రైల్వే మంత్రిత్వ శాఖ
పర్యావరణహితం, మరింత ఇంధన సమర్థత... త్వరలోనే పట్టాలెక్కనున్న తొలి స్వదేశీ హైడ్రోజన్ రైలు
జింద్-సోనిపట్ మార్గంలో గంటకు 75 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించేందుకు 1200 కిలోవాట్ల ఇంజన్ సామర్థ్యంతో కూడిన 10 బోగీల రైలుకు భారతీయ రైల్వే ఆమోదం
ఈ పరిణామంతో స్వచ్ఛమైన, సుస్థిరమైన రైలు కార్యకలాపాల కోసం హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను వినియోగిస్తున్న అగ్ర దేశాల సరసన చేరిన భారత్
నాడు పోస్టు చేయడమైనది:
27 MAY 2026 2:20PM by PIB Hyderabad
పర్యావరణహిత, సుస్థిర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్-సోనిపట్ మార్గంలో 10 బోగీలు కలిగిన ‘హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్’ ఆధారిత రైలుకు ఆమోదం తెలిపింది. ఈ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఇంజన్ సామర్థ్యంతో పనిచేస్తూ, గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికత హైడ్రోజన్‌ను ఉపయోగించి ఒక రసాయన ప్రక్రియ ద్వారా విద్యుత్‌ను తయారు చేస్తుంది. దీనివల్ల సాంప్రదాయ డీజిల్ ఇంజన్ల లాగా పొగ రాదు. కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. అందువల్ల పర్యావరణాన్ని పాడుచేసే సాంప్రదాయ డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలకు ఇది ఒక స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో హైడ్రోజన్ ఆధారిత రైలు వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా మంచి పరిష్కారంగా గుర్తింపు పొందుతున్నాయి. ఈ సరికొత్త సాంకేతికతను వినియోగిస్తున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి కొన్ని దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఈ సాంకేతికత ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ప్రస్తుతం ఇలాంటి రైళ్లను నడుపుతున్నాయి లేదా పరీక్షిస్తున్నాయి.
ఈ హైడ్రోజన్ రైలు ప్రయోగం కోసం హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గాన్ని పైలట్ మార్గంగా ఎంపిక చేశారు. ఈ రైలుకు అవసరమైన హైడ్రోజన్ కోసం స్వదేశీ సాంకేతికతతో జింద్ వద్ద హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కంప్రెస్డ్ హైడ్రోజన్ వాయును నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి అవసరమైన అధికారిక లైసెన్సును పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పీఈఎస్‌ఓ) మంజూరు చేసింది.
రైలుకు ఇంధనం నింపే ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా, నమ్మకంగా. సురక్షితంగా సాగడం కోసం ఒక ప్రత్యేక హైడ్రోజన్ సంపీడన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. దీనికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని, అత్యవసర విడిభాగాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఒకవేళ ప్రధాన వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తే వాడుకోవడానికి వీలుగా మరో కంప్రెసర్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలను నివారించడం కోసం హైడ్రోజన్ తయారీ, నిల్వ, ఇంధనం నింపే కేంద్రాల వద్ద హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు (లీకేజీని కనిపెట్టేవి), ఫ్లేమ్ డిటెక్టర్లు (మంటలను గుర్తించేవి) వంటి రకరకాల భద్రతా సెన్సార్లను అమర్చారు. ఇవి సరిగా పనిచేయడం కోసం వీటిపై దుమ్ము పేరుకుపోకుండా ఎప్పటికప్పుడూ తనిఖీ చేస్తూ, శుభ్రం చేయనున్నారు.
ఈ హైడ్రోజన్ రైలు, హైడ్రోజన్ ప్లాంటును ఎలా నడపాలి, ఎలా పర్యవేక్షించాలనే విషయాలపై ఆర్‌డీఎస్‌ఓ ఆమోదించిన అధికారిక నిర్వహణ పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచారు. ఢిల్లీలోని శకూర్ బస్తీ వద్ద ఏర్పాటు చేయబోయే ప్రత్యేక నిర్వహణ కేంద్రం కోసం అవసరమైన భద్రతా నిబంధనలు, క్రమబద్ధమైన తనిఖీలు, ప్రామాణిక నిర్వహణ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
రైల్వే శాఖ ఆమోదం ప్రకారం.. ఈ ప్రాజెక్టులో అత్యంత కఠినమైన భద్రతా, కార్యాచరణ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం నింపే వ్యవస్థను 24 గంటలూ నిరంతరం పర్యవేక్షిస్తారు. కీలకమైన పనుల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన, ధ్రువీకరించిన సిబ్బందిని మాత్రమే నియమిస్తారు. క్రమబద్ధమైన తనిఖీలు, నిర్వహణ షెడ్యూళ్లను అమలు చేస్తారు. రైలు ప్రయాణం మొదలైన ప్రారంభ దశలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడానికి, రైలు సజావుగా సాగడానికి శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు కూడా రైలులోనే ప్రయాణిస్తారు.
ఈ ప్రాజెక్టు సరికొత్త ఆవిష్కరణలు, ఇంధన పొదుపు, పర్యావరణ హిత రవాణా వ్యవస్థల పట్ల భారత రైల్వే నిబద్ధతను చాటిచెబుతోంది. భారత్ నిర్దేశించుకున్న స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాలకు, బొగ్గు ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలనే జాతీయ ఆశయాలకు ఈ ప్రాజెక్టు ఎంతో మద్దతుగా నిలుస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2265864)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18