ప్రధాన మంత్రి కార్యాలయం
కౌలాలంపూర్లో 22వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2025 9:31PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025, అక్టోబర్ 26న జరిగిన 22వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సులో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఆసియాన్-ఇండియా సంబంధాల్లో సాధించిన పురోగతిని ప్రధానమంత్రి, ఆసియాన్ నాయకులు సంయుక్తంగా సమీక్షించారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలపై చర్చించారు. భారత్-ఆసియాన్ సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది 12వ సారి.
ఆసియాన్‌లో 11వ సభ్యదేశంగా మారిన తైమూర్ లెస్ట్‌కు ప్రధానమంత్రి తన ప్రసంగంలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసియాన్ లో పూర్తి సభ్యదేశంగా, ఆసియాన్-ఇండియా సదస్సుకు మొదటిసారిగా హాజరైన ఆ దేశ ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఆ దేశ మానవ వనరుల అభివృద్ధికి భారత్ నిరంతర తోడ్పాటు అందిస్తుందని తెలియజేశారు.
ఇండో-పసిఫిక్ ప్రాంతంపై ఆసియాన్ ఐక్యత, ఆసియాన్ కేంద్రక, ఆసియాన్ దృక్పథానికి భారత్ అందించే తోడ్పాటును పునరుద్ఘాటించారు. ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2045ను స్వీకరించిన ఆసియాన్‌ను ప్రధాని ప్రశంసించారు.
ఈ ప్రాంత ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు, ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు మన సంబంధాల పూర్తి ఆర్థిక సామర్థ్యాన్ని ఆసియాన్-ఇండియా ఎఫ్‌టీఏ (ఏఐటీఐజీఏ) ముందస్తు సమీక్ష ఆవిష్కరిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
అంతర్జాతీయ శాంతిభద్రతలకు ఉగ్రవాదం పెనుముప్పుగా పరిణమించిందని ప్రధానమంత్రి అన్నారు. దానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాల్సిన ప్రాధాన్యతను వివరించారు.
మలేషియా అధ్యక్షత వహిస్తున్న ‘‘సమ్మిళిత్వం, సుస్థిరత్వం’’ అనే ఇతివృత్తానికి మద్దతుగా ప్రధాని ప్రకటించిన అంశాలు:
-
ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (2026-2030)ను అమలు చేసేందుకు ఆసియాన్-ఇండియా కార్యాచరణ ప్రణాళిక అమలుకు విస్తృత మద్ధతు.
-
ఆసియాన్-ఇండియా పర్యాటక సంవత్సరాన్ని నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈ రంగంలో సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు ఆసియాన్-ఇండియా నాయకుల సంయుక్త ప్రకటనను ఆమోదించడం.
-
సముద్ర ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి 2026ను ‘‘ఆసియాన్-ఇండియా సముద్ర వాణిజ్య సహకార సంవత్సరం’’గా ప్రకటించడం.
-
సురక్షితమైన సముద్ర వాణిజ్యానికి ఆసియాన్-ఇండియా రక్షణ మంత్రుల రెండో సమావేశం, రెండో ఆసియాన్-ఇండియా సముద్ర విన్యాసాలను నిర్వహించాలని ప్రతిపాదన.
-
పొరుగుదేశాల్లో సంక్షోభాలు ఎదురైన సమయంలో మొదట ప్రతిస్పందించే దేశంగా తన పాత్రను భారత్ పోషిస్తుంది. విపత్తు సన్నద్ధత, హెచ్ఏడీఆర్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
-
ఆసియాన్ పవర్ గ్రిడ్ కార్యక్రమానికి తోడ్పాటు అందించేలా పునరుత్పాదక విద్యుత్‌లో 400 మంది నిపుణులకు శిక్షణ ఇవ్వడం.
-
తైమూర్ లెస్ట్ కోసం తక్షణ ప్రభావాన్ని చూపించే ప్రాజెక్టు (క్యూఐపీ)ల విస్తరణ
-
ప్రాంతీయ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసేందుకు నలంద విశ్వవిద్యాలయంలో ఆగ్నేయాసియా అధ్యయన కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదన.
-
విద్య, ఇంధనం, శాస్త్ర సాంకేతికత, ఫిన్‌టెక్, సాంస్కృతిక పరిరక్షణలో కొనసాగుతున్న సహకారానికి మద్దతివ్వడంతో పాటు.. మౌలిక వసతులు, సెమీ కండక్టర్, నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, అరుదైన, కీలకమైన ఖనిజాల విషయంలో సహకారాన్ని విసర్తించుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.
-
గుజరాత్‌లోని లోథాల్‌లో తూర్పు ఆసియా సముద్ర వాణిజ్య వారసత్వ ఉత్సవాన్ని, సముద్ర వాణిజ్య భద్రతలో సహకారంపై సదస్సు నిర్వహించడం.
22వ ఆసియాన్-ఇండియా సదస్సును వర్చువల్‌గా నిర్వహించినందుకు, దానికి తగిన ఏర్పాట్లు చేసినందుకు మలేషియా ప్రధాని దాతో సెరీ అన్వర్ ఇబ్రహీంకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. దేశాలను సమర్థవంతంగా సమన్వయం చేసిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కస్ జూనియర్‌కు కూడా ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. ఆసియాన్‌కు దీర్ఘకాలంగా మద్ధతు అందిస్తున్న, యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఈ ప్రాంతంతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకొనేందుకు నిరంతరం అంకితభావాన్ని కనబరుస్తున్న భారత్‌ను ఆసియాన్ నాయకులు ప్రశంసించారు.
****
(రిలీజ్ ఐడి: 2254280)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam