ఆర్థిక మంత్రిత్వ శాఖ
7 వ్యూహాత్మక, అధునాతన రంగాల్లో తయారీని భారీగా పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కేంద్ర బడ్జెట్ 2026- 27
· అంతర్జాతీయ బయోఫార్మా ఉత్పాదక కేంద్రంగా భారత్‌ను నిలపడం లక్ష్యంగా.. వచ్చే అయిదేళ్ల కాలానికి రూ. 10,000 కోట్ల వ్యయంతో ‘బయోఫార్మా శక్తి’ ప్రతిపాదన
· పరికరాలు, పదార్థాల ఉత్పత్తి, పూర్తిస్థాయిలో భారతీయ మేధో సంపత్తి వికాసం,
సరఫరా వ్యవస్థల బలోపేతం కోసం ఐఎస్ఎం 2.0
· ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పథకానికి కేటాయిపులను
రూ. 40,000 కోట్లకు పెంచాలని ప్రతిపాదన
· ఖనిజ నిక్షేపాలున్న ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటుకు చేయూత... మైనింగ్, శుద్ధి, తయారీలకు ప్రోత్సాహం
· 3 ప్రత్యేక కెమికల్ పార్కుల ఏర్పాటులో రాష్ట్రాలకు మద్దతిచ్చేలా పథకం ప్రతిపాదన...
క్లస్టర్ ప్రాతిపదికన పనితీరును బట్టి నిధుల కేటాయింపు పద్ధతిలో నిర్వహణ సన్నద్ధంగా పార్కుల ఏర్పాటు
· కంటైనర్ల తయారీ కోసం పథకాన్ని ప్రతిపాదించిన బడ్జెట్.. అంతర్జాతీయంగా పోటీ పడగల కంటైనర్ తయారీ వ్యవస్థను సృష్టించడం లక్ష్యంగా
అయిదేళ్ల కాలానికి రూ. 10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపులు
· జౌళి రంగం అభివృద్ధి కోసం 5 విభాగాలతో సమీకృత కార్యక్రమం ప్రకటన
· పనితీరును బట్టి నిధుల కేటాయింపు విధానంలో (చాలెంజ్ మోడ్) మెగా టెక్స్‌టైల్ పార్కులు
· ఖాదీ, చేనేత, హస్తకళల బలోపేతం కోసం ‘మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్’...
అంతర్జాతీయ విపణితో అనుసంధానమూ, బ్రాండింగుకూ దోహదం
· క్రీడా పరికరాల కోసం ప్రత్యేక కార్యక్రమం... తయారీ, పరిశోధన, పరికరాల రూపకల్పనలో, మెటీరియల్ సైన్సెస్‌లో పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం
प्रविष्टि तिथि:
01 FEB 2026 1:05PM by PIB Hyderabad
ఏడు వ్యూహాత్మక, అత్యాధునిక రంగాల్లో తయారీని భారీగా విస్తరించడంపై కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ ప్రతిపాదిత చర్యలన్నీ బడ్జెట్‌లోని ‘ప్రథమ కర్తవ్యం’ కింద ఉన్న ఆరు కీలక రంగాల్లో భాగమని.. పార్లమెంటులో బడ్జెట్ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
అంతర్జాతీయ బయోఫార్మా కేంద్రంగా భారత్‌ను నిలపడం లక్ష్యంగా.. రాబోయే అయిదేళ్ల కాలానికి రూ. 10,000 కోట్ల వ్యయంతో ‘బయోఫార్మా శక్తి’ని బడ్జెట్ ప్రతిపాదించింది. జీవ ఔషధాలనూ, వాటితో సారూప్యమున్న ఔషధాలనూ (బయో సిమిలర్) దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు సానుకూల వ్యవస్థను ఇది నిర్మిస్తుంది. బడ్జెటులో నిర్దేశించిన వ్యూహం మేరకు... 3 కొత్త జాతీయ ఔషధ విద్య, పరిశోధన సంస్థల (ఎన్ఐపీఈఆర్)తో బయోఫార్మాపై ప్రత్యేకంగా దృష్టి సారించేలా ఒక నెట్వర్కును ఏర్పాటు చేస్తారు. ఇదేకాకుండా ప్రస్తుతమున్న 7 సంస్థలను ఉన్నతీకరిస్తారు. 1000కి పైగా గుర్తింపు పొందిన భారత చికిత్సా ప్రయోగ కేంద్రాలతో నెట్వర్కును కూడా ఇది ఏర్పాటు చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థను బలోపేతం చేయాలనీ.. అలాగే ప్రత్యేక వైజ్ఞానిక సమీక్షా సిబ్బంది, వృత్తి నిపుణుల ద్వారా అనుమతుల ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించాలనీ కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది.

భారత సెమీకండక్టర్ రంగ సామర్థ్యాలను విస్తరించడానికీ, ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) 1.0 సాధించిన విజయాలను ముందకు తీసుకెళ్లడానికీ.. ఐఎస్ఎం 2.0ను ప్రారభించాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. తద్వారా పరికరాలు, అవసరమైన పదార్థాల ఉత్పత్తి, భారతీయ మేధో సంపత్తిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం, సరఫరా వ్యవస్థల బలోపేతంపై దృష్టి సారించాలని నిర్ణయించింది. సంబంధిత పారిశ్రామిక నేతృత్వంలో పరిశోధన, శిక్షణ కేంద్రాలపై దృష్టి సారించడం ద్వారా సాంకేతికతనూ, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తినీ అభివృద్ధి చేస్తామని శ్రీమతి నిర్మలా సీతారామన్ చెప్పారు.
2025 ఏప్రిల్ లో ప్రారంభించిన ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పథకం కోసం రూ. 22,919 కోట్లు వెచ్చించారు. కాగా, దీనికి మరింత ఊతమిచ్చి, ముందుకు తీసుకెళ్లేలా.. కేటాయింపులను రూ. 40,000 కోట్లకు పెంచాలని 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది.

అరుదైన ఖనిజాలతో రూపొందించే శాశ్వత అయస్కాంతాలపై పథకానికి సంబంధించి.. ఖనిజ సంపద ఉన్న ఒడిషా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చేయూతనివ్వాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. మైనింగ్, శుద్ధి, పరిశోధన, తయారీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆ రాష్ట్రాల్లో ప్రత్యేక రేర్ ఎర్త్ కారిడార్ల ఏర్పాటుకు సహకరించాలని నిర్ణయించింది.
దేశీయంగా రసాయనాల ఉత్పత్తిని మెరుగుపరచడంతోపాటు దిగుమతులపై ఆధీనతను తగ్గించడం కోసం.. 3 ప్రత్యేక కెమికల్ పార్కుల ఏర్పాటు దిశగా రాష్ట్రాలకు సహకరించేలా ఓ పథకాన్ని ప్రారంభించాలని కేంద్ర మంత్రి ప్రతిపాదించారు. క్లస్టర్ ప్రాతిపదికగా నిర్వహణ సన్నద్ధంగా ఉన్న సదుపాయాలతో.. అమలు ఆధారంగా రాష్ట్రాలకు నిధుల కేటాయింపు విధానం (చాలెంజ్ రూట్)లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వివిధ రంగాల్లో ఉత్పాదకతనూ, నాణ్యతనూ నిర్ణయించడంలో బలమైన మూలధన వస్తువుల సమర్థత కీలకమైనదని బడ్జెట్ ప్రసంగంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా సీపీఎస్ఈల ఆధ్వర్యంలో రెండు చోట్ల హై టెక్ టూల్ రూంలను ఏర్పాటు చేయాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. డిజిటల్ సదుపాయాలు కలిగిన ఆటోమేటెడ్ సర్వీస్ బ్యూరోలుగా ఇవి పనిచేస్తాయి. అత్యంత కచ్చితత్వంతో కూడిన విడిభాగాలను స్థానికంగానే రూపొందించడానికి, పరీక్షించడానికి, తక్కువ ఖర్చుతోనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అత్యంత విలువైన, సాంకేతికంగా పురోగతి చెందిన నిర్మాణ, మౌలిక సదుపాయాల పరికరాల (సీఐఈ) దేశీయ తయారీని బలోపేతం చేయడం కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు బడ్జెట్ తెలిపింది. ఈ పరికరాల్లో బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్‌లలో ఉండే లిఫ్టుల నుంచి చిన్న - భారీ అగ్నిమాపక పరికరాల వరకు.. అలాగే మెట్రోలు, ఎత్తైన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ఉపయోగించే భారీ టన్నెల్ బోరింగ్ యంత్రాల వరకు ఉంటాయి. అయిదేళ్ల కాలానికి రూ. 10,000 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో కంటైనర్ల తయారీ కోసం కూడా ఒక పథకాన్ని బడ్జెట్ ప్రతిపాదించింది. ప్రపంచ స్థాయిలో పోటీపడేలా కంటైనర్ల తయారీ వ్యవస్థను రూపొందించడం దీని లక్ష్యం.
కార్మికులు ఎక్కువగా ఉండే జౌళి రంగం కోసం 5 ఉప విభాగాలతో కూడిన ఓ సమీకృత కార్యక్రమాన్ని బడ్జెట్ ప్రతిపాదించింది. మొదటిది- పట్టు, ఉన్ని, జనపనార వంటి సహజ ఫైబర్ రకాలతోపాటు కృత్రిమ, కొత్త తరహా ఫైబర్ రకాల్లో స్వావలంబన సాధించడం కోసం ‘నేషనల్ ఫైబర్ స్కీం’. రెండోది- సంప్రదాయ జౌళి క్లస్టర్ల ఆధునికీకరణ కోసం టెక్స్‌టైల్ విస్తరణ, ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం.. దీని ద్వారా యంత్రాల కొనుగోలుకు మూలధన సాయం, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, ఉమ్మడి పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాల ఏర్పాటుకు నిధులు సమకూరుస్తారు. మూడోది - ప్రస్తుతమున్న వివిధ పథకాలను ఏకీకృతమూ, బలోపేతమూ చేస్తూ.. నేత కార్మికులకు, హస్తకళాకారులకు నిర్దేశిత మద్దతును అందించడం కోసం ‘జాతీయ చేనేత, హస్తకళా కార్యక్రమా’న్ని ప్రారంభించడం. నాలుగోది- ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగేలా, పర్యావరణ హితంగా జౌళి, వస్త్రోత్పత్తిని ప్రోత్సహించడం కోసం టెక్స్-ఎకో కార్యక్రమం. అయిదోది- సంబంధిత పరిశ్రమ, విద్యా సంస్థల సహకారంతో జౌళీ రంగంలో నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను ఆధునికీకరించడం, ఉన్నతీకరించడం కోసం ‘సమర్థ్ 2.0’ కార్యక్రమం.
ప్రత్యేక అవసరాల కోసం తయారు చేసే వస్త్రాల (టెక్నికల్ టెక్స్టైల్స్) విషయంలో.. వాటి ఉత్పాదక విలువను పెంచడంపై దృష్టి సారిస్తూ, పనితీరును బట్టి నిధుల కేటాయింపు పద్ధతిలో (ఛాలెంజ్ మోడ్) టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది.
వీటితోపాటు ఖాదీ, చేనేత, హస్తకళలను బలోపేతం చేసేలా ‘మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్’ కార్యక్రమాన్నీ ప్రారంభించాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. అంతర్జాతీయ విపణితో అనుసంధానానికీ, బ్రాండింగుకూ ఇది ఎంతగానో దోహదపడుతుంది. శిక్షణ, నైపుణ్యాభివృద్ధితోపాటు ప్రక్రియాపరమైన, ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచి, క్రమబద్ధీకరించడానికి బడ్జెట్ ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. దీనివల్ల మన నేత కార్మికులు, గ్రామీణ పరిశ్రమలు, ‘ఒక జిల్లా- ఒక ఉత్పత్తి’ కార్యక్రమాలతోపాటు గ్రామీణ యువతకు లబ్ధి కలుగుతుందని బడ్జెట్ పేర్కొన్నది.
అందుబాటు ధరల్లోనే అత్యుత్తమ క్రీడా వస్తువుల ఉత్పత్తికి అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే సామర్థ్యం భారత్‌కు ఉందని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ దిశగా క్రీడా పరికరాల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని బడ్జెట్ ప్రతిపాదించింది. ఇది క్రీడా వస్తువుల తయారీ, పరిశోధన, పరికరాల రూపకల్పనలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. అలాగే మెటీరియల్ సైన్సెస్ పరిశోధనలకు దోహదపడుతుంది.
***
(रिलीज़ आईडी: 2221758)
आगंतुक पटल : 12