సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ పురోగతిని వేగవంతం చేస్తున్న ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
02 APR 2026 2:13PM by PIB Hyderabad
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ) రంగం సహా మీడియా-వినోద రంగాన్ని ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తోంది. సృజనాధారిత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం, కంటెంట్ క్రియేషన్‌లో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను నిలపాలనే ప్రభుత్వ దార్శనికతలో భాగంగా అనేక కార్యక్రమాలను ప్రారంభించారు.
2026-27 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకారం, దేశవ్యాప్తంగా 15,000 సెకండరీ పాఠశాలలు, 500 కళాశాలల్లో ఏవీజీసీ కంటెంట్ క్రియేటర్ ల్యాబ్ (సీసీఎల్) లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ కార్యక్రమానికి రూ. 250 కోట్లు కేటాయించారు.
2025 జూలై నుంచి ముంబయిలోని ఐఐసీటీ–నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) క్యాంపస్ నుంచి... ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగానికి ఎన్‌సీఓఈగా ఐఐసీటీ పనిచేస్తోంది. ప్రస్తుతం 18 కోర్సులను ప్రవేశపెట్టగా... వాటిలో 136 మంది విద్యార్థులు చేరారు. 15 మంది అభ్యర్థులు 'ట్రెయిన్-ది-ట్రెయినర్' కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కంటెంట్ క్రియేటర్స్ ల్యాబ్‌ల ప్రణాళిక, సమన్వయం, దశలవారీ అమలు కోసం ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ)ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. టెక్నాలజీ స్టాక్, లబ్ధిదారు సంస్థల గుర్తింపు, అమలు పద్ధతులకు సంబంధించిన వాటాదారుల సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగానికి ప్రోత్సాహం అందించడం, ఈ రంగ అభివృద్ధి కోసం ఒక సమగ్ర వ్యూహాన్ని రూపొందించి, విధానపరమైన చర్యలను సిఫార్సు చేయడానికి 2022 ఏప్రిల్ నెలలో ప్రభుత్వం ఏవీజీసీ ప్రమోషన్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇది 2022 డిసెంబర్ నెలలో తన నివేదికను సమర్పించింది. ఈ రంగం గణనీయమైన ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని, 2030 నాటికి ఏవీజీసీ-ఎక్స్ఆర్, కంటెంట్ ప్రొడక్షన్, డిజైన్, ప్రోగ్రామింగ్, సంబంధిత రంగాల్లో సుమారు ఇరవై లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం కావచ్చని ఆ నివేదిక స్పష్టం చేసింది.
వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్-2025)ను ప్రభుత్వం ముంబయిలో నిర్వహించింది. "క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్" కార్యక్రమం కింద కంటెంట్ సృష్టిలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా దీనిని నిర్వహించారు. 100కు పైగా దేశాలకు చెందిన ప్రపంచ స్థాయి కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, ఓటీటీ వేదికలు, టెక్నాలజీ లీడర్‌లతో సంభాషించడానికి భారతీయ క్రియేటర్లు, నిర్మాతలు, అంకురసంస్థల కోసం ఈ సదస్సు ఒక సమీకృత వేదికను అందించింది.
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) ఆధ్వర్యంలో ప్రారంభించిన వేవ్‌ఎక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్... నిర్మాణాత్మక ఇంక్యుబేషన్, మార్గదర్శకత్వం, ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్‌లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మీడియా-టెక్ అంకుర సంస్థలకు మద్దతునిచ్చింది. అంకుర సంస్థల తొలి బృందానికి పరిశ్రమ నిపుణుల నుంచి మార్గదర్శకత్వం, పెట్టుబడిదారులతో అనుసంధానం, మేధో సంపత్తి సృష్టి, రక్షణకు మద్దతు వంటి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. అంకుర సంస్థలు తమ ఆవిష్కరణలను విస్తరించుకోవడానికి వీలుగా ఈ కార్యక్రమం అంతర్జాతీయ వేదికల్లో భాగస్వామ్యం, పరిశ్రమ భాగస్వామ్యాలు, ప్రపంచ మార్కెట్‌ప్లేస్‌లతో అనుసంధానాన్నీ సులభతరం చేస్తుంది.
మీడియా-వినోద రంగంలోని సృజనాత్మక ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి, ప్రదర్శించడానికి 'క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్' (సీఐసీ)ని ఒక జాతీయ వేదికగా వినియోగిస్తున్నారు. సీఐసీ మొదటి సీజన్‌లో, పరిశ్రమ భాగస్వాముల సహకారంతో 33 పోటీలను నిర్వహించారు. ఇది వేవ్స్ 2025లో ముగిసింది. ఈ సమ్మిట్‌లో దేశంలోని టయర్-II, టయర్-III నగరాలు సహా అనేక ప్రాంతాల నుంచి లక్షకు పైగా క్రియేటర్లు పాల్గొన్నారు. ఎంపికైన క్రియేటర్లు వారి కంటెంట్‌ను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడానికి వేవ్ఎక్స్, వేవ్స్ బజార్ వంటి వేదికల ద్వారా వారికి మద్దతునందిస్తున్నారు.
శ్రీమతి కృతి దేవి దేబ్‌బర్మన్, శ్రీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2248632)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam