ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్‌లోని కామ్లే, క్రా దాదీ, కురుంగ్ కుమే జిల్లాల్లో రూ. 26,069.50 కోట్ల వ్యయంతో

1720 మెగావాట్ల కమల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పెట్టుబడి ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 08 APR 2026 4:26PM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్‌లోని కామ్లే, క్రా దాదీ, కురుంగ్ కుమే జిల్లాల్లో కమల జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 26,069.50 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు 96 నెలల్లో పూర్తవుతుందని అంచనా.

 

1720 మెగావాట్ల (8 x 210 మెగావాట్లు,1 x 40 మెగావాట్లు) స్థాపిత సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు 6870 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు అరుణాచల్ ప్రదేశ్‌లో విద్యుత్ సరఫరా స్థితిగతులను మరింత మెరుగుపరుస్తుంది. డిమాండు ఎక్కువగా ఉన్న సమయాల్లో విద్యుత్ అవసరాలను తీర్చడమే కాకుండా.. దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తి, వినియోగాల మధ్య సమతౌల్యానికీ (నేషనల్ గ్రిడ్ బ్యాలెన్సింగ్) దోహదపడుతుంది. అలాగే బ్రహ్మపుత్ర లోయలో వరద నియంత్రణ ప్రయోజనాన్నీ అందిస్తుంది. కమల జలవిద్యుత్ ప్రాజెక్టుతోపాటు.. సుబాన్‌సిరి దిగువ (2000 మెగావాట్లు), దిబాంగ్ బహుళ ప్రయోజన (2880 మెగావాట్లు) జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. వీటితోపాటు ఎన్‌హెచ్‌పీసీ ద్వారా ఎటాలిన్ (3097 మెగావాట్లు) ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు.

 

ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్య సంస్థ కమల జలవిద్యుత్ ప్రాజెక్టును అమలు చేస్తుంది. వరద నియంత్రణ కోసం బడ్జెట్టు పరంగా రూ. 4,743.98 కోట్ల సాయాన్ని భారత ప్రభుత్వం అందిస్తుంది. అలాగే రహదారులు, వంతెనల నిర్మాణం, అనుబంధ విద్యుత్ సరఫరా వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 1,340 కోట్ల బడ్జెటు సాయాన్నీ అందిస్తుంది. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ వాటా కోసం రూ. 750 కోట్ల కేంద్ర ఆర్థిక సాయం కూడా అందుతుంది.

 

రాష్ట్రానికి 12 శాతం ఉచిత విద్యుత్తు లభించడంతోపాటు.. స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి (ఎల్ఏడీఎఫ్) కోసం అదనంగా 1 శాతాన్ని కేటాయిస్తారు. అలాగే ఈ ప్రాంతంలో విశేషంగా మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు, సామాజిక - ఆర్థిక ప్రయోజనాలూ చేకూరుతాయి.

 

ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 196 కి.మీ మేర రహదారులు, వంతెనల అభివృద్ధి సహా కామ్లే, క్రా దాదీ, కురుంగ్ కుమే జిల్లాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడతాయి. స్థానికంగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఆస్పత్రులు, పాఠశాలలు, మార్కెట్ల వంటి అత్యవసర మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా కూడా ఈ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. రూ. 8 కోట్ల ప్రత్యేక ప్రాజెక్టు నిధుల ద్వారా వీటికి నిధులను సమకూరుస్తారు. పరిహారాలు, ఉపాధి, సీఎస్ఆర్ కార్యకలాపాల ద్వారా కూడా స్థానికులకు ప్రయోజనం లభిస్తుంది.

కమల జలవిద్యుత్ ప్రాజెక్టుతోపాటు.. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో మరో మూడు ప్రధాన ప్రాజెక్టులు - సుబాన్‌సిరి దిగువ (200 మెగావాట్లు), దిబాంగ్ బహుళ ప్రయోజన (2880 మెగావాట్లు), ఎటాలిన్ (3097 మెగావాట్లు)లను కూడా ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ అభివృద్ధి చేస్తోంది. సుబాన్‌సిరి దిగువ జలవిద్యుత్ ప్రాజెక్టు (2000 మెగావాట్లు) పనుల్లో విశేష పురోగతిని గమనించవచ్చు. 750 మెగావాట్ల సామర్థ్యం ఇప్పటికే అందుబాటులోకి రాగా.. 2026 డిసెంబరు నాటికి మిగతా సామర్థ్యమూ అందుబాటులోకి వస్తుందని అంచనా.

 

ప్రాజెక్టులన్నీ అవి నిర్మించిన రాష్ట్రాలకు 12 శాతం ఉచిత విద్యుత్తును అందించడంతోపాటు.. ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో ఒక శాతానికి సమానమైన ‘స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి’ ద్వారా ఆ ప్రాంత అభివృద్ధికీ దోహదపడతాయి.

 

*** 


(రిలీజ్ ఐడి: 2250164) సందర్శకుల సూచీ సంఖ్య : : 18