పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
దేశంలో తగినంత అందుబాటులో ఉన్న ఎరువుల నిల్వలు
రైతులకు మునుపటి ధరలకే ఎరువుల సరఫరా
యూరియా తయారీ కేంద్రాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతర సరఫరాను నిర్ధారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
ఎరువుల దిగుమతి కోసం కేవలం ఒకట్రెండు దేశాలపై ఆధారపడకుండా బహుళ దేశాల నుంచి సేకరించేలా సరఫరా వనరుల విస్తరణ
ఎరువుల అక్రమ మళ్లింపు, నల్లబజారు క్రయవిక్రయాలు, అక్రమ నిల్వలపై కఠినమైన నిఘా
గృహ, వాణిజ్య అవసరాల కోసం పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలను ఇస్తోన్న సీజీజీ కంపెనీలు
పరిశ్రమల గణాంకాల ప్రకారం ఆన్‌లైన్ ద్వారానే సుమారు 95 శాతం ఎల్‌పీజీ బుకింగ్‌లు
గత వారం రోజుల్లో 2.6 లక్షలకు పైగా విక్రయమైన 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు
ఇందులో గత రెండు రోజుల్లోనే వలస కార్మికుల కోసం సరఫరా అయిన 88,000 కంటే ఎక్కువ సిలిండర్లు
క్రమం తప్పకుండా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
ఇదే విధంగా సమాచారాన్ని అందించాలని మిగిలిన రాష్ట్రాలను కూడా కోరిన కేంద్రం
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,500 కంటే ఎక్కువ చోట్ల దాడులు.. అక్రమంగా నిల్వ ఉంచిన 2,000 కంటే ఎక్కువ సిలిండర్ల సీజ్
ఎటువంటి రద్దీ లేకుండా సజావుగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న దేశవ్యాప్త ఓడరేవులు
సౌదీ అరేబియా యువరాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధానమంత్రి
అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజ సంక్షేమం కోసం సౌదీ ప్రభుత్వం అందిస్తున్న నిరంతర సహకారాన్ని అభినందించిన ప్రధాని
అంతర్జాతీయ సరకు రవాణా మార్గాలను సురక్షితంగా, అడ్డంకులు లేకుండా ఉండేలా చూసుకునేందుకు సముద్ర ప్రయాణ స్వేచ్ఛను నిర్ధారించే అవసరం ఉందన్న ఇద్దరు నేతలు
క్రమంగా మెరుగుపడుతోన్న విమాన ప్రయాణాల పరిస్థితి
ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు భారత్‌కు సురక్షితంగా తిరిగివచ్చిన సుమారు 5,50,000 మంది ప్రయాణికులు
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 5:27PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు.. ఇంధన లభ్యత, సముద్రయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తున్న మద్దతు, ఆయా రంగాలలో స్థిరత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలపై తాజా సమాచారాన్ని తెలియజేశారు. రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎరువుల విభాగం అధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో ఎరువుల కొరత లేకుండా తగినంత లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ఆయన వివరించారు.
ఎరువుల లభ్యత, సరఫరా కోసం తీసుకుంటున్న చర్యలు
దేశంలో ఎరువుల పరిస్థితిపై తాజా సమాచారాన్ని తెలియజేసిన ఆయన.. ఎరువుల లభ్యత, వాటిని సాఫీగా పంపిణీ జరిగేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఈ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు:
ప్రస్తుత పరిస్థితి
-
యూరియా అవసరాలలో 20–30 శాతం, డీఏపీ అవసరాలలో 30 శాతం దిగుమతుల కోసం గల్ఫ్ ప్రాంతంపైనే భారత్ ఆధారపడి ఉన్నాం. అంతేకాకుండా యూరియా తయారీకి ప్రధాన ముడిసరకైన ఎల్ఎన్‌జీ దిగుమతుల్లో దాదాపు 50 శాతం వాటా ఈ ప్రాంతానిదే. దేశీయంగా పీ-కే ఎరువుల ఉత్పత్తికి అవసరమైన అమ్మోనియా, సల్ఫర్, సల్ఫ్యూరిక్ ఆమ్లం వంటి కీలక ముడి పదార్థాల సరఫరాపై కూడా ప్రస్తుత పరిస్థితుల ప్రభావం పడింది.
-
అంతర్జాతీయ ఎరువుల మార్కెట్లో ఎల్ఎన్‌జీ, అమ్మోనియా, సల్ఫర్ వంటి ముడిసరుకుల ధరలు భారీగా పెరిగాయి. వీటితో పాటు సముద్రయాన ఛార్జీలు, రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరగడాన్ని గమనించొచ్చు.
-
ప్రస్తుత పరిస్థితుల కారణంగా దేశీయ యూరియా ఉత్పత్తిపై ప్రభావం పడింది. అయితే ఈ ప్రభావాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు ఎరువుల విభాగం నిరంతరం అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
లభ్యత
-
గత ఏడాది 2025 ఖరీఫ్‌లో జరిగిన వాస్తవ అమ్మకాలు 361 లక్షల టన్నులు కాగా రాబోయే 2026 ఖరీఫ్ సీజన్ కోసం మొత్తం సుమారు 390 లక్షల టన్నులు అవసరమవుతాయన్న అంచనా ఉంది.
-
గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుతం తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
-
గత ఏడాది 147 లక్షల టన్నులతో పోలిస్తే ప్రస్తుతం మొత్తం నిల్వలు సుమారు 180 లక్షల టన్నులుగా ఉన్నాయి.
-
ఏప్రిల్, మే నెలల్లో వ్యవసాయ పనులు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఖరీఫ్ సీజన్‌కు ముందు నిల్వలను పెంచుకోవడానికి ఈ సమయాన్ని వినియోగించుకుంటున్నారు.
దేశీయ ఉత్పత్తి
-
యూరియా ఉత్పత్తి కేంద్రాలకు గ్యాస్ సరఫరా ప్రారంభంలో సుమారు 60 శాతానికి తగ్గింది. అయితే దీనిని క్రమంగా 65 శాతానికి పెంచారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా దీనిని మరింతగా 75–80 శాతానికి పెంచారు. దీనివల్ల యూరియా ఉత్పత్తి రోజుకు 12,000–15,000 టన్నుల వరకు పెరిగింది. ఫలితంగా నెలకు 9–10 లక్షల మెట్రిక్ టన్నులుగా (ఎల్ఎంటీ) ఉన్న ఉత్పత్తి నష్టం ప్రస్తుతం సుమారు 6–7 ఎల్ఎంటీలకు తగ్గింది.
-
ఈ చర్యల వల్ల యూరియా ఉత్పత్తి కేంద్రాలకు గ్యాస్ సరఫరా నిరంతరాయంగా అందడమే కాకుండా తగిన వ్యూహాలను అవలంబించడానికి అవసరమైన సమయం లభించింది.
-
మార్చి నెలలో దేశీయ యూరియా ఉత్పత్తి సుమారు 18 లక్షల టన్నులుగా, పీ-కే ఎరువుల ఉత్పత్తి 9–10 లక్షల టన్నులుగా నమోదైంది. 2025 మార్చిలో ఇవి వరుసగా 24.78 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ), 11.90 లక్షల మెట్రిక్ టన్నులుగా (ఎల్ఎంటీ) ఉన్నాయి.
-
స్థానిక ఎరువుల ఉత్పత్తికి అవసరమైన సల్ఫర్‌ను సరఫరా చేయాలని భారతీయ చమురు శుద్ధి కేంద్రాలను రసాయనాలు, ఎరువుల శాఖ (డీఓఎఫ్) ఆదేశించింది.
ఎరువుల దిగుమతి, వైవిధ్యభరితమైన వనరులు
-
ప్రపంచవ్యాప్తంగా ఎరువుల లభ్యతను అంచనా వేయడానికి, సరఫరా వనరులను గుర్తించడానికి, తగినంత యూరియా అందుబాటులో ఉండేలా దిగుమతుల నిమిత్తం ఒక ప్రణాళికను రూపొందించేందుకు ఒక ప్రత్యేక టాస్క్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు.
-
13.07 లక్షల టన్నుల యూరియా దిగుమతి కోసం ఫిబ్రవరి మధ్యలోనే గ్లోబల్ టెండర్‌ను పిలిచారు.
-
కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా రష్యా నుంచి సుమారు 28 లక్షల టన్నుల ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
-
సౌదీ అరేబియా నుంచి డీఏపీ సరఫరా కోసం దీర్ఘకాలిక ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది (ఐదేళ్లపాటు ఏటా 31.10 లక్షల టన్నులు).
-
అక్టోబర్ 2026 వరకు ఓమిఫ్కో (ఒమన్) నుంచి ఏటా 10 లక్షల టన్నుల యూరియా, సాబిక్ (సౌదీ అరేబియా) నుంచి 7 లక్షల టన్నుల అదనపు సరఫరాలను పొందేలా ఏర్పాట్లు ఉన్నాయి.
-
సల్ఫర్, ఎల్‌ఎన్‌జీ వంటి కీలక ముడి పదార్థాల సరఫరాను స్థిరపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
-
రష్యా, మొరాకో, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, మలేషియా, జోర్డాన్, కెనడా, అల్జీరియా, ఈజిప్ట్, ఫిన్లాండ్, టోగో సహా పలు దేశాల నుంచి ఎరువులకు సంబంధించిన వనరులను గుర్తిస్తున్నారు.
-
ప్రత్యామ్నాయ సరఫరా వనరులను గుర్తించడానికి విదేశాల్లోని 16 భారతీయ రాయబార కార్యాలయాలు సమన్వయం చేసుకుంటున్నాయి.
రాష్ట్రాలతో సమన్వయం
-
ఎరువుల లభ్యతపై ఎటువంటి భయాందోళనలు కలగకుండా రాష్ట్రాలకు అవగాహన కల్పించారు. రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి 2026 మార్చి 26న ఈ అంశంపై 10 మంది ముఖ్యమంత్రుల, 12 మంది రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో మాట్లాడారు.
-
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డీఏ-ఎఫ్‌డబ్ల్యూ), ఎరువుల విభాగం (డీఓఎఫ్) సంయుక్త ప్రయత్నాల ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, వ్యవసాయ కార్యదర్శులకు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించారు.
-
రాష్ట్రాల వ్యవసాయ శాఖల సమన్వయంతో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ- రైతు సంక్షేణ శాఖ.. నిత్యావసర సరకుల చట్టం-1955 ప్రకారం ఎరువుల అక్రమ మళ్లింపు, నల్లబజారు విక్రయాలు, నిల్వ చేయడం వంటి వాటిపై కఠిన నిఘా కొనసాగిస్తోంది.
-
పంపిణీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి వినూత్న చర్యలను అవలంబించాల్సిందిగా రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నారు.
-
అమోనియం సల్ఫేట్ (ఏఎస్), టీఎస్‌పీ, ఎస్ఎస్‌పీ, ఎఫ్‌ఓఎమ్ లేదా ఎల్‌ఎఫ్‌ఓఎమ్, నానో ఎరువుల వంటి ప్రత్యామ్నాయ ఎరువులను అందుబాటులోకి తెచ్చారు.
మొత్తం ప్రయత్నాలు
-
అంతర్జాతీయ ధరల పోకడలను ఎరువుల విభాగం నిశితంగా పర్యవేక్షిస్తోంది. రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం పోషక ఆధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్) రేట్లపై త్వరలో తగిన నిర్ణయాలు తీసుకోనుంది.
-
ఈ రోజు దేశంలో అన్ని రకాల ఎరువుల నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. రాబోయే రెండున్నర నెలల వరకు ఎరువుల విషయంలో ఎటువంటి ప్రధాన అవసరాలు ఉండే అవకాశం లేదు.
-
సంక్షోభానికంటే ముందున్న ధరలకే ప్రస్తుతం రైతులకు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డీఏ-ఎఫ్‌డబ్ల్యూ) కోరిన డిమాండ్ మేరకు తగినంత ఎరువులను అందించడానికి ఎరువుల విభాగం (డీఓఎఫ్) కట్టుబడి ఉంది. పంటలకు అవసరమైన ఎరువుల లభ్యతను నిర్ధారించడానికి భారతీయ ఎరువుల ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు, ఓడరేవు అధికారులు, భారతీయ రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వాలు వంటి అన్ని రకాల భాగస్వాములతో సమన్వయం కోసం ఎరువుల విభాగం (డీఓఎఫ్) 24 గంటలు పని చేస్తోంది. దీనిపై ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదు.
-
ఎరువుల లభ్యత, ఉత్పత్తి, దిగుమతులు, రవాణాను నిరంతరం పర్యవేక్షించడానికి ఒక అత్యవసర వార్‌రూంను ఏర్పాటు చేశారు. తగినంత సరఫరా కొనసాగుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇంధన సరఫరా, లభ్యత
హోర్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇంధన సరఫరా పరిస్థితిపై తాజా సమాచారాన్ని పంచుకుంది. మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు:
ముడి చమురు, చమురు శుద్ధి కేంద్రాలు
-
అన్ని చమురు శుద్ధి కేంద్రాలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ విషయంలో తగినంత నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
-
దేశీయ వినియోగానికి మద్దతుగా చమురు శుద్ధి కేంద్రాల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచారు.
రిటైల్ విక్రయకేంద్రాలు
-
దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ విక్రయకేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నాయి.
-
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 10 రూపాయల చొప్పున తగ్గించింది.
-
దేశీయ మార్కెట్లో ఇంధన లభ్యతను నిర్ధారించడానికి డీజిల్‌పై లీటరుకు 21.5 రూపాయలు, విమానయాన ఇంధనంపై (ఏటీఎఫ్) లీటరుకు 29.5 రూపాయల ఎగుమతి లేవీని ప్రభుత్వం విధించింది.
-
కొన్ని ప్రాంతాలలో వదంతుల కారణంగా ప్రజలు భయాందోళనతో ఇంధనాన్ని భారీగా కొనుగోలు చేస్తున్న సంఘటనలు దృష్టికి వచ్చాయి. దీనివల్ల రిటైల్ విక్రయకేంద్రాల వద్ద అసాధారణంగా అమ్మకాలు పెరగడమే కాకుండా రద్దీ కూడా ఏర్పడింది. అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
-
ప్రజలు వదంతులను నమ్మొద్దని ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. మీడియా సమావేశాల ద్వారా సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
సహజ వాయువు
-
గృహ వినియోగ పీఎన్‌జీ, రవాణా రంగ సీఎన్‌జీకి ప్రాధాన్యతనిస్తూ 100 శాతం సరఫరా చేస్తున్నారు.
-
గ్రిడ్‌కు అనుసంధానించమైన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు వారి సగటు వినియోగంలో సుమారు 80 శాతం మేర సరఫరా కొనసాగుతోంది.
-
వాణిజ్య ఎల్‌పీజీ లభ్యతపై ఉన్న ఆందోళనలను పరిష్కరించడానికి రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాంటీన్లు వంటి వాణిజ్య సంస్థలకు పీఎన్‌జీ కనెక్షన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సీజీడీ సంస్థలకు సూచించారు.
-
ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి.
-
సీజీడీ నెట్‌వర్క్ విస్తరణకు సంబంధించిన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
-
ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి దీర్ఘకాలిక మార్పును ప్రోత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును ప్రతిపాదించారు. రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల ఆధారంగా ఈ కేటాయింపులు సిఫార్సు చేస్తారు.
-
పైప్‌లైన్లు అందుబాటులో ఉన్న చోట 5 రోజుల్లోపు ఆవాస పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, సామాజిక వంటశాలలు, అంగన్‌వాడీ వంటశాలలకు పీఎన్‌జీ కనెక్షన్‌లను ప్రాధాన్యత క్రమంలో అందించాలని సీజీడీ సంస్థలను పీఎన్‌జీఆర్‌బీ ఆదేశించింది.
-
3 నెలల కాలానికి సీజీడీ మౌలిక సదుపాయాల కోసం తగ్గించిన సమయ పరిమితులతో కూడిన వేగవంతమైన ఫ్రేమ్‌వర్క్‌ను రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆమోదించింది.
-
పైప్‌లైన్ విస్తరణ కోసం క్రమబద్ధీకరించిన, సమయపాలనతో కూడిన ఫ్రేమ్‌వర్క్‌ను అందించడానికి ‘సహజ వాయువు, పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ ఉత్తర్వు- 2026’ను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇది సహజ వాయువు మౌలిక సదుపాయాల వేగవంతమైన వృద్ధిని సులభతరం చేస్తుంది.. ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది.
-
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నివాస ప్రాంతాలలో పీఎన్‌జీ మౌలిక సదుపాయాల ఏర్పాటును వేగవంతం చేసేందుకు 2026 జూన్ వరకు స్వల్పకాలిక విధాన సవరణను రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
-
మార్చి నెలలో గృహ, వాణిజ్య విభాగాల్లో కలిపి 3 లక్షలకు పైగా పీఎన్‌జీ కనెక్షన్‌లకు గ్యాస్ సరఫరాను ప్రారంభమైంది.
ఎల్‌పీజీ
-
ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం కొనసాగుతోంది.
-
ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద ఎక్కడా నిల్వలు అయినపోయినట్లు నివేదికలు అందలేదు.
-
పరిశ్రమ గణాంకాల ప్రకారం ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు దాదాపు 95 శాతానికి పెరిగాయి.
-
డెలివరీ అథెంటికేషన్ కోడ్ (డీఏసీ) ఆధారిత సిలిండర్ల పంపిణీ ఫిబ్రవరి 2026లో 53 శాతం ఉండగా.. ఇప్పుడు అవి 82 శాతానికి పెరిగాయి. ఇది గ్యాస్ మళ్లింపును నిరోధించడంలో సహాయపడుతోంది.
-
చాలా వరకు ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌లు గృహాలకు అంతరాయం లేకుండా సరఫరాను నిర్ధారించడానికి ఆదివారం కూడా పనిచేశాయి.
-
ఇంతకుముందే పాక్షికంగా (20 శాతం) వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను పునరుద్ధరించారు. సంస్కరణల ఆధారిత కేటాయింపులతో కలిపి అదనపు కేటాయింపుల ద్వారా మొత్తం వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో 50 శాతానికి.. ఆ తర్వాత 70 శాతానికి పెంచడం జరిగింది.
-
తాజా అదనపు కేటాయింపుల్లో ఉక్కు, వాహనాలు, వస్త్రాలు, రసాయనాలు, ప్లాస్టిక్ వంటి పరిశ్రమలకు.. ముఖ్యంగా ప్రత్యేక హీటింగ్ ప్రక్రియలు అవసరమయ్యే పరిశ్రమలకు ప్రాధాన్యత లభించింది.
-
వలస కార్మికుల కోసం గత 2 రోజుల్లో విక్రయించిన 88,000 సిలిండర్లతో కలిపి గత వారం రోజుల్లో మొత్తం 2.6 లక్షలకు పైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడయ్యాయి.
-
అత్యధిక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గృహేతర ఎల్‌పీజీ కేటాయింపుల కోసం ఉత్తర్వులు జారీ చేశాయి. దీనివల్ల 2026 మార్చి 14 నుంచి ఇప్పటివరకు సుమారు 41,503 మెట్రిక్ టన్నుల గ్యాస్‌ను వినియోగదారులు పొందారు.
కిరోసిన్
సాధారణ కేటాయింపులకు అదనంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 48,000 కిలో లీటర్ల కిరోసిన్‌ను కేటాయించారు.
నిల్వ పరిమితులతో కూడిన నిర్దేశిత పీఎస్‌యూ ఓఎమ్‌సీ సర్వీస్ స్టేషన్ల ద్వారా ఎస్‌కేవో రహిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పీడీఎస్ ఎస్‌కేవో పంపిణీని సులభతరం చేసే చర్యలను ప్రభుత్వం నోటిఫై చేసింది.
17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయగా, హిమాచల్ ప్రదేశ్, లదాఖ్‌లు దీని అవసరం లేదని సూచించాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాత్ర
నిత్యావసర వస్తువుల చట్టం-1955, ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వులు-2000 ప్రకారం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం కలిగి ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సరఫరాను పర్యవేక్షించే బాధ్యతలనూ అవి కలిగి ఉన్నాయి.
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, ఏసీఎస్/ప్రధాన కార్యదర్శులు/ఆహార, పౌర సరఫరాల శాఖ కార్యదర్శులందరికీ విజ్ఞప్తి -
రాష్ట్ర, జిల్లా స్థాయిలో రోజువారీ పత్రికా సమావేశాలను నిర్వహిస్తూ, ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు జారీ చేయాలి.
ప్రత్యేక కంట్రోల్ రూమ్/హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేయాలి
సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, తప్పుడు సమాచారాన్ని చురుగ్గా పర్యవేక్షించాలి, సమర్థంగా ఎదుర్కోవాలి.
జిల్లా యంత్రాంగం ద్వారా రోజువారీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లను ముమ్మరం చేయాలి, ఓఎమ్‌సీలతో సమన్వయం ద్వారా సోదాలు, తనిఖీలను కొనసాగించాలి.
తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన అదనపు ఎస్‌కేవో కోసం ఎస్‌కేవో కేటాయింపు ఉత్తర్వులను జారీ చేయాలి.
ఆర్‌వోడబ్ల్యూ/ఆర్‌వోయూ అనుమతులు, 24x7 పని అనుమతులు మొదలైనవాటిని వేగవంతం చేయడం సహా సీజీడీ విస్తరణనూ వేగవంతం చేయాలి.
పీఎన్‌జీ వినియోగాన్నీ, ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించాలి.
ఎమ్‌వోపీఎన్‌జీతో సమన్వయం కోసం సీనియర్ నోడల్ అధికారులను నామినేట్ చేయాలి.
భారత ప్రభుత్వం 27.03.2026 తేదీ నాటి లేఖ ద్వారా సరైన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, వదంతుల వ్యాప్తిని నివారించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు రోజువారీ పత్రికా సమావేశాలు నిర్వహించాలని... సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్స్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందించాలని మరోసారి అభ్యర్థించింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ సహా 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పత్రికా సమావేశాలు నిర్వహిస్తున్నాయి.
ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు
గత 24 గంటల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వ్యాప్తంగా 2,500లకు పైగా సోదాలు నిర్వహించగా, 2,000లకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.
బీహార్, జార్ఖండ్, కేరళం, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
సజావుగా సరఫరాలు జరిగేలా చూడటానికి... ఏవైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ కేసులను తనిఖీ చేయడానికి... ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల అధికారులూ దేశవ్యాప్తంగా ఆర్‌వో, ఎల్‌పీజీ పంపిణీ కేంద్రాల్లో ప్రతిరోజూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటివరకు ఎల్‌పీజీ పంపిణీ సంస్థలకు 500కు పైగా షోకాజ్ నోటీసులు జారీ చేశాయి.
ఢిల్లీ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాయి.
ప్రభుత్వం చేపడుతున్న ఇతర చర్యలు
ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ గృహాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ... గృహాలకు ఎల్‌పీజీ, పీఎన్‌జీ నిరంతర సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది.
సరఫరా, డిమాండ్ రెండు వైపులా అనేక హేతుబద్ధీకరణ చర్యలు అమలు చేశారు. వీటిలో శుద్ధి కర్మాగారాల ఉత్పత్తిని పెంచడం, ఎల్‌పీజీ బుకింగ్ వ్యవధిని పట్టణ ప్రాంతాల్లో 21 రోజుల నుంచి 25 రోజులకు... గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు పెంచడం, అలాగే సరఫరా విషయంలో వివిధ రంగాలకు ప్రాధాన్యమివ్వడం వంటి చర్యలు వీటిలో భాగంగా ఉన్నాయి.
ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలను ప్రతిపాదించారు.
చిన్న, మధ్య తరహా, ఇతర వినియోగదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రాలకు అధిక పరిమాణంలో బొగ్గును కేటాయించాలని బొగ్గు మంత్రిత్వ శాఖ 'కోల్ ఇండియా', 'సింగరేణి బొగ్గు గనుల' సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్‌జీ కనెక్షన్లను సమకూర్చాలని రాష్ట్రాలకు సూచించారు.
ప్రజలకు సూచనలు
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. పౌరులు ఆందోళనతో కూడిన కొనుగోళ్లను, అనవసరమైన ఎల్‌పీజీ బుకింగ్‌లను నివారించాలని సూచించడమైనది.
పౌరులు వదంతుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలని సూచించడమైనది.
వినియోగదారులు ఎల్‌పీజీ బుకింగ్ కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలని, ఎల్‌పీజీ పంపిణీదారుల వద్దకు వెళ్లడం మానుకోవాలని సూచిస్తున్నారు.
పీఎన్‌జీ, విద్యుత్-ఇండక్షన్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించాల్సిందిగా పౌరులను ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో పౌరులందరూ తమ రోజువారీ వినియోగంలో ఇంధనాన్ని పొదుపు చేయాలని కోరడమైనది.
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్‌లోని నౌకా వాణిజ్య పరిస్థితిపై తాజా సమాచారంతో పాటుగా భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను, రక్షణను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యలను నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ పంచుకుంది. అందులో ఈ సమాచారాన్ని తెలియజేసింది:
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులను, ముఖ్యంగా భారతీయ నావికుల భద్రత, నౌకల రాకపోకలు, నౌకాశ్రయాల కార్యకలాపాలను మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది.
ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ క్షేమంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా కలిగిన నౌకలకు సంబంధించి ఎటువంటి ఘటనలూ నమోదు కాలేదు. గత 72 గంటలుగా పరిస్థితి స్థిరంగానే కొనసాగుతోంది.
పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో గత 72 గంటల్లో 540 మంది నావికులతో 20 నౌకలు, ప్రస్తుతం సుమారు 485 మంది భారతీయ నావికులతో 18 భారత జెండా గల నౌకలు అక్కడ ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్‌పీఎస్‌ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్లతో సమన్వయం చేసుకుంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్) పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.
డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24×7 పనిచేస్తూనే ఉంది. ఇది ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 4,555 ఫోన్ కాల్‌లు, 9,074 ఈమెయిళ్లను స్వీకరించి, పరిష్కరించింది. ఇందులో గత 24 గంటల్లో వచ్చిన 32 కాల్‌లు, 89 ఈమెయిళ్లు, గత 72 గంటల్లో వచ్చిన 124 కాల్‌లు, 209 ఈమెయిళ్లూ ఇందులో ఉన్నాయి.
డీజీ షిప్పింగ్ ఇప్పటివరకు 950 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు మార్గాన్ని సుగమం చేసింది. వీరిలో గత 24 గంటల్లో స్వదేశానికి వచ్చిన 8 మంది, గత 72 గంటల్లో వచ్చిన 12 మంది ఉన్నారు.
సుమారు 94114 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ సరుకుతో వస్తున్న బీడబ్ల్యూ టీవైఆర్, బీడబ్ల్యూ ఈఎల్ఎమ్ అనే రెండు నౌకలు ఈ నెల 28న హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. బీడబ్ల్యూ టీవైఆర్ 47115 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జీతో రేపు, అంటే 31.03.2026న సాయంత్రం ముంబయికి చేరుకోవాల్సి ఉంది. బీడబ్ల్యూ ఈఎల్ఎమ్ 46999 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీతో 01.04.2026 సాయంత్రం న్యూ మంగళూరుకు చేరుకోనుంది.
గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళం, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరితో సహా వివిధ రాష్ట్రాల మారిటైమ్ బోర్డులు ధ్రువీకరించినట్లుగా, దేశవ్యాప్తంగా నౌకాశ్రయ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో ఎటువంటి రద్దీ నమోదు కాలేదు. గత 72 గంటలుగా ఈ కార్యకలాపాలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.
భారతీయ నావికుల భద్రతను, నిరంతరాయ నౌకా వాణిజ్య కార్యకలాపాలను నిర్ధారించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారతీయ మిషన్లు, నౌకా వాణిజ్య సంబంధిత భాగస్వాములతో మంత్రిత్వ శాఖ సమన్వయం కొనసాగిస్తోంది.
ఈ ప్రాంతంలోని భారత పౌరుల భద్రత
భారత మిషన్ల ద్వారా కొనసాగుతున్న సహాయం సహా, ఈ ప్రాంతంలోని తాజా పరిణామాలపై ఒక అప్‌డేట్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పంచుకుంది. కింది విషయాలను తెలియజేసింది:
ఈ నెల 28న సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌తో సంభాషించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ... పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై చర్చించారు.
ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను భారత్ ఖండిస్తుందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడం, నౌకాయాన మార్గాలను తెరిచి సురక్షితంగా ఉంచడం అవసరమని ఇరువురు నేతలు అంగీకరించారు.
ఆ దేశంలోని భారతీయ పౌరుల సంక్షేమం కోసం సౌదీ అరేబియా అందిస్తున్న నిరంతర మద్దతును ప్రధానమంత్రి అభినందించారు.
మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి...:
గల్ఫ్, పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశాంగ మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది. భారతీయ పౌరుల భద్రత, రక్షణ, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యమిస్తోంది.
భారతీయ పౌరులకు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నారు.
ఈ ప్రాంతం అంతటా ఉన్న భారతీయ మిషన్లు, కార్యాలయాలు 24×7 హెల్ప్‌లైన్‌లతో నిరంతరం పనిచేస్తూ, ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నాయి. స్థానిక ప్రభుత్వాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూనే, భారతీయ కమ్యూనిటీ సంస్థలు, సంఘాలు, కంపెనీలతో చురుగ్గా సంప్రదింపులు జరుపుతున్నాయి.
గగనతల పరిమితుల దృష్ట్యా వీసాలు, కాన్సులర్ సేవలు, పొరుగు దేశాల గుండా రవాణా సౌకర్యం కల్పించడం, అవసరమైన చోట లాజిస్టికల్ మద్దతును అందించడం ద్వారా మిషన్లు భారత పౌరులకు చురుగ్గా సహాయం చేస్తున్నాయి.
గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. వారి విద్యా సంవత్సరంపై ఎటువంటి ప్రభావం పడకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు.
విద్యా సంబంధిత సమస్యలను పరిష్కరించడం కోసం స్థానిక అధికారులు, భారతీయ పాఠశాలలు, సంబంధిత విద్యా మండళ్లు, జాతీయ పరీక్షా సంస్థతో దౌత్య కార్యాలయాలు సమన్వయం సాధిస్తున్నాయి.
ఈ ప్రాంతంలో 10వ, 12వ తరగతి ఫలితాల ప్రకటనకు సంబంధించి సీబీఎస్ఈ ఒక మూల్యాంకన విధానాన్ని తెలియజేసింది. ఐసీఎస్ఈ, కేరళ బోర్డులు, జేఈఈ, నీట్ వంటి పరీక్షలకు సంబంధించిన ఆందోళనలను విద్యార్థులు, తల్లిదండ్రులతో నిరంతర సంప్రదింపుల ద్వారా పరిష్కరిస్తున్నారు.
భారతీయ నావికులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. వారికి కాన్సులర్ సహాయం అందించడానికి, కుటుంబాలతో సంప్రదింపులు సులభతరం చేయడానికి, స్వదేశానికి తిరిగి రప్పించే అభ్యర్థనల్లో సహాయపడటానికి నావికా సిబ్బందితో మిషన్లు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయి.
విమాన ప్రయాణ పరిస్థితులు మొత్తంగా మెరుగుపడుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు సుమారు 5,50,000 మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి వచ్చారు.
యూఏఈలో, విమానయాన సంస్థలు కార్యాచరణ, భద్రతాపరమైన అంశాల ఆధారంగా పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులను కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు సుమారు 85 విమానాలు భారత్‌కు నడుస్తాయని అంచనా.
సౌదీ అరేబియా, ఒమన్‌లోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని పలు గమ్యస్థానాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.
ఖతార్ గగనతలం పాక్షికంగా తెరుచుకోవడంతో, ఖతార్ ఎయిర్‌వేస్ ఈ రోజు సుమారు 10 విమానాలను భారత్‌కు నడుపుతుందని భావిస్తున్నారు.
కువైట్, బహ్రెయిన్ గగనతలం మూసి ఉంది. జజీరా ఎయిర్‌వేస్, గల్ఫ్ ఎయిర్ సంస్థలు సౌదీ అరేబియాలోని దమ్మమ్ విమానాశ్రయం నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు షెడ్యూల్ చేయని వాణిజ్య విమానాలను నడుపుతున్నాయి.
గగనతల ఆంక్షల కారణంగా భారత పౌరులు ఇరాన్ నుంచి అర్మేనియా, అజర్‌బైజాన్ మీదుగా... ఇజ్రాయెల్ నుంచి ఈజిప్ట్, జోర్డాన్ మీదుగా... ఇరాక్ నుంచి జోర్డాన్, సౌదీ అరేబియా మీదుగా... కువైట్, బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియా మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు.
కువైట్‌లో జరిగిన ఒక దాడిలో ఒక భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వం మృతునికి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది, అలాగే మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తరలించేందుకు భారతీయ మిషన్ స్థానిక అధికారులతో సమన్వయం చేస్తోంది.
వివిధ సంఘటనల్లో మొత్తం 8 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభావిత కుటుంబాలకు సహాయం అందించడానికి భారతీయ మిషన్లు చర్యలను కొనసాగిస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2247164)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6