పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
· పటిష్ఠతతో వైవిధ్యభరితంగా ఉన్న భారతదేశ విద్యుత్ వ్యవస్థ.. స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలను తీర్చడానికి సిద్ధం
· 2026 ఏప్రిల్–జూన్‌లో వేగవంతమైన థర్మల్, హైడ్రో, పునరుత్పాదక ఇంధన, బీఈఎస్ఎస్, పీఎస్‌పీ ప్రాజెక్టుల ప్రారంభ ప్రక్రియ
· 98 శాతానికి పెరిగిన ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు
· కొనసాగుతోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు.. సుమారు 1.2 లక్షల దాడులు నిర్వహించి 57,000 కంటే ఎక్కువ సిలిండర్ల స్వాధీనం చేసుకున్న అధికారులు
· 4.05 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రారంభమైన గ్యాస్ సరఫరా… కొత్త కనెక్షన్ల కోసం నమోదు చేసుకున్న దాదాపు 4.41 లక్షల మంది అదనపు వినియోగదారులు
· రద్దీ, నిలిపివేత లేకుండా కొనసాగుతున్న ఓడరేవుల కార్యకలాపాలు
· భారత్, మారిషస్ మధ్య తుది దశకు చేరుకున్న చమురు, గ్యాస్ సరఫరా ఒప్పందం
· లెబనాన్‌లో ప్రజల మరణాల పట్ల తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసిన భారత్.. భారతీయుల భద్రత కోసం అక్కడి రాయబార కార్యాలయం నిరంతరంగా కొనసాగుతున్న సంప్రదింపులు
నాడు పోస్టు చేయడమైనది:
10 APR 2026 6:25PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించే నిరంతర ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించింది. పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు-నౌకాయానం-జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల అధికారులు ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందుతోన్న సహాయం, కీలక రంగాలలో స్థిరత్వాన్ని కాపాడటానికి తీసుకుంటున్న చర్యలపై తాజా వివరాలను అందించారు. దీనితో పాటు విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆ రంగానికి సంబంధించిన తాజా సమాచారాన్ని తెలియజేసింది.
విద్యుత్ రంగ తాజా సమాచారం:
· ప్రపంచవ్యాప్త అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత విద్యుత్ వ్యవస్థ పటిష్ఠతతో వైవిధ్యభరితంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలను తీర్చడానికి తగిన రీతిలో సిద్ధంగా ఉందని విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రముఖంగా పేర్కొంది.
· భారతదేశం ప్రస్తుతం కలిగి ఉన్న 531 గిగావాట్ల (జీడబ్ల్యూ) కంటే ఎక్కువ స్థాపిత సామర్థ్యం వైవిధ్యభరితమైన వనరులపై ఆధారపడి ఉంది. ఇందులో బొగ్గు, పునరుత్పాదక ఇంధనం, జలవిద్యుత్, అణుశక్తి వనరులకు గణనీయమైన వాటా ఉంది. ముఖ్యంగా శిలాజేతర వనరుల వాటా 50 శాతం కంటే ఎక్కువగా ఉంది.
· సుమారు 5 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల (సీకేఎం) బలమైన సరఫరా వ్యవస్థ, ప్రాంతాల మధ్య (ఇంటర్- రీజియన్) 120 గిగావాట్లకు పైగా సరఫరా సామర్థ్యం ఈ వ్యవస్థకు అండగా నిలుస్తున్నాయి. ఇది వివిధ ప్రాంతాల మధ్య అంతరాయం లేని విద్యుత్ ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది.
స్వల్పకాలిక సన్నాహకత: సరఫరా సమృద్ధిని నిర్ధారించడం
· సమీప కాలంలో ఎదురయ్యే సరఫరా సవాళ్లను అధిగమించడానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద తగినంత బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకుంటున్నారు.
· ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని గరిష్ఠంగా వినియోగించుకోవడానికి దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడే (ఐసీబీ) విద్యుతుత్పత్తి కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
· వేసవి కాలంలో సుమారు 10,000 మెగావాట్ల (ఎండబ్ల్యూ) అదనపు సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల సాధారణ నిర్వహణ పనులను వాయిదా వేస్తున్నారు.
· నిర్మాణంలో ఉన్న థర్మల్, హైడ్రో, పునరుత్పాదక ఇంధన, బీఈఎస్ఎస్, పీఎస్‌పీ ప్రాజెక్టుల ప్రారంభాన్ని 2026 ఏప్రిల్–జూన్ మధ్య వేగవంతం చేస్తున్నారు.
దీర్ఘకాలిక వ్యూహం: ఇంధన స్వయంప్రతిపత్తి దిశగా అడుగులు
· దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన భద్రతను పెంపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించారు.
· గత దశాబ్ద కాలంలో గ్యాస్ ఆధారిత లేదా దిగుమతి చేసుకున్న బొగ్గు ఆధారిత కొత్త విద్యుత్ కేంద్రాలను ప్రణాళిక చేయలేదు. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న కేంద్రాలను దేశీయ ఇంధన వనరులకు అనుగుణంగా మార్చే ప్రక్రియ కొనసాగుతోంది.
జాతీయ విద్యుత్ ప్రణాళిక ప్రకారం 2031–32 నాటికి మొత్తం స్థాపిత సామర్థ్యం సుమారు 874 గిగావాట్లకు చేరుకుంటుందన్న అంచనా ఉంది. ఇందులో శిలాజేతర ఇంధన వనరుల వైపు గణనీయమైన మార్పు ఉండబోతోంది:
· శిలాజేతర ఇంధన వనరుల వాటా 67 శాతం కంటే ఎక్కువ అవుతుందన్న అంచనా ఉంది.
· ఇంధన నిల్వ సామర్థ్యాన్ని 300 గిగావాట్ అవర్స్ (జీడబ్ల్యూహెచ్) వరకు పెంచనున్నారు.
· విద్యుత్ సరఫరా వ్యవస్థను సుమారు 6.5 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లకు (సీకేఎం) పెంచడంతో పాటు.. ప్రాంతాల మధ్య 167 గిగావాట్ల సరఫరా సామర్థ్యాన్ని (ఇంటర్- రీజియన్) అందుబాటులోకి తీసుకురానున్నారు.
స్థిరత్వాన్ని పెంచే కీలక విధానపరమైన చర్యలు
· విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం వరుసగా ఈ కింది విధానపరమైన చర్యలను చేపట్టింది:
o రాష్ట్రాలు నిరంతరంగా కొనసాగే 10 ఏళ్ల 'వనరుల సమృద్ధి ప్రణాళికలను' అమలు చేస్తున్నాయి.
o జాతీయ, ప్రాంతీయ స్థాయిలలో అవసరాలకు అనుగుణంగా సరితూగే సరఫరా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
o అంతరాష్ట్ర సరఫరా వ్యవస్థ (ఐఎస్‌టీఎస్) ఛార్జీల మినహాయింపు, హరిత ఇంధన కారిడార్ల అభివృద్ధి, పీఎం-కుసుమ్, పీఎం సూర్య ఘర్, జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ వంటి ప్రతిష్ఠాత్మక పథకాలను అమలు చేస్తున్నారు.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూడటానికి తీసుకుంటున్న చర్యలను పెట్రోలియం- సహజ వాయువు మంత్రిత్వ శాఖ వివరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రజా సూచనలు, పౌర అవగాహన
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ విషయంలో ప్రజలు భయాందోళనతో కొనుగోళ్లు చేయొద్దని.. కేవలం అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.
ఎల్‌పీజీ వినియోగదారులు డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించాలని.. డిస్ట్రిబ్యూటర్ల వద్దకు వెళ్లకుండా ఉండాలని కోరారు.
ప్రజలు పీఎన్‌జీ, ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించాల్సిందిగా ప్రోత్సహించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపు చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సంసిద్ధత, సరఫరా నిర్వహణ చర్యలు
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు మధ్య ప్రభుత్వం గృహావసరాల ఎల్‌పీజీ, పీఎన్‌జీ సరఫరాకు.. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ప్రాధాన్యతనిస్తోంది.
· సరఫరా, డిమాండ్ రెండు అంశాల్లోనూ ప్రభుత్వం ఇప్పటికే పలు హేతుబద్ధీకరణ చర్యలను అమలు చేసింది. ఇందులో భాగంగా చమురు శుద్ధి కేంద్రాల ఉత్పత్తిని పెంచడం.. ఎల్‌పీజీ బుకింగ్ గడువును పట్టణ ప్రాంతాల్లో 21 నుంచి 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం.. కీలక రంగాలకు సరఫరాలో ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు చేపట్టారు.
· ఎల్‌పీజీ డిమాండ్ ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
· చిన్న, మధ్యతరహా వినియోగదారులకు పంపిణీ చేయడం కోసం రాష్ట్రాలకు అదనపు బొగ్గును సరఫరా చేయాలని కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్‌ను బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
· గృహ, వాణిజ్య వినియోగదారుల విషయంలో కొత్త పీఎన్‌జీ కనెక్షన్‌లు పొందటాన్ని సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంస్థాగత యంత్రాంగాలతో సమన్వయ ప్రయత్నాలు
· నిత్యావసరాల చట్టం- 1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వు- 2000 ప్రకారం పెట్రోలియం ఉత్పత్తుల సరఫరాను పర్యవేక్షించడానికి.. అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది.
· 27.03.2026, 02.04.2026 నాటి లేఖల ద్వారా ఇంధనం తగినంతగా అందుబాటులో ఉందన్న భరోసాను ప్రజలకు ఇచ్చేందుకు ముందస్తు ప్రజా సమాచార మార్పిడి అవసరమని కేంద్రం ప్రభుత్వం ప్రధానంగా చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సమీక్షా సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. 02.04.2026న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి… 06.04.2026న సమాచార - ప్రసార, వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శులతో కలిసి పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో కింది అంశాలను ప్రముఖంగా చెప్పారు:
o ప్రతిరోజూ మీడియా సమావేశాలు నిర్వహించడం, క్రమం తప్పకుండా ప్రజా సూచనలను జారీ చేయడం.
o సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలు, అవాస్తవ సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించడం, తిప్పికొట్టడం.
o జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతిరోజూ తనిఖీలను ఉద్ధృతం చేయటం, ఓఎంసీలతో సమన్వయం చేసుకుంటూ దాడులు, తనిఖీలను కొనసాగించడం.
o సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించిన కిరోసిన్ (ఎస్‌కేఓ) కోసం కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయడం.
o పీఎన్‌జీ వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం.
o ఎల్‌పీజీ సరఫరాలో ముఖ్యంగా గృహ అవసరాల ఎల్‌పీజీ సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల లక్షిత పంపిణీ విధానాన్ని అనుసరించడం.
· అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలు, జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేశాయి.
· ప్రస్తుతం 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు క్రమం తప్పకుండా మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
అమలు, పర్యవేక్షణ చర్యలు
· ఎల్‌పీజీ అక్రమ నిల్వ, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. 2026 ఏప్రిల్ 9న దేశవ్యాప్తంగా 3800కి పైగా దాడులు నిర్వహించి 450కి పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
· ఇప్పటి వరకు సుమారు 1.2 లక్షల దాడులు నిర్వహించగా 57,000 కంటే ఎక్కువ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 950కి పైగా ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి.. 229 మందిని అరెస్టు చేశారు.
· ప్రభుత్వ రంగ చమురు విక్రయ సంస్థలు (పీఎస్‌యూ ఓఎంసీ) ఆకస్మిక తనిఖీలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా 2110కి పైగా షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన 204 ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లపై జరిమానాలు విధించాయి.. 53 డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లను సస్పెండ్ చేశాయి.
ఎల్‌పీజీ సరఫరా స్థితిగతులు
గృహావసరాల ఎల్‌పీజీ
· ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
· ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వల కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.
· పరిశ్రమవ్యాప్తంగా ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు సుమారు 98 శాతానికి పెరిగాయి.
· సిలిండర్ల దారి మళ్లింపును అరికట్టడానికి డెలివరీ ఆథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత పంపిణీ విధానాన్ని సుమారు 92 శాతానికి పెంచారు.
· గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీ సాధారణంగానే కొనసాగుతోంది.
వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా, కేటాయింపు చర్యలు
· మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో సుమారు 70 శాతానికి పెరిగాయి. ఇందులో 10 శాతం సంస్కరణలతో ముడిపడి ఉన్న కేటాయింపులు కూడా ఉన్నాయి.
· కేంద్ర ప్రభుత్వం 08.04.2026 నాటి లేఖ ద్వారా.. ఫార్మా, ఆహార రంగం, పాలిమర్, వ్యవసాయం, ప్యాకేజింగ్, పెయింట్, యురేనియం, భార జలం, ఉక్కు, విత్తనాలు, లోహాలు, సిరామిక్, ఫౌండ్రీ, ఫోర్జింగ్, గాజు, ఏరోసోల్ మొదలైన రంగాల్లోని పారిశ్రామిక విభాగాలు కూడా 2026 మార్చికి ముందు ఉన్న తమ బల్క్ గృహేతర ఎల్‌పీజీ వినియోగ స్థాయిలో 70 శాతాన్ని పొందుతాయని తెలియజేసింది. అయితే ఇది రోజుకు 0.2 టీఎంటీ అనే మొత్తం రంగాల పరిమితికి లోబడి ఉంటుంది.
· ఈ కేటాయింపు కింద బల్క్ ఎల్‌పీజీ పొందాలంటే సంబంధిత పరిశ్రమలు తప్పనిసరిగా 21.03.2026 నాటి లేఖలోని పారా (బీ) ప్రకారం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. పారా (సీ) ప్రకారం పీఎన్‌జీ కనెక్షన్ కోసం సీజీడీ సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. అయితే పైన పేర్కొన్న పరిశ్రమలు తమ తయారీ ప్రక్రియలో ఎల్‌పీజీని ఒక ముఖ్యమైన ముడిసరుకుగా ఉపయోగిస్తున్నా లేదా సహజ వాయువుతో భర్తీ చేయలేని ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగిస్తున్నా పీఎన్‌జీ కోసం దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.
· ఈ చర్యలు సరఫరా గొలుసులో అంతరాయాలను నివారించడమే కాకుండా నిత్యావసరాల కొరత ఏర్పడకుండా చూస్తాయని.. ప్రస్తుత ప్రపంచ సంక్షోభాలు ఉన్నప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేలా చేస్తాయని భావిస్తున్నారు.
· కేంద్ర ప్రభుత్వం 06.04.2026 నాటి లేఖ ద్వారా వలస కార్మికులకు పంపిణీ చేసే 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్ల రోజువారీ పరిమాణాన్ని రెట్టింపు చేస్తున్నట్లు వెల్లడించింది. 2026 మార్చి 2-3 తేదీలలో వలస కార్మికులకు ఉన్న సగటు రోజువారీ సరఫరా ఆధారంగా ఈ పెంపు ఉంటుంది. ఇది 21.03.2026 నాటి లేఖలో పేర్కొన్న 20 శాతం పరిమితి కంటే అదనంగా ఉంటుంది. ఈ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అందుబాటులో ఉంటాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సహకారంతో వీటిని కేవలం తమ రాష్ట్రంలోని వలస కార్మికులకు సరఫరా చేయడానికి మాత్రమే వినియోగించాలి.
· గడిచిన 7 రోజుల్లో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్‌యూ ఎఫ్‌టీఎల్) 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లపై సుమారు 2400 అవగాహన శిబిరాలను నిర్వహించాయి. ఈ శిబిరాల ద్వారా 25,000 కంటే ఎక్కువ 5 కేజీల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు విక్రయమయ్యాయి.
· 2026 ఫిబ్రవరి నెలలో రోజువారీ సగటు విక్రయాలు 77,000గా ఉండగా దానికి భిన్నంగా 09.04.2026 నాడు దేశవ్యాప్తంగా 1.1 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
· 2026 మార్చి 23 నుంచి వలస కార్మికులు, అల్పాదాయ వర్గాలతో పాటు విద్యార్థులకు సుమారు 11 లక్షల 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అందాయి.
· వాణిజ్య ఎల్‌పీజీ పంపిణీని ప్రణాళికాబద్ధంగా నిర్వహించడానికి ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ సంస్థల కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పరిశ్రమల విభాగాలతో సమన్వయం చేసుకుంటోంది.
· 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు సుమారు 1,06,093 మెట్రిక్ టన్నుల (ఎంటీ) వాణిజ్య ఎల్‌పీజీ (ఇది 55.8 లక్షల కంటే ఎక్కువ 19-కేజీల సిలిండర్లకు సమానం) విక్రయమైంది.
· నిన్న ఒక్కరోజే 6297 మెట్రిక్ టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ (ఇది 3.3 లక్షల కంటే ఎక్కువ 19-కేజీల సిలిండర్లకు సమానం) విక్రయమైంది.
సహజ వాయువు సరఫరా, పీఎన్‌జీ విస్తరణ కార్యక్రమాలు
· ప్రాధాన్యత రంగాలకు గ్యాస్ సరఫరాను ప్రభుత్వం కొనసాగిస్తోంది. దేశీయ గృహ అవసరాల పీఎన్‌జీ, సీఎన్జీ రవాణా రంగానికి 100 శాతం సరఫరాను రక్షిత ప్రాతిపదికన అందిస్తోంది.
· అందుబాటులో ఉన్న నిల్వలు, రానున్న ఎల్‌ఎన్‌జీ కార్గో షిప్పులను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కర్మాగారాలకు మొత్తం గ్యాస్ కేటాయింపులను మరో 5 శాతం పెంచుతున్నారు. ఈ ప్లాంట్లు తమ ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 95 శాతం సరఫరాను పొందనున్నాయి. ఈ కేటాయింపు 09.04.2026 నుంచి అమలులోకి వచ్చింది.
· ఇతర పారిశ్రామిక. వాణిజ్య రంగాలు, అలాగే సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థలకు గ్యాస్ సరఫరాను అదనంగా 10 శాతం పెంచారు. ఇది 06.04.2026 నుంచి అమల్లోకి వచ్చింది.
· వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతపై నెలకొన్నఆందోళనలను తొలగించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లకు పీఎన్‌జీ కనెక్షన్లు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలని సీజీడీ సంస్థలను ఆదేశించారు.
· గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లను పెంచేందుకు ఐజీఎల్, ఎంజీఎల్, జీఏఐఎల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి కంపెనీలు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.
· సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు అవసరమైన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలను భారత ప్రభుత్వం కోరింది.
· ఎల్‌పీజీ నుంచి పీఎన్ జీకి దీర్ఘకాలిక మార్పునకు సహకరించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపులో 10 శాతం అదనంగా ఇవ్వనున్నట్లు 18 మార్చి 2026 నాటి లేఖ ద్వారా భారత ప్రభుత్వం ప్రకటించింది.
· గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళం మొదలైన 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే పీఎన్‌జీ విస్తరణ సంస్కరణలకు అనుసంధానంగా అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును పొందుతున్నాయి.
· పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న చోట, నివాస పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, కమ్యూనిటీ కిచెన్‌లు, అంగన్వాడీ కిచెన్‌లు మొదలైన వాటికి 5 రోజులలోపు పీఎన్ జీ కనెక్షన్లు ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని సీజీడీ సంస్థలను పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి ఆదేశించింది.
· సీజీడీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యతా పాతిపదికన పరిశీలించడానికి, మూడు నెలలపాటు తర్వతి ఆమోద విధానాన్ని అమలు చేస్తోంది.
· నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ (పైప్లైన్లు, ఇతర సదుపాయాల నిర్మాణం, నిర్వహణ, విస్తరణ ద్వారా) ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం 24 మార్చి 2026 నాటి గెజిట్ ద్వారా నోటిఫై చేసింది. ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా పైప్‌లైన్ల నిర్మాణం, విస్తరణ కోసం ఒక సరళీకృత, సమయపాలనతో కూడిన విధానాన్ని అందిస్తుంది. ఇది భూసేకరణ, అనుమతుల్లో ఎదురయ్యే జాప్యాన్ని నివారిస్తూ, నివాస ప్రాంతాలతో సహా అన్ని చోట్లా సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల పీఎన్ జీ వ్యవస్థ అభివృద్ధి వేగవంతం అవ్వడమే కాకుండా.. మారుమూల ప్రాంతాలకు కూడా అనుసంధానం పెరుగుతుంది. ఇది స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, భారత ఇంధన భద్రతను, గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
· పీఎన్‌జీ విస్తరణలో వేగాన్ని కొనసాగించడానికి జాతీయ పీఎన్‌జీ కార్యక్రమం 2.0ను పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి 30 జూన్ 2026 వరకు పొడిగించింది.
· పర్యావరణానికి మేలు చేసే, సురక్షితమైన, స్వయం సమృద్ధి కలిగిన ఇంధన వనరులను పెంచడానికి భారత ప్రభుత్వం రాష్ట్రాల కోసం ఒక నమూనా సీబీజీ విధాన ముసాయిదాను తయారు చేసింది. ఈ నమూనా విధానం రాష్ట్రాలు తమ సొంతంగా పెట్టుబడిదారులకు అనుకూలమైన పద్ధతులను రూపొందించుకోవడానికి ఇది ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. ఏ రాష్ట్రాలైతే ఈ విధానాన్ని అమలు చేస్తాయో, వాటికి అదనపు వాణిజ్య ఎల్‌పీజీ కోటాను కేటాయించడంలో ప్రాధాన్యత ఇస్తారు.
· మార్చి 2026 నుంచి ఇప్పటివరకు సుమారు 4.05 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా మొదలైంది. వీరితోపాటు మరో 4.41 లక్షల మంది కొత్త కనెక్షన్ల కోసం పేరు నమోదు చేసుకున్నారు.
ముడి చమురు లభ్యత/ రిఫైనరీ కార్యకలాపాలు
· అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో పెట్రోల్, డీజిలు నిల్వలు సరిపడా ఉన్నాయి.
· దేశీయ వినియోగానికి మద్దతుగా రిఫైనరీల నుంచి ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.
· భారత ప్రభుత్వం 01.04.2026 నాటి ఉత్తర్వుల ప్రకారం... మన దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు తమ వద్ద ఉండే సీ3, సీ4 గ్యాస్ నిల్వలను నిర్ణీత పరిమాణంలో కొన్ని ముఖ్యమైన రంగాలకు అందించాలని అనుమతించింది. ఔషధ రంగం, ఆహార, పౌర సరఫరాల శాఖ, రసాయనాల శాఖ వంటి కీలక విభాగాలకు వీటిని కేటాయించనున్నారు. ఏ రిఫైనరీ నుంచి ఎంత పరిమాణంలో గ్యాస్ ఇవ్వాలనేది సెంటర్ ఫర్ హై టెక్నాలజీ (సీహెచ్‌టీ) నిర్ణయిస్తుంది.
· పైన చెప్పిన శాఖలకు సంబంధించిన కంపెనీల కోసం రోజుకు 800 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను కేటాయించారు. ఔషధ విభాగానికి బీపీపీసీఎల్ కొచ్చి, ముంబై రిఫైనరీల నుంచి రోజుకు 400 మెట్రిక్ టన్నుల కోటాను కేటాయించారు. ఈ అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
రిటైల్ ఇంధన లభ్యత, ధరల నియంత్రణ చర్యలు
· దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోలు బంకులు యథావిధిగా నడుస్తున్నాయి.
· మధ్యప్రాచ్యం సంక్షోభం వల్ల ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిలు పైన ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 10 తగ్గించింది.
· దేశీయ మార్కెట్‌లో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను నిర్ధారించడానికి డీజిలుపై లీటరుకు రూ. 21.5, విమాన ఇంధనంపై లీటరుకు రూ. 29.5 ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం విధించింది.
· పెట్రోలు, డీజిల్ సాధారణ రిటైల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.
· ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని ప్రభుత్వం కోరింది. సరైన సమాచారాన్ని పత్రికా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
కిరోసిన్ లభ్యత, పంపిణీ చర్యలు
· అన్ని రాష్ట్రాలకూ, కేంద్రపాలిత ప్రాంతాలకూ సాధారణ కేటాయింపులకు అదనంగా 48,000 కిలో లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
· భారత ప్రభుత్వం 29 మార్చి 2026 నాటి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కిరోసిన్ రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కేవలం వంట, వెలుతురు అవసరాల కోసం పీడీఎస్ కిరోసిన్ పంపిణీకి అనుమతించింది.
· ప్రతి జిల్లాలో గరిష్టంగా రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఓఎంసీ సేవా కేంద్రాలలో (ప్రాధాన్యంగా సంస్థ స్వయంగా నిర్వహించేవి) 5,000 లీటర్ల వరకు పీడీఎస్ కిరోసిన్‌ను నిల్వ చేయడానికి అనుమతించింది.
· ప్రతి జిల్లాలో ఈ ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఓఎంసీ కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగాలు నిర్దేశిస్తాయి.
· ఇప్పటికే 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కిరోసిన్ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలు తమకు కిరోసిన్ అవసరం లేదని తెలియజేశాయి.
సముద్ర భద్రత, నౌకా రవాణా కార్యకలాపాలు
· పర్షియన్ గల్ఫ్‌లో ప్రస్తుత సముద్ర పరిస్థితి, భారతీయ నౌకలు, సిబ్బందిని కాపాడటానికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
· ఓడరేవులు, నౌకాయానం మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ, సీబీఐసీ, డీజీఎఫ్టీలతో కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఎఫ్ఐఈఓ, సీఎస్ఎల్ఏ,ఈఈపీసీ, ఎస్ఈపీసీ,ఏపీఈడీఏ, ఇతరులతో సహా భాగస్వాములు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను అంచనా వేయడానికి నిన్న ఈ సమావేశం నిర్వహించింది.
· ఎగుమతిదారులు, వారి సంఘాల నిర్దిష్ట సమస్యలతో పాటు, ఆ సమస్యలు ఎదురవుతున్న ఓడరేవుల వివరాలను పంచుకోవాలని కోరారు.
· ఓడరేవులు ఎగుమతిదారులకు అందించే ఉపశమన చర్యలను, తిరిగి చెల్లించే ప్రాతిపదికన కాకుండా ముందస్తుగానే వర్తింపజేయాలని షిప్పింగ్ లైన్లను ఆదేశించారు.
· పారదర్శకత, విస్తృత ప్రచారం కోసం సరుకు, నౌకలకు అందించే అన్ని మినహాయింపులు, రాయితీల వివరాలను సంబంధిత ఓడరేవుల వెబ్‌సైట్‌లలో ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు.
· చమురు కంపెనీలు, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సమన్వయంతో అన్ని ఓడరేవుల వద్ద తగినంత బంకర్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి కొరత లేదు.
· ఓడరేవుల వద్ద కంటైనర్ల రద్దీ లేదా కిక్కిరిసిపోవడం వంటివి లేవు. పోర్టు కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయి.
· మార్చి 8 నుంచి ఏప్రిల్ 10, 2026 వరకు కాండ్లా, జేఎన్‌పీటీ వద్ద షిప్పింగ్ లైన్ కార్యకలాపాల కారణంగా నిలిచిపోయిన కంటైనర్ల నిల్వ తగ్గింపు వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
· కాండ్లా - 1575 నుంచి 44కి తగ్గింది. (97శాతం తగ్గింపు)
· జేఎన్‌పీటీ- 4500 నుంచి 394కి తగ్గింది. (92 శాతం తగ్గింపు)
· రీఫర్ కంటైనర్లు - 1200 నుంచి 8కి తగ్గింది. (99శాతం తగ్గింపు)
· అన్ని ఓడరేవులు, డిజి షిప్పింగ్, ఇతర భాగస్వామ్య పక్షాలతో ప్రస్తుత పరిస్థితిని ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సమీక్షించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
· ఆ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ జెండా ఉన్న నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.
· డిజి షిప్పింగ్ కంట్రోల్ రూమ్ గత 24 గంటల్లో 198 కాల్స్, 319 ఈమెయిళ్లను స్వీకరించి పరిష్కరించింది.
· ఇప్పటివరకు 1,927 మందికి పైగా భారతీయ నావికులు సురక్షితంగా స్వదేశానికి తిరిగి రావడానికి డిజి షిప్పింగ్ సహకరించింది. ఇందులో గత 24 గంటల్లో గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 124 మంది నావికులు ఉన్నారు.
· భారతీయ నావికుల సంక్షేమ, అంతరాయం లేని నౌకాయాన కార్యకలాపాలను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ రాయబార కార్యాలయాలు, ఇతర సముద్రయాన భాగస్వామ్య పక్షాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది.
యుద్ధ ప్రభావ ప్రాంతంలో భారత పౌరుల భద్రత
· భారత రాయబార కార్యాలయాల ద్వారా అందిస్తున్న సహాయంతో సహా యుద్ధ ప్రభావ ప్రాంతాల్లోని ఇటీవలి పరిణామాలను తెలియజేశారు. అవి ఈ కింది విధంగా ఉన్నాయి.
· గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.
· ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి కేంద్ర మంత్రులు గల్ఫ్ దేశాలలో పర్యటిస్తున్నారు.
· విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ ఎస్. జైశంకర్ ప్రస్తుతం మారిషస్‌లో అధికారిక పర్యటనలో ఉన్నారు. ఆయన ఏప్రిల్ 11,12 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా భారత్, యూఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అక్కడి నాయకత్వంతో చర్చలు జరపనున్నారు.
· భారత్ తన ఇంధన భద్రతను బలోపేతం చేసుకునేందుకు కృషి చేస్తున్నప్పటికీ, పొరుగు దేశాల ఇంధన అవసరాలను తీర్చడానికి వారి అభ్యర్థన మేరకు మద్దతును కూడా అందిస్తోంది.
· రెండు వారాల క్రితం శ్రీలంకకు 38 మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను భారత్ సరఫరా చేసింది.
· మారిషస్ ఇంధన భద్రతను పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించే చమురు, గ్యాస్ సరఫరాకు సంబంధించిన ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని ఖరారు చేస్తున్నారు.
· ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంక్షోభ సమయంలోనూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందిస్తున్న మద్దతు పట్ల ఇరు దేశాల నాయకులు అభినందనలు వ్యక్తం చేశారు.
· భారత్‌కు కీలక ఇంధన సరఫరాదారు అయిన ఖతార్‌లో పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ఏప్రిల్ 9, 10 తేదీల్లో పర్యటిస్తున్నారు.
· భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరపున ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి, అలాగే ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి హెచ్‌ఈ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీకి పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శుభాకాంక్షలు, సంఘీభావం, మద్దతు సందేశాన్ని తెలియజేశారు.
· నమ్మకమైన ఇంధన సరఫరాదారుగా కొనసాగుతామని ఖతార్ ఇంధన శాఖ మంత్రి తన దేశ నిబద్ధతను తెలియజేశారు. భారత్‌తో ఇంధన సంబంధాలను, సహకారాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
· మంత్రిత్వ శాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నిరంతరం పని చేస్తోంది. ఇది భారతీయ రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూనే, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోంది.
· ఆ ప్రాంతంలోని భారతీయ సమాజం రక్షణ, భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు.
· భారతీయ రాయబార కార్యాలయాలు, పోస్టులు 24x7 హెల్ప్‌లైన్లను నిర్వహిస్తున్నాయి. భారతీయ పౌరులకు సహాయం అందిస్తున్నాయి.
· స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలు, విమాన ప్రయాణ పరిస్థితులు, కాన్సులర్ సేవలకు సంబంధించిన సమాచారంతో కూడిన తాజా సూచనలను క్రమం తప్పకుండా జారీ చేస్తున్నారు.
· ఆ ప్రాంతంలోని భారతీయ కమ్యూనిటీ సంఘాలు, వృత్తిపరమైన సమూహాలు, భారతీయ కంపెనీలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో భారతీయ రాయబార కార్యాలయాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
· గగనతలం తెరిచి ఉన్న దేశాల నుంచి విమాన సర్వీసులు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి సుమారు 8,43,000 మంది ప్రయాణికులు భారత్‌కు చేరుకున్నారు.
· యూఏఈలో కార్యాచరణ, భద్రతా కారణాల దృష్ట్యా విమానయాన సంస్థలు యూఏఈ- భారత్ మధ్య పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. ఈ రోజు సుమారు 95 విమానాలు నడుస్తాయని అంచనా.
· సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌లోకి గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచి ఉండటంతో ఖతార్ ఎయిర్‌వేస్ నేడు భారత్‌కు సుమారు 8 నుంచి 10 విమానాలను నడపనుంది.
· కువైట్ గగనతలం ఇంకా మూసివేసి ఉంది. జజీరా ఎయిర్‌వేస్, కువైట్ ఎయిర్‌వేస్ సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి భారత్‌కు షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి. గగనతలం మూసివేత కారణంగా కువైట్ నుంచి భారతీయ పౌరులు సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు చేరుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
· బహ్రెయిన్ గగనతలం తెరిచి ఉంది. గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ నుంచి భారత్‌కు పరిమిత విమానాలను ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం సౌదీ అరేబియాలోని దమ్మామ్ విమానాశ్రయం నుంచి షెడ్యూల్ చేయని విమానాలను నడుపుతోంది. బహ్రెయిన్ నుంచి భారతీయుల ప్రయాణాన్ని సౌదీ అరేబియా ద్వారా సౌకర్యం కల్పిస్తున్నారు.
· టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటివరకు 2,180 మంది భారతీయ పౌరులను ఇరాన్ నుంచి ఆర్మేనియా, అజర్బైజాన్ మీదుగా భారత్‌కు పంపింది. వీరిలో 981 మంది భారతీయ విద్యార్థులు, 657 మంది భారతీయ మత్స్యకారులు ఉన్నారు.
· ఇజ్రాయెల్ గగనతలం పరిమిత విమాన రాకపోకలతో పాక్షికంగా తెరిచి ఉంది. భారతీయ పౌరుల ప్రయాణాన్ని జోర్డాన్, ఈజిప్ట్ మీదుగా సులభతరం చేస్తున్నారు.
· ఇరాక్ గగనతలం పరిమిత కార్యకలాపాలతో తెరిచి ఉంది. భారతీయ పౌరులు జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా భారత్‌కు చేరుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు.
లెబనాన్ పై ప్రకటన:
· లెబనాన్‌లో భారీ సంఖ్యలో పౌరులు మరణించినట్లు వస్తున్న నివేదికలపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం.
· లెబనాన్ శాంతి, భద్రతల కోసం పనిచేసే యూఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌కిసైన్యాన్ని అందించే దేశంగా ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి.
· పౌరుల రక్షణకే భారత్ ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యతనిచ్చింది. అంతర్జాతీయ చట్టాలను పాటించడం, దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం అత్యవసరం.
· లెబనాన్‌లోని మా రాయబార కార్యాలయం భారతీయ పౌరుల భద్రత, క్షేమం కోసం వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.
***
(రిలీజ్ ఐడి: 2251110)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam