పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ


పీఎన్‌జీ పరివర్తన దిశగా సంస్కరణలు చేపట్టే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం

గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లను వేగవంతం చేయాలని, వినియోగదారులు పీఎన్‌జీని ఎంచుకునేలా ప్రోత్సహించడానికి కనెక్షన్ గడువును (టైమ్‌లైన్) స్పష్టంగా తెలియజేయాలని సీజీడీ సంస్థలకు ఆదేశం

40 శాతం పెరిగిన దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి

ప్రాధాన్యత రంగాలకు నిరంతరాయంగా కొనసాగుతున్న రక్షిత గ్యాస్ సరఫరా

ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగుతోన్న భారత సముద్రయాన రంగ కార్యకలాపాలు

ఓడరేవుల వద్ద ఎక్కడా నమోదు కానీ రద్దీ

అదనపు విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో మెరుగుపడుతున్న విమాన ప్రయాణ పరిస్థితులు

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 5:37PM by PIB Hyderabad

పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై ఈ రోజు జాతీయ మీడియా కేంద్రంలో పెట్రోలియం- సహజ వాయువు, ఓడరేవులు- నౌకాయానం- జలమార్గాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు మీడియాకు వివరాలు తెలియజేశారు. మారుతున్న పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఇటువంటి సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. నేటి సమావేశంలో ఇంధన లభ్యత, నౌకాయాన కార్యకలాపాలు, ఆ ప్రాంతంలోని భారతీయులకు అందిస్తున్న సహాయంపై తాజా సమాచారాన్ని పంచుకున్నారు.

ఇంధన సరఫరా, లభ్యత

హార్ముజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్‌పీజీ నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించింది. ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ ఈ విధంగా పేర్కొంది:

ముడి చమురు, చమురు శుద్ధి కేంద్రాలు

  • అన్ని రిఫైనరీలు తగినంత ముడి చమురు నిల్వలతో గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి తగినంతగా ఉంది. దేశీయ అవసరాలను తీర్చడానికి ఎటువంటి దిగుమతులు అవసరం లేదు.

  • చమురు శుద్ధి కేంద్రాల నుంచి దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి సుమారు 40 శాతం పెరిగింది.

రిటైల్ అవుట్‌లెట్లు

  • ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం రిటైల్ అవుట్‌లెట్లలో ఎటువంటి ఇంధన కొరత నమోదు కాలేదు. పెట్రోల్, డీజిల్ సరఫరా క్రమం తప్పకుండా కొనసాగుతోంది.

  • తగినంత స్టాక్ అందుబాటులో ఉన్నందున ప్రజలు భయాందోళనతో నిల్వ చేయొద్దని సూచించారు. 

సహజ వాయువు

  • గృహ వినియోగ పీఎన్‌జీ, సీఎన్‌జీ రవాణాకు 100 శాతం సరఫరాతో సహా ప్రాధాన్యత రంగాలకు రక్షిత గ్యాస్ సరఫరా కొనసాగుతోంది. అదే సమయంలో పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు సరఫరాను సుమారు 80 శాతానికి నియంత్రించారు. 

  • వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులు పీఎన్‌జీకి మారాలని ప్రోత్సహిస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, హాస్టళ్లు వంటి సంస్థలు అధీకృత సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) సంస్థల నుంచి పీఎన్‌జీ కనెక్షన్‌లను పొందొచ్చు. 

  • ఐజీఎల్, ఎంజీఎల్, గెయిల్ గ్యాస్, బీపీసీఎల్ వంటి సీజీడీ కంపెనీలు గృహ, వాణిజ్య పీఎన్‌జీ కనెక్షన్‌లను ప్రోత్సహించడానికి రాయితీలను అందిస్తున్నాయి.

  • స్వచ్ఛ, సమర్థవంతమైన పీఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సీజీడీ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. వ్యాపార సంస్థలు కనెక్షన్‌ల కోసం అధీకృత సీజీడీ సంస్థలను సంప్రదించాల్సిందిగా కోరారు. 

  • విత్తనాల ఆరబెట్టే యూనిట్లు, శీతల నిల్వ కేంద్రాలు వంటి కీలక రంగాలకు గరిష్ట గ్యాస్ సరఫరా జరిగేలా చూడాలని సీజీడీ సంస్థలకు సూచించారు.

  • గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయం నుంచి సరఫరా ప్రారంభమయ్యే వరకు పట్టే కాలాన్ని తగ్గించాలని.. అలాగే వినియోగదారులు పీఎన్‌జీని ఎంచుకునేలా ప్రోత్సహించడానికి ఆ గడువును వారికి స్పష్టంగా తెలియజేయాలని పెట్రోలియం, సహజ వాయువు నియంత్రణ మండలి (పీఎన్‌జీఆర్‌బీ) సీజీడీ సంస్థలను ఆదేశించింది.

  • పీఎన్‌జీ డ్రైవ్ కింద ముద్రణ, రేడియో, సామాజిక మాధ్యమాలు, భాగస్వాములు, ఇన్‌ఫ్లుయెన్సర్లతో కూడిన ప్రజా అవగాహన కార్యక్రమాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని సీజీడీ సంస్థలకు సూచించారు. 

  • 2026 మార్చి 16 నాటి లేఖ ద్వారా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు తక్షణ అనుమతులు (డీమ్డ్ పర్మిషన్) ఇవ్వడం, కొత్త అనుమతులను 24 గంటల్లోపు ఆమోదించడం, రోడ్ల పునరుద్ధరణ- అనుమతి రుసుములను మినహాయించడం, పని వేళలు- సీజన్లలో సడలింపులు ఇవ్వడం, సమన్వయం కోసం రాష్ట్ర నోడల్ అధికారులను నియమించడం ద్వారా సీజీడీ విస్తరణకు సహకరించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. 

  • 2026 మార్చి 18 నాటి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం.. ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీ‌కి మారడానికి మద్దతుగా చేపట్టిన సంస్కరణల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం వాణిజ్య ఎల్‌పీజీ కేటాయింపును ప్రతిపాదించింది. ఇందులో:

    • సీజీడీ దరఖాస్తుల ఆమోదం, ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు చేసినందుకు 1 శాతం అదనపు కేటాయింపు

    • సీజీడీకి తక్షణ అనుమతులు (డీమ్డ్ పర్మిషన్స్) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు 2 శాతం అదనపు కేటాయింపు

    • సీజీడీ సంస్థల కోసం ‘డిగ్ అండ్ రిస్టోర్ స్కీమ్’ ప్రవేశపెట్టినందుకు 3 శాతం అదనపు కేటాయింపు

    • వార్షిక అద్దె, లీజు రుసుములను తగ్గించినందుకు 4 శాతం అదనపు కేటాయింపు ఉంటాయి.

  • సీజీడీ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేయడానికి.. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు పీఎన్‌జీ కనెక్షన్‌లను త్వరితగతిన అందించడానికి ఈ సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ప్రోత్సహిస్తున్నారు. 

  • ఈ చర్యలు ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గిస్తాయని, వాణిజ్య వినియోగదారులు పీఎన్‌జీ వైపు సులభంగా మారడానికి దోహదపడతాయని భావిస్తున్నారు.

ఎల్‌పీజీ

  • ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్‌పీజీ సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 

  • డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఎక్కడా ఎల్‌పీజీ కొరత ఉన్నట్లు నివేదికలు అందలేదు.

  • ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు 83 శాతం నుంచి 93 శాతానికి పెరిగాయి.

  • గ్యాస్ పక్కదారి పట్టకుండా నిరోధించడానికి 'డెలివరీ అథెంటికేషన్ కోడ్' కవరేజీని ఫిబ్రవరి 2026 నాటి 53 శాతం నుంచి సుమారు 81 శాతానికి పెంచారు.

  • గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల డెలివరీలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

  • బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహా సుమారు 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గృహేతర ఎల్‌పీజీ కేటాయింపు కోసం ఉత్తర్వులు జారీ చేశాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా అందుబాటులో ఉంది. 

కిరోసిన్

  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 48,000 కిలో లీటర్ల (కేఎల్) కిరోసిన్ కేటాయించారు. పంపిణీ కేంద్రాలను గుర్తించాలని ఆయా రాష్ట్రాలను కోరారు. 

  • బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, మణిపూర్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలతో కలిపి సుమారు 12 రాష్ట్రాలు కిరోసిన్ (ఎస్‌కేఓ) కేటాయింపు ఉత్తర్వులను జారీ చేశాయి. కొన్ని రాష్ట్రాలు తమకు ఎటువంటి అవసరం లేదని తెలియజేశాయి.

రాష్ట్ర ప్రభుత్వాల సమావేశాలు

  • నిత్యావసరాల అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 'నిత్యావసర సరకుల చట్టం', 'ఎల్‌పీజీ నియంత్రణ ఉత్తర్వుల' కింద నిత్యావసర వస్తువుల సరఫరాను పర్యవేక్షిస్తున్నాయి.

  • అక్రమ పద్ధతులను అరికట్టడానికి సమన్వయంతో కూడిన తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

  • ఇప్పటికే 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశాయి. 22 రాష్ట్రాలు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి. మిగిలిన వారు ప్రాధాన్యత ప్రతిపాదికన వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. 

  • రాజస్థాన్, తెలంగాణ, గోవా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు మొదలైన 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాయి.

  • ఇంతవరకు కంట్రోల్ రూంలు, జిల్లా పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నీ అత్యవసర ప్రతిపాదికన వాటిని ఏర్పాటు చేయాలని కోరారు. 

అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలు

  • ఎల్‌పీజీ అక్రమ నిల్వలు, నల్లబజారు క్రయవిక్రయాలను అరికట్టడానికి అన్ని రాష్ట్రాల్లో నిఘా చర్యలు కొనసాగుతున్నాయి.

  • ఇటీవలి కాలంలో జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో పెద్ద ఎత్తున ఎల్‌పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాయి.

  • సరఫరా సజావుగా సాగేలా చూడటానికి, అక్రమాలను నిరోధించడానికి రిటైల్ అవుట్‌లెట్లు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌షిప్‌ల వద్ద 2,300 కంటే ఎక్కువ ఆకస్మిక తనిఖీలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (పీఎస్‌యూ ఓఎంసీలు) నిర్వహించాయి.

ప్రభుత్వం చేపడుతున్న ఇతర చర్యలు

· ముఖ్యంగా గృహాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి ప్రాధాన్య రంగాలకు నిరంతరాయ ఎల్‌పీజీ సరఫరా, పీఎన్‌జీ విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యాన్ని కొనసాగిస్తోంది.

· సరఫరా, డిమాండ్-సైడ్ చర్యల్లో భాగంగా రిఫైనరీ ఉత్పత్తిని పెంచడం, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు... గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వరకు బుకింగ్ వ్యవధులను సవరించడం, ప్రాధాన్యతా క్రమంలో కేటాయింపులు చేయడం వంటివి చర్యలను అమలు చేస్తోంది.

· ఎల్‌పీజీ డిమాండ్‌పై ఒత్తిడిని తగ్గించడానికి కిరోసిన్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను అందుబాటులో ఉంచుతున్నారు.

· ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థల వినియోగాన్ని మెరుగుపరచడం ద్వారా డిజిటల్ బుకింగ్‌లను ప్రోత్సహిస్తూ, ఆందోళనతో చేసే బుకింగ్‌లను నివారించేందుకు కృషి చేస్తున్నాయి.

· రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పలు రాష్ట్రాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సరఫరానూ ప్రారంభించారు.


 

ప్రజలకు సూచనలు

· పౌరులు అధికారిక సమాచారంపైనే ఆధారపడాలని, వదంతులకు దూరంగా ఉండాలని సూచించారు.

· వినియోగదారులు భయాందోళనలతో బుకింగ్‌లు చేయకూడదని, డిజిటల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకోవాలని, ఎల్‌పీజీ పంపిణీదారులను అనవసరంగా సంప్రదించవద్దని విజ్ఞప్తి చేయడమైనది.

· పౌరులు పీఎన్‌జీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను, ఎలక్ట్రిక్, ఇండక్షన్ కుక్‌టాప్‌లను ఉపయోగించాలని... ఇంధనాన్ని పొదుపు చేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు

పర్షియన్ గల్ఫ్‌లో ప్రస్తుత నౌకా వాణిజ్య పరిస్థితి, భారతీయ నౌకలు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి తీసుకుంటున్న చర్యల గురించి నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ వివరణాత్మక తాజా సమాచారాన్ని పంచుకుంది. మంత్రిత్వ శాఖ కింది విషయాలను తెలియజేసింది:

· ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ సురక్షితంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారత జెండా గల నౌకలకు సంబంధించి ఎలాంటి నౌకా ప్రమాదం జరగలేదు.

· ప్రస్తుతం, 611 మంది భారతీయ నావికులతో కూడిన 22 భారత జెండా గల నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్‌పీఎస్‌ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్ల సమన్వయంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.

· ఎల్‌పీజీ రవాణా నౌకలైన శివాలిక్, నందా దేవి నౌకల నుంచి ప్రస్తుతం చమురు నిర్వహణ సంస్థల షెడ్యూల్ ప్రకారం సరుకును డిశ్చార్జ్ చేస్తున్నారు.

· డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 24×7 పనిచేస్తూనే ఉంది. కార్యచరణ ప్రారంభించినప్పటి నుంచి 3,305 కాల్‌లు, 6,324 ఈమెయిళ్లను అందుకుని, వాటిని పరిష్కరించింది. ఇందులో గత 24 గంటల్లో వచ్చిన 125 కాల్‌లు, 449 ఈమెయిళ్లూ ఉన్నాయి.


 

· డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఇప్పటి వరకు విమానాశ్రయాలు, ప్రాంతీయ ప్రదేశాల నుంచి 472 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు సహాయపడింది. వీరిలో గత 24 గంటల్లో 25 మంది స్వదేశానికి చేరుకున్నారు.

· గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్ర నౌకా వాణిజ్య బోర్డుల ద్వారా ధ్రువీకరణ సహా, ఓడరేవుల్లో ఎటువంటి రద్దీ లేకుండా భారత నౌకా వాణిజ్య రంగం కార్యకలాపాలు సజావుగా కొనసాగుతున్నాయి.

· ఓడరేవులు... నౌకల రవాణాను, సరుకు రవాణా కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో సుమారు 2,260 చదరపు మీటర్లు సహా అన్ని చోట్లా అదనపు నిల్వ స్థలాన్ని ఏర్పాటు చేయడంతో తగినంత అదనపు సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది.

· జేఎన్‌పీఏలో పరిస్థితి సాధారణంగానే ఉంది. సుమారు 1,000 వరకు ఉన్న నిలిచిపోయిన కంటైనర్ల సంఖ్య మరింత తగ్గి 770కి చేరింది.

· పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ నౌకల రవాణాను, ఓడరేవుల కార్యకలాపాలు, నావికుల భద్రత, నౌకా వాణిజ్య కార్యకలాపాల కొనసాగింపును పర్యవేక్షిస్తూనే ఉంది.

సంక్షోభ ప్రాంతంలో భారత పౌరుల భద్రత

భారత మిషన్ల ద్వారా కొనసాగుతున్న సహాయం, విస్తరణ సహా, ఈ ప్రాంతంలోని ఇటీవలి పరిణామాలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని పంచుకుంది. మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలిపింది:

· భారతీయ పౌరుల భద్రత, క్షేమం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని పరిణామాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.

· యూఏఈ అధ్యక్షుడు హెచ్‌హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి, ముందస్తు ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

· ఇరువురు నేతలూ పశ్చిమాసియాలోని ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. యూఏఈపై జరిగిన దాడుల్లో ప్రాణనష్టం, పౌర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

· హార్మూజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన నౌకాయానాన్ని నిర్ధారించాల్సిన ప్రాముఖ్యతను ఇరువురు నేతలు స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించే దిశగా కృషిని కొనసాగించడానికి వారు అంగీకరించారు.

· భూ సరిహద్దుల ద్వారా అజర్‌బైజాన్‌లోకి ప్రవేశించాలనుకునే వారితో సహా ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయం అందిస్తూనే ఉంది.

· అర్మేనియా, అజర్‌బైజాన్‌లోకి భూ సరిహద్దుల ద్వారా సులభంగా ప్రవేశించడానికి, భారత పౌరులు రాయబార కార్యాలయ సూచనలను పాటించాలని సూచించడమైనది.

· భారత పౌరులకు, వారి కుటుంబాలకు సహాయం చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం కొనసాగుతోంది.

· ఈ ప్రాంతంలోని భారతీయ మిషన్లు, పోస్టులు నిరంతరం పనిచేస్తూ... సామాజిక సంఘాలు, సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలను జారీ చేస్తున్నాయి. హెల్ప్‌లైన్‌కు వచ్చే ప్రశ్నలు తగ్గడం బట్టి, చిక్కుకుపోయిన పౌరుల అనేక అత్యవసర సమస్యలు పరిష్కారమైనట్లు తెలుస్తోంది.

· మిషన్లు స్థానిక అధికారులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ... సముద్రయాన సిబ్బందికి, చిక్కుకుపోయిన భారతీయులకు, స్వల్పకాలిక సందర్శకులకు... వీసాలు, కాన్సులర్ సేవలు, లాజిస్టికల్ మద్దతుతో సహాయం అందిస్తున్నాయి.

· ఈ ప్రాంతంలోని భారతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాఠశాలలు, విద్యా బోర్డులతో మిషన్లు సమన్వయం చేసుకుంటున్నాయి.

· సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు కాగా, ఇప్పుడు పన్నెండో తరగతి బోర్డు పరీక్షలూ రద్దు చేశారు. ఐసీఎస్ఈ, కేరళ బోర్డు పరీక్షలూ రద్దయ్యాయి.

· సంబంధిత బోర్డులు ఈ పరిస్థితుల్లో మార్కుల నిర్ధారణకు సంబంధించిన విధానాన్ని తగిన సమయంలో ప్రకటిస్తాయి.

· ఇరాన్‌లో, టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్‌లకు చెందిన భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ విషయంలో రాయబార కార్యాలయం అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తోంది.

· 28 ఫిబ్రవరి 2026 నుంచి ఇప్పటివరకు ఆ ప్రాంతం నుంచి సుమారు 2,60,000 మంది ప్రయాణికులు భారత్ తిరిగి వచ్చారు.

· ప్రాంతమంతటా అదనపు సర్వీసుల ప్రారంభంతో విమాన కార్యకలాపాలు క్రమంగా మెరుగవుతున్నాయి.

· యూఏఈలో ఈ నెల 17న సుమారు 70 విమానాలు నడిచాయి. భారత్‌లోని పలు గమ్యస్థానాలకు ఈ రోజు సుమారు 75 విమానాలు నడవనున్నాయి. ఈ నెల 5 నుంచి ప్రతిరోజూ 50కి పైగా విమానాలు నడుస్తున్నాయి. ఇది కనెక్టివిటీ మెరుగుపడుతోందని సూచిస్తుంది.

· సౌదీ అరేబియా, ఒమన్ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి.

· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచే ఉంది. నిన్న 5 విమానాలు నడపగా, ఈ రోజు నుంచి 9 భారతీయ గమ్యస్థానాలకు సర్వీసులు ప్రకటించారు.

· 28 ఫిబ్రవరి 2026 నుంచి కువైట్ గగనతలం మూసి ఉంది. సౌదీ అరేబియాలోని అల్ ఖైసుమా విమానాశ్రయం నుంచి జజీరా ఎయిర్‌వేస్ ప్రత్యేక నాన్-షెడ్యూల్డ్ విమానాలను నడపనుంది.

· కువైట్, బహ్రెయిన్, ఇరాక్‌లలో గగనతలంపై ఆంక్షలు కొనసాగుతున్నందున, అక్కడి భారతీయ పౌరులకు సౌదీ అరేబియా మీదుగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నారు.

పూర్తిగా అప్రమత్తంగా ఉంటూనే కీలక రంగాలు, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని... సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

***


(రిలీజ్ ఐడి: 2242037) సందర్శకుల సూచీ సంఖ్య : : 80