పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల వివరణ
అక్రమ నిల్వలు, నల్ల బజారు క్రయవిక్రయాలపై ఉక్కుపాదం
12,000కు పైగా దాడులు.. 15,000 ఎల్‌పీజీ సిలిండర్ల స్వాధీనం
పట్టణ ప్రాంతాల్లోని వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులు పీఎన్‌జీకి మారాలని ప్రోత్సాహం
సీజీడీ పైప్‌లైన్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి
దాదాపు 94 శాతానికి పెరిగిన ఆన్‌లైన్ ఎల్‌పీజీ బుకింగ్‌లు
నిత్యావసర సరకుల చట్టం కింద నల్లబజారు క్రయవిక్రయాలు, అక్రమ నిల్వలపై కఠిన చర్యలను కొనసాగించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచన
రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పలు రాష్ట్రాల్లో ప్రారంభమైన వాణిజ్య ఎల్‌పీజీ సరఫరా
ప్రజలు భయాందోళనతో ముందస్తు బుకింగ్‌లు చేయొద్దని, ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ కోసం డిజిటల్ పద్ధతులను ఉపయోగించాలని విజ్ఞప్తి
నిన్న భారత్ చేరుకున్న ఎల్‌పీజీ వాహక నౌక 'శివాలిక్'.. ఈ రోజు చేరుకున్న 'నందాదేవి'
కొనసాగుతున్న కార్గో అన్‌లోడింగ్ ప్రక్రియ
ఆర్మేనియా సరిహద్దు దాటిన సుమారు 130 మంది భారతీయ యాత్రికులు... ఈ రోజు స్వదేశానికి చేరుకునే అవకాశం
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 5:31PM by PIB Hyderabad
నౌకా వాణిజ్య భద్రత, నౌకాయాన కార్యకలాపాలు
పర్షియన్ గల్ఫ్‌లోని సముద్ర కార్యకలాపాల తాజా పరిస్థితిని, భారతీయ నౌకలు, సిబ్బంది భద్రత కోసం తీసుకున్న చర్యలను నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మంత్రిత్వ శాఖ కింది విషయాలను తెలిపింది:
· ఈ ప్రాంతంలోని భారతీయ నావికులందరూ క్షేమంగా ఉన్నారు. గత 24 గంటల్లో భారతీయ నావికులకు సంబంధించిన ఎటువంటి నౌకా ప్రమాదంలో లేదు.
· ప్రస్తుతం, 611 మంది భారతీయ నావికులతో కూడిన 22 భారత జెండా గల నౌకలు పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. నౌకా యజమానులు, ఆర్పీఎస్ఎల్ ఏజెన్సీలు, భారత మిషన్లతో సమన్వయం చేసుకుంటూ నౌకాయాన డైరెక్టరేట్ జనరల్ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంది.
· నౌకాయాన డైరెక్టరేట్ జనరల్ కంట్రోల్ రూమ్ ప్రారంభమైనప్పటి నుంచీ మొత్తం 3,180 కాల్‌లు, 5,875 ఈమెయిళ్లను పరిష్కరించారు. గత 24 గంటల్లోనే సముద్ర ప్రయాణికులు, వారి కుటుంబాలు, నౌకా వాణిజ్య సంబంధిత వర్గాల నుంచి వచ్చిన 150 కాల్‌లు, 378 ఈమెయిళ్లు వీటిలో భాగంగా ఉన్నాయి.
· గల్ఫ్ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, ప్రాంతీయ కేంద్రాల నుంచి గత 24 గంటల్లో తరలించిన 161 మందితో సహా, మొత్తం 447 మందికి పైగా భారతీయ నావికులను నౌకాయాన డైరెక్టరేట్ జనరల్ సురక్షితంగా స్వదేశానికి తరలించింది.
· ఎల్‌పీజీ రవాణా నౌక శివాలిక్ ముంద్రా పోర్టుకు చేరుకుంది. సరుకును నౌక నుంచి అన్‌లోడింగ్ చేస్తున్నారు. నందా దేవి నౌక ఈ రోజు తెల్లవారుజామున కాండ్లా ఓడ రేవుకు చేరుకుంది. ఎన్నూర్, హల్దియాతో సహా తూర్పు తీరానికి తరలించేందుకు సరుకుల అన్‌లోడింగ్ ప్రారంభమైంది.
· ప్రాధాన్యతతో కూడిన బెర్తింగ్, వేగవంతమైన డిశ్చార్జ్‌ను నిర్ధారించడం కోసం అన్ని రకాల డాక్యుమెంటేషన్, ఇతర సాధారణ ప్రక్రియలను ముందుగానే పూర్తి చేశారు.
· ప్రధాన ఓడరేవులు నౌకల రవాణాను, సరుకు రవాణా కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తూ, ట్రాన్స్షిప్మెంట్ కంటైనర్ల కోసం వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ అథారిటీ అందించిన సుమారు 90,000 చదరపు మీటర్ల అదనపు నిల్వ స్థలం సహా అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాయి.
· జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ వెలుపల రహదారిపై కంటైనర్లు పడి ఉన్నాయనే సమాచారం తప్పు. సాధారణ లాజిస్టిక్స్ కార్యకలాపాల్లో భాగంగా కంటైనర్లను ప్రస్తుతం కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గిడ్డంగులు, కర్మాగారాల ప్రాంగణాల్లో ఉంచారు.
· జేఎన్‌పీఏ వద్ద రద్దీ తగ్గుముఖం పడుతోంది. నిల్వ చేయలేని సరుకులు గల కంటైనర్ల సంఖ్య సుమారు 2,000 నుంచి 1,000కి తగ్గింది.
· సలాలా, ఖోర్ ఫక్కాన్ వంటి ఓడరేవులకు నౌకలు ప్రయాణించాయి. సుమారు 200 కంటైనర్లను తీసుకువెళ్లే మరో నౌక ఈ రోజు బయలుదేరనుంది. నిలిచిపోయిన కంటైనర్ల సంఖ్య రాబోయే 24 నుంచి 48 గంటల్లో సుమారు 600కి తగ్గుతుందని అంచనా.
· పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా నౌకా రవాణా, ఓడరేవు కార్యకలాపాలు, భారతీయ నావికుల భద్రత, నౌకా వాణిజ్య కార్యకలాపాల కొనసాగింపును నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.
సంక్షోభ ప్రాంతంలో భారత పౌరుల భద్రత
ఆ ప్రాంతానికి సంబంధించిన పరిణామాలు, ప్రత్యేక అధికారిక బృందాల ద్వారా కొనసాగుతున్న సహాయం, కొనసాగుతున్న సంప్రదింపుల గురించి తాజా సమాచారం తెలియజేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని తెలియజేసింది:
· పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. భారతీయ పౌరుల భద్రత, శ్రేయస్సు, రక్షణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం కొనసాగుతోంది.
· ఈయూ విదేశాంగ మండలి సమావేశానికి హాజరయ్యేందుకు, ఈయూ ఉన్నతస్థాయి ప్రతినిధి, ఉపాధ్యక్షురాలు శ్రీమతి కాజా కల్లాస్ ఆహ్వానం మేరకు విదేశాంగ మంత్రి బెల్జియంలో పర్యటించారు.
· భారత్-ఈయూ సంబంధాలు, తీవ్రమైన ప్రపంచ సవాళ్లు, ముఖ్యంగా పశ్చిమాసియాలోని పరిస్థితి, ఇంధన భద్రతపై దాని ప్రభావాలను గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ చర్చల్లో భాగంగా సంప్రదింపులు, దౌత్యానికి ప్రాధాన్యమిచ్చి శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సిన అవసరాన్ని ఈ సమావేశం స్పష్టం చేసింది.
· కౌన్సిల్ సమావేశాల సందర్భంగా ఈయూ ఉన్నతస్థాయి ప్రతినిధి, ఉపాధ్యక్షురాలితో పాటు బెల్జియం, సైప్రస్, జర్మనీ, నెదర్లాండ్స్, స్లోవేకియా విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
· 700 మందికి పైగా భారత పౌరులు ఇరాన్ నుంచి అర్మేనియా (సుమారు 600 మంది), అజర్‌బైజాన్‌లోకి ప్రవేశించారు. వీరిలో నిన్న అర్మేనియాలోకి ప్రవేశించిన సుమారు 50 మందీ ఉన్నారు.
· అర్మేనియాలోకి ప్రవేశించిన వారిలోని 284 మంది భారతీయ యాత్రికుల్లో, సుమారు 130 మంది ఈ రోజు ఢిల్లీకి చేరుకుంటారని భావిస్తున్నారు.
· భారత పౌరులకు సహాయం చేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్ పనిచేస్తూనే ఉంది. కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. నిన్న 22 కాల్‌లు, 6 ఈమెయిళ్లు అందగా, వాటికి సమాధానాలు ఇచ్చారు.
· ఈ ప్రాంతం అంతటా ఉన్న భారతీయ బృందాలు, పోస్టులు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇవి 24×7 హెల్ప్‌లైన్‌లను నిర్వహిస్తూ, భారతీయ కమ్యూనిటీ సంస్థలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలూ జారీ చేస్తున్నాయి. మిషన్లు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ... ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు, విద్యార్థులకు, నావికులకు, స్వల్పకాలం నిమిత్తం ఆయా ప్రాంతాలకు వెళ్లిన సందర్శకులకు వీసా సహాయం, లాజిస్టికల్ సహాయం, రవాణా సౌకర్యంతో సహా అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నాయి.
· ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి సుమారు 2,44,000 మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి వచ్చారు.
· యూఏఈలో ఈ రోజు ఉదయం గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసి, కొంత సమయం తర్వాత తిరిగి తెరిచారు. ఈ నెల 16న నడిచిన సుమారు 55 విమానాలు సహా పరిమిత సంఖ్యలో షెడ్యూల్ చేయని విమాన సర్వీసులూ కొనసాగుతున్నాయి. ఈ రోజు యూఏఈలోని వివిధ విమానాశ్రయాల నుంచి భారత్‌కు దాదాపు 70 విమానాలు నడుస్తాయని అంచనా. ప్రయాణికులు విమానయాన సంస్థలతో తాజా షెడ్యూళ్లను గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని, సహాయం కోసం భారత మిషన్లను సంప్రదించవచ్చని సూచించారు.
· సౌదీ అరేబియా, ఒమన్ నుంచి భారత్‌లోని పలు గమ్యస్థానాలకు విమానాలు నడుస్తూనే ఉన్నాయి.
· ఖతార్ గగనతలం పాక్షికంగా తెరిచే ఉంది. ఈ నెల 16 భారత్‌కు మూడు విమానాలు నడపగా, ఈ రోజు మరో మూడు విమానాలు నడవనున్నాయి.
· 2026 ఫిబ్రవరి 28 నుంచి కువైట్ గగనతలం మూసి ఉంది. సౌదీ అరేబియాలోని అల్ ఖైసుమా విమానాశ్రయం నుంచి భారత్‌కు జజీరా ఎయిర్‌వేస్ ద్వారా ప్రత్యేక, షెడ్యూల్ చేయని విమానాలు నడుస్తాయని భావిస్తున్నారు.
· గగనతలం మూసి ఉన్న బహ్రెయిన్, ఇరాక్‌లలోని భారతీయ పౌరుల కోసం సౌదీ అరేబియా మీదుగా ప్రయాణ సదుపాయం కల్పించడం కొనసాగుతోంది.
· ఈ నెల 13న సోహార్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భారతీయ పౌరుల భౌతిక కాయాలను జైపూర్‌లోని వారి కుటుంబ సభ్యులకు అందించారు. భారత ప్రభుత్వం వారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసింది.
· గాయపడిన భారతీయ పౌరుల పరిస్థితిని పర్యవేక్షించడానికి రాయబార కార్యాలయం ఆసుపత్రి అధికారులతోనూ, సంబంధిత సంస్థతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. వీరిలో ఎవరికీ ప్రాణాంతక గాయాలు కాలేదు.
· ప్రస్తుతం బాస్రాలోని హోటల్‌లో బస చేస్తున్న 15 మంది భారతీయ సిబ్బందికి అక్కడి మిషన్ బృందం సహాయం కొనసాగిస్తోంది. వారిని వీలైనంత త్వరగా భారత్‌కు తిరిగి పంపేందుకు కృషి జరుగుతోంది.
· మరణించిన భారతీయ పౌరుడి భౌతిక కాయాన్ని త్వరగా స్వదేశానికి తరలించేందుకు ఈ మిషన్ ఇరాక్ అధికారులతో మాట్లాడుతోంది.
· ఇటీవల జరిగిన ఘటనల్లో ఐదుగురు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా, ఒకరు గల్లంతయ్యారు. ఒమన్ నుంచి ఇద్దరు భారతీయ పౌరుల మృతదేహాలను ఈ రోజు భారత్‌కు తరలించారు.
· గల్లంతయిన వ్యక్తికి సంబంధించి అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించేందుకు ఒమన్, ఇరాక్, యూఏఈలలోని భారత రాయబార కార్యాలయాలు సంబంధిత అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి.
కీలక రంగాలు, దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటూనే సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల మధ్య సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నారు. పూర్తిగా అప్రమత్తంగా ఉన్నట్లు భారత ప్రభుత్వం పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2241497)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam