గొన్నారు. ఈ వాహనాలు ‘ఇ20’ నుంచి ‘ఇ100’ వరకూ వివిధ రకాల ఇథనాల్-పెట్రోల్ మిశ్రణంతో నడవగలవు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- మిశ్రమ ఇంధన సాంకేతికతతో రూపొందిన ప్రయాణిక వాహన ప్రారంభోత్సవం ఒక వినూత్న ఉత్పత్తి మార్కెట్ ప్రవేశానికి పరిమితం కాదని, దేశ ఇంధన రూపాంతరీకరణలో ఇదో కొత్త అధ్యాయమని అభివర్ణించారు. దేశంలోని దాదాపు 37 లక్షల ప్రయాణిక వాహనాలు మధ్యతరగతి ఆకాంక్షలకు, వ్యక్తిగత ప్రయాణ భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తున్నాయని శ్రీ పూరి గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మిశ్రమ ఇంధన సాంకేతకతను విస్తృతంగా అనుసరించడం ద్వారా ఇథనాల్ ఆధారిత ప్రయాణ ప్రభావం గణనీయంగా పెరుగుతుందన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న సైనిక ఘర్షణ ప్రారంభానికి ముందు భారత ఎల్‌పీజీ దిగుమతులలో దాదాపు 60 శాతం హోర్ముజ్ జలసంధి గుండానే సాగేవని మంత్రి చెప్పారు. మొత్తం 140 కోట్ల జనాభా, ప్రపంచ సగటుతో పోలిస్తే 3 రెట్లు అధిక ఇంధన డిమాండ్ వృద్ధిగల దేశంగా భారత్ దేశవ్యాప్త పెట్రోలియం ఉత్పత్తుల నిరంతర లభ్యతకు భరోసా ఇచ్చిందన్నారు. “దేశంలో ఎక్కడా సరఫరాకు కొరతన్నది లేనేలేదు. ప్రజలు రహదారులు, గగన మార్గాల్లో యథావిధిగా ప్రయాణిస్తున్నారు. ప్రపంచమంతటా అంతరాయాలు తప్పకపోయినా, భారత్ మాత్రం దాదాపు సాధారణ స్థితిని కొనసాగిస్తోంది” అని మంత్రి పేర్కొన్నారు. తప్పుదోవ పట్టించే సమాచార వ్యాప్తితోపాటు కృత్రిమ కొరత సృష్టికి ప్రయత్నాలు చోటుచేసుకున్నా సకాలంలో విధానపరమైన చర్యలు సహా సమర్థ నిర్వహణ వల్ల పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నదని ఆయన తెలిపారు.
భారత ఇంధన వ్యూహంలో మూడు కీలక స్తంభాలు- లభ్యత, అందుబాటు ధర, సుస్థిరతల మధ్య సమతూకం సాధనలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వ పటిమను అద్వితీయమని శ్రీ పూరి ప్రశంసించారు. ఇంధనల లభ్యత పరంగా ప్రపంచమంతటా అస్థిరత నెలకొన్నప్పటికీ, భారత్ మాత్రం ముడి చమురు, ఎల్‌పీజీ, సహజ వాయువు నిరంతర సరఫరాను కొనసాగించిందని ఆయన గుర్తుచేశారు. సంక్షోభానికి ముందు దేశీయ ఎల్‌పీజీ ఉత్పాదన రోజుకు 32 ట్రిలియన్ టన్నులు కాగా, ఆ తర్వాత దాదాపు 52 ట్రిలియన్ టన్నులకు పెంచినట్లు తెలిపారు. మరోవైపు పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు సహా సీఎన్‌జీ వైపు మళ్లడాన్ని కూడా విస్తృతం చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజల కొనుగోలు శక్తి కొనసాగింపును ప్రస్తావిస్తూ- ప్రపంచంలో ఇంధన ధరల అత్యల్ప పెరుగుదల గల దేశాల జాబితాలో భారత్ ఒకటని మంత్రి అన్నారు. ఈ మేరకు వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 వంతున కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రధానమంత్రి నిర్ణయించడాన్ని ఆయన గుర్తుచేశారు.
ఇంధన సుస్థిరత అంశాన్ని ప్రస్తావిస్తూ- బ్రెజిల్, అమెరికా దేశాల్లో చెరకు, మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ మిశ్రణం విజయవంతమైందని, ఇది తన పూర్వానుభవమని పూరి గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు భారత ఇథనాల్ మిశ్రణం కూడా అత్యంత విజయవంతమైన ఇంధన మార్పిడి కార్యక్రమాలలో ఒకటిగా నిలిచిందన్నారు. రైతులు, ఉత్పత్తిదారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, వాహన తయారీదారులు, శాస్త్రవేత్తలు, ఆర్థిక సంస్థలన్నిటి సమ్మేళనంతో బలమైన వ్యవస్థ సృష్టి ద్వారానే ఇది సాధ్యమైందని చెప్పారు. దీనికి అన్ని విభాగాల భాగస్వామ్యంగల ప్రభుత్వ విధానం దన్నుగా నిలిచిందని తెలిపారు. ధాన్యపు నూకలు, వ్యవసాయ వ్యర్థాలు, వెదురు, సముద్ర నాచు వంటి బహుళ ముడి పదార్థాలతో ఇథనాల్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం నేడు మన దేశానికి ఉందని పేర్కొన్నారు.
దేశంలో ఇంధన మిశ్రణం 2013-14 నాటికి కేవలం 1.5 శాతం కాగా, 2025-26కల్లా 20 శాతానికి చేరుకోవడం ద్వారా నిర్దేశిత గడువుకు ఐదేళ్లు ముందుగానే లక్ష్యం సాధించామని మంత్రి పేర్కొన్నారు. ఇథనాల్ కొనుగోళ్లు ‘ఈఎస్‌వై’ 2013-14లో 38 కోట్ల లీటర్లు కాగా, నేడు 1,040 కోట్ల లీటర్లకు పైగా పెరిగిందన్నారు. అలాగే, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 2014 నాటి 421 కోట్ల లీటర్ల స్థాయి నుంచి 2026కల్లా 2000 కోట్ల లీటర్లకు- దాదాపు 5 రెట్లు పెరిగిందని వెల్లడించారు. ఈ మార్పుతో ముడిచమురు దిగుమతుల తగ్గుదల, విదేశీ మారకం ఆదా, ఉద్గారాల తగ్గింపు రైతుల ఆదాయం పెరుగుదల వంటి ప్రయోజనాలు సమకూరాయని తెలిపారు.
దేశంలో ఇకపై అమ్ముడయ్యే కొత్త ద్విచక్ర, చతుశ్చక్ర వాహనాల్లో 50 శాతం మేర మిశ్రమ ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా మార్చగలిగితే 311.8 కోట్ల లీటర్ల ఇథనాల్‌కు అదనపు డిమాండ్ ఏర్పడుతుందని మంత్రి చెప్పారు. తద్వారా రైతులకు ₹12,403 కోట్ల అదనపు ఆదాయం లభించడమే కాకుండా 66.4 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయన్నారు.
నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన అధికారిక ప్రకటనలో- ‘ఇ85’ వంటి అధిక ఇథనాల్ మిశ్రమంతో నడిచే వాహనాలు సహా ఇథనాల్ ఆధారిత మిశ్రమ ఇంధన వాహనాలను (ఎఫ్‌ఎఫ్‌వి) శూన్య ఉద్గార వాహనాలుగా వర్గీకరించింది. ‘ఇ85’ ఇంధనంతో ఉద్గారాలు దాదాపు శూన్య పరమాణు పదార్థ స్థాయిలో ఉంటాయి. దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్య నివారణలో మిశ్రమ వాహనాలు ఒక ఆశాజనక పరిష్కారం చూపుతాయి.
దేశవ్యాప్తంగా మిశ్రమ ఇంధనావరణ వ్యవస్థ విస్తరణ దిశగా ప్రభుత్వం రూపొందించిన భవిష్యత్ ప్రణాళిక గురించి మంత్రి వివరించారు. దీని ప్రకారం- ‘బీఐఎస్’ నిబంధనల కింద ‘ఎఫ్‌ఎఫ్‌వీ’లలో ‘ఇ85’ వినియోగాన్ని ‘మోనో-ఫ్యూయల్’ ప్రమాణంగా ప్రకటించారు. అలాగే, తొలుత ఢిల్లీ రాజధాని ప్రాంతం, ముంబై-పుణె-నాగ్‌పూర్ కారిడార్లలో 50-100 ‘ఎఫ్‌ఎఫ్‌వి’ సంసిద్ధ చిల్లర ఇంధన విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తారు. అటుపైన ఈ ఏడాది డిసెంబరు నాటికి 500 కేంద్రాల స్థాయికి పెంచాలని, 2027 ఆఖరుకల్లా ప్రధాన నగరాల్లో సుమారు 5,000 కేంద్రాల స్థాయికి విస్తరించాలని లక్ష్యనిర్దేశం చేసుకున్నారు.
దీంతోపాటు వినియోగం పెంపు దిశగా ప్రభుత్వ పరంగా ధరల మద్దతు, రహదారి పన్ను రాయితీ, ‘ఇ85’ టెస్టింగ్ ఇంధన లభ్యత, ‘ఎఫ్‌ఎఫ్‌వీ’లు, చిల్లర విక్రయ కేంద్రాలకు ప్రత్యేక గుర్తింపు చిహ్నాలు, వినియోగదారు అవగాహన కార్యక్రమాలు, నిల్వ-పంపిణీ మౌలిక సదుపాయాల కల్పన వంటి చర్యలు విస్తృతంగా చేపడతారు. ఇదంతా కేవలం ఇంధన మార్పిడికి పరిమితం కాదని, కాలుష్య రహిత రవాణా, ఇంధన భద్రత బలోపేతం, మరింత స్వావలంబన దిశగా సంపూర్ణ వ్యవస్థను సృష్టించడంలో అంతర్భాగమని శ్రీ పూరి విశదీకరించారు.
‘హీరో మోటోకార్ప్’ సంస్థ నిన్న ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లను ఆవిష్కరించగా, నేడు మారుతి సుజుకి ప్రయాణిక వాహనాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి గుర్తుచేస్తూ- కాలుష్య రహిత రవాణా రంగం దిశగా నవ శకంవైపు భారత్ ప్రస్థానానికి నాందిగా ఈ పరిణామాన్ని ఆయన అభివర్ణించారు.
భారత రవాణా రంగ కాలుష్య రహిత రూపాంతరీకరణ దిశగా మారుతి సుజుకి కృషిని ఈ సందర్భంగా శ్రీ హర్దీప్ సింగ్ పూరి అభినందించారు. భారత ఇంధన రూపాంతరీకరణ దేశీయంగానే సాకారం కాగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశీయ ఆవిష్కరణలు, రైతుల తోడ్పాటు, వినియోగదారుల ఆదరణ ఇందుకు నవ్యోత్తేజం ఇస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లోనూ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహన మోడళ్ల మార్కెట్ ప్రవేశాన్ని వేగిరపరచాలని ఆటోమొబైల్ తయారీదారులకు సూచించారు. అలాగే దేశవ్యాప్తంగ ‘ఇ85’ ఇంధన లభ్యతను వేగంగా విస్తరించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను కోరారు.
***
(रिलीज़ आईडी: 2269153)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam