ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
28 MAR 2026 2:47PM by PIB Hyderabad
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
భారత్ మాతా కీ జై!
ప్రారంభోత్సవం అయిపోయిందా? ప్రారంభోత్సవం అయిపోయిందా ? లేదు.. సగం పనే పూర్తయింది. నేను కేవలం ఆ కర్టెన్ను (తెరను) మాత్రమే తొలగించాను. కానీ నేడు ఇక్కడ ఉన్న మీ అందరి చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవం జరగాలని నేను కోరుకుంటున్నాను. అందుకే మీ మొబైల్ ఫోన్లను బయటకు తీయండి. మీ ఫోన్ ఫ్లాష్లైట్లను ఆన్ చేయండి.. మీరే దీనిని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించినట్లుగా ఈ విమానాశ్రయాన్ని నేడు ప్రారంభిస్తున్నారు. ఇది మీ ఆస్తి, ఇది మీ భవిష్యత్తు, ఇది మీ కష్టం.. అందుకే దీని ప్రారంభోత్సవం కూడా మీ చేతుల మీదుగానే జరుగుతోంది. ‘భారత్ మాతా కీ జై’ అని నినదిస్తూ మీ చేతులెత్తి, ఫ్లాష్లైట్లను పూర్తిగా చూపించండి. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభోత్సవం పూర్తయింది.
ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య గారు, బ్రజేష్ పాఠక్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు రామ్మోహన్ నాయుడు గారు, పంకజ్ చౌదరి గారు, జూరిచ్ ఎయిర్పోర్టు చైర్మన్ జోసెఫ్ ఫెల్డర్ గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, నా ప్రియమైన సోదర సోదరీలారా!
నేడు నా కళ్లు ఎటు చూసినా ఉత్సాహంతో, ఆశయంతో నిండిన యువత మాత్రమే నాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ యువతకు తెలుసు.. ఇక్కడ జరుగుతున్న ఈ పని తమ భవిష్యత్తుకు కొత్త రెక్కలను ఇస్తుందని. ఈరోజు మనం ‘వికసిత్ యూపీ-వికసిత్ భారత్’ ప్రచారంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నేడు దేశంలోనే అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈరోజు నేడు గర్వకారణంగా, సంతోషకరంగా ఉండటానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే భాగ్యాన్ని, ఇప్పుడు దీనిని ప్రారంభించే అవకాశాన్ని కూడా మీరే నాకు ఇచ్చారు. కానీ నేను ఆ గౌరవాన్ని మీతో పంచుకుని మీ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేయించాను. ఇక రెండవది.. ఏ ఉత్తరప్రదేశ్ అయితే నన్ను తన ప్రతినిధిగా ఎన్నుకుందో, నన్ను ఎంపీగా చేసిందో.. ఆ ఉత్తరప్రదేశ్ అస్తిత్వంతో, ఆ గుర్తింపుతోనే ఈ గొప్ప విమానాశ్రయం పేరు కూడా ముడిపడి ఉంది..
మిత్రులారా,
నోయిడాలోని ఈ విమానాశ్రయం ఆగ్రా, మథుర, అలీగఢ్, ఘజియాబాద్, మీరట్, ఎటావా, బులంద్‌షహర్, ఫరీదాబాద్ వంటి ప్రాంతాలకు ఎంతో మేలు చేయబోతోంది. దేశానికి, ఉత్తరప్రదేశ్‌కు ఇది ఖచ్చితంగా జరగాల్సిన అభివృద్ధి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని రైతులకు, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు, ఇక్కడి యువతకు ఈ విమానాశ్రయం ఎన్నో కొత్త అవకాశాలను తీసుకురాబోతోంది. ఇక్కడి నుంచి విమానాలు ప్రపంచ దేశాలకు పయనిస్తాయి. ఇది అభివృద్ధి చెందిన ఉత్తరప్రదేశ్ ప్రగతికి ప్రతీకగా మారుతుంది. ఈ గొప్ప విమానాశ్రయం దక్కిన సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్ వాసులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
నేటి ఈ కార్యక్రమం దేశపు కొత్త ఆలోచనా విధానానికి ప్రతీక. నేడు యావత్ ప్రపంచం ఎంతటి ఆందోళన చెందుతుందో మీరందరూ చూస్తున్నారు. పశ్చిమాసియాలో గత నెల రోజులుగా యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం కారణంగా అనేక దేశాల్లో ఆహార పదార్థాలు, పెట్రోలు, డీజిలు, గ్యాస్, ఎరువులు వంటి అనేక నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రతి దేశం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. మన భారత్ కూడా దేశ ప్రజల శక్తిపై ఆధారపడి ఈ సంక్షోభంతో పూర్తిస్థాయిలో పోరాడుతోంది. ఎక్కడైతే యుద్ధం జరుగుతోందో ఆ ప్రాంతం నుంచే భారత్ అత్యధిక మొత్తంలో ముడి చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల ఈ సంక్షోభ భారం సామాన్య కుటుంబాలపై, మన రైతు సోదర సోదరీలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతి చర్య తీసుకుంటోంది.
మిత్రులారా,
ఇంతటి సంక్షోభ సమయంలో కూడా భారత్ తన వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తోంది. నేను కేవలం పశ్చిమ ఉత్తరప్రదేశ్ గురించి మాత్రమే మాట్లాడితే.. గత కొన్ని వారాల్లోనే శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవం జరుపుకున్న నాలుగో పెద్ద ప్రాజెక్టు ఇది. కొన్ని వారాల వ్యవధిలోనే నోయిడాలో ఒక భారీ సెమీకండక్టర్ కర్మాగరానికి శంకుస్థాపన జరిగింది. ఇదే కాలంలో దేశపు తొలి ఢిల్లీ-మీరట్ నమో భారత్ రైలు వేగం అందుకుంది. ఇదే కాలంలో మీరట్ మెట్రో విస్తరణ జరిగింది. ఇంత తక్కువ సమయంలోనే నేడు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం మీ చేతుల మీదుగా జరిగింది.
మిత్రులారా,
ఈ ప్రాజెక్టులన్నీ ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఒక గొప్ప ఉదాహరణ. సెమీకండక్టర్ కర్మాగారం సాంకేతిక రంగంలో దేశాన్ని స్వయంసమృద్ధిగా చేస్తోంది. మీరట్ మెట్రో, నమో భారత్ రైలు వేగవంతమైన, స్మార్ట్ అనుసంధానాన్ని అందిస్తున్నాయి. మన ఈ జేవార్ విమానాశ్రయం ఉత్తర భారత్ను మొత్తం ప్రపంచంతో అనుసంధానిస్తోంది. మీరు ఇప్పుడే వీడియోలో చూశారు. ప్రతి రెండు నిమిషాలకు ఒక విమానం ఎగిరేలా భారీ విమానాశ్రయం ఇక్కడ నిర్మితమవుతోంది. గతంలో సమాజ్వాదీ పార్టీ నాయకులు నోయిడాను తమ దోపిడి కోసం ఒక ఏటీఎంలా మార్చుకున్నారు. కానీ నేడు బీజేపీ ప్రభుత్వంలో అదే నోయిడా ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి ఒక శక్తిమంతమైన ఇంజిన్గా మారుతోంది.
మిత్రులారా,
ఈ జేవార్ విమానాశ్రయం డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పనితీరుకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒక్కసారి ఆలోచించండి. అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం 2003లోనే ఈ విమానాశ్రయానికి ఫైళ్లలో ఆమోదం తెలిపింది. 2003లో మీలో చాలామంది ఇంకా పుట్టి ఉండకపోవచ్చు. అప్పట్లో 25-30 ఏళ్ల వయసున్న వారు నేడు పదవీ విరమణ అయ్యి ఉండవచ్చు. కానీ అప్పుడు విమానాశ్రయం నిర్మించలేదు. కేంద్రంలోని కాంగ్రెస్, ఇక్కడి గత ప్రభుత్వాలు ఏళ్ల తరబడి ఈ విమానాశ్రయానికి కనీసం శంకుస్థాపన కూడా జరగనివ్వలేదు. 2004 నుంచి 2014 వరకు ఈ విమానాశ్రయం ఫైళ్లలోనే మగ్గిపోయింది. మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు యూపీలో ఎస్పీ ప్రభుత్వం ఉండేది. మొదటి రెండు మూడేళ్లలో ఆ పార్టీ వారు పని జరగనివ్వలేదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిందో.. ఢిల్లీలోనూ బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు జేవార్ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. నిర్మాణం పూర్తయింది. ఇక ఇప్పుడు కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి.
మిత్రులారా,
విమానాశ్రయంతో పాటు ఈ ప్రాంతం దేశంలోని రెండు అతిపెద్ద సరుకు రవాణా కారిడార్లకు కేంద్రంగా మారుతోంది. ఈ సరుకు రవాణా కారిడార్లు అనేవి కేవలం సరుకు రవాణా రైళ్ల కోసం ప్రత్యేకంగా వేసిన పట్టాలు. వీటి వల్ల ఉత్తర భారతదేశానికి బెంగాల్, గుజరాత్ సముద్ర తీరాలతో అనుసంధానం మెరుగుపడింది. ఈ రెండు కారిడార్లు ఒకదానికొకటి కలుసుకునే ప్రదేశమే ఈ దాద్రి. ఇక్కడి రైతులు పండించే పంటలు. ఇక్కడి పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులు.. భూమి, వాయు మార్గాల ద్వారా ప్రపంచంలోని ప్రతి మూలకు వేగంగా చేరుకోగలవు. ఇటువంటి బహుళ రవాణా మార్గాల అనుసంధానం కారణంగా ఉత్తరప్రదేశ్ ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఒక పెద్ద ఆకర్షణగా మారుతోంది.
మిత్రులారా,
గతంలో మూఢనమ్మకాల వల్ల ఏ నోయిడానైతే దాని విధికి వదిలేశారో.. ఏ నోయిడాకు వస్తే తమ పదవి ఊడిపోతుందనే భయంతో గత పాలకులు ఇక్కడికి రావడానికి భయపడేవారో నాకు గుర్తుంది. అప్పుడు ఇక్కడ ఎస్పీ ప్రభుత్వం ఉండేది. నేను నోయిడాకు రావడానికి ఒక కార్యక్రమం ఖరారు చేసుకున్నాను. అప్పటి ముఖ్యమంత్రి ఎంతగానో భయపడి ఆ కార్యక్రమానికి రాలేదు. ప్రజలు నన్ను కూడా భయపెట్టడానికి ప్రయత్నించారు. ‘‘మోదీ గారు నోయిడాకు వెళ్లకండి. మీరు ఇప్పుడే ప్రధానమంత్రి అయ్యారు’’ అని అనేవారు. అప్పుడు నేను ‘‘నాకు సుదీర్ఘకాలం సేవ చేసే అవకాశాన్ని ఇచ్చే ఈ నేల ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్తున్నాను’’ అని చెప్పాను. ఇప్పుడు అదే ప్రాంతం ప్రపంచం మొత్తానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతం మొత్తం ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేస్తోంది.
మిత్రులారా,
నేను నా రైతు మిత్రులకు మరో విషయంలోనూ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. మీరు పండించే చెరకు నుంచి తయారయ్యే ఇథనాల్ వల్ల, ముడి చమురు కోసం మన దేశం, ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గింది. ఇథనాల్ ఉత్పత్తి పెరగకపోయినా, పెట్రోల్‌లో దాన్ని కలపకపోయినా.. విదేశాల నుంచి భారత్, అదనంగా నాలుగున్నర కోట్ల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అంటే దాదాపు 700 కోట్ల లీటర్ల చమురు. ఈ సంక్షోభ సమయంలో రైతుల కష్టం దేశానికి భారీ ఊరట కలిగించింది.
మిత్రులారా,
ఇథనాల్ వల్ల దేశానికే కాక, రైతులకూ భారీగా ప్రయోజనం చేకూరింది. దీనివల్ల దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. ఇథనాల్‌ను తయారు చేయకపోయింటే, ఇంత భారీ మొత్తం విదేశాలకు తరలిపోయేది. కొన్నేళ్లుగా ఈ డబ్బు మన దేశ రైతులకి, ముఖ్యంగా చెరకు రైతులకు అందింది.
మిత్రులారా,
ఏళ్ల తరబడి చెరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్న రోజులను ఇక్కడి రైతులు చూశారు. కానీ ఇవాళ బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వ కృషితో చెరకు రైతుల పరిస్థితి మెరుగుపడింది.
మిత్రులారా,
ఏ దేశానికైనా విమానాశ్రయం కేవలం సౌకర్యం మాత్రమే కాదు.. అభివృద్ధికి రెక్కలనిస్తుంది. 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, నేడు దేశంలో 160కి పైగా విమానాశ్రయాలున్నాయి. ఇప్పుడు మెట్రో నగరాలతో పాటు దేశంలోని చిన్న నగరాలకూ విమాన ప్రయాణ సౌకర్యం చేరుతోంది. గత ప్రభుత్వాలు విమాన ప్రయాణమంటే కేవలం ధనికులకే పరిమితమని భావించేవి. కానీ బీజేపీ ప్రభుత్వం సామాన్య భారతీయుడికి కూడా విమాన ప్రయాణాన్ని సులభతరం చేసింది. మా ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లో విమానాశ్రయ వ్యవస్థను వేగంగా విస్తరిస్తూ, వాటి సంఖ్యను పదిహేడుకు పెంచింది.
మిత్రులారా,
విమానాశ్రయాల నిర్మాణమే కాక, ప్రయాణ ఛార్జీలు కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని బీజేపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అందుకే ఉడాన్ పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం ద్వారా గత కొన్నేళ్లలో కోటి అరవై లక్షల మందికి పైగా దేశ ప్రజలు తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేశారు. ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలనుకుంటున్నా. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకాన్ని మరింత విస్తరించేందుకు సుమారు రూ. 29 వేల కోట్లకు ఆమోదం తెలిపింది. దీనిద్వారా రాబోయే ఏళ్లలో చిన్న నగరాల్లో 100 నూతన విమానాశ్రయాలను, 200 కొత్త హెలిప్యాడ్లను నిర్మిస్తాం. తద్వారా యూపీకి కూడా ప్రయోజనం చేకూరుతుంది.
మిత్రులారా,
భారతదేశ విమానయాన రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారతదేశంలో కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తున్న కొద్దీ, కొత్త విమానాల అవసరం కూడా పెరుగుతోంది. దేశంలోని వివిధ విమానయాన సంస్థలు వందలాది కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ఈ కొత్త సౌకర్యాలు, రానున్న కొత్త విమానాలు.. వీటిని నడిపేందుకు, సేవలందించేందుకు, నిర్వహణ కార్యకలాపాలు చూసేందుకు, ఇలా ప్రతి పనికీ అధిక సంఖ్యలో నిపుణులు అవసరమవుతారు. ఇది యువతకు లభించబోయే ఒక గొప్ప అవకాశం. ఇందుకోసం మా ప్రభుత్వం విమానయాన రంగంలో శిక్షణ సౌకర్యాలనూ విస్తరిస్తోంది.
మిత్రులారా,
మీరు ఏదైనా వాహనాన్ని కొన్నప్పుడు, ఆ కంపెనీకి సంబంధించిన సర్వీసింగ్ సెంటర్ దగ్గర్లో ఉందో లేదో చూస్తారు. కానీ, మన దేశంలో విమానాల సర్వీసింగ్.. అంటే నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాలింగ్ కోసం ఇప్పటివరకు సరైన ఏర్పాట్లు లేవని తెలిస్తే ఆశ్చర్యపోతారు. నేటికీ భారతదేశంలోని 85 శాతం విమానాలను ఈ ఎంఆర్ఓ పనులకు విదేశాలకు పంపాల్సి వస్తోంది. అందుకే ఈ రంగంలోనూ భారతదేశాన్ని స్వావలంబన దిశగా నడిపించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు మన దేశంలోనే భారీ స్థాయిలో ఎంఆర్ఓ సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ జెవార్‌లోనూ ఒక ఎంఆర్ఓ కేంద్రానికి శంకుస్థాపన జరిగింది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే స్వదేశీ, విదేశీ విమానాలకు సేవలందించవచ్చు. దీనివల్ల దేశానికి ఆదాయం వస్తుంది. మన డబ్బు దేశంలోనే ఉంటుంది. మన యువతకు ఎన్నో ఉద్యోగాలు వస్తాయి.
మిత్రులారా,
దేశ పౌరుల సౌకర్యమే మా ప్రభుత్వ ప్రాధాన్యత. పౌరుల సమయం ఆదా అయి.. వారిపై భారం పడకూడదనేదే మా లక్ష్యం. మెట్రో, వందేభారత్ వంటి ఆధునిక రైలు సేవలను ఈ ఉద్దేశంతోనే విస్తరిస్తున్నాం. ఢిల్లీ-మీరట్ నమో భారత్ రైలు వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుందో మనం చూస్తున్నాం. ఇప్పటివరకు 2.5 కోట్లకు పైగా ప్రజలు నమో భారత్ రైలులో ప్రయాణించారు. గతంలో గంటల సమయం పట్టే ఢిల్లీ-మీరట్ ప్రయాణం ఇప్పుడు నిమిషాల్లో పూర్తవుతోంది.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాల కోసం మా ప్రభుత్వం ఎన్నో పెట్టుబడులను పెడుతోంది. గత 11 ఏళ్లలో మౌలిక సదుపాయాల బడ్జెట్‌ను 6 రెట్లకు పైగా పెంచాం. ఇన్నేళ్లలో హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల కోసం రూ. 17 లక్షల కోట్లు ఖర్చు చేశాం. లక్ష కిలోమీటర్లకు పైగా హైవేలను నిర్మించాం. రైల్వేలో 2014 వరకు కేవలం 20 వేల కిలోమీటర్ల మార్గంలో మాత్రమే విద్యుదీకరణ జరిగింది. కానీ 2014 తర్వాత, 40 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే ట్రాక్ విద్యుదీకరణ పూర్తయింది. ఈ రోజు బ్రాడ్ గేజ్ వ్యవస్థలో దాదాపు 100 శాతం విద్యుదీకరణ జరిగింది. కాశ్మీర్ లోయ నుంచి ఈశాన్య రాష్ట్రాల రాజధానుల వరకు.. రైలు వ్యవస్థతో ఇవన్నీ మొదటిసారి అనుసంధానం అవుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ఓడరేవుల సామర్థ్యం రెట్టింపుకు పైగా పెరిగింది. దేశంలోని నదీ జలమార్గాల సంఖ్య కూడా నిరంతరం పెరుగుతోంది. అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి అవసరమైన ప్రతి రంగంలోనూ దేశం శరవేగంగా ముందుకు సాగుతోంది.
మిత్రులారా,
అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణంలో ప్రతి ఒక్కరి కృషి ఎంతో కీలకం. 140 కోట్ల మంది దేశ ప్రజలు కఠినంగా శ్రమించటం, ప్రపంచ సంక్షోభాలను ఐక్యంగా ఎదుర్కోవటం నేడు అత్యవసరం. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల తలెత్తిన సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో నేను పార్లమెంటులోనూ వివరంగా చెప్పాను. నిన్న కూడా దేశంలోని ముఖ్యమంత్రులందరితో సుదీర్ఘంగా, సానుకూలంగా చర్చించాను. నేను ఈ రోజు మళ్లీ మీ అందరికీ, అంటే నా ప్రజా దేవుళ్లకు (జనతా జనార్దనానికి), దేశ ప్రజలకు ఒకటే చెబుతున్నా. మనం ఈ సంక్షోభాన్ని ప్రశాంతమైన మనసుతో, సహనంతో, ఐక్యతతో, కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఇది యావత్ ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే సంక్షోభం. మనం అన్నిటికంటే మిన్నగా మన దేశం గురించి ఆలోచించాలి. భారతీయులమైన మనందరి అతిపెద్ద బలం ఇదే. యూపీ, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు నేనొక విన్నపం చేస్తున్నా. ఇలాంటి సంక్షోభ సమయంలో దేశానికి హాని కలిగించే మాటలు మాట్లాడకండి. భారతీయుల మేలు కోసం, దేశ ప్రయోజనాల కోసం ఏది అవసరమో.. అదే భారత ప్రభుత్వ విధానం, వ్యూహం. రాజకీయాల కోసం తప్పుడు ప్రకటనలు చేసే వారికి రాజకీయ చర్చల్లో మార్కులు పడతాయోమో కానీ, దేశానికి నష్టం కలిగించే చర్యలను దేశ ప్రజలు ఎన్నటికీ క్షమించరు. కరోనా వంటి మహా సంక్షోభ సమయంలోనూ కొందరు వ్యక్తులు వదంతులు లేవనెత్తారు.. టీకాలపై అబద్ధపు ప్రచారం చేశారు. ప్రభుత్వం చేసే పని కష్టతరం కావాలని, దేశం నష్టపోవాలని కోరుకున్నారు. ఫలితం ఏమైంది? అటువంటి రాజకీయాలను ఎన్నికల సమయంలో ప్రజలు తిరస్కరించారు. దీని నుంచి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు పాఠం నేర్చుకుంటాయని, దేశం చేసే ఐక్య ప్రయత్నాలకు వారు బలాన్ని, శక్తిని ఇస్తారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. ఈ అభ్యర్థనతో, ఈ అద్భుతమైన విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌కు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
నాతో కలిసి పలకండి:
భారత్ మాతా కీ జై!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
వందేమాతరం!
జై హింద్!
వందేమాతరం!
వందేమాతరం!
అందరికీ ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది తెలుగు అనువాదం.
***
(రిలీజ్ ఐడి: 2246555)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6