సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతీయ సాంస్కృతిక విషయాల ప్రపంచవ్యాప్త ప్రచారం కోసం ఐసీసీఆర్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్న దూరదర్శన్ (ప్రసార భారతి)


సాంస్కృతిక విషయాలను బహుళ-వేదికలకు విస్తరించనున్న భాగస్వామ్యం

ప్రపంచవ్యాప్త విస్తరణ, డిజిటల్ వ్యాప్తిపై ప్రధానంగా దృష్టి

నాడు పోస్టు చేయడమైనది: 09 APR 2026 6:51PM by PIB Hyderabad

భారతదేశ సాంస్కృతిక దౌత్యం, ప్రపంచ స్థాయి విస్తరణను బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు వేస్తూ, దూరదర్శన్ (ప్రసార భారతి) ఈ నెల 7న న్యూఢిల్లీలోని దూరదర్శన్ భవన్‌లో భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్)తో అవగాహన ఒప్పందం చేసుకుంది.

దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ శ్రీ కె. సతీష్ నంబూదిరిపాద్, ఐసీసీఆర్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి కె. నందిని సింగ్లాలు, ఇరు సంస్థలకు చెందిన సీనియర్ అధికారుల సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో దూరదర్శన్ (ప్రసార భారతి), ఐసీసీఆర్ సంస్థల అధికారులు పాల్గొన్నారు.

ఐసీసీఆర్ అందించే సాంస్కృతిక విషయాల విస్తరణను పెంపొందించడం కోసం దూరదర్శన్ (ప్రసార భారతి)లోని విస్తృత టెలివిజన్, రేడియో, డిజిటల్ వ్యవస్థలను వినియోగించడమే ఈ భాగస్వామ్య లక్ష్యం. విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లు, భారతీయ సాంస్కృతిక కేంద్రాలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ఐసీసీఆర్ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దాని జోనల్, ప్రాంతీయ కార్యాలయాలు నిర్వహించే కార్యక్రమాలూ ఇందులో భాగంగా ఉన్నాయి.

ఈ అవగాహన ఒప్పందం ప్రకారం... ఐసీసీఆర్ సాంస్కృతిక కంటెంట్, ప్రదర్శనలను అందిస్తుంది. దూరదర్శన్ (ప్రసార భారతి) టెలివిజన్ ఛానెళ్లు, రేడియో నెట్‌వర్క్‌లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా సహా పలు వేదికల ద్వారా వాటి కవరేజ్, ప్రచారాన్ని చేపడుతుంది. ఈ ఏర్పాట్లు విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల నుంచి స్వీకరించి, రికార్డ్ చేసిన సాంస్కృతిక కంటెంట్ ప్రసారాన్నీ సులభతరం చేస్తాయి. తద్వారా భౌగోళిక ప్రాంతాల వ్యాప్తంగా భారత సాంస్కృతికతను విస్తృతంగా అందుబాటులోకి తెస్తాయి.

ఈ ఒప్పందంలోని ఒక ముఖ్యమైన అంశం... డిజిటల్ హక్కులు సహా కంటెంట్ హక్కులను శాశ్వతంగా ఉమ్మడిగా సొంతం చేసుకునేందుకు వీలు కల్పించడం. దీని వల్ల రెండు సంస్థలూ కంటెంట్‌ను దీర్ఘకాలిక ఉపయోగం కోసం భద్రపరచుకోవడానికి, వ్యాప్తి చేయడానికి వీలవుతుంది. ప్రేక్షకుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు గానూ దూరదర్శన్ (ప్రసార భారతి) సాధ్యమైనంత వరకు ప్రీ-ఈవెంట్ ప్రచారం, పలు వేదికల ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తుంది.

ఈ అవగాహన ఒప్పందం... సాంస్కృతిక ప్రసార కార్యక్రమాల సుస్థిరతకు దోహదపడుతూ, ఈ సహకారం కింద రూపొందించిన కంటెంట్ నుంచి ఉత్పన్నమయ్యే ఆదాయ అవకాశాలను అన్వేషించడానికి దూరదర్శన్ (ప్రసార భారతి)కు మరింత వీలు కల్పిస్తుంది.

ఈ ఒప్పందం మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. పరస్పర అంగీకారంతో దీనిని పొడిగించేందుకు నిబంధనలు ఉన్నాయి. ఈ సహకారం ద్వారా, సాంస్కృతిక ప్రచార ప్రయత్నాలను సమకాలీన మీడియా వేదికలు, ప్రపంచ ప్రేక్షకులతో అనుసంధానిస్తూ... భారత సుసంపన్నమైన, విభిన్నమైన సాంస్కృతిక వారసత్వానికి మరింత ప్రాచుర్యాన్ని కల్పిస్తూనే, దానిని ప్రపంచంలో అందరికీ అందుబాటులోకి తెస్తుందని భావిస్తున్నారు.

***


(రిలీజ్ ఐడి: 2250748) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Telugu , Kannada , Malayalam