హోం మంత్రిత్వ శాఖ
‘జనాభా సంబంధ మార్పులపై ఉన్నత స్థాయి కమిటీ’ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
· ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 15న ‘అత్యున్నత స్థాయి జనాభా కార్యక్రమం’ ప్రకటించిన నేపథ్యంలో సెప్టెంబరు 11నాటి కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ఆమోద ముద్ర
· చొరబాట్లు.. ఇతరత్రా కారణాల వల్ల జనాభాలో వచ్చే అసాధారణ మార్పులు వర్తమాన.. భవిష్యత్ కాలాల్లో ఏ దేశానికైనా పెనుసవాలే: కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
· జస్టిస్ (రిటైర్డ్) ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీలో జనగణన కమిషనర్ సహా శ్రీ దుర్గా శంకర్ మిశ్రా (రిటైర్డ్ ఐఏఎస్).. శ్రీ బాలాజీ శ్రీవాస్తవ (రిటైర్డ్ ఐపీఎస్).. డాక్టర్ షమికా రవి సభ్యులుగా ఉంటారు
· జనాభా సంబంధ మార్పు దేశ సార్వభౌమాధికారానికే గాక జాతీయ భద్రత.. శాంతిభద్రతలు.. సామాజిక స్వరూపంలో పెనుమార్పులు.. గిరిజన తెగల రక్షణతో ముడిపడిన తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది
· అక్రమ వలసలు.. ఇతర అసాధారణ కారణాల వల్ల దేశమంతటా సంభవిస్తున్న జనాభా సంబంధ మార్పులపై సమగ్ర అంచనాలు రూపొందించనున్న కమిటీ
· మత.. సామాజిక స్థాయులలో అసాధారణ జనాభా సంబంధ మార్పుల సరళిపై విశ్లేషణ సహా సామాజిక వర్గాలతో సంయుక్తంగా సమస్య పరిష్కారం దిశగా సువ్యవస్థిత.. నిర్దిష్ట వ్యవధి సహిత మార్గాలపై కమిటీ సిఫారసులు
· నివేదిక సమర్పణ కోసం కమిటీకి ఏడాది గడువు... అవసరమైతే మరో ఆరు నెలల పొడిగింపు
నాడు పోస్టు చేయడమైనది:
26 MAY 2026 5:30PM by PIB Hyderabad
· దేశంలోకి అక్రమ వలసలు... చొరబాట్లు సహా ఇతరత్రా అసాధారణ కారణాలతో తలెత్తే జనాభా సంబంధ మార్పులపై అధ్యయనం, పరిష్కారాలపై సిఫారసుల దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 15న ‘అత్యున్నత స్థాయి జనాభా కార్యక్రమం’ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రిమండలి అదే ఏడాది సెప్టెంబరు 11న దీనికి ఆమోదం తెలిపింది.
· ఈ ఉన్నతస్థాయి కమిటీకి జస్టిస్ (రిటైర్డ్) ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ అధ్యక్షత వహిస్తుండగా, జనగణన కమిషనర్ సహా శ్రీ దుర్గా శంకర్ మిశ్రా (రిటైర్డ్ ఐఏఎస్), శ్రీ బాలాజీ శ్రీవాస్తవ (రిటైర్డ్ ఐపీఎస్), డాక్టర్ షమికా రవి ఇందులో సభ్యులుగా ఉంటారు. దీనికి హోం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి (విదేశీయులు-I) సభ్య కార్యదర్శిగా పనిచేస్తారు. ఉన్నత స్థాయి కమిటీ ఏడాదిలోగా నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అయితే, అవసరమైన పక్షంలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఈ వ్యవధిని మరో ఆరు నెలలు పొడిగించవచ్చు.
· ఈ అంశాన్ని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ఈ మేరకు “అక్రమ వలసలు, చొరబాట్లు వంటి ఇతరత్రా అసాధారణ కారణాల వల్ల దేశమంతటా సంభవించే జనాభా సంబంధ మార్పులు వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఏ దేశానికైనా పెనుసవాలే. ఈ పరిస్థితిని ఎదుర్కొనడానికే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 15న ‘జనాభా సంబంధ మార్పులపై అత్యున్నత స్థాయి కార్యక్రమాన్ని ప్రకటించారు. తదనుగుణంగా ప్రభుత్వం ఇప్పుడీ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో జనగణన కమిషనర్‌తోపాటు శ్రీ దుర్గా శంకర్ మిశ్రా (రిటైర్డ్ ఐఏఎస్), శ్రీ బాలాజీ శ్రీవాస్తవ (రిటైర్డ్ ఐపీఎస్), డాక్టర్ షమికా రవి సభ్యులుగా ఉంటారు. దీనికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (విదేశీయులు-I) సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. జనాభా సంబంధ మార్పు దేశ సార్వభౌమాధికారానికే గాక జాతీయ భద్రత, శాంతిభద్రతలు, సామాజిక స్వరూపంలో పెనుమార్పులు సహా గిరిజన తెగల రక్షణతో ముడిపడిన తీవ్ర సమస్యగా పరిణమిస్తుంది” అని పేర్కొన్నారు.
· ఈ నేపథ్యంలో అక్రమ వలసలు, ఇతర అసాధారణ కారణాల వల్ల దేశమంతటా సంభవిస్తున్న జనాభా సంబంధ మార్పులపై ఈ కమిటీ సమగ్ర, శాస్త్రీయ అంచనాలు రూపొందిస్తుంది. అంతేకాకుండా మత, సామాజిక స్థాయులలో అసాధారణ జనాభా సంబంధ మార్పుల సరళిపై విశ్లేషణ సహా సామాజిక వర్గాలతో సంయుక్తంగా సమస్య పరిష్కారం దిశగా తగిన సువ్యవస్థిత, నిర్దిష్ట వ్యవధి సహిత విధాన, శాసన, పరిపాలన చర్యలను సిఫారసు చేస్తుంది” అని తెలిపారు. ఈ కమిటీ ప్రతిపాదిత స్వరూపం, విధివిధానాలు కింది విధంగా ఉన్నాయి:
· అక్రమ వలసల వల్ల దేశంలో సంభవించే జనాభా సంబంధ మార్పులతో తలెత్తే సవాళ్లపై సమగ్ర చర్చ.
· సరిహద్దులలో అక్రమ (వలసలు సహా) కార్యకలాపాలు, ఆర్థిక అవకాశాలు, ఇతర సామాజిక-పర్యావరణ కారకాల వంటి జనాభా సంబంధ మార్పులకు దారితీసే అంశాలపై అధ్యయనం.
· అక్రమ వలసలు, అసాధారణ నివాస కార్యకలాపాలు, వ్యూహాత్మక వలసలు సహా ఈ మార్పుల వెనుకగల అంతర్లీన కారకాల గుర్తింపు.
· మత లేదా సామాజిక వర్గాల స్థాయిలో జనాభా స్వరూపంలో.... ముఖ్యంగా అవి విస్తృత ధోరణులకు భిన్నంగా ఉన్నపుడు మార్పులపై విశ్లేషణ.
· దేశంలో ఇప్పటికే నివసిస్తున్న అక్రమ వలసదారుల చట్టబద్ధ, నిష్పక్షపాత, నిర్దిష్ట వ్యవధి సహిత గుర్తింపు-నిర్బంధం-బహిష్కరణ దిశగా క్రమబద్ధ, శాశ్వత కార్యాచరణ యంత్రాంగం ఏర్పాటుపై సిఫారసులు.
· సరిహద్దుల నిర్వహణ, జనాభా స్థిరీకరణ సహా సదరు ధోరణులపై నిరంతర పర్యవేక్షణ కోసం గుర్తింపు వ్యవస్థలను బలోపేతానికి తగిన సంస్థాగత యంత్రాంగం రూపకల్పనపై సిఫారసులు.
· అక్రమ వలసలు, తత్ఫలితంగా సంభవించే జనాభా అసమతౌల్యం సంబంధిత అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెంపు దిశగా సమగ్ర విధాన చట్రం రూపకల్పనకు ప్రతిపాదన.
· అక్రమ వలసలు సహా జనాభా సంబంధ మార్పులతో తలెత్తే సవాళ్ల పరిష్కారానికి సముచితమని పరిగణించే ఇతరత్రా చర్యలను కూడా కమిటీ సిఫారసు చేయవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2265631)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6