ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూఢిల్లీలో నారీశక్తి వందన్ సమ్మేళన్ సందర్భంగా ప్రధాని ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2026 2:40PM by PIB Hyderabad
వేదికనలంకరించిన ఢిల్లీ ప్రజల మన్ననలు పొందిన ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా గారూ, కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవిగారూ, శ్రీమతి సావిత్రీ ఠాకూర్ గారూ, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ శ్రీమతి విజయా రహత్కర్ గారూ... అలాగే మీలో చాలా మంది సీనియర్లు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు ఉన్నారు. మన లోక్‌సభ మాజీ స్పీకర్ గౌరవనీయులు మీరాకుమార్ గారూ మన మధ్యనే ఉన్నారు. ఆత్మీయులైన అక్కాచెల్లెళ్లంతా ఇక్కడున్నారు. ఈ వేళ బైశాఖీ పండుగ శోభతో దేశమంతా ఆనందంతో ఉంది. రేపు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకొంటారు. అలాగే జలియన్‌వాలా బాగ్ మారణకాండలో అమరులైన యోధులకూ ఈ రోజు నేను నివాళి అర్పిస్తున్నాను.
మిత్రులారా,
దేశం తీసుకోబోతున్న నిర్ణయం 21వ శతాబ్దపు అత్యంత గొప్ప నిర్ణయాలలో ఒకటిగా నిలవబోతోంది. దేశ అభివృద్ధి ప్రస్థానంలో ఇదొక కీలక మైలురాయి. పూర్తి బాధ్యతతో నేనీ మాట చెబుతున్నాను – మన కాలపు అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఇదొకటి. మహిళా శక్తినీ, వారి సామర్థ్యాన్నీ గుర్తించి గౌరవించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. ఒక కొత్త చరిత్రను సృష్టించే దిశగా మన పార్లమెంటు అడుగులు వేస్తోంది – గత కాలపు ఆకాంక్షలను నెరవేర్చే, భవిష్యత్తు పట్ల మన సంకల్పాలను సాకారం చేసే చరిత్ర ఇది. దేశంలో సమసమాజాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న సంకల్పమిది. ఇక్కడ సామాజిక న్యాయమన్నది నినాదాలకే పరిమితం కాదు.. మన పని సంస్కృతిలో, నిర్ణయ ప్రక్రియలో సహజమైన అంతర్భాగమది.
మిత్రులారా,
రాష్ట్రాల శాసనసభల నుంచి భారత పార్లమెంటు దాకా.. దశాబ్దాల నిరీక్షణ ఈ 16, 17, 18 తేదీల్లో ముగియబోతున్నది. 2023లో కొత్త పార్లమెంటును ప్రారంభించిన అనంతరం నారీశక్తి వందన్ అధినియం రూపంలో మనం మొదటి అడుగు వేశాం. దాన్ని సకాలంలో అమలు చేయడంతోపాటు, మన ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా.. ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రత్యేక సెషన్ ప్రారంభమవుతోంది. దానికిముందు దేశవ్యాప్తంగా లక్షలాది తల్లులు, అక్కాచెల్లెళ్ల ఆశీస్సులతో నేడు నారీశక్తి వందన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మీకేదో చెప్పాలనో, మిమ్మల్ని జాగరూకులను చేద్దామనో నేనిక్కడికి రాలేదు.. మీ ఆశిస్సుల కోసమే వచ్చాను. దేశంలోని నలుమూలల నుంచీ మీరొచ్చారు. మీరిక్కడికి రావడం, అత్యంత ముఖ్యమైన ఈ కార్యక్రమం కోసం మీ సమయాన్ని కేటాయించడాన్ని మనఃపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఓ నవశకం ప్రభవిస్తున్న తరుణంలో దేశ మహిళలందరికీ శుభాకాంక్షలు.
మిత్రులారా,
మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ల ఆవశ్యకత ఉంది. అనేక చర్చలూ జరిగాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా, అంటే 40 ఏళ్లుగా దీనిపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అన్ని పార్టీలు, అన్ని తరాల నేతల కృషి ఇందులో ఉన్నాయి. ప్రతి పార్టీ తమదైన రీతిలో ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్ళింది. 2023లో నారీశక్తి వందన్ అధినియాన్ని ప్రవేశపెట్టిన వేళ అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. 2029 నాటికి ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలన్న అంశంపై కూడా ఆ సమయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. చట్టాన్ని ఆమోదించి, దానిని అమలు చేయకపోవడం ఆమోదయోగ్యం కాదని అందరూ అంగీకరించారు. ముఖ్యంగా ప్రతిపక్షంలోని మా సహచరులు.. 2029 నాటికి తప్పక అమలు చేయాలని గట్టిగా పట్టుబట్టారు. ఈ కాలపరిమితిని దృష్టిలో పెట్టుకుని.. ప్రతిపక్షాల ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మేము దీనిపై నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, కొత్త మార్గాలను అన్వేషించాం. రాజ్యాంగ నిపుణుల సలహాలనూ తీసుకున్నాం. ఏప్రిల్ 16 నుంచి ఈ అంశంపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరగనుంది.
మిత్రులారా,
చర్చలు, సహకారం, భాగస్వామ్యం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకే మేం ప్రాధాన్యమిస్తూ, ఆ దిశగా కృషిచేస్తున్నాం. ఈ చట్టం ఆమోదం పార్లమెంటు గౌరవాన్ని పెంచినట్టుగానే... ఈసారి కూడా సమష్టి కృషితో మన పార్లమెంటు గౌరవప్రదమైన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందన్న గట్టి నమ్మకం నాకుంది. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి తమ ప్రయోజనాల కోసం ఈ కీలక నిర్ణయం తీసుకున్నందుకు దేశంలోని ప్రతి మహిళా గర్వపడుతుంది. ఇటీవల దేశవ్యాప్తంగా మహిళలు ఈ అంశంపై గళమెత్తడాన్ని నేను గమనించాను. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇదే ప్రజాస్వామ్యానికి గొప్ప బలం. అసెంబ్లీలకు, పార్లమెంటుకు చేరుకోవాలన్న వారి కలలకు ఇప్పుడు కొత్త రెక్కలు రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా సానుకూల వాతావరణం నెలకొంటున్న అనుభూతి నాకు కలుగుతోంది.
మిత్రులారా,
స్వాతంత్య్ర పోరాటం నుంచి రాజ్యాంగ పరిషత్ నిర్ణయాల వరకు.. స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో మహిళా శక్తి అపారమైన కృషి చేసింది. చరిత్రే దీనికి సాక్ష్యం. స్వాతంత్ర్యానంతరం కూడా.. ప్రాతినిధ్యావకాశాన్ని పొందిన మహిళలు దేశం కోసం అద్భుతంగా కృషి చేశారు. రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు.. ఏ స్థానంలో సేవలందించినా, తమకంటూ ఓ ప్రత్యేక పరంపరను మహిళలు ఏర్పరచుకున్నారు. ఈ రోజు కూడా రాష్ట్రపతి నుంచి ఆర్థిక మంత్రి వరకు.. మన దేశంలో కీలక పదవుల్లో మహిళలున్నారు. దేశ గౌరవాన్నీ, ప్రతిష్ఠన్నీ వారు ఇనుమడింపజేశారు.
మిత్రులారా,
మహిళా నాయకత్వానికి మన పంచాయతీ రాజ్ సంస్థలు మరో అద్భుత ఉదాహరణ. నేడు దేశవ్యాప్తంగా 14 లక్షలకు పైగా మహిళలు స్థానిక ప్రభుత్వ సంస్థల్లో విజయవంతంగా సేవలందిస్తున్నారు. దాదాపు 21 రాష్ట్రాల్లో పంచాయతీల్లో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 50 శాతానికి చేరింది. నేను విదేశీ అతిథులతో ఈ గణాంకాలను చెప్పినప్పుడల్లా.. వారు ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు.
మిత్రులారా,
ఇది సాధారణమైన విషయం కాదు. రాజకీయాల్లో, సామాజిక జీవనంలో లక్షలాది మహిళల క్రియాశీల భాగస్వామ్యం.. ప్రపంచంలోని అగ్ర నాయకులకు, రాజకీయ నిపుణులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. యావత్ భారతదేశపు ప్రతిష్ఠనూ ఇదెంతగానో పెంచుతోంది.
మిత్రులారా,
నిర్ణయ ప్రక్రియల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే వ్యవస్థల్లో సున్నితత్వం కూడా పెరుగుతుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. మనకిది గొప్ప బలం. దీని ఫలితంగా నీరు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటి అనేక అంశాలపై మరింత అంకితభావంతో, సున్నితత్వంతో కూడిన సమర్థమైన పనితీరు కనిపిస్తోంది. జల్ జీవన్ మిషన్‌ను దీనికి ఒక అద్భుత ఉదాహరణగా నేను చెబుతాను. పంచాయతీ స్థాయిలో మహిళల భాగస్వామ్యం ఈ పథకం విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించింది.
మిత్రులారా,
మన స్థానిక సంస్థల్లో, వ్యవస్థల్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న, వాటికి నేతృత్వం వహిస్తున్న లక్షలాది మహిళలకు క్షేత్రస్థాయిలో ఎంతో గొప్ప, సుదీర్ఘమైన అనుభవం ఉంది. మరింత పెద్ద బాధ్యతలు చేపట్టేందుకు వారిప్పుడు సిద్ధంగా ఉన్నారు. నా వ్యక్తిగత అనుభవాల్లో ఒకటి మీతో చెబుతాను. ఈ సామర్థ్యమంటే ఏమిటంటే - నేను 2001లో కొత్తగా ముఖ్యమంత్రినయ్యాను. ప్రభుత్వాన్ని నడపడంలోనూ, పరిపాలన వ్యవస్థల్లోనూ నాకు పెద్దగా అనుభవం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే నేను కొత్త వ్యక్తిని. బహుశా ఆ సంఘటన జరిగినది 2002లోనో, 2003లోనో... మా ఎమ్మెల్యేలలో ఒకరు నా దగ్గరకు వచ్చారు. తన ప్రాంతంలోని ఒక గ్రామ పంచాయతీకి చెందిన కొందరు అక్కాచెల్లెళ్లు నన్ను కలవాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. సర్దార్ సాహెబ్ జన్మించిన ఆనంద్ జిల్లా ప్రాంతంలోని ఖేడా ప్రాంతం అది. పంచాయతీకి సంబంధించి వాళ్లకేమైనా పని ఉంటే, పంచాయతీ శాఖా మంత్రిని కలవమని చెప్పాను. దానికాయన సమాధానమిస్తూ.. లేదు సర్, వాళ్ళు మిమ్మల్నే కలవాలనుకుంటున్నారు అన్నారు. ‘ఎందుకు’ అని నేనడిగాను. దానికాయన జవాబిస్తూ.. ఆ పంచాయతీలో సభ్యులందరూ మహిళలేననీ, ఒక్క పురుష సభ్యుడు కూడా లేడనీ చెప్పారు. అదెలా సాధ్యపడిందని నేనడిగాను. ఈసారి గ్రామ పెద్దగా ఒక మహిళ ఉండాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారనీ, అందువల్ల సభ్యులందరూ కూడా మహిళలే ఉండేలా నిర్ణయించుకున్నారనీ, పురుషులెవరూ ఎన్నికల్లో పోటీ చేయలేదనీ ఆయన చెప్పారు. సహజంగానే అటువైపు నా దృష్టి మళ్లింది. నేను తప్పకుండా వారిని కలుస్తానని చెప్పాను. అదొక చిన్న గ్రామం. బహుశా 13 మంది సభ్యులున్న పంచాయతీ అనుకుంటా. వారికి నా సమయాన్ని కేటాయించాను. వారంతా నన్ను కలవడానికొచ్చారు. 13 మంది అక్కాచెల్లెళ్లు అక్కడికొచ్చారు. గ్రామ పెద్ద అయిన వ్యక్తి 8వ తరగతి వరకు చదువుకున్నారు. మిగిలిన వారిలో ఒకరిద్దరు తమ ముఖాలను ముసుగుతో కప్పుకున్నారు. వారిలో ఎక్కువ మంది బహుశా బడిని ఎప్పుడూ చూసి ఉండరు. వారంతా వచ్చారు. బహుశా ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళను సభ్యులుగా ప్రతిపాదించి ఉంటారేమో అని నేననుకున్నాను. మా ఊరిలో ఇది చేయండి, అది చేయండి అంటూ ఏవైనా కొన్ని డిమాండ్లతో వచ్చారేమో అనుకున్నాను. నేను ఆశ్చర్యపోయాను. వారి చేతుల్లో ఎలాంటి పత్రాలూ లేవు. వాళ్ళు కూర్చున్నారు. నన్ను పరిచయం చేసుకున్నాను. ‘‘మీరు సమయం అడిగారు కదా.. పనేమిటి?’’ అని నేనడిగాను. పనేమీ లేదనీ, తామంతా ఎన్నికయ్యాం కాబట్టి కలవడానికి వచ్చామనీ వాళ్ళు చెప్పారు. నన్ను చాలా ఆశ్చర్యపరిచిన విషయమది. సాధారణంగా నాయకులు వినతిపత్రాలతోనే వస్తారు. అప్పుడు నేను వాళ్ళని అడిగాను - చెప్పండి, అయిదేళ్ల పాటు ఇంత పెద్ద బాధ్యతను ప్రజలు మీకు అప్పగించారు. ఊరిని మీరే ఏలబోతున్నారు. మీ కల ఏమిటి? ఈ అయిదేళ్లలో మీరేం చేస్తారు? మీ ఊరిని మీరెలా తీర్చిదిద్దుతారు? సాధారణంగా.. గొప్పగా కనిపించే మనలాంటి వాళ్ళం ఏం జవాబు చెబుతాం... ఒక పాఠశాల కడతామనీ, ఒక హాస్పిటల్ కడతామనీ, ఓ రోడ్డు వేస్తామనీ.. ఇలాంటి సమాధానాలే కదా ఇస్తాం. అయితే ఆ రోజు.. 8వ తరగతి వరకు చదువుకున్న ఆ గ్రామ పెద్ద, ఆమె వెంట వచ్చిన మహిళా సభ్యులు ఇచ్చిన సమాధానాన్ని బహుశా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థికవేత్త కూడా ఇవ్వలేడేమో! ఆ జవాబు ఇప్పటికీ నాకొక పాఠం. నేను ముఖ్యమంత్రినయ్యాను, ప్రధానమంత్రినయ్యాను.. కానీ ఆ పంచాయతీ మహిళలు చెప్పిన మాట ఇప్పటికీ నాకు మార్గదర్శకంగా నిలుస్తోంది. వాళ్లు చెప్పిన జవాబు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ‘‘మీకు ఐదేళ్ల సమయముంది. ఊరు మిమ్మల్ని ఎన్నుకుంది. మీరేం చేస్తారు?’’ అని నేను వారిని అడిగాను. ‘‘అయ్యా, మాకున్నది ఒకే ఒక్క కోరిక’’ అని వారు బదులిచ్చారు. అదేమిటని నేనడిగాను. వాళ్లిచ్చిన జవాబు ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతుంది. ‘‘మా ఊర్లో ఎవరూ పేదవారిగా ఉండకూడదు. అదే మా కోరిక’’ అని చెప్పారు వాళ్లు. గొప్ప ఆర్థికవేత్తలకు సైతం దీనికన్నా గొప్ప సందేశం మరొకటి ఉండదు. నాకైతే ఇదొక అద్భుతమైన అనుభవం. ఇప్పటికీ వారి మాటలు నా చెవుల్లో మార్మోగుతున్నాయి. అందుకే మూలాలతో అనుబంధం ఉన్న, అనుభవంతో వచ్చిన మాట వేదవాక్కవుతుంది.
మిత్రులారా,
నారీ శక్తి వందన్ అధినియం అమలు చేయడం మహిళలందరి జీవితాల్లో ఒక గొప్ప అవకాశంగా మారబోతోంది. ఇప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు వారి ప్రయాణం మరింత సులభతరం కానుంది.
మిత్రులారా,
నేడు వికసిత్ భారత్ వైపు మన ప్రయాణంలో మహిళల పాత్ర మరింత కీలకమైంది. 2014లో దేశప్రజలైన మీరు మాకు సేవ చేసే అవకాశాన్ని కల్పించారు. అప్పటి నుంచి మా ప్రభుత్వం మహిళల కోసం ప్రతి దశలోనూ తగిన పథకాలను రూపొందించి, వాటిని విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పడానికి నేను ఎంతో సంతృప్తి చెందుతున్నాను. నేడు ఆడబిడ్డ పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు ఏదో ఒక పథకం ద్వారా మా ప్రభుత్వం దేశ ఆడపడుచుల, కుమార్తెలకు అండగా నిలుస్తోంది. ఆడపిల్లలను గర్భంలోనే చంపకుండా ఉండటానికి మేం బేటీ బచావో-బేటీ పఢావో ప్రచారాన్ని ప్రారంభించాం. గర్భిణీ తల్లులకు సరైన పోషకాహారం అందేలా చూసేందుకు ‘మాతృ వందన యోజన’ ద్వారా ప్రతి తల్లికి రూ. 5,000 ఆర్థిక సహాయం అందింస్తున్నాం. పుట్టిన తర్వాత ఆడపిల్లల చదువుకు ఇబ్బంది కలగకుండా, అధిక వడ్డీ ప్రయోజనాలతో ‘సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని’ ప్రారంభించాం. చిన్నతనంలోనే ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించడానికి సకాలంలో టీకాలు వేయించే ‘మిషన్ ఇంద్రధనుస్సు’ కార్యక్రమం చేపట్టాం. పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్ల సమస్య ఉండకూడదని ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మరుగుదొడ్లను నిర్మించాం. నెలసరి సమయంలో ఇబ్బందులు కలగకుండా తక్కువ ధరకే శానిటరీ నాప్‌కిన్‌లను అందిస్తున్నాం. క్రీడల్లో రాణించాలనుకునే ఆడబిడ్డలకు ‘ఖేలో ఇండియా’ ప్రచారం ద్వారా ఏటా లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నాం. ఆడపిల్లలు పెద్దయ్యాక భవిష్యత్తులో సైన్యంలో చేరాలనుకుంటే, సైనిక్ పాఠశాలలు, జాతీయ రక్షణ అకాడమీకి మార్గం సుగుమం చేశాం. వంటగది పొగ నుంచి విముక్తి కల్పించడానికి ‘ఉజ్వల యోజన’ ద్వారా కోట్లాది ఉచిత గ్యాస్ కనెక్షన్లను ఇచ్చాం. మైళ్ల దూరం నీటి బిందెలు నెత్తిపై మోసే కష్టం లేకుండా ‘హర్ ఘర్ నల్ సే జల్’ పథకంతో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తున్నాం. కుటుంబ పోషణకు ఉచిత రేషన్, అనారోగ్యానికి గురైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ‘ఆయుష్మాన్ యోజన’ ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తూ అండగా నిలుస్తున్నాం. 80 శాతం వరకు తగ్గింపు ధరతో మందులు లభించేలా ‘జన్ ఔషధి కేంద్రాలను’ అందుబాటులోకి తెచ్చాం. ఈ ప్రయోజనాలన్నీ మన సోదరీలకు, కుమార్తెలకు అధిక సంఖ్యలో అందుతున్నాయి.
మిత్రులారా,
దేశంలో మహిళలను సాధికారత వైపు నడిపించాలంటే వారి ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచడం అవసరమని మీకు తెలుసు. అందుకే మా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకున్నాం. గతంలో కుటుంబ ఆస్తులన్నీ పురుషుల పేరు మీదనే ఉండేవి. ఇల్లు, భూమి, దుకాణం, వాహనం, ఆఖరికి స్కూటర్ ఉన్నా సరే పురుషుడి పేరు మీదనే ఉండేది. దీనిని అప్పట్లో ఒక సహజమైన విషయంగానే పరిగణించేవారు. మేం ‘పీఎం ఆవాస్ యోజన’ కింద ఇళ్లను ప్రాథమికంగా కుటుంబంలోని మహిళల పేరు మీదనే నమోదు చేయడం ప్రారంభించాం. ఈ నిర్ణయం ద్వారా గత 11 ఏళ్లలో 3 కోట్లకు పైగా మహిళలు తమ సొంత ఇంటికి యజమానులయ్యారు. దీనివల్ల గృహాల్లో మహిళలకు ఆర్థిక సాధికారతను కల్పించింది. పిల్లలు పాఠశాలలో చేరేటప్పుడు సహజంగానే తండ్రి పేరు రాసేవారు. ఆ సంప్రదాయాన్ని మారుస్తూ, తల్లి పేరును కూడా తప్పనిసరిగా రాయాలనే విధానాన్ని మేం అమలులోకి తెచ్చాం. సాధారణంగా గతంలో తండ్రీకొడుకులు ఏదైనా వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తల్లి టీ తీసుకువచ్చి అక్కడ నిలబడితే.. ‘‘నువ్వు వెళ్ళు, వంటగదిలోకి వెళ్ళు, మేం మాట్లాడుకుంటున్నాం’’ అని అనేవారు. నేను గృహస్థుడిని కాకపోయినా.. నాకు ఇవన్నీ తెలుసు. కానీ ఇప్పుడు ఆమె ఆర్థికంగా బలోపేతం కావడంతో కొడుకు ‘‘అమ్మను కూడా పిలవండి, ఆమెను కూడా చర్చలో చేర్చుకుందాం’’ అని చెప్పే పరిస్థితి వచ్చింది.
మిత్రులారా,
2014 నాటికి మన దేశంలో కనీసం బ్యాంకు ముఖం కూడా చూడని వారు కోట్లాది మంది మహిళలు ఉన్నారు. మహిళలకు బ్యాంకింగ్ రంగంతో అనుబంధం లేనప్పుడు, వారికి బ్యాంకింగ్ ప్రయోజనాలు ఎలా అందుతాయి. మేం జన్ ధన్ యోజన ప్రారంభించినప్పుడు దేశంలో 32 కోట్లకు పైగా మహిళల బ్యాంకు ఖాతాలు తెరిచాం. నేను గుజరాత్‌లో ఉన్నప్పుడు మొదట్లో ఒక నిర్ణయం తీసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించేంది. గుజరాత్‌లో ఒక పెద్ద సహకార డైరీ సామ్రాజ్యం ఉంది. అది చాలా పెద్ద కార్యకలాపం. పశుపోషణలో ఎక్కువ పని మన తల్లులు, సోదరీలే చేస్తారు. వారు పాలు పోయడానికి వెళతారు. వారం తర్వాత వారికి డబ్బులు ఇచ్చేవారు. కానీ ఆ డబ్బును పురుషులకే ఇచ్చేవారు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ డబ్బును పురుషులకు ఇవ్వబోనని చెప్పాను. ఆ సమయంలో డైరీలలో పాలు పోసే సోదరీలందరికీ బ్యాంకు ఖాతాలు తెరిపించాను. అప్పటి నుంచి పాల డబ్బు నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లడం మొదలైంది.
మిత్రులారా,
నేడు మన కుమార్తెలు కొత్త వ్యాపారాల్లో తమకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ముద్రా యోజన కింద 60 శాతానికి పైగా రుణాలు మహిళలే తీసుకున్నారు. దేశంలోని అంకుర సంస్థల విప్లవానికి కూడా మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. నేడు నమోదిత స్టార్టప్‌లలో 42 శాతానికి పైగా సంస్థలకు కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉన్నారు. మహిళల వృత్తికి ఆటంకం కలగకుండా ఉండేందుకు మేం ప్రసూతి సెలవులను 26 వారాలకు పెంచాం. ప్రపంచంలోని సంపన్న దేశాలలో కూడా ఇంతటి వెసులుబాటు లేదు. నేను ఈ విషయం వారికి చెప్పినప్పుడు వారు ఆశ్చర్యంతో కళ్లు పెద్దవి చేస్తారు.
మిత్రులారా,
కొన్ని సంవత్సరాల క్రితం దేశం ‘స్కిల్ ఇండియా మిషన్’ను ప్రారంభించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. దీని ద్వారా మేం వృత్తి విద్యా శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించాం. వేలాది మంది ‘డ్రోన్ దీదీల’ ద్వారా నేడు వ్యవసాయ విప్లవం రూపంలో దాని ఫలితాలను మనం చూస్తున్నాం. ఒకసారి నేను వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ డ్రోన్ దీదీలతో మాట్లాడుతున్నాను. వారు గ్రామీణ ప్రాంతాలకు చెందిన కుమార్తెలు, కోడళ్ళు.. డ్రోన్లు ఎగురవేస్తున్నారు. ‘‘ఇప్పటి వరకు గ్రామంలో మమ్మల్ని ఎవరూ ఏమని పిలిచేవారు కాదు. ఇప్పుడు మమ్మల్ని పైలట్లు అని పిలుస్తున్నారు. మాకో గుర్తింపు వచ్చింది, మేము పైలట్లం’’ అని వారు నాతో చెప్పారు. అంటే ఒక చిన్న నిర్ణయంతో సమాజ ఆలోచనా దృక్పథం త గొప్పగా, ఎంత త్వరగా మారుతుందో చూడండి. సాంకేతికత ద్వారా మహిళలు ఆధునిక వ్యవసాయాన్ని నేర్చుకుంటున్నారు. గత 11 ఏళ్లలో దాదాపు 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న ఇటువంటి 6 కోట్ల మంది సోదరీలను లఖ్ పతి దీదీలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా గ్రామీణ మహిళలు లఖ్ పతి దీదీలుగా మారారు. ఈ మహిళా స్వయం సహాయక సంఘాలు తమ పనుల కోసం బ్యాంకుల నుంచి డబ్బు పొందుతాయి. ఒకవేళ వారు బుధవారం డబ్బు జమ చేయాల్సి ఉంటే మంగళవారమే అంటే ఒక రోజు ముందే వెళ్లి జమ చేస్తారని తెలుసుకోవడం మీకు సంతోషాన్నిస్తుంది. సోదరీల ప్రవర్తన ఎంత గొప్పదంటే.. అక్కడ మొండి బాకీలు అనేది ఉండవు. బ్యాంకు నుంచి వెళ్ళిన ప్రతి పైసా తిరిగి వస్తుంది.నేను అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యాంకుల వ్యాపారంలో పేదల గొప్పతనాన్ని చూశాను.. అలాగే ధనికుల దరిద్రాన్ని కూడా చూశాను.
ఇదొక్కటే కాదు మిత్రులారా,
మన తల్లులు, సోదరీలు ‘వోకల్ ఫర్ లోకల్’ (స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం) కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారు. సోదరీలారా.. మహిళా నేతృత్వంలో అభివృద్ధి అనే దృక్పథం సాధించిన గొప్ప విజయం ఏంటంటే.. అది మహిళల పట్ల ఉన్న పాత ఆలోచనా విధానాన్ని సవాలు చేసింది. మన అధ్యక్షతన జీ-20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్నప్పుడు మహిళా అభివృద్ధికి, మహిళా నేతృత్వంలోని అభివృద్ధికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నేను ప్రపంచ దేశాలకు వివరించాల్సి వచ్చింది. ప్రపంచంలోని చాలా దేశాలు మహిళా అభివృద్ధి వరకు అంగీకరించాయి. కానీ మహిళా నేతృత్వంలోని అభివృద్ధి ప్రాధాన్యతను వివరించడానికి నేను కొంత కృషి చేయాల్సి వచ్చింది. చివరికి మేం విజయం సాధించాం. ఈ ఆలోచనా విధానం ఫలితంగానే ఒకప్పుడు కేవలం పురుషుల గుత్తాధిపత్యంగా భావించిన రంగాల్లో కూడా నేడు మహిళలు శిఖరాలను అధిరోహిస్తున్నారు. నేడు మన కుమార్తెలు ఫైటర్ పైలట్లుగా మారి ఆకాశపు అంచులను తాకుతున్నారు. ప్రపంచంలోని మరే ఇతర దేశంతో పోల్చినా, భారత్‌లోనే మహిళా పైలట్ల శాతం అత్యధికంగా ఉంది. ఈ గణాంకం మిమ్మల్ని కూడా సంతోషపరుస్తుంది. నేడు పీహెచ్‌డీలో చేరే కుమార్తెల సంఖ్య 2014తో పోలిస్తే రెట్టింపు అయింది. ఉన్నత విద్య, పరిశోధనల్లో దాదాపు సగం భాగస్వామ్యం మన కుమార్తెలదే. గణితం, విజ్ఞాన శాస్త్రాల అధ్యయనాల్లో, స్టెమ్(ఎస్టీఈఎం) విద్యలో కుమార్తెల సంఖ్య దాదాపు 43 శాతానికి చేరుకుంది. ఒకసారి నేను ప్రపంచంలోని ఒక సంపన్న దేశానికి వెళ్ళినప్పుడు అక్కడి విద్యాశాఖ మంత్రి నాతో లిఫ్ట్‌లో ఉన్నారు. భారత్‌లో మహిళా విద్య ఎలా ఉంది అని ఆయన నన్ను అడిగారు. నేను చాలా బాగుందని, ఉన్నత స్థాయిలో ఉందని, కొన్ని చోట్ల పురుషుల కంటే కూడా ఎక్కువగా ఉందని చెప్పాను. అప్పుడు ఆయన చాలా కుతూహలంగా.. స్టెమ్ విద్యలో మహిళల వాటా ఎంత అని అడిగారు. దానికి నేను 50 శాతం వాటా వారిదే అని చెప్పాను. అది ఆయనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను మాట్లాడుతోంది ప్రపంచంలోని ఒక సంపన్న దేశపు విద్యాశాఖ మంత్రి గురించి.
మిత్రులారా,
మన సమాజంలో మహిళల భద్రత కూడా ఒక పెద్ద సవాలుగా మారింది. శతాబ్దాలుగా మహిళలు తమ భద్రత కోసం మౌనంగా ఉండాల్సి వచ్చింది. మా ప్రభుత్వం ఈ దిశగా బలమైన చర్యలు తీసుకుంది. న్యాయ వ్యవస్థను మరింత సున్నితంగా మార్చడానికి, నిర్ణయాలు వేగంగా తీసుకోవడానికి మేం చట్టపరమైన మార్పులు చేశాం. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేశాం. భారతీయ న్యాయ సంహితలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ప్రక్రియను సరళీకృతం చేశాం. ఇప్పుడు ఏ ప్రాంతం నుండైనా ఈ ఎఫ్‌ఐఆర్ లేదా జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో వీడియో రూపంలో నమోదు చేసే ఏర్పాట్లు కూడా అమలు చేశాం. ప్రగతిశీల సమాజం అనే భావనను నిజం చేయడానికి ఇటువంటి అనేక చర్యలు తీసుకుంటున్నాం.
మిత్రులారా,
జీవితంలోని ప్రతి దశలోనూ, ప్రతి ఆందోళనలోనూ, సుఖదుఃఖాలలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ శ్రద్ధ వహిస్తూ మా ప్రభుత్వం అనేక చిన్న, పెద్ద చర్యల ద్వారా మహిళలను సాధికారత వైపు నడిపించింది. దీని ఫలితంగా దేశం ఇప్పుడు తన ప్రజాస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.
మిత్రులారా,
దేశంలోని మహిళా శక్తి తమ కష్టార్జితం, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో కొత్త శిఖరాలను అధిరోహించింది. ఇప్పుడు మనం అందరం కలిసి ఈ శక్తికి కొత్త ఉత్తేజాన్ని ఇవ్వాలి. వారికి మరిన్ని అవకాశాలను విస్తరించాలి. దేశంలోని ప్రతి తల్లికి, సోదరికి, కుమార్తెకు ఈ వేదిక నుంచి నేను ఒక హామీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ దేశం మీ ఆకాంక్షలను అర్థం చేసుకుంటుంది. మీ కలలను నిజం చేయడానికి అవసరమైన ప్రతి అడగునూ వేస్తోంది.
మిత్రులారా,
పార్లమెంటులో చర్చ జరగడానికి ముందే ఈ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనవలసిందిగా దేశంలోని మహిళా శక్తికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ప్రాంతాలకు చెందిన ఎంపీలను మీరు తప్పకుండా కలవండి. దేశంలోని మహిళలు తమ పక్షాన ఉన్న విషయాలను ఎంపీలకు వివరించాలి. తమ ఆశలను, అంచనాలను వారికి తెలియజేయాలి. వారు సభకు బయలుదేరే రోజున వారికి పూలు, దండలతో వీడ్కోలు పలకండి. తల్లులు, సోదరీల దీవెనలతో ఎంపీలు సభకు వెళ్ళినప్పుడు వారు వేరే ఏ నిర్ణయాలను తీసుకోలేరు. తద్వారా నా తోటి ఎంపీలు సరైన నిర్ణయం తీసుకుంటారు. మహిళల ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకుంటారు. ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకుంటారు.
మిత్రులారా,
మీకు నాదో చిన్న విన్నపం. ఈ ‘నారీ శక్తి వందన్’ కార్యక్రమంలో జరుగుతున్న చర్చలను దేశంలోని పల్లెపల్లెకూ తీసుకెళ్లండి. వ్యక్తిగత సమావేశాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా దేశం తీసుకున్న ఈ అతిపెద్ద నిర్ణయాన్ని ప్రతి మహిళకూ చేరవేయాలి. వారిని చైతన్యవంతులను చేయాలి. తద్వారా ఈ గొప్ప నిర్ణయం వెనక ఉన్న బలాన్ని, తమ పాత్రను అర్థం చేసుకోగలరు. రాబోయే రోజుల్లో రాష్ట్రాల నుంచి దేశ పార్లమెంటు వరకు అన్ని చోట్లా తమ ఉనికిని చాటుతామని వారు స్వేచ్ఛగా కలలు కనగలరు. రండి మనమందరం కలిసి ఈ నిశ్చయంతో ముందుకు సాగుదాం. మహిళా శక్తికి వారి హక్కులు లభిస్తాయి. నిర్ణయాత్మక ప్రక్రియలో వారు పూర్తి స్థాయి భాగస్వాములవుతారు. మన ఉజ్వల భవిష్యత్తుకు ఇదే అతిపెద్ద గొప్ప హామీ. ఇది గౌరవ స్పీకర్ పరిధిలోని అంశం అయినప్పటికీ.. ఈ నెల 16, 17, 18 తేదీల్లో సందర్శకుల గ్యాలరీ అంతా మహిళలతో నిండిపోవాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు దేశమంతటా ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇది ఈ పార్టీదో లేక ఆ పార్టీదో అనే అంశంగా మిగిలిపోదు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు చేశారు అనే దానితో సంబంధం లేదు. ఈ ఘనత అంతా దేశంలోని మాతృశక్తిదే. ఈ ఘనత అంతా దేశ పార్లమెంటుదే, ఈ ఘనత అంతా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలదీ. గత 3, 4 దశాబ్దాలుగా నిరంతరం కృషి చేస్తున్న వారందరికీ దక్కుతుంది. ఇది అందరికీ చెందినది. అందరి సహకారంతో సాధ్యమైంది. అందరి సంక్షేమం కోసం ఉద్దేశించినది. ఈ నమ్మకంతో మీరంతా ఇంత సమయాన్ని కేటాయించి, ఇంత ఉత్సాహంతో, ఉత్తేజంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
మీ అందరికీ ధన్యవాదాలు.
***
(రిలీజ్ ఐడి: 2251906)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10