గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
కార్మికుల జీవితాల్లో ఓ నవోదయం: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
కొత్త గ్రామీణ ఉపాధి చట్టంతో కార్మికులు, రైతులు, గ్రామాలు మూడింటికీ సాధికారత: శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
వికసిత్ భారత్ దిశగా మరో ముందడుగు.. వీబీ-జీ రామ్ జీ చట్టం నోటిఫికేషన్ విడుదల: కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో జూలై 1 నుంచి గ్రామీణ భారత్‌లో ఉపాధి నవశకం..ఇకపై 100 రోజులు కాదు, 125 రోజుల పని హామీ: శ్రీ శివరాజ్ సింగ్
గ్రామాల రూపురేఖలు మార్చేందుకు రూ. 1.51 లక్షల కోట్లు... ఉపాధి నుంచి మౌలిక సదుపాయాల వరకు భారీ ప్రచార కార్యక్రమం:శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్
సకాలంలో వేతనాలు, జాప్యానికి పరిహారం, పని కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి: కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్
నాడు పోస్టు చేయడమైనది:
11 MAY 2026 3:00PM by PIB Hyderabad
భారత గ్రామీణ అభివృద్ధి చరిత్రలో ఒక కీలక మైలురాయి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘వికసిత్ భారత్-ఉపాధి, జీవనోపాధి హామీ మిషన్ (గ్రామీణ) చట్టం’ అమలుకు సంబంధించి మే 11, 2026 (నేడు) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని క్లుప్తంగా వీబీ-జీ రామ్ జీ చట్టం అని కూడా పిలుస్తారు. ఈ చట్టం జులై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఈ నూతన చట్టం గ్రామీణ పేదలు, కార్మిక కుటుంబాలు, మహిళలు, స్వయం సహాయక సంఘాలు, రైతుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తుందని కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. మెరుగైన ఆదాయ భద్రతకు, భారీ స్థాయి సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ చట్టం మార్గం సుగుమం చేస్తుందని తెలిపారు.
నేడు భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘వికసిత్ భారత్ జీ-రామ్ జీ’ చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైనట్లు కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. జులై 1వ తేదీ నుంచి ఈ చట్టం అమలులోకి వస్తుందని, దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోరుకునే కార్మికులకు ఏడాదికి కల్పించే పని దినాలను గతంలో ఉన్న 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త చట్టం అమలులోకి వచ్చే వరకు (జులై 1 లోపు) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిబంధనలే అమలులో ఉంటాయని అన్నారు. ఆ లోపు పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ఉపాధి హామీ పథకం కిందనే పూర్తి అవుతాయని చెప్పారు. రాష్ట్రాలతో విస్తృతస్థాయి సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ కొత్త చట్టానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని తెలిపారు. మార్పు ప్రక్రియలో ఏ ఒక్క కార్మికుడు కూడా ఉపాధికి దూరం కాకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ఉపాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
‘వికసిత్ భారత్ జీ-రామ్ జీ’ కార్యక్రమం కోసం అవసరమైన సన్నాహాలను పూర్తి చేసుకోవడానికి చాలా రాష్ట్రాలకు గరిష్టంగా ఆరు నెలల సమయం ఉంటుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. జూలై 1వ తేదీ నాటికి ఏ రాష్ట్రమైనా అవసరమైన సన్నాహాలను పూర్తి చేయడంలో విఫలమైనప్పటికీ.. జూలై 1 తర్వాత చేపట్టే పనులకు సంబంధించిన నిధుల విధానం ‘వికసిత్ భారత్ జీ-రామ్ జీ’ పథకం నిబంధనల ప్రకారమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ పథకం ద్వారా ఉపాధి కల్పించేందుకు భారత ప్రభుత్వం తన బడ్జెట్‌లో రూ. 95,000 కోట్లకు పైగా నిధులను కేటాయించిందని కేంద్రమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్రాలు కూడా తమ బడ్జెట్‌లలో తగిన నిబంధనలు చేసుకున్నాయని...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కేటాయింపులు కలిపి మొత్తం రూ. 1,51,000 కోట్లకు పైగా ఉంటాయని వివరించారు.
కార్మికులకు చెల్లించే వేతనాల ప్రక్రియపై మంత్రి మాట్లాడుతూ..డబ్బు నేరుగా వారి బ్యాంకు లేదా తపాలా శాఖ ఖాతాల్లోకి జమ చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు. వేతనాలను కేవలం మూడు రోజుల్లోనే చెల్లించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని... అయితే గరిష్టంగా 15 రోజుల్లోపు అన్ని ప్రక్రియలు పూర్తి చేసి నిధులు కార్మికుల ఖాతాల్లోకి చేరాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఒకవేళ 15 రోజులు దాటినప్పటికీ వేతనం అందకపోతే సదరు కార్మికులు ఆలస్య చెల్లింపు పరిహారం పొందేందుకు అర్హులని, చెల్లింపులో జాప్యం జరిగినందుకు అదనపు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
కార్మికుల సంక్షేమానికి ఈ పథకం ఒక సమగ్ర కవచంలా పనిచేస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ అభివర్ణించారు. పని కావాలని కోరినప్పుడు ఉపాధి కల్పించలేకపోతే, సదరు కార్మికుడికి తప్పనిసరిగా నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏటా కేటాయించే రూ. 1.51 లక్షల కోట్ల భారీ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను భారీ ఎత్తున చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ పథకం ద్వారా కేవలం ఉపాధి మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరమైన మౌలిక వసతుల కల్పన జరుగుతుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ముఖ్యంగా నీటి సంరక్షణ పనులు, రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఈ కార్యక్రమం తోడ్పడుతుందని వివరించారు. ఉపాధి కల్పన కార్యకలాపాల్లో భాగంగా.. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అవసరమైన పని షెడ్లు వంటి మౌలిక సదుపాయాలను కూడా ఈ పథకం కింద నిర్మించవచ్చని తెలిపారు. ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ పథకం ద్వారా చేపట్టే ప్రత్యేక పనుల గురించి మంత్రి ప్రస్తావించారు. నదీ తీర గ్రామాలు లేదా నీరు నిలిచే ప్రాంతాల్లో రక్షణ గోడల నిర్మాణం వంటి పనులను కూడా ఇందులో చేర్చినట్లు వెల్లడించారు. ఈ పనుల్లో నిమగ్నమయ్యే కార్మికులకు వేతనాలు సకాలంలో, తగిన విధంగా అందేలా చూడటం కోసం పరిపాలనా వ్యయ కేటాయింపును గతంలో ఉన్న 6 శాతం నుంచి 9 శాతానికి పెంచినట్లు ఆయన ప్రకటించారు.
ఇది కార్మికుల జీవితాల్లో నూతన శకానికి నాంది అని కేంద్ర మంత్రి శ్రీ చౌహాన్ తెలిపారు. ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి ‘వికసిత్ గ్రామాలు’ పునాది అని, ఆ సంకల్పాన్ని నెరవేర్చడంలో ఈ పథకం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2259858)
సందర్శకుల సూచీ సంఖ్య : : 17