రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రక్షణశాఖ మంత్రి నేతృత్వంలో పశ్చిమాసియాపై న్యూఢిల్లీలో ఐజీఓఎమ్‌ రెండో సమావేశం


ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి భారత్‌ సిద్ధంగా ఉండాలంటే.. నిరంతర పర్యవేక్షణ, వ్యూహాత్మక స్పందన అత్యవసరమన్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2026 9:32PM by PIB Hyderabad

రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఏప్రిల్ 2న న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్-2లో అనధికారిక మంత్రుల బృందం(ఐజీఓఎం) రెండో సమావేశం జరిగింది. పశ్చిమ ఆసియాలో చోటచేసుకుంటున్న పరిస్థితులను పర్యవేక్షించడానికి, భారత్‌పై వాటి ప్రభావం తక్కువగా ఉండేలా ముందస్తు చర్యలను చేపట్టేందుకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇటీవలి పరిణామాలపై మంత్రుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా తలెత్తే ఎలాంటి ప్రతికూల ప్రభావాలనైనా తగ్గించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపైనా చర్చలు జరిపారు.

ఈ సమావేశంలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్, పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్‌, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్, రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్, ఐటీ శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.

‘అనిశ్చిత పరిస్థితి’ దృష్ట్యా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాల్సిన ప్రాముఖ్యతను, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తగిన రీతిలో స్పందించాల్సిన అవసరాన్ని రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు. ఈ సంఘర్షణ ప్రభావం దేశ ప్రజలపై తక్కువగా ఉండేలా చూడటం కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా అన్ని విధాలా కృషి చేయాలని తెలిపారు.

ఈ సమావేశం సందర్భంగా పరిస్థితిని ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఏడుగురు కార్యదర్శులతో కూడిన సాధికారిక బృందాలు.. మంత్రుల బృందానికి వివరించాయి. ప్రపంచ వాణిజ్య అంతరాయాల వల్ల తలెత్తిన ఆందోళనలను పరిష్కరించడానికి, పరిశ్రమలకు.. ముఖ్యంగా తయారీ రంగానికి ఉపశమనం, మద్దతు అందించడానికి, అలాగే పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చేపట్టిన చర్యల గురించి కూడా వివరించారు. ఆ చర్యలు కింది విధంగా ఉన్నాయి.

40 రకాల కీలక పెట్రోకెమికల్ ఉత్పత్తులపై 2026 జూన్ 30 వరకు పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపును ఇస్తూ 2026 ఏప్రిల్ 1న నోటిఫికేషన్ విడుదల చేశారు.

సెజ్‌లలోని అర్హత కలిగిన యూనిట్లు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను దేశీయ పన్ను విధించే ప్రాంతంలో రాయితీ కస్టమ్స్ సుంకం ధరలతో విక్రయించుకోవడానికి వీలుగా 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు అమలులో ఉండేలా ఒక ప్రత్యేక ఏకకాల ఉపశమన చర్యను ప్రకటించారు.

2017 ఏప్రిల్ 1 కంటే ముందు చేసిన పెట్టుబడుల విషయంలో గార్ (జీఏఏఆర్‌) నిబంధనలను వర్తింపజేయబోమని స్పష్టం చేస్తూ రెవెన్యూ శాఖ 2026 మార్చి 31న నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ చర్యలు టెక్స్‌టైల్స్, ప్యాకేజింగ్‌, ఫార్మాస్యూటికల్స్ వంటి డౌన్‌స్ట్రీమ్ రంగాలపై వ్యయ ఒత్తిడిని తగ్గిస్తాయి. దేశంలో సరఫరా స్థిరత్వాన్ని సులభతరం చేస్తాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న పెట్టుబడిదారులకు అవసరమైన స్పష్టతను అందిస్తాయి.

ఏప్రిల్ 1, 2026 నుంచి దేశీయ కార్యకలాపాల కోసం విమాన టర్బైన్ ఇంధనం ధరల నెలవారీ పెరుగుదలపై 25 శాతం పరిమితిని విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ చర్య విమాన ప్రయాణ ఛార్జీల ఆకస్మిక పెరుగుదల నుంచి ప్రజలను రక్షించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు.

దేశీయ ఎల్‌పీజీ సరఫరాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని, వినియోగ అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చడానికి రిఫైనరీ ఉత్పత్తిని పెంచామని తెలిపారు. ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాలలో నిల్వలు అయిపోయినట్లు ఎటువంటి నివేదికలు లేవని, గృహ అవసరాల ఎల్‌పీజీ సిలిండర్ల డెలివరీ సాధారణ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతోందని మంత్రుల బృందానికి సమాచారం అందించారు. కొన్ని ప్రాంతాలలో అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి ఘటనల కారణంగా తాత్కాలిక సరఫరా ఆందోళనలు తలెత్తాయని, ఇది ప్రజల్లో భయాందోళనలకు దారితీసిందని పేర్కొన్నారు.

ఎల్‌పీజీ నిల్వ, అక్రమ రవాణాను అరికట్టడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని, పలు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నామని మంత్రులకు వివరించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన కొందరు ఎల్‌పీజీ పంపిణీ దారులపై కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

వలస కార్మికులకు, తక్కువ వినియోగం ఉన్న కుటుంబాలకు మద్దతుగా 5 కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్లు తగినంత అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2026 మార్చి 23 నుంచి ఇప్పటివరకు ఇటువంటివి 4.3 లక్షలకు పైగా సిలిండర్లు అమ్ముడయ్యాయి. డిమాండు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

వాణిజ్య ఎల్‌పీజీపై ఆధారపడే పారిశ్రామిక అవసరాలను తీరుస్తున్నట్లు మంత్రుల బృందానికి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు. పారిశ్రామిక కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చూడటం కోసం సంక్షోభానికి ముందు ఉన్న సరఫరా స్థాయిలలో 80 శాతానికిపైగా ఎక్కువ మొత్తాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నారని తెలిపారు. వివిధ పరిశ్రమల డిమాండు‌ను అర్థం చేసుకుని, వారి అవసరాలను తీర్చడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, భాగస్వాములతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఆటో ఎల్‌పీజీ సరఫరా నిరంతరాయంగా జరిగేలా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చూస్తున్నాయని.. అయితే ప్రైవేట్ ఆపరేటర్లు తమ సేకరణ సవాళ్ల కారణంగా కొన్ని సరఫరా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందుకే ప్రభుత్వ రంగ ఆటో ఎల్‌పీజీ పంపుల వద్ద రద్దీ కనిపిస్తున్నాయని, ఎక్కడైతే ఆటోలు డ్యూయల్ ఫీడ్ (పెట్రోలు, గ్యాస్‌ రెండింటితో నడిచేవి) కలిగి ఉన్నాయో, అక్కడ పెట్రోల్‌ను ఉపయోగించాల్సిందిగా వారిని ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.

భయాందోళనతో ప్రజలు అధికంగా కొనుగోళ్లు చేయడం కారణంగా పెరిగిన డిమాండును తట్టుకోవడానికి, వినియోగదారులకు ఎటువంటి కొరత లేకుండా చూడటానికి, రోజువారీ ఎల్‌పీజీ సరఫరాల సంఖ్యను గణనీయంగా పెంచినట్లు మంత్రులకు వివరించారు. ఎక్కడైతే సాధ్యమవుతుందో అక్కడ పారిశ్రామిక వినియోగం కోసం నమ్మకమైన ప్రత్యామ్నాయంగా పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువును (పీఎన్‌జీ) ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.ఇప్పటికే పీఎన్‌జీ వాడుతున్న రంగాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా సరఫరాను అందిస్తున్నట్లు చెప్పారు.

కొందరు దుండగులు ఫోటోషాప్ చేసిన, మార్ఫింగ్ చేసిన చిత్రాలను, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కావాలని భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రుల బృందానికి కేంద్ర రక్షణ మంత్రి వివరించారు. ఇటువంటి చర్యలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, ధ్రువీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, షేర్‌ చేయవద్దని సూచించారు. ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలని పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.

మంత్రుల బృందం తొలి సమావేశం 2026మార్చి 28న జరిగింది. ఆ సమయంలో రక్షణశాఖ మంత్రి అధికారులను ఉద్దేశిస్తూ.. పరిస్థితులను నిశితంగా పర్యవేక్షించాలని, మధ్యకాలిక నుంచి దీర్ఘకాలిక సన్నద్ధత విధానాన్ని అనుసరించాలని తెలిపారు. ఉన్నత స్థాయి సమన్వయాన్ని కొనసాగించాలని, వేగవంతమైన నిర్ణయాలు తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

***


(రిలీజ్ ఐడి: 2248810) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Khasi , English , हिन्दी , Marathi , Bengali , Gujarati , Odia , Kannada , Malayalam