ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణ దృష్ట్యా తీసుకుంటున్న చర్యలను సమీక్షించేందుకు పీఎం అధ్యక్షతన సీసీఎస్ సమావేశం


వ్యవసాయం,ఎరువులు, నౌకారవాణా, విమానయానం, సరకు రవాణా, ఎంఎస్ఎంఈలకు ఎదురవుతున్న సవాళ్లను తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చ

నిత్యావసర వస్తువుల సరఫరాలో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ఎల్పీజీ,పీఎన్జీ, ఎల్ఎన్జీ వైవిధ్యీకరణ, ఇంధన సుంకం తగ్గింపు, విద్యుత్ రంగంలో చేపట్టిన చర్యలపై సమీక్ష

నిత్యావసర వస్తువుల ధరలను స్థిరీకరించడానికి, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలపై కఠిన చర్యలు

ధరలు, నిత్యావసర వస్తువుల చట్టం అమలుపై నిరంతర పర్యవేక్షణ, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపులకు కంట్రోల్ రూముల ఏర్పాటు

ఎరువుల సరఫరాకు హామీ ఇచ్చేలా యూరియా ఉత్పత్తిని కొనసాగించడం, డీఏపీ/ఎన్పీకేఎస్ సరఫరా కోసం విదేశీ సరఫరాదారులతో సమన్వయంతో సహా చేపడుతున్న వివిధ ప్రయత్నాలు

సామాన్యుడి ప్రాథమిక అవసరాల లభ్యతను సమీక్షించిన పీఎం

దేశంలో అందుబాటులో ఉన్నఎరువులు, ఖరీఫ్, రబీ సీజన్లలో వాటి లభ్యత విషయంలో చేపట్టిన చర్యలపై చర్చించిన ప్రధాని

ఈ ఉద్రిక్తతల ప్రభావం నుంచి పౌరులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రధాని ఆదేశం

ప్రామాణిక సమాచారాన్ని సకాలంలో ప్రజలకు అందించి అసత్య సమాచారాన్ని, వదంతుల వ్యాప్తిని అడ్డుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసిన ప్రధాని

రాబోయే నెలల్లో విద్యుత్ అవసరాలను తీర్చడానికి అందుబాటులో ఉన్న తగినన్ని బొగ్గు నిల్వలు

నాడు పోస్టు చేయడమైనది: 01 APR 2026 10:04PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన లోక కల్యాణ్ మార్గ్, 7లో భద్రతపై క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశం జరిగింది. దీనిలో వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు చేపట్టిన చర్యలను సమీక్షించి, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

పెట్రోలియం ఉత్పత్తులు ముఖ్యంగా ఎల్ఎన్జీ/ఎల్పీజీ సరఫరాకు, తగినంత విద్యుత్తు అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన చర్యల గురించి మంత్రివర్గ కార్యదర్శి వివరించారు. కొత్తగా వివిధ దేశాల నుంచి వస్తున్న దిగుమతులతో ఎల్పీజీ సేకరణ వనరులను వైవిధ్యపరుస్తున్నారు. అదే విధంగా, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ)  కూడా వివిధ దేశాల నుంచి దిగుమతి అవుతోంది. గృహ వినియోగదారులకు ఎల్పీజీ ధరలు యథాతథంగా ఉన్నాయని కార్యదర్శి తెలిపారు. అదే విధంగా, ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్లో విక్రయాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లను విస్తరించే కార్యక్రమాలను కూడా చేపట్టారు. వేసవిలో డిమాండు ఎక్కువగా ఉండే నెలల్లో తగినంత విద్యుత్తును అందుబాటులో ఉంచేందుకు 7 నుంచి 8 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్తు కేంద్రాలకు గ్యాస్ పూలింగ్ విధానం నుంచి మినహాయింపు, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మరింత బొగ్గు నిల్వ చేసుకొనేందుకు ర్యాకుల ఏర్పాటు, తదితరమైన చర్యలు తీసుకుంటున్నారు.

అంతే కాకుండా.. వ్యవసాయం, పౌర విమానయానం, నౌకారవాణా, సరకు రవాణా తదితర రంగాల్లో తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రతిపాదించిన చర్యలపై చర్చించారు.

ఎరువుల సరఫరాకు భరోసానిచ్చేలా అవసరాలకు అనుగుణంగా యూరియా ఉత్పత్తిని కొనసాగించడం, డీఏపీ/ఎన్‌పీకేఎస్ సరఫరాదారుల కోసం విదేశీ సరఫరాలను సమన్వయం చేసుకోవడం లాంటి ప్రయత్నాలు చేపడుతున్నారు. రోజువారీ పర్యవేక్షణ, దాడులు, కఠిన చర్యల ద్వారా బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను, ఎరువుల మళ్లింపును అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

గత నెల రోజులుగా ఆహార పదార్థాల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ధరలు, నిత్యావసర వస్తువుల చట్టం అమలుపై నిరంతర పర్యవేక్షణకు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల కోసం కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. వ్యవసాయ ఉత్పత్తులు, కూరగాయలు, పండ్ల ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మన ఇంధన వనరులు, ఎరువులు, ఇతర సరఫరా వ్యవస్థలను అంతర్జాతీయంగా వైవిధ్యీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. అలాగే, హర్మూజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి అంతర్జాతీయ చర్యలు, దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.   

కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో మెరుగైన సమన్వయానికి, ఎప్పటికప్పుడు సమాచారం అందించడానికి, కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో సమాచార ప్రసారానికి, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.

సామాన్య ప్రజలకు అత్యవసర వస్తువుల లభ్యతపై ప్రధానమంత్రి సమీక్షించారు. దేశంలో అందుబాటులో ఉన్న ఎరువులు, ఖరీఫ్, రబీ కాలాల్లో వాటి లభ్యతను నిర్ధారించడానికి చేపట్టిన చర్యల గురించి చర్చించారు. ఈ సంక్షోభం ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు అన్నిచర్యలు తీసుకోవాలని చెప్పారు. అసత్య వార్తలను, వదంతుల ప్రచారాన్ని నిలువరించేందుకు ప్రామాణిక సమాచారం ప్రజలకు అందించాలని స్పష్టం చేశారు.

కొనసాగుతున్న అంతర్జాతీయ పరిణామాల వల్ల ప్రభావితమైన పౌరులు, వివిధ రంగాల సమస్యలను పరిష్కరించేందుకు సాధ్యమైన అన్ని చర్యలను చేపట్టాలని ప్రధానమంత్రి ఆదేశించారు.

****


(రిలీజ్ ఐడి: 2248193) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Gujarati , Kannada , Malayalam