హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆపరేషన్‌ రేజ్‌పిల్‌: అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థను ఛేదించిన ఎన్సీబీ… మధ్యప్రాచ్యంలో ఉపయోగించే క్యాప్టగాన్ సైకోట్రోపిక్ పదార్థం తొలిసారిగా భారత్‌లో స్వాధీనం


ఆపరేషన్‌ రేజ్‌పిల్‌ను విజయవంతం చేసిన ఎన్సీబీ అధికారుల ధైర్యసాహసాలను అభినందించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి

ఆపరేషన్ రేజ్‌పిల్‌ ద్వారా తొలిసారిగా జిహాదీ డ్రగ్‌గా పిలిచే క్యాప్టగాన్ స్వాధీనం

మధ్యప్రాచ్యానికి తరలిస్తున్న భారీ డ్రగ్స్‌ రవాణాను అడ్డుకోవటం, మాదక ద్రవ్యాలపై జీరో టోలరెన్స్‌ అనే మోదీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం

భారత సరిహద్దులను రవాణా మార్గంగా ఉపయోగించుకుంటూ దేశంలోకి అక్రమంగా వచ్చే, బయటికి వెళ్లే ప్రతి గ్రాము మత్తు పదార్థాన్ని అడ్డుకుంటామని స్పష్టం

డ్రగ్స్ మూలాలు, హవాలా లింకులు, రవాణా వ్యవస్థ, అంతర్జాతీయంగా డ్రగ్స్ తీసుకునేవారు, విస్తృత అంతర్జాతీయ డ్రగ్స్ వ్యవస్థపై ఎన్సీబీ సమగ్ర విచారణ ప్రారంభం

రూ.182 కోట్ల విలువైన 227.7 కిలోల క్యాప్టగాన్ మాత్రలు, పౌడర్ స్వాధీనం... అంతర్జాతీయ ముఠాతో సంబంధమున్న సిరియా పౌరుడి అరెస్ట్‌

నాడు పోస్టు చేయడమైనది: 16 MAY 2026 2:06PM by PIB Hyderabad

ఆపరేషన్ రేజ్‌పిల్‌ ద్వారా అంతర్జాతీయ డ్రగ్స్ అక్రమ రవాణా వ‌్యవస్థపై జరిపిన దాడిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఒక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను విజయవంతంగా బహిర్గతం చేసింది. క్యాప్టగాన్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఈ ముఠా నుంచి సుమారు 227.7 కిలోల క్యాప్టగాన్ మాత్రలు, పౌడర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిండికేట్‌లో సభ్యుడై, వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటున్న సిరియా దేశస్థుడిని అరెస్ట్ చేశారు. క్యాప్టగాన్‌లో ఉండే ఫెనెటిలిన్, యాంఫెటమైన్‌లను మానసిక స్థితిని ప్రభావితం చేసే పదార్థాలుగా ఎన్‌డీపీఎస్‌ చట్టం గుర్తించింది.

ఆపరేషన్ రేజ్‌పిల్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు ఎన్సీబీ ధైర్యసాహసాలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అభినందించారు. ఆపరేషన్ రేజ్‌పిల్‌ ద్వారా "జిహాదీ డ్రగ్"గా పిలిచే క్యాప్టగాన్‌ను దేశంలోనే మొదటిసారిగా స్వాధీనం చేసుకుని మన ఏజెన్సీలు విజయాన్ని సాధించాయని శ్రీ అమిత్ షా పేర్కొన్నారు.

"'మాదకద్రవ్య రహిత భారత్' నిర్మాణానికి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 'ఆపరేషన్ రేజ్‌పిల్' ద్వారా దర్యాప్తు సంస్థలు రూ.182 కోట్ల విలువైన 'జిహాదీ డ్రగ్'గా పిలిచే క్యాప్టగాన్‌ను దేశంలోనే తొలిసారిగా స్వాధీనం చేసుకున్నాయని చెప్పటానికి నేను సంతోషిస్తున్నాను. మధ్యప్రాచ్యానికి తరలిస్తున్న ఈ డ్రగ్స్ రవాణాను అడ్డుకోవటం, విదేశీ పౌరుడిని అరెస్ట్ చేయటం.. మాదకద్రవ్యాల పట్ల మాకున్న జీరో టాలరెన్స్ నిబద్ధతకు నిదర్శనాలు. భారతదేశంలోకి ప్రవేశించే ప్రతి గ్రాము డ్రగ్స్‌ను, మన భూభాగాన్ని రవాణా మార్గంగా వినియోగిస్తూ దేశం దాటిపోయే ప్రతి గ్రాము డ్రగ్స్‌ను మేం అడ్డుకుంటామని నేను మరోసారి స్పష్టం చేస్తున్నా. అప్రమత్తతతో, ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఎన్సీబీ వీరులకు నా అభినందనలు" అని శ్రీ అమిత్ షా 'ఎక్స్' పోస్టులో పేర్కొన్నారు.

విదేశీ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ నుంచి అందిన సమాచారం ప్రకారం.. క్యాప్టగాన్ అక్రమ రవాణాకు, భారతదేశాన్ని రవాణా మార్గంగా వినియోగించుకుంటున్నట్లు తెలిసింది. ఈ సమాచారం ఆధారంగా దర్యాప్తు చేయగా.. మే 11, 2026న న్యూఢిల్లీలోని నెబ్ సరాయ్‌లో ఓ ఇంట్లో జరిపిన సోదాల్లో దాదాపు 31.5 కిలోల క్యాప్టగన్ మాత్రలు లభ్యమయ్యాయి. వీటిని ఒక కమర్షియల్ చపాతీ కట్టింగ్ మెషీన్‌లో దాచిపెట్టారు. ఈ మాత్రలను సౌదీ అరేబియాలోని జెడ్డాకు ఎగుమతి చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న సిరియా దేశస్థుడు 15.11.2024న టూరిస్ట్ వీసాపై భారతదేశానికి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అతని వీసా గడువు 12.01.2025తో ముగిసినప్పటికీ అక్రమంగా భారత్‌లోనే ఉంటూ నెబ్ సరాయ్‌లో ఇల్లును అద్దెకు తీసుకున్నాడు.

నిందితుడిని విచారించటం ద్వారా మే 14, 2026న గుజరాత్‌లోని ముంద్రాలో ఉన్న కంటైనర్ ఫెసిలిటేషన్ స్టేషన్ (సీఎఫ్ఎస్)లోని ఒక కంటైనర్ నుంచి సుమారు 196.2 కిలోల క్యాప్టగాన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సిరియా నుంచి దిగుమతైన ఆ కంటైనర్‌లో గొర్రె ఉన్ని ఉన్నట్లు తేల్చారు. తర్వాత ఆ కంటైనర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. 196.2 కిలోల క్యాప్టగాన్ పౌడర్ ఉన్న 3 బ్యాగులు బయటపడ్డాయి. ఈ స్వాధీనం చేసుకున్న సరకును గల్ఫ్ ప్రాంతానికి, ముఖ్యంగా సౌదీ అరేబియా, మధ్యప్రాచ్య దేశాలకు తరలించనున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఆయా దేశాల్లో చట్టాన్ని కాపాడే సంస్థలకు, ప్రజారోగ్యానికి క్యాప్టగాన్ వాడకం పెద్ద సమస్యగా మారింది.

ఆపరేషన్ రేజ్‌పిల్ ద్వారా సుమారు 227.7 కిలోల క్యాప్టగాన్ మాత్రలు, పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గల్ఫ్, మధ్యప్రాచ్య దేశాల్లోని మార్కెట్లలో దీని అక్రమ అంతర్జాతీయ మార్కెట్ విలువ సుమారు రూ.182 కోట్లు ఉంటుందని అంచనా.

భారతదేశంలో తొలిసారిగా క్యాప్టగాన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు భారత్‌ను రవాణా కేంద్రంగా మార్చుకునేందుకు చేసిన ప్రయత్నాలను ఈ ఆపరేషన్ బహిర్గతం చేసింది. వివిధ దేశాల పరిధిలో విస్తరించిన ఇలాంటి అంతర్జాతీయ మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యవస్థలను గుర్తించి, అడ్డుకోవటంలో, వాటిని పూర్తిగా నిర్మూలించటంలో అంతర్జాతీయ నిఘా సమాచార మార్పిడి, చట్టాన్ని అమలు చేసే సంస్థల మధ్య సహకారం కీలకమైనదని ఈ సంఘటన నిరూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణ సంస్థలు చేతులు కలిపితే ఇలాంటి అంతర్జాతీయ ముఠాలను పూర్తిగా నిర్మూలించవచ్చు.

ఇటీవలే ముంబైలో ఎన్సీబీ చేపట్టిన మరో పెద్ద ఆపరేషన్‌లో ఈక్వడార్ నుంచి వచ్చిన కంటైనర్లో 349 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఘటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వివిధ ప్రాంతాలకు మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసేందుకు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు వాణిజ్య కార్గో, కంటైనర్ రవాణా మార్గాలను దుర్వినియోగం చేస్తున్నాయని ఈ ఘటనలు సూచిస్తున్నాయి.

ఈ సిండికేట్‌కు సంబంధించిన డ్రగ్స్ సేకరణ, వాటి ఆర్థిక, హవాలా సంబంధాలు, రవాణా సదుపాయాలు కల్పించేవారు, అంతర్జాతీయంగా వీటిని వినియోగించేవారిని, విస్తృతమైన అంతర్జాతీయ వ్యవస్థను గుర్తించేందుకు ఎన్సీబీ సమగ్ర విచారణను ప్రారంభించింది. గ్లోబల్ డ్రగ్ ట్రాఫికింగ్, డ్రగ్స్ దుర్వినియోగం వంటి ప్రపంచవ్యాప్త సమస్యను సమష్టిగా ఎదుర్కొనేందుకు.. ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం, డ్రగ్ కింగ్‌పిన్ల అప్పగింత, నార్కో-టెర్రరిజం, డ్రగ్ కార్టెల్స్‌పై సమన్వయ చర్యల ద్వారా అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్‌ కట్టుబడి ఉంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో.. మాదకద్రవ్యాల వినియోగంపై జీరో టోలరెన్స్ విధానం పట్లు ఎన్సీబీ తిరుగులేని నిబద్ధతను స్పష్టం చేసింది. సరిహద్దులు దాటి కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలను అణచివేసేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఎన్సీబీ నిరంతరం సమన్వయంతో పనిచేస్తోంది. మత్తు పదార్థాలకు సంబంధించిన ఎలాంటి సమాచారమైనా మానస్ హెల్ప్‌లైన్ (టోల్-ఫ్రీ నంబర్: 1933) ద్వారా తెలియజేయాలని పౌరులను ఎన్సీబీ కోరుతోంది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.

***


(రిలీజ్ ఐడి: 2261832) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , Bengali , Assamese , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam