పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమ ఆసియా పరిణామాల నేపథ్యంలో కేంద్రం చర్యలను మీడియాకు వివరించిన అంతర్-మంత్రిత్వ శాఖలు


పశ్చిమ ఆసియా సంక్షోభం వేళ చమురు వినియోగం తగ్గించేందుకు విద్యుత్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేస్తున్న కేంద్రం

ఈవీల తయారీ, వినియోగం తగ్గకుండా ఉండేందుకు పీఎం ఈ- డ్రైవ్ పథకం పొడిగింపు

పరిశ్రమల్లో 98% శాతానికి పెరిగిన ఆన్‌లైన్ ఎల్పీజీ బుకింగ్స్

సాధారణ స్థాయికి వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా; అంతరాయం కలగకుండా ఆదివారం కూడా పని చేసిన పంపిణీ సంస్థలు

అక్రమ నిల్వలపై మార్చి 2026 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1.28 లక్షల దాడులు: 59,000 పైగా సిలిండర్ల స్వాధీనం

హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటి రేపు కాండ్లా చేరుకోనున్న భారతీయ నౌక 'జగ్ విక్రమ్'

గత 24 గంటల్లో 93 మందితో కలిపి, గల్ఫ్ ప్రాంతం నుంచి క్షేమంగా స్వదేశానికి చేరుకున్న 2,177 మంది భారతీయ నావికులు

ఆ ప్రాంతంలోని నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బందికి సహాయం అందిస్తూ, తిరిగి రావాలనుకునే వారిని క్షేమంగా పంపిస్తున్న రాయబార కార్యాలయాలు

నాడు పోస్టు చేయడమైనది: 13 APR 2026 6:08PM by PIB Hyderabad

పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితులపై సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈరోజు నేషనల్ మీడియా సెంటర్‌లో ఒక సమావేశం నిర్వహించింది. ఇంధన నిల్వలు, సముద్రయాన కార్యకలాపాలు, అక్కడ ఉన్న భారతీయులకు అందుతున్న సహాయం, కీలక రంగాల స్థిరత్వం కోసం తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం - సహజ వాయువు, నౌకాయాన- జలమార్గాల శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు మీడియాకు వివరించారు. భారీ పరిశ్రమల శాఖ కూడా తమ రంగానికి సంబంధించిన తాజా వివరాలను వెల్లడించింది.

భారీ పరిశ్రమల రంగం

ప్రపంచవ్యాప్త అనిశ్చితుల మధ్య భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ విద్యుత్  వాహనాల వినియోగాన్ని, కీలక ఖనిజాల తయారీని వేగవంతం చేసింది. ఆ వివరాలు:

  • పశ్చిమ ఆసియా భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. ఇది ఇంధన ధరల స్థిరత్వం, సరఫరా వ్యవస్థలో తలెత్తే ఆటంకాలపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.

  • ఈ పరిణామాలు శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని, స్వచ్ఛ ఇంధన సాంకేతికతకు అవసరమైన కీలక ఖనిజాల తయారీలో స్వదేశీ సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను స్పష్టం చేశాయి. 

  • సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి విద్యుత్ వాహనాల వృద్ధిని కొనసాగించడానికి, వాటి విడిభాగాల సరఫరా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడానికి మంత్రిత్వ శాఖ సమన్వయ చర్యలు చేపట్టింది.

  • ఈవీల వాడకాన్ని, తయారీ వేగాన్ని కొనసాగించడానికి రూ.10,900 కోట్ల పీఎం ఈ -  డ్రైవ్ పథకం పొడిగింపునకు మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.

  • ఇ-2డబ్ల్యూ విభాగాన్ని జూలై 31, 2026 వరకు మూడు నెలల పాటు పొడిగించారు.

  • ఇ-రిక్షాలు, ఇ-కార్టులతో సహా ఇ-3డబ్ల్యూ విభాగాన్ని 31 మార్చి 2028 వరకు రెండు ఏళ్ల పాటు పొడిగించారు.

  • ప్రోత్సాహకాలు నిరంతరం అందేలా చూడటానికి, ఈవీల వినియోగాన్ని పెంచడానికి, స్వదేశీ తయారీని ప్రోత్సహించడానికి పీఎం ఈ -  డ్రైవ్  పథకం కింద విధానపరమైన మద్దతును క్రమబద్ధీకరించారు.

  • సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపిఎం) తయారీని రూ. 7,280 కోట్లతో ప్రోత్సహించే పథకానికి కేంద్ర మంత్రిమండలి 26 నవంబర్ 2025న ఆమోదం తెలిపింది.

  • భారత్ లో  6,000 ఎంటీపీఏ  సమీకృత ఆర్ఈపిఎం తయారీ సామర్థ్యాన్ని నెలకొల్పడం ఈ పథకం లక్ష్యం. ఇది సింటర్డ్ ఆర్ఈపిఎం స్వదేశీ తయారీని ప్రోత్సహించడం, ఈవీ, రక్షణ, అంతరిక్ష రంగాల సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్, నెట్ జీరో 2070 లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది.

  • ఈవీ విడిభాగాల తయారీని స్థానికంగా పెంచడానికి ఆర్ఈపిఎం పథకాన్ని అమలు చేసే చర్యలు చేపట్టారు. 

  • సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారులు (ఓఈఎంలు), విడిభాగాల తయారీదారులు, పరిశ్రమ భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

  • అమలులో భాగంగా, ఏప్రిల్ 7, 2026న 25 ప్రముఖ కంపెనీల భాగస్వామ్యంతో 'ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్' నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనల అభ్యర్థన (ఆర్ఈపీ) మార్చి 20, 2026న జారీ అయింది.

  • బిడ్డింగ్ ప్రక్రియను సీపీపీ పోర్టల్ ద్వారా పారదర్శకమైన రెండు విధాలైన లీస్ట్ కాస్ట్ సెలక్షన్ (ఎల్సీఎస్) పద్ధతిలో నిర్వహిస్తున్నారు.

  • ఈవీ తయారీలో స్వదేశీ విలువను పెంచడానికి ప్రస్తుతం కొనసాగుతున్న దశలవారీ తయారీ కార్యక్రమం (పీఎంపీ) ఈ చర్యలకు తోడ్పాటునందిస్తోంది.

  • పీఎం ఈ- డ్రైవ్, ఆర్ఈపీఎం, పీఎంపీ పథకాల ఉమ్మడి అమలు ఎలక్ట్రిక్ వాహనాల విలువ వ్యవస్థ మొత్తాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

  • పీఎం ఈ- డ్రైవ్ పథకం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి, ఉత్పత్తిని విస్తరించడానికి తయారీదారులకు అవసరమైన డిమాండ్ మద్దతును, విధానపరమైన భరోసాను అందిస్తుంది.

  • విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, కీలకమైన అరుదైన భూ ఆధారిత విడిభాగాలను స్వదేశీ తయారీ ద్వారా అభివృద్ధి చేయడం ద్వారా ఆర్ఈఎంపీ పథకం సరఫరా లోపాలను సరిదిద్దుతుంది.

  • ఈవీ ఉప వ్యవస్థల తయారీలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ, దశలవారీగా స్వదేశీకరణ చేయడానికి పీఎంపీ తోడ్పడుతుంది.

  • ఈ కార్యక్రమాలు స్వదేశీ విలువ జోడింపును పెంచడం, సరఫరా వ్యవస్థలో స్థిరత్వం, పెట్టుబడి అవకాశాల ద్వారా తయారీదారులు, ఎంఎస్ఎంఈలు, విడిభాగాల సరఫరాదారులకు ప్రయోజనం చేకూరుస్తాయి.

  • ప్రజలకు సంబంధించి, ఈ చర్యలు విద్యుత్ వాహనాల ధరలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా, వాటి లభ్యతను, విశ్వసనీయతను మెరుగుపరుస్తాయి. అలాగే, దిగుమతి చేసుకునే ఇంధనాలు,విడిభాగాలపై ఆధారపడటం తగ్గడం వల్ల, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గుల నుంచి  వినియోగదారులకు రక్షణ లభిస్తుంది.

  • ఈ కార్యక్రమాలు స్వచ్ఛమైన గాలి, మెరుగైన ప్రజారోగ్యం,ఇంధన భద్రతకు దోహదపడతాయి. అలాగే, ఇవి ముఖ్యంగా ఈ-రిక్షా, చివరి మైలు వరకు సేవలు అందించే విభాగాలలో జీవనోపాధి కల్పనకు మద్దతునిస్తాయి.

  • ఈ చర్యలు విద్యుత్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేస్తాయని, స్వచ్ఛమైన రవాణా, అధునాతన తయారీ రంగాలలో ప్రపంచ అగ్రగామిగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.

ఇంధన సరఫరా,ఇంధన లభ్యత

హోర్ముజ్ జలసంధి వద్ద చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో, పెట్రోలియం ఉత్పత్తులు,  ఎల్‌పీజీ  నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారులు ప్రస్తుత ఇంధన సరఫరా పరిస్థితిపై తాజా సమాచారాన్ని అందించారు.అందులోని ముఖ్యాంశాలు:

ప్రజలకు సలహాలు- అవగాహన

*పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ కొనుగోళ్ల విషయంలో ఆందోళన చెంది తొందరపాటుతో వ్యవహరించవద్దని, సమాచారం కోసం అధికారిక వర్గాలను మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించారు.

*పుకార్లను నమ్మవద్దని, సరైన సమాచారం కోసం అధికారిక వర్గాలపై మాత్రమే ఆధారపడాలని సూచించారు.

*ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ వేదికలను ఉపయోగించాలని, డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లకుండా ఉండాలని సలహా ఇచ్చారు. 

*పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ స్టవ్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాల్సిందిగా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.

*ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులందరూ తమ దైనందిన వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయవలసిందిగా కోరారు. 

ప్రభుత్వ సంసిద్ధత - సరఫరా నిర్వహణ చర్యలు

*ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ, గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ, పీఎన్‌జీ, సీఎన్‌జీ (రవాణా) సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం 100% సరఫరాను నిర్ధారించింది.  

*వాణిజ్య అవసరాలకు ఎల్‌పీజీ సరఫరాలో ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇవే కాకుండా ఫార్మా, ఉక్కు, ఆటోమొబైల్, విత్తనోత్పత్తి, వ్యవసాయం వంటి రంగాలకు కూడా ప్రాధాన్యత కల్పించారు. అలాగే,వలస కార్మికులకు అందించే 5 కేజీల ఎఫ్‌టిఎల్ సరఫరాను, 2026 మార్చి 2, 3 తేదీలలో జరిగిన సగటు రోజువారీ సరఫరా ఆధారంగా రెట్టింపు చేశారు. 

*ప్రభుత్వం ఇప్పటికే సరఫరా,డిమాండ్ రెండింటిలోనూ పలు క్రమబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో భాగంగా రిఫైనరీ ఉత్పత్తిని పెంపొందించడం, గ్యాస్ బుకింగ్ కాలపరిమితిని పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం, అలాగే వివిధ రంగాలకు సరఫరాలో ప్రాధాన్యతలను నిర్ణయించడం వంటి చర్యలు చేపట్టారు.

*ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 

*చిన్న,మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ ఇండియా,సింగరేణి కాలరీస్‌ను ఆదేశించింది.

*గృహ,వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్‌లను సులభతరం చేయాలని రాష్ట్రాలకు సూచించారు. 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహా సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయం

·        నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు-2000 ప్రకారం- పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పర్యవేక్షణ, అక్రమ నిల్వ-నల్లబజారు నిరోధక చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.

·        ఇదే క్రమంలో పౌరులకు తగినంత ఇంధనం సౌలభ్యంపై భరోసా దిశగా వారితో చురుకైన సమాచార ఆదానప్రదానాన్ని స్పష్టం చేస్తూ 27.03.2026, 02.04.2026 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. తదనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తోంది. ఈ మేరకు 02.04.2026న (పీఎన్‌జీ కార్యదర్శి అధ్యక్షతన), 06.04.2026నాడు (పీఎన్‌జీ కార్యదర్శి, సమాచార-ప్రసార శాఖ, వినియోగదారు వ్యవహారాల శాఖ కార్యదర్శులతో సంయుక్తంగా) సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కింది అంశాలను వివరించారు:

o   రోజువారీ పత్రికా సమావేశాల నిర్వహణ, క్రమం తప్పకుండా ప్రజలకు సూచనలు జారీ.

o   సామాజిక మాధ్యమాల్లో బూటకపు/అవాస్తవ సమాచారంపై చురుకైన పర్యవేక్షణ-నిరోధం.

o   జిల్లా యంత్రాంగాల ద్వారా రోజువారీ చర్యల ముమ్మర అమలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం ద్వారా దాడులు, తనిఖీల కొనసాగింపు.

o   రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వుల జారీ.

o   రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ‘ఎస్‌కేఓ' కోసం సంబంధిత ఉత్తర్వుల జారీ.

o   పీఎన్‌జీ సహా ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి ప్రోత్సాహం.

o   ముఖ్యంగా గృహోపయోగం కోసం ఎల్‌పీజీ సరఫరాకు ప్రాధాన్యత, ఇందులో స్థిరత్వం కోసం 5 కిలోల ‘ఎఫ్‌టీఎల్‌’ సిలిండర్ల లక్షిత సరఫరా చేపట్టడం.

·        అక్రమనిల్వ, నల్ల బజారు నిరోధం దిశగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నియంత్రణ యంత్రాంగంతోపాటు జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.

·        ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

అమలు... పర్యవేక్షణ చర్యలు

·        ఎల్‌పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు నిరోధం దిశగా దేశమంతటా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 12.04.2026నాడు 2250కి పైగా దాడులు నిర్వహించారు.

·        ఈ మేరకు నిన్నటిదాకా మొత్తం 1.28 లక్షలకు పైగా దాడులలో 59,000కు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకుని, 1000కి పైగా కేసుల నమోదు సహా 238 మందిని అరెస్టు చేశారు.

·        ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేయడంతోపాటు నిరంతరం కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా 219 ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలకు జరిమానా విధించడమే కాకుండా 56 కేంద్రాలపై నిషేధం విధించాయి.

ఎల్‌పీజీ సరఫరా:

గృహోపయోగ వంటగ్యాస్‌ సరఫరా స్థితి

·        ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితుల వల్ల ఎల్‌పీజీ సరఫరాకు అంతరాయం కొనసాగుతోంది.

·        ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలలో ఎక్కడా సరఫరా నిలిచిన సమాచారమేదీ లేదు.

·        పరిశ్రమల పరంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌ సుమారు 99 శాతానికి పెరిగింది.

·        దారి మళ్లింపు నివారణ, సరఫరా నిర్ధారణ కోడ్ (డీఏసీ) ఆధారిత డెలివరీ సుమారు 92 శాతానికి పెరిగింది. ఈ మేరకు వినియోగదారు రిజిస్టర్డ్ మొబైల్‌కు ఈ ‘డీఏసీ’ అందుతుంది.

·        గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా సాధారణంగానే కొనసాగుతోంది.

·        గృహాలకు ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాకు భరోసా ఇస్తూ అనేక కేంద్రాలు ఆదివారం కూడా పనిచేశాయి.

వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా... కేటాయింపు చర్యలు

·        సంస్కరణాధారిత 10 శాతం కేటాయింపు సహా మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు సంక్షోభానికి ముందు స్థాయికి సరఫరాను సుమారు 70 శాతానికి పెంచారు.

·        ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితిని మించి 2026 మార్చి 2-3 తేదీలలో వలస కార్మికులకు సగటు రోజువారీ సరఫరా (సిలిండర్ల సంఖ్య) ఆధారంగా ప్రతి రాష్ట్రంలో వారికి పంపిణీ కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని 06.04.2026 నాటి లేఖ ద్వారా రెట్టింపు చేసింది. ఈ సిలిండర్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీల) సహాయంతో తమతమ రాష్ట్రాల్లోని వలస కార్మికులకు మాత్రమే సరఫరా చేసేందుకు అక్కడి ప్రభుత్వాల అదుపులో ఉంటాయి.

·        ఇక ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు 5 కిలోల ‘ఎఫ్‌టీఎల్‌’ సిలిండర్ల కోసం 3 2026 ఏప్రిల్ 3 నుంచి 3450కి పైగా అవగాహన శిబిరాలు నిర్వహించాయి. వీటి ద్వారా 40,800కు పైగా ‘ఎఫ్‌టీఎల్‌’ సిలిండర్లను విక్రయించారు.

·        దేశంలో 2026 మార్చి 23 నుంచి 13.3 లక్షలకు పైగా 5 కిలోల ‘ఎఫ్‌టీఎల్‌’ సిలిండర్లు అమ్ముడయ్యాయి.

·        వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీ ప్రణాళిక రూపకల్పన కోసం ఏఓసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ రాష్ట్రాల అధికారులు, పారిశ్రామిక సంస్థలతో సమన్వయ బాధ్యత నిర్వర్తిస్తోంది.

·        మరోవైపు 2026 మార్చి 14 నుంచి మొత్తం 1,22,984 టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (64.72 లక్షలకు పైగా 19 కిలోల సిలిండర్లకు సమానం) అమ్ముడైంది.

సహజ వాయువు సరఫరా... పీఎన్‌జీ విస్తరణకు చర్యలు

·        దేశీయ పీఎన్‌జీ, సీఎన్‌జీ రవాణాకు 100% సరఫరాతో వినియోగదారులకు ప్రాధాన్యం.

·        అందుబాటులోగల నిల్వలు, షెడ్యూల్ ప్రకారం- ఎల్‌ఎన్‌జీ దిగుమతి ఆధారంగా, ఎరువుల కర్మాగారాలకు వాటి 6 నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతానికి చేరువగా, మొత్తం గ్యాస్‌ కేటాయింపును 09.04.2026 నుంచి మరో 5 శాతం పెంచారు.

·        వాణిజ్య ఎల్‌పీజీ లభ్యత సంబంధిత సమస్యల పరిష్కారం దిశగా హోటళ్లు, రెస్టారెంట్లు,  క్యాంటీన్ల వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లలో ప్రాధాన్యం ఇవ్వాలని సీజీడీ సంస్థలకు ఆదేశాలు.

·        ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీల ద్వారా దేశీయ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రోత్సాహకాల మంజూరు.

·        సీజీడీ నెట్‌వర్క్‌ విస్తరణకు సత్వర అనుమతులు ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సహా కేంద్ర మంత్రిత్వ శాఖలకు సూచన.

·        ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక మార్పు దిశగా రాష్ట్రాల తోడ్పాటుకు ప్రతిగా వాణిజ్య ఎల్‌పీజీలో అదనంగా 10 శాతం కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం 18.03.2026 నాటి లేఖ ద్వారా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హామీ ఇచ్చింది.

·        ఎల్‌పీజీ నుండి పీఎన్‌జీకి దీర్ఘకాలిక మార్పులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమవంతు తోడ్పాటునిస్తేనే ఈ కేటాయింపు వర్తిస్తుంది. అయితే, పీఎన్‌జీ విస్తరణలో సంస్కరణలకు అనుసంధానం కింద 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటికే అదనపు వాణిజ్య ఎల్‌పీజీ లభిస్తోంది.

·        ప్రాధాన్య క్రమంలో దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి సీజీడీ మౌలిక సదుపాయాల కోసం మూడు నెలల పాటు సత్వర ఆమోద చట్రాన్ని రోడ్డు రవాణా-రహదారుల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది.

·        కేంద్ర ప్రభుత్వం 24.03.2026న గెజిట్ ప్రకటన ద్వారానే కాకుండా నిత్యావసర వస్తువుల చట్టం-1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్‌లైన్లు, ఇతర సౌకర్యాల కల్పన, నిర్మాణం-నిర్వహణ-విస్తరణ)ఉత్తర్వు-2026ను జారీ చేసింది.

·        ఈ ఉత్తర్వుతో దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణం, విస్తరణకు క్రమబద్ధ-వ్యవధి నిర్దేశిత చట్రం అమలులోకి వస్తుంది. తద్వారా అనుమతులు, భూసేకరణలో జాప్యాలను నివారించి, ఆవాస ప్రాంతాలు సహా సహజ వాయువు మౌలిక సదుపాయాల సత్వర అభివృద్ధికి వీలు కలుగుతుంది. దీనివల్ల పీఎన్‌జీ నెట్‌వర్క్ వృద్ధిని వేగిరపరచడమే కాకుండా చివరి అంచె అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, కాలుష్యరహిత ఇంధనాల వైపు మళ్లేందుకు తోడ్పడుతుందని, దీంతో ఇంధన భద్రత బలోపేతమై గ్యాస్ ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

·        గృహ వినియోగ పీఎన్‌జీ కనెక్షన్ల జారీని వేగిరపరచాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది.  అలాగే పీఎన్‌జీ విస్తరణ వేగం కొనసాగింపు లక్ష్యంగా జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను ఇప్పుడు 30.06.2026 వరకు పొడిగించింది.

·        కాలుష్య రహిత, సురక్షిత, స్వయంసమృద్ధి సహిత ఇంధన భవిష్యత్తును ప్రోత్సహించే దిశగా ముసాయిదా రాష్ట్ర సీబీజీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. సీబీజీ తయారీ కోసం రాష్ట్రాలు తమ పరిధిలోని పెట్టుబడిదారు అనుకూల, అమలు హితవైన వ్యవస్థను ఈ నమూనా విధానం ద్వారా సృష్టించుకోవచ్చు. ఈ మేరకు సమగ్ర, సరళ, మార్గదర్శక చట్రంగా ఈ విధానం దోహదపడుతుంది. దీన్ని అమలు చేసే రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ అదనపు కేటాయింపులకు సంబంధించి తదుపరి విడతలో ప్రాధాన్యం లభిస్తుంది.

·        2026 మార్చి నుంచి 4.32 లక్షలకు పైగా పీఎన్‌జీ కనెక్షన్ల గ్యాసిఫికేషన్‌ పూర్తయింది. అలాగే, కొత్త కనెక్షన్ల కోసం మరో 4.75 లక్షల మందికి పైగా నమోదు చేసుకున్నారు.

·        మరోవైపు 12.04.2026 నాటికి 31,700 మందికి పైగా పీఎన్‌జీ వినియోగదారులు MYPNGD.in వెబ్‌సైట్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను వదులుకున్నారు.

ముడిచమురు నిల్వలు... శుద్ధి కర్మాగారాల కార్యకలాపాలు

·        దేశంలో తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉండటంతో శుద్ధి కర్మాగారాలన్నీ  అదనపు సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతోపాటు పెట్రోల్, డీజిల్ నిల్వల నిర్వహణ సంతృప్తికరంగా ఉంది.

·        దేశీయ వినియోగానికి కొరత రాకుండా శుద్ధి కర్మాగారాల్లో వంటగ్యాస్‌ ఉత్పత్తిని పెంచారు.

·        దేశలోని ఫార్మాస్యూటికల్స్, ఆహార-ప్రజా పంపిణీ, రసాయనాలు-పెట్రో కెమికల్స్ వంటి కీలక రంగాలకు సి3, సి4 స్ట్రీమ్‌లను కనీస పరిమాణంలో... అంటే- రోజుకు 800 టన్నుల వరకూ అందుబాటులో ఉంచే విధంగా దేశంలోని పెట్రోకెమికల్ ప్రాంగణాలు సహా శుద్ధి కంపెనీలను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం 01.04.2026న ఒక ఉత్తర్వు జారీచేసింది.

రిటైల్ ఇంధన లభ్యత, ధరల నియంత్రణ చర్యలు

దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ విక్రయకేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి.

మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగాయి. అయినప్పటికీ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.

దేశీయ మార్కెట్లో ఇంధనం నిరంతరాయంగా లభించేలా చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 11.04.2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఎగుమతి సుంకాన్ని డీజిల్ విషయంలో లీటరుకు రూ. 55.50కి, విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) విషయంలో రూ. 42కి పెంచింది.

రిటైల్ విక్రయకేంద్రాల వద్ద పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు లేదు. ఈ విషయంలో పాత ధరలే కొనసాగుతున్నాయి.

కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు క్రమం తప్పకుండా ఇచ్చే కోటాతో పాటు అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్ కేటాయించారు.

ఇప్పటివరకు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ (ఎస్‌కేఓ) కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. అయితే హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలు తమకు ఎటువంటి అదనపు అవసరం లేదని తెలియజేశాయి.

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితులు.. భారతీయ నౌకలు, సిబ్బంది రక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి కూడా వివరించారు. దీనికి సంబంధించి కీలక అంశాలు:

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను ఓడరేవులు, నౌకాయనం, జలమార్గాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ ప్రక్రియలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోంది.


 

ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ క్షేమంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు కాలేదు.

భారత జెండాతో ఉన్న ఎల్‌పీజీ నౌక 'జగ్ విక్రమ్' 2026 ఏప్రిల్ 11న హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటింది.

ఈ నౌకలో సుమారు 20,400 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ, 24 మంది నావికులు ఉన్నారు. ఇది 2026 ఏప్రిల్ 14న కాండ్లా ఓడరేవుకు చేరుకుంటుందన్న అంచనా ఉంది.

డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 6,073 ఫోన్ కాల్స్.. 12,867 ఈమెయిల్స్‌ను పరిష్కరించింది. ఇందులో గత 24 గంటల్లో వచ్చిన 20 కాల్స్, 80 ఈమెయిల్స్ కూడా ఉన్నాయి.

గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటివరకు 2,177 మందికి పైగా భారతీయ నావికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా డీజీ షిప్పింగ్ చర్యలు చేపట్టింది. గత 24 గంటల్లోనే 93 మందిని స్వదేశానికి పంపించారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఓడరేవుల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఎక్కడా ఎటువంటి రద్దీ లేదు.

పశ్చిమ తీరంలోని భారతీయ ఓడరేవులు పశ్చిమాసియాకు వెళ్లాల్సిన మొత్తం 3,383 టీఈయూల కంటైనర్లను స్వీకరించాయి. వీటిలో 3,228 టీఈయూల కంటైనర్లను తిరిగి పంపే ప్రక్రియను సులభతరం చేశాయి.

మిగిలిన 155 టీఈయూలు కేవలం షిప్పింగ్ లైన్ కార్యకలాపాల కారణాల వల్ల మాత్రమే నిలిచి ఉన్నాయి. ఏ ఓడరేవు వద్ద కూడా ఎటువంటి రద్దీ లేదు.

భారతీయ నావికుల సంక్షేమం, అంతరాయం లేని నౌకాయాన కార్యకలాపాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయాలు, సముద్ర రంగ భాగస్వాములతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.

ఆ ప్రాంతంలోని భారతీయుల భద్రత

గల్ఫ్ ప్రాంతవ్యాప్తంగా ఉన్న భారత రాయబార కార్యాలయాలు, పోస్ట్‌లు అక్కడి భారతీయ సమాజంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి. వారి భద్రత, క్షేమం కోసం అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు తగిన సూచనలను జారీ చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం:


 

ప్రధానమంత్రి ఆదేశాల మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గల్ఫ్ దేశాలతో సంబంధాలు, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

ఇందులో భాగంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి 2026 ఏప్రిల్ 11 నుంచి 12 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటించారు.

నిన్న అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు గౌరవ మొహమ్మద్ బిన్ జాయెద్‌తో భారత విదేశీ వ్యవహారాల మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ పశ్చిమ ఆసియా ఘర్షణల సమయంలో అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజం క్షేమంగా ఉండేలా చూసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఆయన అందిస్తున్న మార్గదర్శకత్వానికి మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.

పర్యటనలో భాగంగా దుబాయ్ యువరాజు, ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అయిన గౌరవనీయ హమ్దాన్ బిన్ మొహమ్మద్‌ను కూడా మంత్రి కలిశారు. దుబాయ్‌లోని భారతీయుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించినందుకు భారత ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.

2026 ఏప్రిల్ 11న అబుదాబిలో యూఏఈ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్‌తో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సమావేశమయ్యారు. మారుతున్న ప్రాంతీయ పరిస్థితులు, వాటి ప్రభావాలపై చర్చించారు. యూఏఈలోని భారతీయుల భద్రత పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ రెండు దేశాల మధ్య భాగస్వామ్యం భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

విదేశీ వ్యవహారాల మంత్రి తన యూఏఈ పర్యటనను ప్రవాస భారతీయులతో చర్చా కార్యక్రమంలో ప్రారంభించారు. పశ్చిమ ఆసియా సంక్షోభం మధ్య వారి భద్రత, సంక్షేమం కోసం భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. క్లిష్ట సమయాల్లో స్థానిక సమాజానికి వారు అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు.

పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి గత వారం ఖతార్‌లో పర్యటించారు. అలాగే వాణిజ్య శాఖ మంత్రి గల్ఫ్ దేశాలలోని ఆయా దేశాల వాణిజ్య శాఖ మంత్రులతో ఫోన్ ద్వారా మాట్లాడారు.

గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిరంతరం నిశితంగా గమనిస్తోంది.


 

సమాచార మార్పిడి, మెరుగైన సమన్వయం కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపులు చేపడుతోంది.

ఆ ప్రాంతంలోని భారతీయుల రక్షణ, భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.

భారత రాయబార కార్యాలయాలు, పోస్ట్‌లు 24 గంటల హెల్ప్‌లైన్‌లు పనిచేసేలా చూసుకుంటున్నాయి. అవి భారతీయులకు చురుగ్గా సహాయం అందిస్తున్నాయి.

స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణాల పరిస్థితి, దౌత్య సేవలకు సంబంధించిన తాజా సమాచారంతో కూడిన సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.

మన రాయబార కార్యాలయాలు ఆ ప్రాంతంలోని భారతీయ సంఘాలు, వృత్తిపరమైన బృందాలు, భారతీయ కంపెనీలు, ఇతర భాగస్వాములతో నిరంతరం సంబంధాలు కలిగి ఉన్నాయి.

గల్ఫ్ ప్రాంతంలోని నౌకల్లో ఉన్న భారతీయ సిబ్బందికి మన మిషన్లు అన్ని విధాలా సహకరిస్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక అధికారులు- ఏజెన్సీలతో సమన్వయం చేయడం, దౌత్య సహాయం అందించడం, స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారి అభ్యర్థనలను సులభతరం చేయడం వంటి చర్యలు చేపడుతున్నాయి.

గగనతలం అందుబాటులో ఉన్న దేశాల నుంచి విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు సుమారు 9,27,000 మంది ప్రయాణికులు గల్ఫ్ ప్రాంతం నుంచి భారతదేశానికి చేరుకున్నారు.

భద్రత, నిర్వహణ అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత్-యూఏఈ మధ్య పరిమిత సంఖ్యలో ప్రణాళికేతర వాణిజ్య విమానాలు నడుస్తున్నాయి. ఈ రోజు సుమారు 100 విమానాలు నడిచే అవకాశం ఉంది.

సౌదీ అరేబియా, ఒమన్ దేశాలలోని వివిధ విమానాశ్రయాల నుంచి భారతదేశంలోని వివిధ నగరాలకు విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగుతున్నాయి.

ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉంది. దీనివల్ల ఖతార్ ఎయిర్‌వేస్ ఈ రోజు భారతదేశానికి సుమారు 8 నుంచి 10 విమానాలను నడపవచ్చన్న అంచనా ఉంది.


 

కువైట్ గగనతలం ఇంకా మూసివేసి ఉంది. అయితే కువైట్‌కు చెందిన జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు ప్రణాళికేతర వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. కువైట్‌లోని భారతీయుల ప్రయాణాలను సౌదీ అరేబియా ద్వారా ప్రభుత్వం సులభతరం చేస్తోంది.

బహ్రెయిన్ గగనతలాన్ని తెరిచారు. గల్ఫ్ ఎయిర్ త్వరలోనే బహ్రెయిన్ నుంచి భారత్‌కు పరిమిత విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఈ సంస్థ సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి ప్రణాళికేతర విమానాలను నడుపుతోంది. బహ్రెయిన్‌లోని భారతీయులు కూడా సౌదీ అరేబియా మీదుగా భారతదేశానికి చేరుకుంటున్నారు.

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు 2,230 మంది భారతీయులను ఇరాన్ నుంచి ఆర్మేనియా, అజర్‌బైజాన్ మీదుగా భారతదేశానికి పంపే ప్రక్రియను సులభతరం చేసింది. వీరిలో 987 మంది భారతీయ విద్యార్థులు, 657 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు.

ఇజ్రాయెల్ గగనతలాన్ని పాక్షికంగా తెరిచారు. అయితే విమాన రాకపోకలపై ఆంక్షలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని భారతీయులను జోర్డాన్, ఈజిప్ట్ మీదుగా భారతదేశానికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇరాక్ గగనతలాన్ని తెరిచారు. ఇరాకీ ఎయిర్‌వేస్ నిన్నటి నుంచి భారతదేశానికి విమాన సర్వీసులను ప్రారంభించింది. అలాగే ఇరాక్ నుంచి భారతీయుల ప్రయాణాలను జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా కూడా ప్రభుత్వం సులభతరం చేస్తోంది.

***


(రిలీజ్ ఐడి: 2251908) సందర్శకుల సూచీ సంఖ్య : : 103